నిర్లిప్తత నియంతల పుట్టిల్లు

నిర్లిప్తత నియంతల పుట్టిల్లు


విశ్లేషణ


ఎనభై శాతం ప్రజలపై ప్రభావం చూపిన నోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయాల వివరాలను వెంటనే తెలపాలని ఆర్టీఐ చట్టంలోనే ఉంది. కానీ నోట్ల రద్దుకు ముందటి సమావేశాల వివరాలను ఇవ్వడానికి ఆర్‌బీఐ నిరాకరించింది.



ఆర్టీఐ సామాన్యుడికి ప్రశ్నించడానికి మంచి సాధ నాన్నిచ్చింది. ప్రశ్నించ కుండా ప్రజలు ప్రజాస్వా మ్యంలో పాల్గొనడం సాధ్యం కాదు. ప్రజలు పాల నలో పాలు పంచుకోవడ మంటే ఓటేసి ఐదేళ్ల దాకా మరిచిపోవడం కాదు. రాజుల పాలన స్థానంలో వచ్చిన ప్రజాపాలన అంటే సార్వభౌమత్వాన్ని అందరికీ పంచడమని అర్థం. పౌరులు స్వశక్తిని చాటుకునే అవకాశం ఇది. ఇదివరకు పాలకుడు(రాజు) – పాలితులు ఉండేవారు. ఇప్పుడు వ్యక్తి పాలితునిగా గాక పౌరునిగా ఎదగవలసి ఉంటుంది. విషయం తెలుసుకుని ధైర్యంగా తప్పుడు విధానాలను విమర్శించి, సరైన విధానం ఏమిటో తెలియజెప్పి పాలనా విధానాలను మార్పించడం పౌరుల విధి.


చదువులేకపోవడం వల్ల 30 శాతం ప్రజలు ఆ పని చేయడం లేదు. చదువుకున్నవారిలో చాలా మందికి సరైన ఉద్యోగం లేక, రోజంతా పనిచేస్తే తప్ప బతుకు గడవని పరిస్థితి. కనుక ప్రభుత్వం ఏం చేస్తున్నదో తెలుసుకునే తీరిక లేదు. కుటుంబ పోషణ తప్ప మరేమీ చేయలేనివారే మన జనాభాలో ఎక్కువ. ఆర్థిక తదితర విధానాల ప్రక టనల్లోని నిజానిజాలను తెలుసుకునే శక్తి లేక కొందరు, ఆసక్తి లేక కొందరు, పరిచయంలేక ఇంకొందరు వాటిని పట్టించుకోరు. ఎన్నికలప్పుడు తప్ప ఎçప్పుడూ ఏదీ పట్టించుకోని వారి నిర్లిప్తతే మౌనంగా నియంతలను సృష్టిస్తుంటుంది. అడిగే వాడు లేకపోతే, ఓట్లు అడుక్కునే వాడు ఓటర్లందరినీ అడుక్కునే వాళ్లని చేస్తాడు.



సమాచార హక్కు అంటే తెలుసుకునే హక్కు కాదు. చాలా పరిమితంగా సర్కారీ దఫ్తర్‌లలో దస్తావేజుల నకళ్లు అడిగి తీసుకునే హక్కు ఇది. దీని ద్వారా పరిపాలన ఏవిధంగా జరుగుతుందో తెలుసు కోవచ్చు, పాలకులను ప్రశ్నించవచ్చు. నిర్ణయ ప్రక్రి యలో పాల్గొనవచ్చు. భారీ ఎత్తున ప్రజలను ప్రభావితంచేసే విధాన నిర్ణయాలతో పాటు సంబం ధిత వాస్తవాలన్నీ ప్రజల ముందుంచాలని సెక్షన్‌ 4(1)(సి), పాలనాపరమైన, లేదా అర్ధ న్యాయ నిర్ణ  యాలు తీసుకున్నప్పుడు బాధితులకు ప్రజా సంస్థలు తమంతట తామే వారికి తెలియజేయాలని సెక్షన్‌ 4(1)(డి) వివరిస్తున్నది.



చట్టసభలలో ప్రకటనతో పాటు అన్ని వివరాల కట్టలు, పుస్తకాలు, నివేదికల కాగితాలు ఇస్తారు. తాళ్లు విప్పి చదివేవారు కనీసం ఒక్క శాతమైనా ఉంటారు. వారు శాసనసభలోనే వివరాలు అడగవచ్చు. ప్రశ్నో త్తర సమయంలో ప్రశ్నలు అడగవచ్చు. అందుకే సెక్షన్‌ 8లో అనేక మినహాయింపులు ఇచ్చిన తరువాత పార్ల మెంటు, శాసన సభలకు ఇవ్వవలసిన ఏ సమా చారమైనా అడిగిన పౌరులకు  ఇవ్వవచ్చు అని  సమా చార హక్కు చట్టం మినహాయింపులకు మినహా యింపును చేర్చింది. చట్టసభలో ఉన్నవారూ, బయ టున్న మనమూ అడగకపోతే పాలకులను అడిగే వారెవరు? ప్రజా ప్రతినిధులు అడగడం లేదని విమ ర్శిస్తామే గానీ మనం అడగాలనుకుంటున్నామా?



పెద్దనోట్ల రద్దు నిర్ణయం దాదాపు 80 శాతం ప్రజల పైన ప్రభావం చూపింది. అంతటి పెద్ద నిర్ణయాలను ప్రకటించిన వారికి అదే సమయంలో (సి), (డి) కింద వివరాలు ఇవ్వవలసిన బాధ్యత ఉందని పార్లమెంటు జారీ చేసిన ఆర్టీఐ చట్టంలోనే ఉంది. పార్లమెంటేరియన్లు ఆ విషయం గమనించక పోతే పౌరులు చెప్పాలి. సెక్షన్‌ 4 కింద వివరాలు ఇవ్వకపోతే, పౌరులు ఆర్టీఐ దరఖాస్తులో వివరాలు అడగవచ్చు. 80 శాతం మంది బాధితులుగా ఉన్న పెద్ద నోట్ల రద్దుపై వేసిన రెండు ఆర్టీఐ ప్రశ్నలను ఆర్‌బీఐ తిరగ్గొట్టినట్టు వార్తలు వచ్చాయి. ఫాక్ట్‌ లీ అనే ఆర్టీఐ అధ్యయన సంస్థ ఆర్‌బీఐకి ఒక ఆర్టీఐ ప్రశ్నను సమర్పించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న నవంబర్‌ 8, 2016కు ముందు దాని అమలుకు ముందస్తు ఏర్పాట్లు చేయడానికి జరిపిన సమావేశాల వివరాలను ఇవ్వాలని అడిగింది.



అవి చాలా సున్నితమైన వివరాలంటూ సెక్షన్‌ 8(1) (ఎ) కింద వాటిని వెల్లడించడానికి వీల్లేదని ఆర్‌బీఐ తిరస్కరించింది. దేశ భద్రతాపరమైన కారణాలను చూపుతూ సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ సమాచారం వెల్లడిస్తే దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, రక్షణకు ప్రమాదం కలుగుతుందని, అంతేగాక కొందరి ప్రాణాలకూ ప్రమాదం ఉందని ఆర్‌బీఐ మరో సమాచార దరఖాస్తుకు సమాధానం చెప్పిందని వార్తల్లో వచ్చింది. పౌరులు అడిగే ప్రశ్నలకు సమాచార సమా ధానం ఇచ్చిన తరువాత పనైపోయిందని చేతులు దులుపుకోక, వచ్చిన ప్రశ్నలను, ఇచ్చిన సమాధానా లను అధ్యయనం చేయాలనీ, సూచనలను, కావల సిన మార్పులను గమనించి పాలనా విధానాలను మార్చుకోవలసి ఉంటుందని ప్రధాని 2015 సమా చార హక్కు సదస్సులో వివరించారు.



రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులను ఇచ్చింది. మనకున్న ప్రా«థమిక హక్కుల సా«ధనా మార్గాలను కూడా మన రాజ్యాంగం 32, 226 ఆర్టికల్స్‌ ద్వారా అందించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు లకు వెళ్లయినా వాటిని సాధించుకోవచ్చని వివ రించింది. కాని ఆ విషయం తెలిస్తే కదా. ఆ తెలు సుకునే అవకాశం సమాచార హక్కు ద్వారా లభించింది.



సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే ఇతర హక్కులన్నిటి అమలుకు అవకాశం దొరు కుతుందనేది సిద్ధాంతం, ఈ చట్టం లక్ష్యం. ఆచరణలో అది నిరాకరణగా మారకుండా చూసుకోవాలి. ఒక్క ఆర్టీఐని నిరాకరించడం ద్వారా అన్ని హక్కులను నిరా కరించే పరిస్థితి రాకుండా కాపాడుకోవాలి. రూల్‌ ఆఫ్‌ లా అంటే నియమపాలన, సమపాలన. ఇది సిద్ధాం తం, పాలకులు తమకు కావలసిన రీతిలో పాలించా లని ప్రయత్నించడం రాద్ధాంతం చేయ వలసిన అంశం. మనం చేస్తున్నామా? కనీసం అడుగుతు న్నామా? అని పౌరులు ఆలోచించుకోవలసి ఉంది.



(అరుణారాయ్‌ ఆధ్వర్యంలో ‘భాగస్వామ్య ప్రజాస్వామ్యం’ అనే అంశంపైన ‘మెక్‌ గిల్‌ యూనివర్సిటీ’ (కెనడా), ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ గవర్నమెంట్‌’ (కేరళ) సంయుక్తంగా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు తిరువనంతపురంలో నిర్వ హించిన అంతర్జాతీయ సదస్సులో చేసిన ప్రసంగంలో కొంత భాగం.)




వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌

professorsridhar@gmail.com

మాడభూషి శ్రీధర్‌

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top