కవిత చెలికాడు.. పాట విలుకాడు

కవిత చెలికాడు.. పాట విలుకాడు


విశ్లేషణ

‘‘వెంకన్న పాటను వెంకన్న నోటి నుంచి ఒక దృశ్య కావ్యమై బయటకు వస్తున్న సన్నివేశాన్ని అనుభవించడం అపూర్వ సన్నివేశం’’ అని శివారెడ్డి అమితానందం వ్యక్తం చేశాడు. రెండు వాదాల నుంచి వచ్చిన గోరటి వెంకన్న విశ్వమానవ శ్రేయస్సును ఏకనాదంగా స్వీకరించిన వాగ్గేయకారుడు.



అక్షరాల కూర్పు అకారణంగా జరగదు. ఒక లక్ష్యం అంగాంగాన్ని విహంగం చేసి నప్పుడే అది సాధ్యమవుతుంది. ఉత్సాహం కళని తోడువేసుకుని మనిషిని ఉరకలేయి స్తుంది. అప్పుడు నిజమైన ఉద్యమం ఊపిరై శ్వాసిస్తుంది. నేడు అదే ధ్యాసలో నిమగ్నమై జీవిస్తున్నవాడు ప్రజాకవి ‘గోరటి వెంకన్న’. ప్రకృతి, పల్లె జీవితంలోని స్థితిగతుల్ని, మార్పుల్ని, వైరుధ్యాల్ని పాటల్లో చెబు తున్నాడు. తెలుగుపల్లె ప్రజల జీవనగాధలను తన సైద్ధాంతిక భూమిక మీద నిటారుగా నిలబడి ఆలపిస్తున్నాడు. ఈ ఆలాపన కూనిరాగం కాదు. ఒక మహోన్నత గర్జన. అతడే పాటకు పదనిసలు నేర్పించినట్టుంది. గజ్జెకు కాళ్ళను కట్టించినట్టు కనిపిస్తుంది. మహా కవి శ్రీశ్రీ శ్రమైక జీవన సౌందర్యశక్తితో ‘పల్లె కన్నీరు’ మీద పాట కట్టి జనసంతకం చేయించినట్టుంటుంది. అందుకే ‘కుబుసం’ దర్శకుడు ఎల్‌.శ్రీనా«ద్‌ వెంకన్న పాట కోసమే సినిమా తీశానన్నాడు. ‘‘వాడు మట్టికి మాటలు నేర్పిన వాగ్గేయకారుడు’’ అన్నారు జూలూరి గౌరీ శంకర్‌. ఏ కాలానికి చెందిన  పదజాలాన్ని ఆ కాలం పాటలో అమరు స్తున్నాడు ఆయన. గల్లీని సిన్నది చేసి గరీబోల్ల కధను పెద్దది చేసి దీనజన పక్షం వహించాడు. అందుకే వర్తమానాన్ని నర్తింపజేసే ఆట గాడయ్యాడు వెంకన్న. అందుకే ‘‘వెంకన్న పాటలో పల్లె అందాలే కాదు. ప్రపంచ రాజకీయాలూ పలుకుతాయి’’ అంటారు ఓల్గా.



బైరాగి ఆలాపన, తాత్వికుని తలంపులు, వాగ్గేయకారుల ఆగ్రహం వెంకన్న పల్లవిలో అమరిపోయి, చరణాలై చిందేస్తున్నాయి. నేడు అభినందనల పల్లకిలో ఊరేగుతున్నాయి. అనేక అవార్డులను అక్కున చేర్చుకొని సాఫల్య పురస్కారాలను సరసన చేర్చుకున్న వెంకన్నను నేడు ‘లోక్‌ నాయక్‌ పౌండేషన్‌’  పురస్కారం వరించింది. పద్మభూషణ్‌ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ వ్యవస్థాపక అధ్యక్షు   లుగా నిర్వహిస్తున్న ఈ సంస్ధ రెండు దశాబ్దాలుగా సాహితీ ప్రముఖు లకు ఘనసత్కారాలను అందిస్తూ వస్తోంది. ఆచార్య వైఎల్‌పి ‘సత్తా’ ఉంటే తప్ప ‘సానుభూతి’తో ఎవర్నీ గుర్తించరు. అందుకే ఆయన ఈ పురస్కారాన్ని తెలుగు జ్ఞానపీuŠ‡ అవార్డుగా ఖ్యాతికెక్కించగలిగారు. అలాంటి సత్కారమే  నేడు వెంకన్నకు దక్కింది.



సాహిత్యప్రక్రియల్లో కీలకస్థానాన్ని ఆక్రమించుకున్న ‘పాట’కు పాఠకుడు, శ్రోత, ప్రేక్షకుడు ముగ్గురు మిత్రులయితే .. పాటను పాడుతూ .. ఆడుతూ.. జనచైతన్యాన్ని సాధించిన గోరటి వెంకన్నకు మాత్రం లోకమంతా అభిమానులే అయ్యారు. ‘గోరటి’ పాటను సామాన్యులు విని, వీక్షించి ఆనందిస్తారు. పాలకులు తెలుసుకొని ఆలోచిస్తారు. ఉద్యమకారులు కెరటాలై కదంతొక్కుతూ ఉప్పొంగే తరంగాలవుతారు. అందుకే.. ‘‘వెంకన్న పాటను, వెంకన్న నోటి నుంచి ఒక దృశ్య కావ్యమై బయటకు వస్తున్న సన్నివేశాన్ని అనుభవిం     చడం అపూర్వ సన్నివేశం’’ అని శివారెడ్డి అమితానందం వ్యక్తం చేశాడు.  రెండు వాదాల నుంచి వచ్చిన గోరటి వెంకన్న విశ్వమానవ శ్రేయస్సును ఏకనాదంగా స్వీకరించిన వాగ్గేయకారుడు. వామపక్షం నుంచి దళితతత్త్వం వైపు పయనం సాగించాడు. అక్కడితో ఆగలేదు. ప్రపంచీకరణ పర్యవసానాల మీద గేయ చిత్రాలు గొంతెత్తి గీశాడు.  ‘ఏకునాదం మోత’, ‘రేల పూతలు’, ‘అలచంద్రవంక’, ‘పూసిన పువ్వు’ మెుదలైన ప్రచురణలను పాఠకలోకానికి అందించాడు. కొన్ని ఆల్బమ్‌లు వచ్చాయి. ఇప్పటికే ప్రజల సినిమాలకు పాటలు రాశాడు. తెలిసినవారి కోసం తెరకెక్కాడు. నచ్చిన సినిమాకు నృత్యం చేశాడు.



గోరటి వెంకన్న కవిత్వంలో... దోపిడీకి గురవుతున్న జనం ఆవేదనల్నీ, ఆత్మ స్థైర్యాల్నీ, అనుభూతుల్నీ, ఆవేశాల్నీ, ఆగ్రహాల్నీ, ఆనం దాల్నీ ఆయా దేశాల జానపదపాటలతో పోల్చి చూడాలని, ఆపై అతని ప్రతిభకి అక్షరరూపం ఇవ్వాలనే శివారెడ్డి వాఖ్య సమర్థనీయం.



నాజర్, సుద్దాల హనుమంతు, గద్దర్, వంగపండు మెుదలయిన ప్రజావాగ్గేయకారులు జనజీవనానుభవాల్నీ వ్యక్తీకరించారు. వెంక న్నది అదే దారి అయినా కొన్ని ప్రత్యేక ఆకర్షణలను సాధించారు. సాంప్రదాయ భక్తి కవుల్లో, కీర్తన పదకవుల్లోని, శతక కవుల్లో గల ధిక్కారం, అవహేళన, అపహాస్యం వెంకన్న కవితలోనూ, గేయం లోనూ వున్నాయి. అంతకు మించి సాంçస్కృతికాంశాలు, ప్రకృతి పరమైన అంశాల మీద శ్రద్ధ కనబరిచారు. ఖాదర్‌ మెుహియుద్దీన్‌ మాటల్లో .. ‘‘గోరటి వెంకన్న కవిత్వం కేవలం మానవ కేంద్రం కాదు. ప్రధానంగా అది ప్రకృతి కేంద్రకం. మనిషి అశాశ్వతం, ప్రకృతి శాశ్వతం.’’



అందుకే వెంకన్న సాహిత్యంలో గ్రామీణ జనజీవన సౌందర్యం తేలియాడుతుంది. అందుకే గోరటి వెంకన్నను పర్యావ రణ జ్ఞానకవిగా వాస్తవీకరించారు విమర్శకుడు సీతారాం. ‘‘ఈ సమస్త ప్రకృతిని పర్యావరణ పరిరక్షణ కోణం నుంచి  కాపాడేందుకు ఊగుతూ, ఊరేగుతూ, పాడుతూ, ఆడుతూ, ఎగురుతూ రంజింప జేస్తున్నాడు.’’అన్నారు. అందుకే యాకూబ్‌ కవి ‘‘వెంకన్న జీవించిన కాలంలో నేను కూడా జీవిస్తుండటం నేను చేసుకున్న గొప్ప అదృష్టం’’ అంటాడు. ‘‘వెంకన్న çహృదయ కవితానేత్రం దృష్టిలో పడని వస్తువులేదు..అతని గొంతులో పలికేSజీర లక్షలాది ప్రజల కన్నీటిధారలా అనిపిస్తుంది’’ అన్నారు సుద్దాల అశోక్‌తేజ.



వెంకన్న అక్షరాలు తూనీగల మేల్కొలుపులా ఉంటాయి. అతనికి పాట పూనకం, కవిత కలవరం, గేయమే అతని విజయం. తొలి సారిగా సినిమాకు పాట రాసే అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్‌ ‘ననుగన్న నా తల్లి రాయలసీమ’ పాట సీమ ప్రజలను ఆకట్టుకున్న సంఘటన నన్నెంతో ఉత్తేజపరిచింది. సినిమా రంగం వెంకన్న పాట లను ఎంతగానో ఉపయోగించుకోవలసి ఉంది అన్నారు.



గోరటి వెంకన్న ఆంధ్రనాట ‘అన్నపూర్ణమ్మ’నూ కీర్తించారు. గోదావరిని స్తుతించడమంటే అన్నపూర్ణమ్మను గుర్తు చేసుకోవడ మేనని భావించారు. ఆపై వానమ్మను కృష్ణమ్మ ఒడికి చేర్చాడు. ఇదే సందర్భంలో మూసీ నది దుస్థితిని పాలకులకు గుర్తు చేయటాన్ని తాను మర్చిపోనేలేదు. విశ్వరమణీయాల వింత జలచక్రం జీవితం అనే అతని ఆకాంక్షకు... పాఠకులు, ప్రేక్షకులు, శ్రోతలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేయవలసిందే.(నేడు లోక్‌నాయక్‌ పౌండేషన్‌ పురస్కారాన్ని గోరటి వెంకన్నకు ప్రదానం చేస్తున్న సందర్భంగా...)



డాక్టర్‌ జీకేడీ ప్రసాద్‌

యూజీసీ పోస్ట్‌ డాక్టరల్‌ ఫెలో, జర్నలిజం విభాగం, ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం ‘ 93931 11740



 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top