ఆ జనాదరణను గుర్తించలేకపోయాం!

ఆ జనాదరణను గుర్తించలేకపోయాం! - Sakshi


కొమ్మినేని శ్రీనివాసరావుతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌. జైపాల్‌ రెడ్డి

వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రజల్లో ఆయన కుటుంబం పట్ల పెరిగిన సానుభూతిని గుర్తించడంలో, వైఎస్‌ జగన్‌ క్లెయిమ్‌ను గుర్తించడంలో కాంగ్రెస్‌ అధిష్టానం విఫలమైందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఎస్‌. జైపాల్‌ రెడ్డి అంటున్నారు. విశ్వమానవతా వాదిగా చాలాకాలం సమైక్యవాదిగా ఉన్నప్పటికీ దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గమనించాకే రాష్ట్ర విభజనకు అంగీకరించానన్నారు.



తనవల్లే విభజన జరిగిందని వస్తున్న విమర్శలను ఖండిస్తూ మెజారిటీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పుడు మైనారిటీకి దాన్ని వ్యతిరేకించే శక్తి ఉండదన్నారు. లోక్‌సభలో విభజన బిల్లుపై చర్చ, ఓటింగ్‌ జరిగినప్పుడు ప్రతిమాటా రికార్డయిందని, టీవీలో కూడా రికార్డు చేశారు కానీ దాన్ని టీవీలో చూపలేదని వివరణ ఇచ్చారు.



శారీరక వైకల్య సమస్యను అధిగమించి ఈ స్థాయికి ఎలా రాగలిగారు?

సంపన్న కుటుంబంలో పుట్టాను. అంగవైకల్యం ఉన్నప్పుడు దారిద్య్రం కూడా ఉంటే చేసేదేమీలేదు. ఆ రెండూ ఒక భయంకరమైన కాంబినేషన్‌. అంగవైకల్యం ఉంది కాబట్టే నన్ను దేవరకొండలో తెలుగు మీడియంలో చేర్పించారు. ఇంగ్లిష్‌ ట్యూటర్‌ని పెట్టిం చారు. అలా తొలినుంచి ఆంగ్లంలో ప్రావీణ్యం సంపాదించే అవకాశం కలిగింది.



తెలంగాణ తొలి దశ ఉద్యమంలో (1969) మీరు సమైక్యవాదిగా ఎలా ఉండగలిగారు?

నేను చాలా స్వాభావికమైన సమైక్యవాదిని. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కాదు ప్రత్యేక రక్షణలు కావాలి అనేవాడిని. అయితే బ్రహ్మానందరెడ్డి పట్ల విధేయత వల్ల జైపాల్‌ రెడ్డి విశాలాంధ్ర వాది అయ్యాడని అప్పట్లో నాపై అప్పట్లో ఒక అపవాదు ఉండేది. ఆరోజు నా ఉపన్యాసాలు మీరు చూసినట్లయితే, అప్పటికే నేను విశ్వమాన వతావాదిని. ఎలాంటి విభజనవాదమూ ఇష్టముండేది కాదు.



సమైక్యవాదులు మీవద్దకు వస్తే నేను సమైక్యవాదిననీ, తెలంగాణ వాళ్లు వస్తే తెలంగాణ రావలసిందేననీ అనేవారట?

1969 నుంచి 71 వరకు చెన్నారెడ్డి నాయకత్వంలో ఉద్యమం వచ్చిన పుడు నేను కాంగ్రెస్‌లో ఉంటూ సమైక్యవాదిగా ఉండేవాడిని.  1972– 73లో ఆంధ్రలో ఉద్యమం వచ్చింది. దాని నేపథ్యం వేరు కారణాలు వేరు. తెలంగాణలో ఎంత తీవ్రంగా ఉద్యమం వచ్చిందో ఆంధ్రలో కూడా అంతే తీవ్రంగా వచ్చింది. చాలామందికి తెలియనిది ఏమిటంటే, 1973లో ఇక తెలంగాణ తగదు. రాష్ట్రాన్ని విభజిస్తేనే మనం సమైక్యంగా ఉండగలం. భావ సమైక్యం ఏర్పడు తుంది అని చెప్పాను. నా అభిప్రాయంలో 1973లోనే కాంగ్రెస్‌ అధిష్టానం రాష్ట్ర విభజన చేసి ఉంటే సీమాంధ్ర ప్రాంతంలో ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే ఆనాటికి సీమాంద్ర మిత్రులకు హైదరాబాద్‌లో ఆస్తిపాస్తులు లేవు. రెండోది.. హైదరా బాద్‌ నగరంపై ఇంత మమకారాన్ని వారు ఆనాడు పెంచుకోలేదు. ఒక భాషా ప్రాంత రాష్ట్రాన్ని విడగొడితే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇలాగే అడుగుతాయని ఇందిరాగాంధీ భావించి ఉంటారు.



సోనియావల్లే రాష్ట్రం విడిపోయిందని బాబు చెబుతున్నారే?

ఇలాంటి మాటలు ఓట్లకోసం, అధికారం కోసం సాగించిన అవకాశవాదంలో భాగం. ఘోరమైన అవకాశవాదంలో భాగం.



తెలంగాణను తెలివి తక్కువగా ఇచ్చారా?

తెలంగాణ ఏర్పాటు ఒక చారిత్రక అనివార్యత. ఇన్ని దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్న వేరు భావనలను ఎంతవరకు మనం అణిచివేయగలం? ఇప్పుడు బాధ ఎందుకు? వచ్చిన తెలంగాణను టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ సక్రమంగా వాడుకోలేదని అంటున్నాను.  అంతే గానీ తెలంగాణను అడగటం, తెచ్చుకోవడమే పొరపాటని ఏ కాంగ్రెస్‌ వాదీ అనడం లేదు. పైగా నక్సలైట్‌ మిత్రులున్నారు. 1969 నుంచే వారు తెలంగాణను కోరుకుంటు న్నారు. ఇలాంటి తెలంగాణాను మేం కోరుకున్నామా అని వారు అంటున్నారిప్పుడు.



వైఎస్సార్‌ మరణం తర్వాత జరిగిన ఘటనలు, వచ్చిన సమస్యలపై మీ అభిప్రాయం?

బతికున్నప్పటికంటే మరణించాకే వైఎస్‌పై సానుభూతి మరింతగా పెరిగింది. ఆ పరి ణామాన్ని గుర్తించడంలో హైకమాండ్‌ లేక మాలాంటివాళ్లం విఫలమయ్యాం. అలాగే జగన్‌మోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అంశాన్ని కొంతమేరకయినా మేం గుర్తించవలసి ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలలోనే కాదు ప్రజల్లో కూడా వైఎస్‌ కుటుం బంపై అప్పట్లో సానుభూతి ఏర్పడింది.



కేసులు పెట్టడం, జైలుకు పంపించడం లాంటివి అప్రజాస్వామికమైన చర్యలు కదా?

ఆనాటికి రాష్ట్ర రాజకీయాల్లో నేను లేను. రికార్డు ప్రకారం చూసినప్పుడు ఇవన్నీ కోర్టు చొరవవల్ల జరిగినట్లు తెలుస్తోంది. నాకు విషయం తెలియనప్పుడు దానిపై అభి ప్రాయం చెప్పలేను.



కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలంగాణపై అంతగా విభేదించినా ఏం చేయలేకపోయారే?

తెలంగాణపై నిర్ణయం తీసుకున్నప్పుడు అధిష్టానం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని తొలగించాల్సి ఉంది. అతడిని మనమే పెట్టాం కదా. మనం ఏం చెప్పినా వింటాడులే అని నమ్మారు. ఆయన్ని సీఎంగా పెట్టడంలో తప్పు జరిగింది అనే అభిప్రాయానికి ఇప్పుడు వచ్చాం. కానీ ఇప్పుడనుకుంటే ఏం ప్రయోజనం?



పార్లమెంటును తప్పుదారి పట్టించి విభజన బిల్లును ఆమోదింపజేయడంలో మీరు ప్రధాన పాత్ర వహించారని ఉండవల్లి విమర్శించారు కదా?

తెలంగాణ కంటే సీమాంద్రలోనే నాకు మిత్రులు ఎక్కువ. ‘తెలం గాణకు మద్దతిచ్చావు సరే. ఒప్పుకుంటాం. కానీ ప్రొసీజర్‌కి బిన్నంగా నీవు చేశావు’ అంటారు వారు. ఈ విమర్శ ఉంది. సమాధానం చెప్ప వలసిన బాధ్యత కూడా నాపై ఉంది. నేను చెప్పేది ఒకే విషయం. మెజారిటీని కాదనే శక్తి మైనారిటీకి ఎలా ఉంటుంది? విభజనకు అనుకూలంగా మెజారిటీ లేదు అనే సందేహం ఎక్కడైనా ఉందా? పైగా తలుపులు మూసేసారంటున్నారు. మీతరఫున నేను దీనిపై క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడు కీలకమైన బిల్లు ప్రవేశపెట్టినా డోర్లు బంద్‌ చేస్తారు. పాత్రికేయులుగా మీకూ తెలిసిందే. కానీ లైట్లు, టీవీ ఆఫ్‌ చేశారన్న విషయం నాకు తెలీనే తెలీదు. నేను లోక్‌ సభలో ఉన్నాను. స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. కానీ అది రికార్డయింది. ఆ సమ యంలో మాట్లాడిన ప్రతి మాటా రికార్డయింది. టీవీలోనూ రికార్డయింది కానీ టీవీలో చూపలేదంతే.



ఈ రెండున్నరేళ్ల మోదీ పాలనపై మీ అభిప్రాయం?

ఇందిరాగాంధీ గరీబీ హఠావో పథకం తరహాలో ప్రజల్లో పేరు వస్తుందని పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. అది బెడిసికొట్టింది. దాని వల్ల ప్రజలు కష్టాలు పడ్డారు. ప్రజల కష్టాలు ఈ రోజు, రేపు తొలగిపోతాయి. కానీ పెద్దనోట్ల రద్దువల్ల జరిగిన నష్టం తొల గిపోవడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. పైగా మోదీ ఇంకా ప్రతిప క్షంలో ఉండి మాట్లాడుతున్నట్టు ఉంది. ఆయన భాషలో సభ్యత లేదు. ప్రధానమంత్రి పదవి ప్రతిష్టను మోదీ తగ్గిస్తున్నారు.



బాధ కలిగించిన సన్నివేశం?

2004లో బీజేపీ కేంద్రంలో ఓడిపోవడం చాలా సంతోషం కలిగించిది. అలాగే 2014లో ఇంత మెజారిటీతో బీజేపీ గెలవడం చాలా బాధనిపించింది. బీజేపీ మిత్రులు, అభి మానులను ఒకటడుగుతాను. మీరంతా ట్రంప్‌ను అంతగా వ్యతిరేకిస్తున్నారే. మోదీ భారత దేశ ట్రంప్‌ కాడా? మీరు అమెరికాలో ట్రంప్‌ను వ్యతిరేకించినప్పుడు భారత దేశంలో మోదీని ఎలా సమర్థిస్తారు?



సంతోషం కలిగించిన విషయం?

ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు పొందడం. నాకంటే ముందు అయిదుమందికి ఈ అవార్డును ఇచ్చారు. వారు వరుసగా ఇంద్రజిత్‌ గుప్తా, అటల్‌బిహారీ వాజ్‌పేయి, నా గురువు చంద్రశేఖర్, సోమనాథ్‌ చటర్జీ, ప్రణబ్‌ ముఖర్జీ... వీరి తర్వాత ఆరవ ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డును నాకు ఇచ్చారు. ఇంతవరకు తెలుగువారికి ఎవరికీ ఈ అవార్డు రాలేదు. ఇది నాకు ఎంతో సంతోషం కలిగించే విషయం.

(ఎస్‌. జైపాల్‌ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top