లక్ష గళాల వేదిక ధర్నాచౌక్‌

లక్ష గళాల వేదిక ధర్నాచౌక్‌


సందర్భం

ధర్నాచౌక్‌ సాక్షిగా అంగన్‌వాడీ టీచర్ల మీదకు గుర్రాలతో స్వారీ చేయించిన ఒకనాటి పాలకుడు ఎలాంటి పరిస్థితిలో ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టాల్సి వచ్చిందో మనకు తెలియదా? ధర్నాచౌక్‌ పాలకులది కాదు, మనందరిదీ.



సేవ్‌ ధర్నాచౌక్‌... ఈ నినాదం ఇప్పుడు తొలి తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో క్షమించరాని నేరం. ఆ ప్రాంతానికున్న చారిత్రక నేపథ్యాన్ని తుడి చేయాలనే కసి వారి ప్రతి మాట, చేతలోనూ కనిపి స్తోంది. ఇరవై ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌ అసెంబ్లీ ఎదురుగా, సెక్రటేరియట్‌ ఎదురుగా నిర్వహించే ధర్నాలను, బహిరంగ సభ లను శాంతి భద్రతల పేరు చెప్పి రెండు కిలోమీటర్లు దాటిన తర్వాతే ఇలాంటి వేదికలు ఉండాలని ఇంది రాపార్క్‌ దగ్గర ఈ ప్రదేశాన్ని కేటాయించింది అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమే. ప్రజాగళం వినిపించాల్సింది ఈ రెండు వేదికలే కాబట్టి, వాటికి ఈ ప్రాంతం మరీ ఎక్కువ దూరం కానందున ప్రతి పక్ష పార్టీలు, ఇతర ప్రజాసంఘాలు అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని ఒక వేదికగా మలచుకున్నారు.



ఆనాటి నుంచి ధర్నాచౌక్‌ అనేక చారిత్రక ఉద్య మాలకు నెలవుగా మారింది. అన్ని రాజకీయ పార్టీలు తమ గొంతు వినిపించటానికి ఈ వేదికను శక్తివంతంగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో వున్న టీఆర్‌ఎస్‌ పార్టీతో సహా. ఇవే కాకుండా ప్రజాసంఘాల ద్వారా 1/70 అమలు కోసం ఆదివాసీల హక్కుల కోసం అయినా, దళిత బహుజనుల హక్కుల కోసం ఉద్యమించినా.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సాధన అయినా, మరణశిక్షల రద్దు ఉద్యమమైనా, రైతు ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఉద్యమించినా, ఎన్‌కౌంటర్ల సంస్కృతిని వ్యతిరేకిం చినా, మత సామరస్యం కోసం నడుం బిగించినా, బాలల హక్కుల కోసం పోరాడినా, డాక్టర్లు, నర్సులు, మున్సిపాలిటీ ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, విద్యార్థులు, మీడియా సంఘాలు, యాజమాన్యాలు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, పనిమనుషులు, సఫాయి కార్మికులు, చేనేత కార్మికులు, కవులు, కళా కారులు అనేకానేక సమూహాలు, ఆఖరికి అర్చకు లతో సహా అనేక కుల సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వాలతో ఒక సంభాషణ జరపటం కోసం ఎవరికీ ఏ రకమైన ఇబ్బందులు కలిగించకుండా.. తమ సమావేశాల్ని, ధర్నాలను నిర్వహించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలపడటానికి అనేక సబ్బండ వర్ణాల ప్రజలు, సమూహాలు ఒక దగ్గరకు రావటానికి ధర్నాచౌక్‌ కీలకమైన ప్రాంతం. తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షని ఈ వేదిక ద్వారానే ప్రపంచానికి చాటి చెప్పారు.



కానీ ఇప్పుడు ఏ వేదికైతే తమ ఆకాంక్షకు బలమైన ఆసరాగా ఉందో, ఏ రహదారి తమ పోరా టాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందో దాన్నే శాశ్వ తంగా మూసి వేయాలనే విఫలయత్నాన్ని ప్రభు త్వం చేస్తోంది. తాము నడచిన దారుల్నే వారు మర చిపోవాలనుకుంటున్నారు. బహుశా తమకింక ఆ వేదికల అవసరం లేదనుకుంటున్నారు. ధర్నాచౌక్‌ అనేమాట వినపడితే విచక్షణ మరుస్తున్నారు. చిన్న పిల్లలు, మహిళలు అని చూడ కుండా లాగి అవతల పారేయమని పోలీసులకు మౌఖిక ఆదేశాలందా యట. ఇదేమిటని ప్రశ్నిస్తే, ‘మీరు సీఎంతో మాట్లా డుకోండి, మాకు ఆదేశాలున్నాయి ఇలా చేయమని’ అని వారే మరీ చెప్తున్నారు. ‘అలా మాట్లాడుకోవటా నికి ఉన్న వారధే కదా ఈ ధర్నాచౌక్, అందుకేS దాని మీద నిషేధాజ్ఞలు ఉండ కూడదని మేం ప్రశ్నిస్తు న్నాం’ అంటే, ‘మాకు చాలా ట్రాఫిక్‌ సమస్యలొస్తు న్నాయని, ‘పక్కనవున్న కాలనీ వాళ్లకి చాలా ఇబ్బంది అవుతోంది’ అని చెబుతున్నారు.



ధర్నాచౌక్‌ అంటే కేవలం ఒక రోడ్డు మాత్ర మేనా!? ఎన్ని ఆలోచనల కూడలి అది! ఎన్నో ప్రాంతాల నుంచి సమూహాలుగా వచ్చిన ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వాలకు తెలియచేసే వేదిక అది. అక్కడి నుంచి ఎన్ని లక్షలమంది తమ గళాల్ని వినిపించి ఉంటారు? ఎన్నో లక్షల మంది గత 25 సంవత్సరాల నుంచి తమ పాదముద్రల్ని అక్కడ నిక్షిప్తం చేశారు. ప్రభుత్వాల నిరంకుశత్వాలకు ఎన్ని సార్లు ఈ ధర్నాచౌక్‌ ప్రత్యక్షసాక్షిగా ఉండలేదు. ఎన్నిసార్లు పోలీసుల లాఠీలు ప్రజల శరీరాల మీద నాట్య మాడలేదు... వాటిని తట్టుకుంటూ, ఇనుప గేట్లను తోసుకుని మరీ నినదించిన మట్టిపాదాల ముద్రలు కదా మనకు స్ఫూర్తి. ధర్నాచౌక్‌ సాక్షిగా అంగన్‌వాడీ టీచర్ల మీదకు గుర్రాలతో స్వారీ చేయించిన ఒకనాటి పాలకుడు ఎలాంటి పరిస్థితిలో ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టాల్సి వచ్చిందో మనకు తెలియదా?



చెరబండరాజు రాసిన ‘నన్ను కదిపినా, ఖండిం చినా మళ్ళీ మళ్ళీ అలలా పుట్టుకొస్తూనే ఉంటాను’ అనే కవిత స్ఫూర్తిగా అవును... మేం ఉద్యమిస్తాం... అన్యాయానికి వ్యతిరేకంగా... అవును.. మేము పాదయాత్రలు చేస్తాం... సామాజిక న్యాయం కోసం... అవును.. మేం దిక్కులు పిక్కటిల్లేలా నిన దిస్తాం... ధర్నాచౌక్‌ సాక్షిగా మీ నియంతృత్వానికి చరమగీతం పాడేలా... ధర్నాచౌక్‌ పాలకులది కాదు, మనందరిది. కాపాడుకుందాం.



కె.సజయ

వ్యాసకర్త సామాజిక పరిశోధకురాలు, స్వతంత్ర జర్నలిస్ట్‌ ‘ 99483 52008

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top