యూపీ తెరపై యోగి

యూపీ తెరపై యోగి - Sakshi


త్రికాలమ్‌

ఎవ్వరూ ఊహించని విధంగా సంచలనాత్మకమైన, సాహసోపేతమైన నిర్ణ యాలు తీసుకోవడంలో ప్రధాని నరేంద్రమోదీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. ఏ రాజకీయ పండితుడూ ఊహించని విధంగా గోరఖ్‌పూర్‌ పార్ల మెంటు సభ్యుడు యోగీ ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసి భారత సమాజంపైకి ఒక సవాలు విసిరారు. ఆదిత్యనాథ్‌ను దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలు ఆమోదించడమో, ప్రజల ఆమోదం పొందే విధంగా ఆదిత్యనాథ్‌ విశ్వాసాలు మారడమో జరగాలి.



రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) నాయకత్వం ఎవరిని సిఫార్సు చేస్తే వారిని ముఖ్యమంత్రులుగా నియమించడానికి అభ్యంతరం లేదని మోదీ మొదటి నుంచీ తన నిర్ణయాల ద్వారా స్పష్టం చేస్తూ వచ్చారు. మహారాష్ట్ర, హరి యాణా ముఖ్యమంత్రుల విషయంలో ఆరెస్సెస్‌ నేపథ్యం ఉండటం అన్నది ప్రధానమైన అర్హత. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా త్రివేంద్రసింగ్‌ రావత్‌ను ఎంచుకోవడంలో సైతం ఆరెస్సెస్‌ నేపథ్యం ప్రధానం. ఆరెస్సెస్‌ బాటలో నడిచి ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించిన రాజకీయ నాయకులూ, ముఖ్యమంత్రి పద విని ఆశిస్తున్నవారూ ఉన్నప్పటికీ కరడు కట్టిన హిందూత్వవాదిని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నియమించడంలోని ఆంతర్యం ఏమిటి? ఆనవాయితీకి భిన్నంగా వ్యవహరించడం మోదీలో కొట్టవచ్చినట్టు కనిపించే ప్రత్యేకత.



మోదీ ఎదుగుదల

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీని బీజేపీ అధినేత లాల్‌కృష్ణ అడ్వాణీ పంపినప్పుడు మోదీ ఒక సాధారణ బీజేపీ కార్యదర్శి. గుజరాత్‌ ముఖ్య మంత్రిగా కుదురుకున్నాక పరిపాలనాదక్షుడుగా పేరు తెచ్చుకున్నారు. గోద్రా అనంతరం మత సంఘర్షణలలో ఆయన పాత్ర వివాదాస్పదం కావడంతో దేశ వ్యాప్తంగా మోదీ పేరు మారుమోగింది. తన సారథ్యంలో బీజేపీని వరుసగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించడంతో రాజకీయ వ్యూహ రచనలో, ఎన్నికల సమరంలో సాటిలేని మేటిగా గుర్తింపు పొందారు. 2014 నాటి ప్రభం జనంతో తిరుగులేని పరపతి సంపాదించి అత్యున్నత నాయకుడిగా ఎదిగారు. మతప్రాతిపదికపైన సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ప్రమాదపుటంచు లలో పదవిన్యాసాలు చేస్తూ అక్షరతూణీరాలను ప్రయోగించడం ద్వారా హిందు వులను ఆకట్టుకునే రాజనీతిలో మోదీ అసమానుడనే విషయం అందరికీ తెలుసు. యోగీ ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలన్న నిర్ణయంతో మోదీ హిందూత్వ వాదానికి ఆగ్రాసనం ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్‌లోనూ, ఉత్త రాఖండ్‌లోనూ అగ్రకులాల (జనరల్‌ క్యాస్ట్స్‌)కు చెందిన ఠాకూర్లకే పెత్తనం అప్ప గించారు. లౌకికవాదులుగా తమను తాము భావించుకునేవారు ఉత్తరప్రదేశ్‌లో ఏది జరగకూడదని ఆశిస్తున్నారో, ఏది జరుగుతుందని భయపడుతున్నారో సరిగ్గా అదే జరిగింది. నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వెళ్ళిన సమయంలో నరేంద్ర మోదీ వ్యక్తిత్వానికీ, యూపీ ముఖ్యమంత్రిగా ఈ రోజు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయబోతున్న యోగీ ఆదిత్యనాథ్‌ నేపథ్యానికీ చాలా తేడా ఉంది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా విఫలమైన ఉమాభారతికీ, ఆదిత్యనాథ్‌కీ సామ్యం ఉంది. యోగి సాధ్విలాగా విఫల మనోరథుడు అవుతారా లేక మోదీలాగా విజ యుడవుతారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.



వివాదాస్పదుడు

చిన్నవయస్సులోనే (26వ ఏటే) 12వ లోక్‌సభకు తూర్పు యూపీలోని గోరఖ్‌ పూర్‌ నుంచి గెలుపొందిన ఆదిత్యనాథ్‌ వరుసగా అయిదు విడతలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో తూర్పు ప్రాంతంలోని కొన్ని జిల్లాలలో దుందు డుకు చర్యలతో సంచలనం సృష్టించిన హిందూ యువ వాహినికి యోగి నాయ కుడు. ఆయన తండ్రి మహంత్‌ అవైద్యనాథ్‌ మహరాజ్‌ బాబ్రీ మసీదును కూల్చే కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న వ్యక్తి. తన కుమారుడు అందరినీ కలుపుకొని పోతాడనీ, పరిపాలనాదక్షుడుగా పేరు తెచ్చుకుంటాడనీ ఆశిస్తున్నట్టు యోగీ ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలుసుకున్న తర్వాత అవైద్యనాథ్‌ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తండ్రి కోరుకున్న పేరుప్రఖ్యాతులు ఆదిత్య నాథ్‌కు దక్కాలంటే ఆయన వైఖరి పూర్తిగా మారిపోవాలి. ఇంతవరకూ ప్రపంచా నికి తెలిసిన ఆదిత్యనాథ్‌ లౌక్యం బొత్తిగా తెలియని హిందూత్వవాది. హిందూ, ముస్లిం యువతీయువకుల మధ్య ప్రేమను నిషేధించాలనీ, మతాంతర వివాహాలు ఆమోదం కాదనీ ‘లవ్‌ జిహాద్‌’ పేరుతో ఉద్యమం నిర్వహించిన వ్యక్తి. ఇతర మతాలు స్వీకరించిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకొని వచ్చేందుకు ‘ఘర్‌వాప్సీ’ పేరుతో సమాజాన్ని ప్రభావితం చేసిన హిందూత్వ నాయకుడు. గోరక్ష ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన హిందూత్వవాది. సుమారు 1,800 మంది క్రైస్తవులను హిందువులుగా మార్చిన ఉద్యమకారుడు. గోరఖ్‌పూర్‌లో మత కలహాలు జరిగినప్పుడు ఆదిత్యనాథ్‌ను అరెస్టు చేశారు. ప్రత్యర్థులను హత్య చేయించారనే అరోపణలు ఉన్నాయి.



పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఓటింగ్‌కు వచ్చినప్పుడు పార్టీ విప్‌ను ధిక్కరించిన బీజేపీ మితవాద ఎంపీలలో ఆదిత్యనాథ్‌ ఒకరు. సూర్యనమస్కారాలను వ్యతి రేకించేవారు ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ ఆదేశించిన పార్లమెంటు సభ్యుడు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ఖాన్‌ని పాకిస్తాన్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌తో పోల్చి, దేశంలో మెజారిటీ మతం ప్రజలు షారుఖ్‌ఖాన్‌ని సూపర్‌ స్టార్‌ చేశారనీ, వారు కనుక సినిమాలు చూడటం మానివేస్తే షారుఖ్‌ ముంబయ్‌ వీధులలో రికామిగా తిరగవలసి వస్తుందనీ వ్యాఖ్యానించిన మఠాధిపతి. ఎన్ని కల ప్రచారం ప్రారంభమైన సందర్భంలో తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆదిత్యనాథ్‌ పట్టు పట్టారనీ, లేకపోతే హిందూ యువ వాహిని తరఫున తూర్పు యూపీలో తిరుగుబాటు అభ్యర్థులను రంగంలో దింపుతాననీ హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. తన వర్గానికి వందకుపైగా సీట్లు  కేటాయించాలంటూ వాదిం చారు. పార్టీ నాయకులు బుజ్జగించిన ఫలితంగా తిరుగుబాటుకు స్వస్తి చెప్పారు. ఏదో సర్ది చెప్పి ఉంటారని భావించారు కానీ, నిజంగానే ముఖ్యమంత్రి పదవిని ఆదిత్యనాథ్‌కు అప్పగిస్తారని ఏ వ్యాఖ్యాతా, ఏ పండితుడూ ఊహించలేదు. వారం రోజులుగా మీడియా కథనాలలో వినిపించిన నాలుగైదు పేర్లలో యోగి పేరు లేదు. కేంద్ర సహాయ మంత్రి మనోజ్‌సిన్హాను ముఖ్యమంత్రిని చేసే అవ కాశం ఉన్నదంటూ శనివారం మధ్యాహ్నం వరకూ ఊహాగానాలు సాగాయి. సిన్హా లేదా ఓబీసీ కులాలను సంఘటితం చేసి మోదీ వెనుక నిలబెట్టిన బీజేపీ యూపీ శాఖ అధ్యక్షుడు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు పట్టం కడతారని అనుకున్నాం. వీరిద్దరూ కాకపోతే లక్నో మేయర్‌ దినేశ్‌ శర్మకూ లేదా లాల్‌బహద్దూర్‌ శాస్త్రి మనుమడు సిద్దార్థనాథ్‌ సింగ్‌కూ యూపీ పగ్గాలు అప్పజెపుతారని ఊహించాం. యోగీ ఆదిత్యనాథ్‌ చేతుల్లో యూపీని పెడతారని కలలో కూడా అనుకోలేదు. అనూహ్యమైన నిర్ణయాలతో విస్మయపరచడం మోదీ యుద్ధతంత్రంలో భాగం.  యూపీలో 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక్క నియోజకవర్గంలో  కూడా ముస్లిం అభ్యర్థిని బీజేపీ నిలబెట్టలేదు. ముస్లింలకు ప్రబల విరోధిగా పేరుమోసిన హిందూ యువ వాహిని అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని చేశారు. యూపీ ప్రజలకూ, దేశ ప్రజలకూ ఎటువంటి సంకేతం పంపుతున్నారు?



హిందువుల సమీకరణ

ఒక్క నియోజకవర్గంలో  కూడా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకపోయినా అద్భుత మైన మెజారిటీ సాధించింది బీజేపీ. దాదాపు వంద టిక్కెట్టు ముస్లిం అభ్యర్థు లకు ఇచ్చిన బీఎస్‌పీ 18 స్థానాలకు తగ్గింది. ముస్లింలను సంఘటితం చేసి తమ వెంట నిలుపుకోవాలని ఆశించిన ఎస్‌పీ–కాంగ్రెస్‌ కూటమికి వచ్చిన స్థానాల మొత్తం 57. జానాభాలో దాదాపు 21 శాతం ఉన్న దళితులను కులాలవారీగా చీల్చి, 19 శాతం ఉన్న ముస్లింల ఓట్లు ఆశించకుండా యూపీలో ఘనవిజయం సాధించవచ్చునని మోదీ–అమిత్‌షా ద్వయం నిరూపించారు. ముస్లిం అభ్యర్థు లకు మొక్కుబడిగా టిక్కెట్లు ఇవ్వదలచుకుంటే ఉత్తర యూపీలో ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాలను కొన్నింటిని వారికి కేటాయించడం బీజేపీకి పెద్ద సమస్య కాదు. కానీ ఒక్క సీటు కూడా ముస్లింలకు ఇవ్వకపోవడం అన్నది వ్యూహాత్మకమైన ఎత్తుగడ. ముస్లిం ఓటర్లతో నిమిత్తం లేకుండా హిందూ ఓట ర్లను సంఘటితం చేయడం మోదీ–షా అనుసరించిన రణనీతి. యాదవ్‌ల పైన విమర్శనాస్త్రాలు సంధించడం ద్వారా యాదవుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న ఇతర వెనుకబడిన కులాలను బీజేపీకి సుముఖం చేయడంలో మోదీ, షా విజ యం సాధించారు. మాయావతికి చెందిన జాతవ్‌ కులాన్ని వదిలి ఇతర దళిత కులాలవారిని ఆకర్షించ డంలో కృతకృత్యులైనారు. ఓబీసీలలో, దళితులలో విశేషమైన ప్రాబల్యం కలి గిన మౌర్యను బీజేపీ యూపీ శాఖ అధ్యక్షు డుగా నియమించడం సత్ఫలితం ఇచ్చిన నిర్ణ యం. ఓబీసీలకు పెద్ద పీట వేస్తూనే అగ్ర కులాలు (జనరల్‌ క్యాస్ట్స్‌) తమకు దూరం కాకుండా జాగ్రత్త పడ్డారు. ఓబీసీలను తమ గూటికి తెచ్చిన మౌర్యకూ, బ్రాహ్మణ కులానికి చెందిన దినేశ్‌ శర్మకూ ఉపముఖ్యమంత్రి పదవులు కేటాయిం చారు. ఎన్నికల ముందూ, ఎన్నికల ప్రచారంలోనూ, ఫలితాలు వెలువడిన తర్వాత తీసుకున్న సకల నిర్ణయాలకూ ప్రాతిపదిక కులం కావడం యూపీ ప్రత్యే కత. అన్ని కులాలనూ సంతృప్తిపరచడానికే ప్రయత్నం.



ప్రతిపక్షాలకు సవాల్‌

యోగి ఆదిత్యనాథ్‌ వంటి జగమెరిగిన మతవాదికి యూపీ పగ్గాలు ఇవ్వడం ద్వారా నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలోనూ, ఆ తర్వాత విజయోత్సవ సభ లోనూ మాట్లాడిన ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌’ అనే నినాదం ఆచరణకు నోచు కుంటుందా? మోదీ..మోదీ అంటూ మోదీ నామస్మరణ చేసిన యూపీ ప్రజలు యోగీ.. యోగీ అంటూ ఉత్సాహం ప్రదర్శించడం టీవీలలో చూశాం. హర్‌హర్‌ మోదీ, హర్‌హర్‌యోగీ నినాదాలతో అన్ని కులాలనూ, అన్ని ప్రాంతాలనూ, అన్ని మతాలనూ కలుపుకొని పోవడం సాధ్యం అవుతుందా? అడ్వాణీ రథ యాత్ర బాహాటంగా జరిగిన హిందూత్వ ప్రదర్శన అయితే మోదీ ప్రచార యాత్ర నర్మగర్భంగా, పరోక్షంగా, కొండొకచో ప్రత్యక్షంగా సాగిన హిందూత్వ సమీకరణ. కబ్రస్థాన్, శ్మశాన్, దీపావళి, రంజాన్‌ అంటూ ముస్లింలను నెత్తిన పెట్టుకుంటూ హిందువుల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ ప్రచారం చేయడం ద్వారా ఎన్నికల ప్రచారంలో వినిపించిన విభజనవాదమే ఎన్నికల అనంతరం కొనసాగడం శోచనీయం.



భారతదేశం హిందువులదే అన్న సందేశం ఇవ్వడం ఇందులోని ఉద్దేశమా? పాకిస్తాన్‌ ఇస్లామిక్‌ రాష్ట్రమైనట్టు, ఇండియా హిందూ రాష్ట్రం అవుతుందా? అదే మోదీ, తదితర నిర్ణేతల పరమోద్దేశమా? లేదా యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రజారంజకంగా పరిపాలించగల దక్షుడుగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నమా? పరిపాలనలో అనుభవం బొత్తిగా లేని, సమాజంలో కొన్ని వర్గాల పొడగిట్టని, జీవితంలో కొన్ని పార్శా్వలు తెలియని వ్యక్తిని యూపీ వంటి కీలక మైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించడంలోని ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో అతిపెద్ద మెజారిటీ సాధించిపెట్టిన ప్రచారమే, భావజాలమే, వ్యూహమే 2019లో సైతం ఘనవిజ యానికి దోహదం చేస్తుందనీ, అది ఆదిత్యనాథ్‌ వంటి హిందూ యువ వాహని సేనాని పరిపాలనలోనే సాధ్యమనీ నరేంద్రమోదీ, అమిత్‌షా ఆలోచిస్తున్నారని భావించాలి. ఒక వైపు ప్రగతి మంత్రం జపిస్తూనే మరోవైపు సమాంతరంగా మతప్రాతిపదికపైన విభజన తంత్రం సాగించడమే యూపీ ప్రచారంలో బీజేపీ అనుసరించిన వ్యూహం. ఇదే వ్యూహం కొనసాగించి ఇదే రకంగా అద్భుతమైన ఫలితాలు సాధించాలన్నది మోదీ సంకల్పం కావచ్చు. ఆయన ఇటీవల తర చుగా మాట్లాడుతున్న నవభారత (న్యూఇండియా) నిర్మాణానికి ఈ ధోరణి తోడ్పడుతుందా? వచ్చే రెండేళ్ళలో యోగీ ఆదిత్యనాథ్‌ నాయకత్వంలో యూపీ ప్రభుత్వం పని తీరు మీదా, ప్రతిపక్షాల పోరాట పటిమ మీదా 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఆదిత్యనాథ్‌ నియామకం  లౌకిక వాదంలో విశ్వాసం ఉంచిన సమాజానికీ, ప్రతిపక్షాలకూ చేసిన పెనుసవాలు. ప్రజాస్వామ్య వ్యవస్థకు అగ్నిపరీక్ష.





- కె. రామచంద్రమూర్తి

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top