అసహనం అవసరమా?

అసహనం అవసరమా? - Sakshi


త్రికాలమ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సారథ్యం కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వీకరించి నేటికి వెయ్యి రోజులు. పుష్కరకాలానికిపైగా ఉద్యమం నిర్వహించి సాధించు కున్న ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే అవకాశం కూడా కేసీఆర్‌కే దక్కడం సముచితమనే అత్యధికులు భావించారు. క్షేత్రజ్ఞానం, శాస్త్రజ్ఞానం దండిగా ఉన్న నేతగా కొత్త రాష్ట్రానికి చక్కటి మార్గదర్శనం చేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు.



తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపదికగా పరిగణించిన మూడు అంశాలు–నిధులు, నీళ్ళు, నియామకాలు అని అందరికీ తెలుసు. తెలంగాణ నిధులు ఇక  తెలంగాణవే. నీళ్ళ విషయంలో ప్రాజెక్టులను పునర్‌ రూపకల్పన (రీడిజైనింగ్‌) చేసి నిర్మించాలనీ, కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది కేసీఆర్‌ స్వప్నం. కొత్తగా రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను కళ్ళకు కట్టే విధంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చాలామందికి చూపించారు. కేంద్రమంత్రి ఉమాభారతి సలహాదారు శ్రీరామ్‌ వెదిరె గోదావరి ప్రాజెక్టులపై రాసిన పుస్తకం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చే ఉంటుంది.



ప్రజల ఆకాంక్షలు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్‌ కొన్ని రంగాలలో కలకాలం నిలిచిపోయే పనులు ప్రారంభించారు. ముఖ్యంగా రెండు: మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ. చెరువులలో పూడిక తీయించడం, కరకట్టలను పటిష్ఠం చేయడం కేవలం చెరువుల పునరుద్ధరణకే కాకుండా గ్రామాలలో వ్యవసాయ అను బంధ వృత్తులపై జీవించేవారికి ఉపాధి కల్పించేందుకు కూడా మిషన్‌ కాక తీయ ఉపయోగపడుతుంది. ప్రతి గ్రామానికీ మంచినీరు సరఫరా చేయా లన్నది మహాసంకల్పం. శుద్ధి చేసిన నీటిని పౌరులందరికీ అందించగలిగితే దాన్ని మించిన వ్యాధినిరోధక మార్గం మరొకటి లేదు. దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమే. ఈ రెండు బృహత్తర కార్యక్రమా లనూ యువకులైన ఇద్దరు మంత్రులకు అప్పజెప్పారు. వృద్ధాప్య పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచడం, యోగ్యులైనవారందరికీ పింఛన్‌ అందే విధంగా చూడటం చెప్పుకోదగిన సంక్షేమ చర్య.



రెసిడెన్షియల్‌ స్కూళ్ళ విస్త రణ స్వాగతించ వలసిన మరో కార్యక్రమం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌సి విద్యార్థులకు 238 రెసిడెన్షియల్‌ స్కూళ్ళూ, ఆదివాసీలకు 145, బీసీ లకు 161, ఇతరులకు 37 స్కూళ్ళూ ఉన్నాయంటే అందుకు కేసీఆర్‌ పూనికే కారణం. 201 మైనారిటీ సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేయడం చరిత్రా త్మకం. భూమి లేని దళిత కుటుంబాలకు మూడున్నర ఎకరాల వంతున సాగు భూమిని కొనుగోలు చేసి ఇవ్వడం మరో గొప్ప సంస్కరణ. కల్యాణ లక్ష్మి పేరుతో నిరు పేద కుటుంబాలలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ప్రభుత్వం సాయం చేసే పథకం వంటి అనేకం అమలు చేసినందుకు అభినందించవలసిందే.



లంగరు అందని ఆకాంక్షలూ, ఆచరణ

వెనువెంటనే సమస్యలన్నీ పరిష్కారం కావాలని కానీ అవుతాయని కానీ ఎవ్వరూ వాదించరు. మన దేశంలో ప్రజలకు సహనం ఎక్కువ. రాజకీయ నాయకులు ఎన్ని వాగ్దానాలు చేసి ఉల్లంఘించినా ఎదురు తిరగరు. వీధులలోకి రారు. మౌనంగా భరిస్తారు. ఎన్నికలలో తిరస్కరించడం ద్వారా తమ ఆగ్రహం ప్రదర్శిస్తారు. ఒక ఆలోచన కార్యరూపం దాల్చడంలో కొంత జాప్యం జరిగినా అర్థం చేసుకుంటారు. తమను ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయని నమ్మకం కుదిరితే చాలు, ఫలాలకోసం వేచి ఉంటారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి ప్రభుత్వాధినేత ఆలోచనలు మరో రకంగా ఉంటాయి. ప్రజల ఆకాంక్షలకూ, ప్రభుత్వ ఆచరణకూ లంగరు అందదు. ప్రభుత్వ యంత్రాంగం మెల్లగా కదులుతుంది. పైగా దాదాపు సంవత్సరం వరకూ కీలకమైన పదవులలో సైతం అధికారులు కుదురుకోలేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభించింది ఒకటిన్నర సంవత్సరాల కిందటే. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర పురోగతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నప్పుడు ప్రజలు సంతోషిస్తారు. ప్రతిపక్షాలు విమర్శించినా స్పందించరు. కానీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలలో ఏవి ప్రజాహితమైనవో, ఏవి కావో గ్రహిస్తారు. చర్చించుకుంటారు.



హితైషులే హితవు చెబుతారు. వందిమాగధులకు స్వప్రయోజనాలు ఉంటాయి. అధినాయకుడి కంటే అధికులమంటూ అహంకారం ప్రదర్శించేవారు ఎప్పుడూ ఉంటారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇటువంటి వ్యక్తులు అధికారపీఠం చుట్టూ తిరుగుతూ ఉంటారు. పొగ డ్తలకు లొంగి భజనపరులను అందలం ఎక్కించే బలహీనత కేసీఆర్‌కు లేదు. ప్రజలతో, ప్రజాసంబంధాలు కలిగి సమాజ హితం కోసం పనిచేసే వారితో మాట్లాడి తన ప్రభుత్వం ఎట్లా పని చేస్తున్నదో, మంత్రులూ, అధికారులూ ఎంత సమర్థంగా పని చేస్తున్నారో తెలుసుకోగల తెలివితేటలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. ఎవరిని, ఎంతమందిని కలుసుకుంటున్నారనే అంశంపైనే ఆయనకు అందే సమాచారం విలువ ఆధారపడి ఉంటుంది.



అధినాయకుడు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, రాజకీయ విలువలకూ, నైతిక విలువలకూ పట్టం కడుతూ దేశంలోని ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా వెలగాలనీ, గొప్ప రాజ కీయవేత్తగా చరిత్రలో నిలిచిపోవాలనీ కేసీఆర్‌ని అభిమానించినవారు కోరుకో వడం సహజం. మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశాక పాలనపైన పూర్తిగా దృష్టి కేంద్రీకరించకుండా ప్రతిపక్షాలను చీల్చడం ప్రారంభించినప్పుడు కేసీఆర్‌ తన అభిమానుల దృష్టిలో పలు^è నైనారు. ఫిరాయింపు ఎంఎల్‌ఏల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో గెలిపించుకోకుండా చట్టంలో ఉన్న లొసు గును ఉపయోగించుకొని స్పీకర్‌ దగ్గరే వ్యవహారం నడిపించినందుకూ, తన పార్టీ అభ్యర్థులను ఓడించిన శాసనసభ్యులకు మంత్రివర్గంలో స్థానం కల్పించి నందుకూ కేసీఆర్‌ను అభిమానించినవారు బాధపడి ఉంటారు. మంత్రివర్గంలో, కార్పొరేషన్‌ పదవుల్లో మహిళలకు బొత్తిగా ప్రాతినిధ్యం లేకపోవడం కూడా విమర్శకు తావు ఇచ్చింది.



కేసీఆర్‌ ఎట్లా అర్థం అవుతున్నారు?

ఉద్యమ సమయంలో ప్రజలకు అర్థమైన కేసీఆర్‌కూ, ముఖ్యమంత్రిగా అర్థం అవుతున్న  కేసీఆర్‌కూ వ్యత్యాసం ఉన్న మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఉద్యమ సారథిలాగా ప్రభుత్వ సారథి వ్యవహరించడం అసాధ్యం. కానీ అంద రినీ సంప్రదిస్తూ, అందరినీ కలుపుకొని ఉద్యమం నిర్మించిన వ్యక్తి ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక తమ అంచనాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు. భాషనూ, శరీరభాషనూ జాగ్రత్తగా గమనిస్తూ తమ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఈ రోజుకూ అత్యంత ప్రాబల్యం కలిగిన నాయకుడు కేసీఆర్‌ అనడంలో సందేహం లేదు. ఆయనకు ప్రత్యామ్నాయం గురించి ప్రజలు ఇప్పుడే ఆలోచించడం లేదు. ఇంత ప్రజాభిమానం కలిగి, చెప్పుకోదగిన గొప్ప నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్న నాయకుడికి  అభద్రతాభావం, అసహనం ఉండవలసిన అవసరం ఏ మాత్రం లేదు. హాయిగా చిరునవ్వు చెదరకుండా, నిబ్బరంగా ఉండవచ్చు. ఉద్యమం తర్వాత కూడా ఉద్యమభాషనే కొనసాగించనక్కరలేదు. అన్నట్టు, శివరాత్రినాడు కాంగ్రెస్‌ నేతలను దుయ్యపడుతూ ముఖ్యమంత్రి ప్రయోగించిన పదజాలం ఆయనకు శోభ చేకూర్చదు. కాంగ్రెస్‌ నాయకులూ తెగించి అదే స్థాయికి దిగితే అందుకు ఎవరిని తప్పు పట్టాలి?



ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని 2009 డిసెంబర్‌ 9 నాటికి పతాకస్థాయికి తీసు కొని వెళ్ళిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దే. ఆయనకు అండగా నిలబడిన ప్రొఫెసర్‌ జయశంకర్‌కి కూడా ఈ కీర్తిలో కొంత వాటా ఉంది. ఆ తర్వాత రెండు వారాలకు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అధ్యక్షతన  తెలంగాణ సంయుక్త కార్యాచరణ సంఘం (టీజాక్‌) వెలిసింది. ఇందులో ప్రధానం కేసీఆర్‌ చొరవ, ఆచార్య జయశంకర్‌ మార్గదర్శనం. అప్పటినుంచీ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో ఉధృతంగా నడిపించడంలో కోదండరామ్, మల్లెపల్లి లక్ష్మయ్య, ఇంకా అనేకమంది నాయ కుల పాత్ర ఉంది. విద్యార్థుల బలిదానం విస్మరించరానిది. కొందరు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు తమ వంతు ప్రయత్నం చేశారు. అందరూ శక్తివంచన లేకుండా కృషి చేస్తేనే తెలంగాణ స్వప్నం సాకారం అయింది. సోనియాగాంధీతో, అధిష్ఠానవర్గంలోని ఇతరులతో, ఇతర పార్టీల నాయకులతో, ముఖ్యంగా బీజేపీ నాయకులతో వ్యవహరించడంలోని చాణక్యం యావత్తూ కేసీఆర్‌దే. కాంగ్రెస్‌లో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నట్టు నమ్మబలికి, రాష్ట్ర విభజన బిల్లు పార్ల మెంటు ఆమోదం పొంది ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్‌లో విలీనం కాకుండా, పొత్తు సైతం పెట్టుకోకుండా, స్వతంత్రంగా పోటీ చేసి మెజారిటీ సాధించడంలో ఆయన చూపిన తెగువ,  సాహసం, దీక్షాదక్షతలూ, రాజకీయ చాతుర్యం అనితర సాధ్యం.  



విభేదాలు ఎందుకు వచ్చాయి?

ఒకానొక బహిరంగసభలో కోదండరామ్‌ను పొగుడుతూ కేసీఆర్‌ మాట్లాడిన సందర్భాలను గుర్తు చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరి మధ్యా విభేదాలు ఎందుకు వచ్చాయో, అందుకు ఎవరు కారణమో సాధారణ ప్రజలకు తెలియదు. కేసీఆర్‌ కానీ కోదండరామ్‌ కానీ ఫలానా కారణ మని బహిరంగంగా చెప్పలేదు. నాటి రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నాయకత్వంలో మంత్రుల బృందం (గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌) సమక్షంలో మాట్లాడానికి వెళ్ళిన ప్పుడు తనతో రావడానికి కోదండరామ్‌ నిరాకరించిన కారణంగా కేసీఆర్‌ మనసు కష్టపెట్టుకున్నారని కొందరి అభిప్రాయం. తెలంగాణ ఇస్తున్న కాంగ్రెస్‌కీ, తెస్తున్న టీఆర్‌ఎస్‌కీ మధ్య సమదూరం పాటించాలని నాటి జేఏసీ కార్యవర్గం నిర్ణయించిందనీ, దాన్ని కోదండరామ్‌ అమలు చేశారనీ అంటారు.



మొత్తంమీద కోదండరామ్‌ అధికార కేంద్రానికి దూరంగా ఉండటం ప్రజలలో చర్చనీ యాంశం అయింది. తెలంగాణ తుది ఉద్యమం ప్రారంభానికి పూర్వమే పౌరహ క్కుల కోసం పోరాడే ప్రొఫెసర్‌గా కోదండరామ్‌కు పేరుంది. ఆత్మహత్య చేసు కున్న రైతుల కుటుంబాలను పరామర్శించడం, వారికి నష్టపరిహారం ఇప్పిం చడం కోసం ఆయన స్వచ్ఛంద, ఉద్యమ సంస్థల ప్రతినిధులతో కలసి పని చేశారు. ఇప్పుడు అదే పని తిరిగి ప్రారంభించారు. రాజకీయ పార్టీ నెలకొల్పాలనే ఆలోచన కూడా ఉండవచ్చు. ప్రస్తుతానికి  పౌరసమాజం ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమంలో కోదండరామ్‌తో భుజం కలిపి నడిచిన వ్యక్తులే ఇప్పుడు పదవులలో ఉండి ఆయనను అనరాని మాటలు అంటుంటే ఎబ్బెట్టుగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ ఉండవు. ప్రైవేటురంగంలో పరిశ్రమలనూ, హోటళ్ళనూ, ఇతర సంస్థలనూ ప్రోత్సహించి ఉద్యోగాలు కల్పించే కృషి జరగాలి. ఆ పని ఇప్పటికే  జరుగుతూ ఉంటే అదే సంగతి చెప్పవచ్చు.



కోదండరామ్‌ను తెలంగాణ ద్రోహిగా చిత్రించాలనుకోవడం వృథా ప్రయాస. ఆయనను అర్థరాత్రి ఇంటి తలుపులు పగలకొట్టి మరీ అరెస్టు చేయాలని డీసీపీ రవీందర్‌ సొంత నిర్ణయం తీసుకున్నారో, సీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు చేశారో, తిరుమల వేంకటేశుడి సన్నిధానంలో ఉన్న కేసీఆర్‌కు తెలుసో తెలియదో మనకు తెలియదు. నిరుద్యోగుల ఉద్యమంలో పరిపక్వత రాకుండానే ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం ఎంత తొందరపాటు నిర్ణయమో  కోదండరామ్‌నూ, ఇతరులనూ బలప్రయోగంతో అరెస్టు చేయడం, ప్రదర్శ కులపై పోలీసులు బలప్రయోగం చేయడం అంతే నిరర్థకమైన చర్య. ప్రత్యర్థి స్థాయి పెంచే కార్యక్రమం. తెలంగాణ సమాజానికి ప్రశ్నించే స్వభావం లేకపోతే, పోరాడే లక్షణం లేకపోతే ప్రత్యేక రాష్ట్రప్రతిపత్తి సిద్ధించేది కాదు. ప్రశ్నకు సమాధానం చెప్పగల శక్తి ఉన్నప్పుడు అసహనం ఎందుకు? ఆగ్రహించకుండా ఆత్మవిమర్శ చేసుకుంటే ఉన్నత శిఖరాలకు దారి కనిపిస్తుంది. ఆత్మవిమర్శ చేసు కోకుండా ఆగ్రహిస్తే... ‘తన కోపమె తన శత్రువు...’ అంటూ సుమతీ శతక కారుడు చెప్పిన హితవచనం ఉండనే ఉంది.





- కె. రామచంద్రమూర్తి

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top