జోరు.. తీరు.. హుషారు..!

జోరు.. తీరు.. హుషారు..! - Sakshi


త్రికాలమ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) పని నల్లేరు మీద బండిలాగా సాగిపోతోంది. ఏది చేయాలని అనుకుంటే అది చేయగల స్థితిలో ఆయన ఉన్నారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు ఉండే అధిష్ఠానం బెడద లేదు. ముఠాలు లేవు. తెలుగుదేశం ముఖ్యమంత్రిలాగా బెరకు లేదు. ప్రతిపక్షం నుంచి ప్రతిఘటన లేదు. సంక్షేమ రంగంలో కేసీఆర్‌ చెలరేగిపోతున్నారు. ఆది వారం జరిగే శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలలో ప్రవేశపెట్టబోయే రిజ ర్వేషన్లకు సంబంధించిన బిల్లులను శనివారం మంత్రివర్గం ఆమోదించింది.



రిజర్వేషన్ల శాతాన్ని 62కి పెంచాలనీ, బీసీ–ఇ కింద ముస్లింలకు 12 శాతం రిజర్వే షన్లు ఇవ్వాలనీ, ఆదివాసీల రిజర్వేషన్లను జనాభాలో దామాషా ప్రకారం 10 శాతానికి పెంచాలనీ నిర్ణయించారు. దళితులకు కూడా ఒక శాతం పెంచితే పెంచవచ్చునంటున్నారు. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలుపుతుందా? న్యాయస్థానాలు ‘స్టే’ ఇవ్వకుండా మిన్నకుంటాయా? ఇటువంటి  ప్రశ్నలు లేక పోలేదు.



కానీ ముస్లిం మైనారిటీల పట్ల, దళితుల పట్ల, ఆదివాసీల పట్ల తనకు ఎటువంటి నిబద్ధత ఉన్నదో కేసీఆర్‌ చాటుకోవడానికి అందుబాటులో ఉన్న అవ కాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ముస్లిం రిజర్వేషన్లను గట్టిగా వ్యతి రేకించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందే అవకాశం బీజేపీకి ఉంటుంది. రిజర్వే షన్లను ప్రతిపాదించడం, శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వ హించి చారిత్రకమైన బిల్లులను ఆమోదింపజేయడంలో అసాధారణమైన చొరవ చూపించడం ద్వారా రాజకీయ లబ్ధి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ ఎస్‌)కి ఎట్లాగూ దక్కుతుంది. కాంగ్రెస్‌ వ్యతిరేకించలేదు. ఉత్సాహంగా సమ ర్థించలేదు. ఆ పార్టీకి లాభం లేదు. నష్టం లేదు.  రైతులకు ఎరువుల కొను గోలు కోసం ఎకరాకు రూ. 4000లు ఇస్తామనీ, ఈ నిర్ణయం 2018లో అమలు లోకి వస్తుందనీ చెప్పారు. ఒక రైతుకు ఎన్ని ఎకరాలకు ఎకరాకు రూ. 4000ల చొప్పున ఇస్తారో, దీనికి ఏదైనా సూత్రం ఉన్నదో లేకపోతే భవిష్యత్తులో రూపొందిస్తారో తెలియదు. కానీ రైతుల సంక్షేమం తాను మనసారా ఆకాం క్షిస్తున్నట్టు సందేశం పంపించగలిగారు. రైతుల రుణం మాఫీపై ఎన్నికల వాగ్దానం పూర్తిగా  అమలు చేశారు. నాణ్యమైన విద్యుచ్ఛక్తి సరఫరా జరుగు తోంది. రైతుకు ఇప్పటికీ సాంత్వన కలగకపోతే ఇంకా ఏమి చేయాలో ఆలోచిం చాలి. రైతు ఆత్మహత్యలు అంతమైనప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సార్థకం.



సాఫల్యవైఫల్యాలు

లె లంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్స రాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రజల స్థితిగతులనూ, పాలకుల పనితీ రునూ సమీక్షించుకోవడం అవసరం. మంత్రులకూ, శాసనసభ్యులకూ ముఖ్య మంత్రి ర్యాంకులు ఇస్తున్నారు. తక్కువ ర్యాంకు వచ్చిన మంత్రులూ, శాసన సభ్యులూ ర్యాంకు పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు. మంచి కసరత్తే. ముఖ్య మంత్రికి ర్యాంకు ఎవరిస్తారు? ప్రజలే ఇవ్వాలి. కేసీఆర్‌ సాఫల్యవైఫల్యాలను ప్రజలు సమీక్షిస్తారు. మంత్రుల, ఎంఎల్‌ఏల ర్యాంకుల నిర్ధారణకు కేసీఆర్‌ అను సరిస్తున్న విధానం (మెథడాలజీ) ఏమిటో మనకు తెలియదు. తమకు తెలిసిన విధానంలో ప్రజలు అంచనా వేస్తారు.  



కొత్త రాష్ట్రానికి కేసీఆర్‌ సారథ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి ఆరుమాసాలూ అధికారులు కుదురుకోవడానికే సరిపోయింది. అనంతరం ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు అమలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలనే కాకుండా లేనివాటిని సైతం అమలు చేసిన ముఖ్యమంత్రి తాను తప్ప మరొకరు ఎవ్వరూ దేశంలో లేరని కేసీఆర్‌ నిర్ద్వం ద్వంగా ప్రకటించారు. ఈ ప్రకటనపైన భిన్నాభిప్రాయాలకు తావుంది. కేసీఆర్‌ ప్రభుత్వం మూడేళ్ళలో సాధించిన ముఖ్యమైన విజయాలూ, సాధించలేకపో యిన కీలకమైన అంశాలూ ఏమిటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మూడు అంశాలపైన నడిచింది–నీళ్ళు, నిధులు, నియామకాలు. తెలంగాణ ప్రాంతానికి చెందవలసిన కృష్ణా, గోదావరి నదీజలాలు అందకుండా పోతున్నాయనే వాదన ఉద్యమ నాయకులు బలంగా వినిపించారు.



ఇప్పుడు కృష్ణా బోర్డు ఎదుట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వాదోపవాదాలు సాగుతున్నాయి. శ్రీశైలం జలా శయం నుంచి వదిలిన నీరు నాగార్జునసాగర్‌ జలాశయంలోకి వచ్చి చేరినప్పటికీ కుడి కాలువలో నీరు వదలడానికి తెలంగాణ నిరాకరించడం వల్ల కృష్ణ నీరు తమకు అందడం లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ నాయకులు గొడవ పెడుతున్నారు. తెలంగాణ నిర్ణాయక స్థితిలో ఉన్నది. తెలంగాణలో ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరాలు చెబితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులను తెలంగాణ సర్కార్‌ ప్రశ్నిస్తోంది. గోదావరి నీటిని వినియోగించుకునేందుకు మాత్రం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులకు మార్పులు చేర్పులతో తిరిగి రూప కల్పన చేసి నిర్మాణం పనులు చేపడుతోంది. వీటన్నిటి కంటే ముఖ్యమైన పూనిక మిషన్‌ కాకతీయ. చెరువులలో పూడిక తీయించి, వాటి కరకట్టలు పటిష్ఠం చేసి, వాటి పక్కనే మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమానికి అధికారంలోకి రాగానే శ్రీకారం చుట్టడం అభినందించవలసిన అంశం. చెరువు పనులు ఎవరు చేస్తు న్నారు, ఎంతకి చేస్తున్నారు, అవినీతి ఎంత అనే ప్రశ్నలు అనేకం వినిపించవచ్చు.  కానీ పనులు జరుగుతున్నాయనేదీ, ఫలితాలు కనిపిస్తున్నాయనేదీ కంటికి కని పిస్తున్న నిజం. అన్ని గ్రామాలకూ మంచినీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో మిషన్‌ భగీరథను ప్రారంభించడం కూడా గొప్ప చొరవ. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగునీటి, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకున్నదనే వాస్తవాన్ని గుర్తించి అభినందించాలి.  



ముమ్మరంగా సంక్షేమ పథకాలు

నిధులలో అన్యాయం జరుగుతోందనే వాదనకు పరిష్కారం రాష్ట్ర విభజనే ప్రసా దించింది. ఇక మీదట అన్యాయం అంటూ జరిగితే కేంద్ర ప్రభుత్వం వల్ల జర గాలే కానీ ఆంధ్ర ప్రాంతం వల్ల కాదు. తెలంగాణ నిధులు తెలంగాణలోనే ఖర్చు అవుతున్నాయి. హైదరాబాద్‌ ఆదాయం తెలంగాణలోనే వినియోగం అవు తోంది. బంగారు తెలంగాణ నినాదానికీ, కేసీఆర్‌ ఇటీవల ముమ్మరంగా ప్రక టిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకీ వెన్నుదన్ను హైదరాబాద్‌ ఆదాయమే. పెరుగు తున్న వ్యాపారం, విస్తరిస్తున్న సేవారంగం (ఐటీ, హోటల్స్‌ వగైరా) తెలంగాణ ఆదాయం గణనీయంగా పెరగడానికి దోహదం చేస్తున్నాయి. ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు  రెసిడెన్షియల్‌ స్కూళ్ళ సంఖ్యను పెంచడం, ముస్లిం విద్యార్థులకు సైతం రెసిడెన్షియల్‌ స్కూలు సౌకర్యం కల్పించడం ప్రశంసార్హమైన విధానం. కల్యాణలక్ష్మి పేరుతో పేదల పెళ్ళిళ్ళకు సహాయం చేసే సంక్షేమ కార్యక్రమాన్ని దళితులకూ, ఆదివాసీలకూ, ముస్లింలకూ, అత్యంత వెనుకబడిన తరగతులకూ విస్తరించడం అభినందించవలసిన మరో అంశం.



నియామకాల విషయంలో ప్రభుత్వం చేసినదానికంటే చేయవలసింది చాలా ఉంది. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇచ్చే లేదా ఇవ్వగలిగే ఉద్యో గాలు మహా అయితే లక్ష. ప్రభుత్వ ఉద్యోగాలతో నిరుద్యోగ సమస్య తీరదు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. యువ జనులకు ఉపాధి కల్పించేందుకు ఒక ప్రణాళిక అవసరం. యువజన విధానం అంటూ ఒకటి ఈ రాష్ట్రానికి కావాలి. చదువుకీ, ఉపాధికీ మధ్య లంగరు అందడం లేదు. ఉపాధికి ఉపయోగించని చదువులు వ్యర్థం. పరిశ్రమలతోనూ, వ్యాపారాలతోనూ విద్యాసంస్థల అనుసంధానం జరగాలి. అటువంటి ప్రయ త్నం కనిపించడం లేదు. విద్యా, ఆరోగ్య రంగాలను ప్రైవేటు రంగమే శాసి స్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థలకూ, ప్రభుత్వ ఆస్పత్రులకూ ఇతోధిక ప్రాధాన్య మివ్వాలి. అరవింద్‌ పనగారియా వంటి అమెరికా నమూనా ఆర్థిక శాస్త్రవేత్త లకూ, అమర్త్యసేన్‌కూ మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటో కేసీఆర్‌ ఇటీవల వివరిం చారు. అమర్త్యసేన్‌ విద్య, ఆరోగ్య రంగాల నుంచి ప్రభుత్వం నిష్క్రమించడాన్ని ఆమోదించరు. ప్రభుత్వాస్పత్రులలో ప్రసవించినవారికి నగదు చెల్లించే కార్యక్ర మాలు అమలు చేస్తున్నారు కానీ ఆరోగ్య రంగంలో ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టా లంటే ఈ చర్యలు చాలవు. కేజీ టూ పీజీ ప్రభుత్వరంగంలో ఉండాలన్న ఆదర్శం ఇంకా అమలుకు నోచుకోలేదు. రెండు పడక గదుల నివాసాలను నిర్మించడానికీ వ్యవధి అవసరం. సంకల్పం ఉంది. ఆచరణకు సమయం పడుతుంది. మహిళల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు ప్రకటించారు. ఇవన్నీ స్వాగతించవలసినవే.



ముఖ్యమంత్రిని కలుసుకోవాలంటే....

ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలైనా, ఎంత అభివృద్ధి సాధించినా అది ప్రజా స్వామ్యబద్ధంగా, అందరినీ కలుపుకొనిపోయే ధోరణిలో జరిగితేనే అందం. ముఖ్యమంత్రి అధికార నివాసం కోసం విశాలమైన భవన సముదాయం నిర్మిం చారు. ఆయన ఎవరిని కలుసుకోవాలని సంకల్పిస్తే వారిని తన నివాసానికి రప్పించుకుంటారు. వారితో మాట్లాడతారు. కానీ ముఖ్యమంత్రిని కలుసుకోవా లనీ, ఆయనకు తమ కష్టాలూ, సమస్యలూ చెప్పుకోవాలనీ అనుకున్నవారు ఆయనను కలుసుకునే అవకాశం లేదు. ఇదివరకు కొందరు ముఖ్యమంత్రులు రోజులో గంటో, రెండు గంటలో సాధారణ ప్రజలను కలుసుకునేందుకు సమ యం కేటాయించేవారు. సహాయార్థులు ఇచ్చే అర్జీలు ఎవరైనా చదివి పరిష్కరిం చేవారా లేక బుట్టదాఖలయ్యేవా అన్నది వేరే విషయం. ముఖ్యమంత్రికి తన చేతులమీదుగా అర్జీని అందించాననే సంతృప్తి ఆదిలాబాద్‌ నుంచి వచ్చిన రైతుకో, భద్రాచలం నుంచి వచ్చిన ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికో ఉండేది. కేసీఆర్‌ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. ప్రజల మేలు కోరే అనేక కార్యక్రమాలు ప్రకటిస్తున్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇవ్వడం అనేది దేశంలో మరె క్కడా లేని సంక్షేమ చర్య. వీటన్నివల్లా కేసీఆర్‌ని ‘మనసున్న మారాజు’గా ప్రజలు భావిస్తారు కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో, మంత్రులనూ, శాసన సభ్యు లనూ, వివిధ వర్గాల ప్రతినిధులనూ కలుసుకొని సంప్రదింపులు జరిపి నిర్ణ యాలు తీసుకుంటున్న ప్రజానాయకుడుగా ప్రజలకు అర్థం కారు. కేసీఆర్‌కు చాలా విషయాలు తెలుసు. ప్రజలనాడి తెలుసు. అయినా సరే ప్రజలను సంప్ర తిస్తున్నట్టు కనిపించాలి.



ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్ళరు. అందుకు కారణం ఏమిటో మనకు తెలియదు. మంత్రులు కూడా ముఖ్యమంత్రి నివాసానికి Ðð డుతున్నారు కానీ సచివాలయానికి విధిగా వెళ్ళడం లేదు. ప్రభుత్వ కార్యదర్శులు బద్ధకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపైన పర్యవేక్షణ లేదు. కొన్ని ఫైళ్ళు నెలల తరబడి అపరిష్కృ తంగా ఉంటున్నాయి. నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోవాలి. మంత్రులు సాహసం చేయరు. ఫైలును ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడానికి అధికా రులు తటపటాయిస్తున్నారు. కొత్త చొరవలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దైనందిక పరిపాలనపైన కేసీఆర్‌ దృష్టి సారించలేకపోతున్నారు. సుదీర్ఘమైన ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించిన అనంతరం ముఖ్యమంత్రి తమకు మరింత అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకోవడం సహజం. ప్రభుత్వ దృష్టికి ప్రజాసమస్యలను తీసుకువెళ్ళడానికి ధర్నా వంటి కార్యక్రమాలను అను మతించినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ధర్నాచౌక్‌ని ఇంది రాపార్క్‌ నుంచి దూరంగా తరలించాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పడం మంచిది. నిరసనలూ, నిరశనలూ, నినాదాలూ, ప్రదర్శనలూ ఇవన్నీ ప్రజాస్వామ్య ప్రక్రి యలే. ఇవన్నీ 2001 నుంచి 2014 వరకూ కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ జయప్రదంగా ఆచరించినవే.



అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజాస్వామ్య ప్రక్రియలనే అనుమతించబోమనడం అప్రజాస్వామికం. ఎవ్వరూ ఎదురు చెప్ప కుండా, ఎటువంటి శబ్దం లేకుండా, వాదన లేకుండా, అసమ్మతి లేకుండా, అలి కిడి లేకుండా, అలజడి లేకుండా సర్వజనులూ పరమ విధేయంగా మౌనంగా ఉండాలనుకోవడం ప్రజాస్వామ్య స్వభావం కాజాలదు. అనేక ప్రగతిశీల, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న క్రమంలో కేసీఆర్‌ వంటి ప్రజా నాయకుడు మరింత కలివిడిగా, ఉదారంగా, సౌమ్యంగా, నిరాడంబరంగా ఉండాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు. ఇంతవరకూ పనితీరుకు కేసీఆర్‌కి ‘ఏ’ గ్రేడ్‌ ఇవ్వవచ్చు. మరింత ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శించి ‘ఏ+’ గ్రేడ్‌కోసం ప్రయత్నించవచ్చు.





- కె. రామచంద్రమూర్తి

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top