ఈ ఉన్మాదం ప్రమాద సంకేతం

ఈ ఉన్మాదం ప్రమాద సంకేతం - Sakshi


మోదీని ఆర్‌ఎస్‌ఎస్‌ తమ తాత్వికతకు తగిన రాజకీయ నేతగా గుర్తిస్తోంది. మన దాయాది దేశమైన పాకిస్తాన్‌ తమది ముస్లిం రాజ్యమని ప్రకటించుకుంది. అలాగే మన దేశాన్ని కూడా మతతత్వ రాజ్యంగా చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోంది. జాతి, మత, భాషా, సాంస్కృతిక, జీవన విధాన వైవి«ధ్యానికి మారుపేరైన మన లౌకిక ప్రజాస్వామ్యాన్ని ఏకశిలాసదృశమైన అఖండ భారత హిందూ రాజ్యంగా మార్చగలమని సంఘ్‌ పరివార్‌ కలలు కంటోంది. ఆ కలలను నిజం చేయడం మోదీ వల్లనే సాధ్యమని వారు భావిస్తున్నారు.



గత 30 నెలలకు పైగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో సాగుతున్న ఎన్‌డీఏ ప్రభుత్వ (అందులో మన చంద్రబాబు తెలుగుదేశం కూడా భాగస్వామి) పాలన తన ప్రజా వ్యతిరేక స్వభావంతో పాటూ సాంస్కృతిక జాతీయోన్మా దాన్ని, పరమత ద్వేషాన్ని వెళ్లగక్కి, తన నిజ రూపాన్ని బయటపెట్టుకుంది. నేటి కేంద్ర ప్రభుత్వ తీవ్ర ప్రమాదకర స్వభావాన్ని సాధారణ ప్రజానీకం ఇంకా తగినంతగా గ్రహించలేకున్నా, క్రమంగా వారిలో కూడా మోదీ పాలన యెడల అసంతృప్తి, ఏదో ఒక మోతాదులో వ్యతిరేకత ఏర్పడుతున్నది. 2014లో ప్రధానంగా మధ్యతరగతి యువత మోదీ గుజరాత్‌ తరహా అభి వృద్ధి నమూనా (అదీ ప్రజా వ్యతిరేకమైనదే) అంటూ జరిగిన ప్రచారానికి ప్రభావితులయ్యారు. యువతలో ఎక్కువ మంది మోదీని ప్రధానిగా ఎంచు కున్నారు. విదేశాలలో మూలుగుతున్న రూ. 80 లక్షల కోట్ల నల్లధనాన్ని మన దేశానికి తిరిగి తీసుకువచ్చి, ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తామని మోదీ దేశమంతా తిరిగి చెవులు చిల్లులు పడేట్టుగా సాగించిన ప్రచారానికి చాలా మంది ఆకర్షితులయ్యారు. అలాగే ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ (భారత దేశంలోనే ఉత్పత్తి్త) అంటూ ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున సృష్టి స్తామని చూపిన ఆశల ఊబిలో కూరుకుపోయారు. క్రమేపీ వారికి అదంతా వట్టి బూటకమని అర్థం అవుతున్నది. రాజకీయ, ఆర్థిక రంగాలలోని మోదీ ప్రభుత్వం స్వభావంతో పాటూ అంతకంటే ప్రమాదకరమైన మోదీ ఆర్‌ఎస్‌ ఎస్‌ మార్కు మతతత్వం, జాతీయోన్మాదం బయటపడుతుండటంతో మేధా వులలో సైతం ఎన్‌డీఏ పాలనపట్ల ఆందోళన పెరుగుతోంది. పరిస్థితి పెనం మీంచి పొయ్యిలోకి పడ్డట్టయిందని వారు భావిస్తున్నారు.



హిందూ రాజ్య స్థాపకునిగా మోదీ

మరోవంక ఆర్‌ఎస్‌ఎస్‌ వారు మోదీని తమ తాత్వికతకు తగిన నేతగా గుర్తిస్తు న్నారు. మన దాయాది దేశమైన పాకిస్తాన్, ముస్లిం మతతత్వంతో తమది ముస్లిం రాజ్యమని ప్రకటించుకుంది. అక్కడ ఉన్న ఇతర మతస్తులను రెండవ తరగతి ప్రజలుగా మార్చి, తమ ప్రజావ్యతిరేక, నిరంకుశ పాలనను ప్రజా స్వామ్యం ముసుగులో సాగిస్తున్నది. అవసరమైతే అక్కడ సైనిక పాలన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమలవుతూనే ఉంది. అదే తరహాలో మన దేశంలో కూడా మతతత్వ రాజ్యాన్ని నిర్మించి, దేశంలోని వివిధ సంస్కృ తులు, నాగరికతలు, భాషలు క్రమేమీ కనుమరుగయ్యేట్టు చేసి, వైవిధ్యపూరి తమైన ప్రజల భావోద్వేగాలను కాలరాచి, ఆదివాసి గిరిజనుల ప్రత్యేక జీవన  విధానాన్ని ధ్వంసంచేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశిస్తోంది. తద్వారా మన లౌకిక ప్రజాస్వామ్యాన్ని ఏకశిలాసదృశమైన అఖండ భారత హిందూ రాజ్యంగా మార్చగలమని అది కలలు కంటోంది. ఆ కలలను నిజం చేయడం మోదీ వల్లనే సాధ్యమని భావిస్తోంది. మన దేశ ప్రజాస్వామిక సంప్రదాయాలకు, లౌకిక భావజాలానికి, సమాఖ్య స్ఫూర్తికి ఏ మాత్రం విలువ ఇవ్వని వ్యక్తిగత అహంకారానికి ప్రతీకగా మోదీ నిలుస్తున్నారు. ఆయినా ముప్పయి నెలల పాలనలో వాగాడంబరం, చౌకబారు విన్యాసాలకు మించి ప్రజలకు ఆయన పాలన వల్ల కలిగిన నిజమైన మేలు ఏమీ లేదు. కానీ అన్యులు చేయ సాహ సించనిది ఏదైనా అనాలోచితంగానైనా చేసిపారేసి, అదే ఓ ఘనకార్యమని చాటి, మౌన ముని మన్మోహన్‌సింగ్‌కు భిన్నమైన తన ‘నిర్ణయాత్మక శైలి’తో ప్రజలకు నివ్వెరపాటు కలిగించేలా తన తరహా ‘మజా’ (ఇది మోదీ అన్న మాటే)ను కలిగించాలని ప్రయత్నిస్తున్నారు.



చలామణిలో ఉన్న రూ. 500. రూ. 1000 నోట్ల రద్దు నిర్ణయాన్ని హఠా త్తుగా రద్దు చేసి పారేసి మోదీ మనకు చూపిన ‘మజా’ అదే. అక్కడ మోదీ ఆ నిర్ణయం చేయడంతోనే ఇక్కడ సలహాల బాబుగా పేరు మోసిన ఏపీ ముఖ్య మంత్రి పెద్ద నోట్లను రద్దు చేయమని మోదీకి తానే సలహా ఇచ్చానన్నారు.  హడావుడిగా అది తన ఘనతేనని ప్రచారం చేసుకున్న పెద్ద నోట్ల రద్దు  బెడిసి కొట్టింది. బ్యాంకుల ముందు క్యూలల్లో నిలబడలేక వందికి పైగా వృద్ధులు, వికలాంగులు తదితరులు మరణించారు. ఇక చిన్న వ్యాపారులు, చిరుద్యో గులు, అసంఘటితరంగ కార్మికులు, సాధారణ పేద, మధ్య తరగతి, కౌలు రైతులంతా నానా ఇబ్బందులకు గురయ్యారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇంత వరకు మోదీ అన్నట్టుగా ఎంత నల్లధనాన్ని వెలికి తీశారు, దొంగ నోట్ల చలా మణి ఎంత మేరకు తగ్గింది, ఉగ్రవాదం ఎంత వరకు తగ్గుముఖం పట్టింది వంటివి ఏవీ కనీసం ప్రజలకైనా లెక్క చెప్పడంలో మోదీ ప్రభుత్వం చతికిల పడింది. పైగా కొత్తగా విడుదల చేసిన రూ. 2000 నోట్లు సైతం అప్పుడే మళ్లీ నల్లధనంగా మారిపోయాయని తెలుస్తోంది. అయినా కిందపడ్డా గెలుపు మాదేననే మోదీ, ఆయన సలహాల బాబు మాత్రం తమను తామే పొగుడు కుంటున్నారు. వీరికి వంత పలికే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వంటి వందిమాగధుల స్తోత్రాలు అందుకుంటున్నారు.



2019 వ్యూహ ప్రయోగ వేదిక యూపీ

నోట్ల రద్దువల్ల దేశానికి మేలు చేకూరిందని, నల్లకుబేరులు కుదేలవుతున్నా రని సాధారణ ప్రజలను నమ్మిస్తున్నారు. ఇక దేశం వడివడిగా అభివృద్ధి పథంలో దూసుకువెళ్తున్నదని, ప్రపంచ నేతలు సైతం మోదీకి సరిపోల రంటూ ప్రచారం సాగిస్తున్నారు. అయినా బిహార్, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మట్టి కరిచింది. 2019 పార్లమెంటు ఎన్నికలలోగానే మోదీ ప్రభుత్వా నికి యూపీ, పంజాబ్‌ తదితర రాష్ట్రాల ఎన్నికల గండం ముంచుకొచ్చింది. మోదీపై మోజు, ఆయన చూపుతున్న ‘మజా’‡సాపేక్షికంగా తగ్గాయి కాబట్టి కొత్త ఎత్తులు అవసరమయ్యాయి. మోదీ అసలుసిసలు ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతా లకు బద్ధులై, తన హిందుత్వ విశ్వరూప సందర్శనం చేయించారు. ముస్లిం ఓటర్లను లెక్కలోకైనా తీసుకోకుండా మతోన్మాదాన్ని, రాజకీయ దురహంకా రాన్ని ప్రదర్శించారు. అంతకు ముందు నుంచే లౌకికవాదులు మొదలు మోదీ విధానాలను వ్యతిరేకించేవారి వరకు ఎవరినైనా దేశద్రోహులుగా, అవినీతి పరులుగా ముద్రలు వేయడం, దాడులు చేయడం సాగింది. హిందూ అధిక్య తావాద రాజకీయ ఎత్తుగడలతో, వివక్షాపూరిత మత సంస్కృతితో ఇటీవల జరిగిన ఎన్నికల బరిలోకి దిగారు. అప్పటికే అధికార యంత్రాంగం నుంచి సైన్యం వరకు హిందుత్వ శక్తులను కీలక స్థానాల్లోకి పంపే ప్రయత్నాలకు నాంది పలికారు. ప్రతిపక్షాలను దేశభక్తిలేనివిగా చిత్రీకరించి వాటికి ఉన్న ప్రజాదరణకు గండికొట్టాలని యత్నించారు. యూపీ ఎన్నికల ప్రచారంంలో మోదీ సహా బీజేపీ నేతలంతా ఇలాగే ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. 2019 ఎన్ని కల నాటికి మోదీ రచించిన జాతీయోన్మాద, మతోన్మాద ఎజెండాను ప్రయోగాత్మకంగా యూపీలో వాడి విజయవంతమయ్యారు. ప్రతిపక్షాల బలహీనత మాటెలా ఉన్నా మోదీ ఎజెండా నుంచి 2014 నాటి అభివృద్ధి, అవకాశాలు కనుమరుగవుతూ జాతీయోన్మాదం, మత విద్వేషం బాహాటంగా ఊరేగడం ప్రారంభమైంది. 2019 నాటికి అవి పతాక స్థాయికి చేరుతాయ నడం నిరాధారం కాదు.  



ఉగ్రవాదుల చేతుల్లో ఒక భారత సైనికుడు మరణిస్తే ప్రతిపక్షాల నేతలు ఆనంద పడతారనే దుర్మార్గపూరిత వ్యాఖ్యలను ప్రధాని హోదాలోని మోదీ చేశారు. మన సైనికులపైన అపార ప్రేమను కురిపిస్తున్నట్లు కనిపించే ప్రభుత్వం దుర్భర వాతావరణ పరిస్థితుల్లో స్వస్థలాలకు, స్వగృహాలకు సుదూరంగా దేశ సరిహద్దులకు కావలి కాస్తున్న వారి జీవన పరిస్థితులను మెరుగుపరడానికి చేస్తున్నది మాత్రం శూన్యం. పైగా తమ అధ్వానమైన బతుకుల గురించి సామాజిక మాధ్యమాలకు, మీడియాకు వెల్లడిస్తున్న జవా న్లపై క్రమశిక్షణా చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. తమ పరిస్థితుల గురించి ఇలా ‘ఫ్రంట్‌లైన్‌’ పత్రికకు సమాచారమిచ్చిన ఒక సైనికుని మృత దేహం అదే రోజు నాసిక్‌లో దొరికింది. అది ఆత్మహత్య అని అధికారికంగా ప్రకటించారు. కార్గిల్‌ అమరవీర జవాను 20 ఏళ్ల కుమార్తె గుర్‌మెహర్‌ కౌర్‌ తన తండ్రిని బలిగొన్నది యుద్ధమేనంటూ శాంతి సందేశాన్ని వెలువరించి నందుకు ఆమెపై అత్యాచారానికి పాల్పడతామనేంత వరకు హిందుత్వ శక్తులు పోయాయి. ఇది ఢిల్లీ వర్సిటీలో ఏబీవీపీ ప్రేరేపిత గూండాయిజం, అల్లర్ల సందర్భంగా బయటపడింది. తెలుగు నాట రోహిత్‌ ఆత్మహత్యకు కార ణమైన కులపరమైన వేధింపులు, అణచివేతలకు మసిపూసి మారేడు కాయను చేశారు. రోహిత్‌ దళితుడే కాడని ‘నిర్ధారించి’ బాబు ప్రభుత్వం ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులకు, ఏబీవీపీకి రక్షణ ఛత్రమై నిలిచింది.



పేట్రేగుతున్న ఉన్మాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలి

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల విజయంతో సరిపెట్టుకోక, గోవా, మణిపూర్‌లలో సైతం అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం మోదీ ప్రభుత్వం, బీజేపీ సకల ప్రజా స్వామిక విలువలను తుంగలోకి తొక్కాయి. ఏదిఏమైనా నేటి బీజేపీ, ఒక ప్పటి జర్మనీలోని హిట్లర్‌ను, ఇటలీలోని ముస్సోలినీని, జపాన్‌లోని టోజోను గుర్తుకు తెస్తోంది. వారి జాతీయోన్మాదంలాగే బీజేపీ అసహనాన్ని, అన్యమత ద్వేషాన్ని, జాతీయోన్మాదాన్ని రేకెత్తిస్తోంది. ‘నేను హిందూ జాతీయవాదిని, హిందూ సాంస్కృతిక జాతీయవాద తాత్వికరూపమైన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అనుయాయిని, ఆ పరంపరకు చెందిన వాడిని’ అని ప్రధాని మోదీ పలుమార్లు స్పష్టం చేశారు. అనుచరగణం ‘మోదీకి ఓటు వేసినవారు శ్రీరామచంద్రుని సంతానం, వ్యతిరేకంగా ఓటు వేసినవారు అక్రమ సంతా నం’ ‘మోదీని వ్యతిరేకించినవారు పాకిస్తానీ ఏజెంట్లు’ ‘మన హిందూ దేశ వాసులంతా హిందువులే. నేను హిందువును కాను అన్నవారు పాకిస్తాన్‌ పొండి’ అనే సాక్షి మహరాజ్‌లు, సాధ్వీ రిత్వంబరిలు ప్రజా ప్రతినిధులు. ఇక యోగి ఆదిత్యనాథ్‌ దేశంలోని అతి పెద్ద రాష్ట్రానికి నేడు ముఖ్యమంత్రి!



దీనికి తోడు ‘ఒకే జాతి, ఒకే ఎన్నికలు’ ‘ఒకే పన్నుల విధానం’, ‘ఒకే మార్కెట్‌’, ‘ఒకే నేత మోదీ’ అంటూ భిన్నజాతుల, సంస్కృతుల, మతాల, భాషల వైవిధ్యపూరిత భారతావనిని ఏకశిలాసదృశమైన, జాతీయోన్మాద, మతోన్మాద, విద్వేష దేశంగా మార్చాలన్న కుహనా దేశభక్తుల కుట్రకు సంకేతం మోదీ పాలనా శైలి. దేశభక్తులు, వివిధ జాతుల ప్రజలు, ప్రగతి శీలురు, ప్రజాస్వామ్య లౌకిక శక్తులు, సకల కష్టజీవులు, కష్టజీవుల పార్టీలు అంతా ఐక్యమై ఈ ఏకపార్టీ, ఏకవ్యక్తి పాలనను తేవాలని జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలి. వివిధ సంస్థలు, పార్టీలు విభేదాలను మరచి ఐక్యమై ప్రజల ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం కోసం ముందుకు రావా ల్సిన సమయం ఆసన్నమైంది.





- డాక్టర్‌ ఏపీ విఠల్‌


వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు ‘ మొబైల్‌ : 98480 69720

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top