ఇలాంటి ప్రజాగ్రహానికి పగ్గాలేవి?

ఇలాంటి ప్రజాగ్రహానికి పగ్గాలేవి? - Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌ 

జల్లికట్టు మీద నిషేధం శాశ్వతంగా తొలగించినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే పొరపాటు. ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు, కర్ణాటకలో బర్రెల కొట్లాట ఇట్లా దేశమంతటా ఏదో పద్ధతిలో పాత సంప్రదాయం, ఆచారం తలెత్తి కేంద్ర ప్రభుత్వం కాళ్లకు బంధాలు వెయ్యడం ఖాయం. ఆ సమస్యతో ఏకీభావం ఉన్నా, లేకున్నా దాని పరిష్కారానికి తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా యువత ఎంచుకున్న మార్గం కచ్చితంగా అనుసరణీయమే. మిగిలిన ప్రభుత్వాలు కూడా సెల్వం ప్రభుత్వ మార్గాన్ని అనుసరిస్తే మంచిది.

 

తమిళనాడు పురాతన సంప్రదాయం జల్లికట్టు మీద విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ వారం రోజులుగా చెన్నై మెరీనా బీచ్‌లో  జరుగుతున్న ఆందోళన దేశంలో మరికొన్ని ఉద్యమాలకు కొత్త ఊపిరిని ఇవ్వబోతున్నట్టు కనిపిస్తున్నది. దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూస్తున్న ఒక సమస్య మీద వేల సంఖ్యలో జనం కదిలి రావడం, జనాగ్రహానికి వెరచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌లు తీసుకురావడం, ప్రజల భావోద్వేగాల దృష్ట్యా కొద్దికాలం ఆగండని సుప్రీంకోర్టును కేంద్రం వేడుకోవడం, హడావుడిగా శాసనసభ సమావేశం నిర్వహించి బిల్లు ఆమోదించడం ఒక కోణంలో నుంచి చూస్తే అద్భుతమైన దృశ్యం. అత్యంత శక్తిమంత మైన రాజ్యాన్ని ధిక్కరించి నిలిచి ప్రజలు విజయం సాధిస్తే ప్రజాస్వామ్య ప్రియులు ఎవరికైనా అద్భుతంగానే అనిపిస్తుంది.

 

ఇదొక్కటేనా సమస్య?

ఒక సమస్య మీద ప్రజలు ఒక్కటై ప్రభుత్వాల మెడలు వంచడం ఆహ్వానించదగ్గ విషయమే అయినా, తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా యువత గత వారం మెరీనా బీచ్‌లో సాగించిన ఉద్యమానికి మూలమైన సమస్య మాత్రం సమర్థనీయం కాదు. పక్షులతో కత్తులాట నిర్వహించడం, నోరులేని అమాయక జంతువులతో పరుగు పందాలు సాగించి ఆనందించడం ఒక వికృత క్రీడ. ప్రపంచవ్యాప్తంగా పశుపక్ష్యాదులను క్రీడల పేరుతో హింసించడం సరికాదని ప్రజలు ఉద్యమిస్తున్న వేళ తమిళనాడులో జరిగిందీ, జరుగుతున్నదీ సమర్థనీయం కాదు. ఇటువంటి దారితప్పిన ఒక ఉద్యమానికి సంఘంలో ప్రముఖులూ, రాజకీయ పక్షాలూ మద్దతుగా నిలవడం ఏవగింపు కలిగిస్తుంది. ఇంతకంటే చాలా తీవ్రమైన ప్రజాసమస్యల విషయంలో ఈ సెలబ్రిటీలు ఎందుకు నోరు మెదపరు? దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనేక సమస్యల మీద ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి, వాటి గురించి వీళ్లు ఎందుకు మాట్లాడరు?

 

తమిళనాడు విషయమే తీసుకుందాం. అక్కడ పేదరికం వికటాట్టహాసం చేస్తున్నది. నిజానికి జయలలిత అక్కడి జనం దృష్టిలో 'అమ్మ'గా స్థిరపడిపోవడానికి కారణం ఆ పేదలకు ఆమె విదిలించిన కొన్ని పథకాలే. పేదరికాన్ని శాశ్వతంగా పారదోలేందుకు ఆమె కూడా చేసిందేమీ లేదు. అంత తీవ్రంగా ఉన్న పేదరికం మీద, నిరుద్యోగం మీదా అన్నిటికీ మించి అవినీతికి నిలయంగా మారిన రాజకీయ వ్యవస్థ మీదా నిరసనగా ఈ యువత ఎందుకు రోడ్ల మీదకు రాలేదు? జల్లికట్టు నిషేధాన్ని వ్యతిరేకించి గెలిచిన స్థాయిలో ఈ సమస్యల మీద ఎందుకు యుద్ధం చెయ్యలేదు? తమిళనాడులో జరుగుతున్న జల్లికట్టు నిషేధ వ్యతిరేక ఉద్యమం పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నది. అందులో ప్రధానమైనది న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం. ప్రజాగ్రహానికి వెరచి ప్రభుత్వాలు లొంగి వచ్చి విజ్ఞప్తి చేస్తే న్యాయస్థానాలు నిర్ణయాలను మార్చు కోవడమో, వాయిదా వేసుకోవడమో జరగడం ఈ సందేహానికి తావిస్తున్నది.

 

జంతు హింస సరికాదు

నిన్న మొన్నటి దాకా జయలలిత నీడన పెరిగిన పన్నీర్‌ సెల్వం ప్రభుత్వం జనాభిప్రాయానికి విలువనిచ్చి ఈ సమస్యను పరిష్కరించే దిశగా వడివడిగా అడుగులు వేసింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాగా కేంద్రంతో ఘర్షణ మంచిది కాదు, ఆందోళనలు చెయ్యకూడదు అని హితబోధలు చెయ్యలేదు. నిజానికి దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ, మరే ముఖ్యమంత్రీ కేంద్రానికి ఇంతగా జీహుజూర్‌ అన్నట్టు వ్యవహరించడంలేదు. పన్నీర్‌ సెల్వం వెంటనే ఢిల్లీ వెళ్లారు, ప్రధానమంత్రికి సమస్యను వివరించారు. ఇద్దరి నిర్ణయం మేరకే ఆర్డినెన్స్‌ వచ్చింది. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. జల్లికట్టు మీద నిషేధం అనేది చాలా చిన్న సమస్య, అనాదిగా వస్తున్న ఒక ఆచారానికి సంబంధించింది.



నిజానికి తమిళనాడు ప్రజలు యావన్మందీ ఈ దురాచారాన్ని, కాలం చెల్లిన సంప్రదాయాన్ని సమర్థిస్తూ ఉన్నారనడానికి వీల్లేదు. జల్లికట్టు మీద నిషేధం శాశ్వతంగా తొలగించినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే పొరపాటు కూడా. ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు, కర్ణాటకలో బర్రెల కొట్లాట ఇట్లా దేశమంతటా ఏదో పద్ధతిలో ఏదో ఒక పాత సంప్రదాయం, ఆచారం తలెత్తి కేంద్ర ప్రభుత్వం కాళ్లకు బంధాలు వెయ్యడం ఖాయం. పశువులనూ, పక్షులనూ హింసించే పద్ధతు  లకు స్వస్తి చెప్పాలంటూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలను తేలికగా తీసుకోడానికి వీల్లేదు.

 

ఆ రెండు ఉద్యమాలు ఒక్కటేనా? 

సరే, జల్లికట్టు నిషేధాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాట జరిగిన ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి స్ఫూర్తిగా తీసుకోవాలనుకుంటున్న వారిని అభినందించాల్సిందే. ఆ సమస్యతో ఏకీభావం ఉన్నా, లేకున్నా దాని పరిష్కారానికి తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా యువత ఎంచుకున్న మార్గం కచ్చితంగా అనుసరణీయమే. మిగిలిన ప్రభుత్వాలు కూడా పన్నీర్‌ సెల్వం ప్రభుత్వం మార్గాన్ని అనుసరిస్తే మంచిది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా విషయంలో తననో, కేంద్రాన్నో రక్షించుకునే ధోరణి వదిలేసి రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజెప్పి ప్రత్యేక హోదా తెచ్చే ప్రయత్నం చేసి ఉండాల్సింది. చంద్రబాబునాయుడే చెప్పినట్టు రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఆందోళనకూ, జల్లికట్టు కోసం జరుగుతున్న ఆందోళనకూ పోలికలేదు. జల్లికట్టు సమస్య తాత్కాలికం, ప్రత్యేక హోదా కోట్లాది మంది ఆంధ్ర ప్రజల, ముఖ్యంగా యువత భవిష్యత్తును నిర్ణయించే సమస్య. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో రెండుసార్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసిన నాటి నుంచి ప్రతిపక్షాలది ఉద్యమబాట, ప్రభుత్వానిది రాజీ పాట.

 

ప్రధాన ప్రతిపక్షం అనునిత్యం ప్రత్యేక హోదా కోసం ఉద్యమ బాటనే సాగుతున్నది. పార్లమెంట్‌ లోపలా బయటా ప్రతిపక్షం ఆందోళన చేస్తుంటే అధికార పక్షం మంత్రి పదవులను కాపాడుకునే ప్రయత్నంలో తలమునకలై ఉంది. ప్రతిపక్ష నేత ఆమరణ నిరాహార దీక్ష, కాంగ్రెస్‌ కోటి సంతకాలు, వామపక్షాల నిరసన ఆందోళనలు; చివరికి 2014 ఎన్నికల్లో మిత్రుడిగా ఉండి, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేందుకు తన వంతు సాయం చేసిన ప్రముఖ సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ కూడా మీరు తెచ్చిన ప్యాకేజీలు పాచి పోయిన లడ్డూలతో సమానం, అవి ఏమీ వద్దు ప్రత్యేక హోదా తీసుకురండి అని నిలదీస్తున్నాడు. ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం మాత్రం అశేష ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా నీరో చక్రవర్తిని, అతడి ధోరణిని మరిపింపచేస్తున్నారు. అంతేకాదు, తమకు ఏమైనా సమస్యలుంటే, కేంద్రాన్ని నిలదీసే శక్తి లేకపోతే, మిన్నకున్నా బాగుండేది, అట్లా చెయ్యక పోగా ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షం చేస్తున్న ప్రతి ఉద్యమాన్ని అణచివేసే, బురద జల్లి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు సంపూర్ణంగా సాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు.

 

ప్రభుత్వాలు ప్రజాభీష్టానికి తలొగ్గాల్సిందే

ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం రామకృష్ణా బీచ్‌ సహా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపునకు అన్ని ప్రతిపక్షాలూ కలిసొచ్చే వాతావరణం ఏర్పడింది. జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ సహా అన్ని పార్టీలు రేపటి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. ఇది నిన్న మొన్న తమిళ నాడును కుదిపేసిన జల్లికట్టు నిషేధ వ్యతిరేక ఉద్యమ రూపు తీసుకోనుందనే మాట వినిపిస్తున్నది. మంచిదే, బధిరులకు వినిపించాలంటే భారీ విస్ఫో టనం అవసరమని స్వాతంత్య్ర పోరాటంలో షహీద్‌ భగత్‌ సింగ్‌ పార్లమెంట్‌ మీద తాను  బాంబు వేయడాన్ని సమర్థించుకుంటూ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి.

 

దావోస్‌ నుంచి తిరిగొచ్చిన వెంటనే ముఖ్యమంత్రి మళ్లీ ఒకసారి కేంద్రంతో తగువుకు తానూ సిద్ధంగా లేనని స్పష్టంగా చెప్పారు. ఆయన పార్టీ నాయకులేమో చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన హింస విశాఖ ఆర్కే బీచ్‌లో కూడా జరగాలని అనుకుంటున్నారా అని సన్నాయి నొక్కులు నొక్కుతు న్నారు. నాలుగు రోజులపాటు ప్రశాంతంగా సాగిన చెన్నై ఆందోళన కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు చొరబడి, పోలీసులు కూడా ప్రతిచర్యకు దిగిన తరు వాతే హింసాత్మకమైంది. జల్లికట్టు సమస్య పరిష్కారం కోసం పన్నీర్‌ సెల్వం అనుసరించిన పద్ధతి వదిలేసి ఆయన ప్రభుత్వంలోని పోలీసులు ఆందో ళనను విచ్ఛిన్నం చెయ్యడానికి ఎంచుకున్న పద్ధతిని అనుసరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు. ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రజాభీష్టానికి తలొగ్గాల్సిందే అని జల్లికట్టు ఉద్యమం మరోసారి రుజువు చేసింది, ఆంధ్రప్రదేశ్‌లోనయినా అంతే. అది గుర్తించకపోతే ప్రభుత్వానికి భంగపాటు తప్పదు.

 

తెలంగాణ  రాష్ట్ర సాధన కోసం రాజకీయ వ్యవస్థనూ, పౌర సమాజాన్ని ఒక్క తాటి మీదకు తీసుకొచ్చి జల్లికట్టు ఉద్యమంతో పోల్చదగిన మిలియన్‌ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె, వంటా వార్పూ వంటి శాంతి యుత ఆందోళనలు నిర్వహించిన జేఏసీ అధ్యక్షులు కోదండరాం తెలం గాణలో జల్లికట్టు ఉద్యమ తరహాలో భారీ నిరుద్యోగుల ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. అంత బలమైన ఉద్యమాన్ని ముందుకు ఉరికించిన తెలంగాణ  ఉద్యమ నాయకత్వమే జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవడాన్ని  పాల కులందరూ గ్రహిస్తే మంచిది.


దేవులపల్లి అమర్‌

 

 
Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top