సంపన్నులు చంకన.. పేదలు వీధిన

సంపన్నులు చంకన.. పేదలు వీధిన - Sakshi


సమకాలీనం

కేంద్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలేవీ ధనక–పేద వ్యత్యాసాల్ని తగ్గించే విగా లేవు. భూసేకరణల నిర్వాసితుల నుంచి  రైతులు, వ్యవసాయ కూలీల వరకు అంద రిదీ దయనీయ స్థితి! చిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, అసంఘటిత కార్మి కులు, దినసరి కూలీల వరకు పేదరికంలోకి నెట్టేస్తున్న పరిస్థితి! ‘ప్రపంచీకరణ రెండు వైపులా పదునున్న కత్తి’. దాన్ని ఒడుపుగా వాడుకొని ఆర్థిక అంతరాల్ని తగ్గించాలి. విప్లవం నేరుగా ఉత్పత్తి కాదు, అది విప్లవ పరిస్థితుల నుంచి పుట్టే ఉప ఉత్పత్తి మాత్రమే!



ప్రపంచమంతా, ముఖ్యంగా మన దేశంలో పెరుగుతున్న ఆర్థిక అంతరా లను చూస్తుంటే భవిష్యత్తు భయానకంగా కన్పిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వాల విధానాలు, నిర్వాకాలు ఈ అంతరాల్ని మరింత పెంచి పోషించేవిగానే తప్ప, తగ్గించేవిగా లేవు. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణల అమలు తర్వాత ఈ అంతరాలు వేగంగా పెరుగుతున్నాయి. స్థూలంగా మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ సంపద ఒకవైపు పోగవుతుంటే, దారిద్య్రం స్థిరపడుతోంది. సంపన్నులు మరింత సంపన్నులవుతున్నారు. పేదలు కటిక దారిద్య్రంలోకి జారుతున్నారు. వేగంగా ఎదుగుతున్న ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ భారత్‌లో 30% తిండి కోసం అలమటిస్తున్నారు.



మరో వంక 1% అంటే కోటీ ముఫ్పై లక్షల మంది వద్ద ఉన్న ఆస్తి 99% అంటే 128 కోట్ల 70 లక్షల మంది మొత్తం సంపద కన్నా 16% ఎక్కువ! పరిస్థితులు ఇలాగే కొనసాగితే... వచ్చే 20 ఏళ్లలో, దేశంలోని 500 మంది అగ్ర సంపన్నుల ఆస్తి మిగతా భారతదేశపు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని మించి పోతుం దనే అంచనా మరింత గగుర్పాటు కలిగిస్తోంది. పేదరిక నిర్మూలనను కోరు తున్న ఓ అంతర్జాతీయ సంస్థ ‘ఆక్స్‌ఫామ్‌’ అధ్యయన నివేదిక వెల్లడించిన గణాంకాల సారాంశమిది. స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్‌ పర్వతశ్రేణి ఒడిలో ఒది గిన దావోస్‌ నగరంలో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆక్స్‌ ఫామ్‌... సమాజిక అశాంతికి ఆజ్యం పోస్తున్న ఆర్థిక అంతరాల నివేది కను వెల్లడించింది.



సంపద సృష్టికన్నా పంపిణీ ముఖ్యం

ప్రపంచదేశాల నేతలు, సంపన్నులు, బ్యాంకింగ్, కార్పొ రేట్‌ ప్రతిని ధులు, వాణిజ్య, వ్యాపార ముఖ్యుల నాలుగు రోజుల భేటీ నేటితో ముగు స్తోంది. ప్రపంచదేశాల విధాన నిర్ణాయక స్థానాల్లోని నేతలు, ఆర్థిక స్థితి గతుల్ని మలుపుతిప్పే ముఖ్యుల సమాలోచనల్లో ఈ అంతరాలే కీలకాంశమై కూర్చుంది. దీంతో ఇన్నాళ్లు బెట్టు చేసినా వారు ఇక ‘సమ్మిళిత ప్రగతే’ పరిష్కార మార్గమని అంగీకరించాల్సి వస్తోంది. ఆర్థిక అంతరాల్ని నియం త్రించకపోతే  ప్రపంచీకరణకు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు గండం తప్ప దనే భయం, వారిని పట్టుకుంది. సుస్థిరాభివృద్ధిని సాధించలేమనే సందే హాలు బలపడుతున్నాయి. ప్రతి సమాజంలోపల, సమాజాల మధ్య ఆర్థిక అంతరాల తగ్గింపు ముఖ్య ఎజెండాగా మారుతోంది.



ఒక దశకు చేరాక సంపద సృష్టి కన్నా పంపిణీ ముఖ్యమని సత్యాన్ని గుర్తించక ఇంకా ‘పంపిణీ సవ్యంగా జరగాలన్నా ముందు ‘సంపద’ సృష్టి జరగాలి, అదే ముఖ్యమ’నే పాత పాటే పాడుతున్నారు ముఖేష్‌ అంబానీ! ఇటువంటి కార్పొరేట్లతో అంట కాగుతున్న ప్రభుత్వాల ఆలోచనా ధోరణీ అంతే.  కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న విధానాలేవీ ధనక–పేద వ్యత్యాసాల్ని తగ్గించేవిగా లేవు. అభివృద్ధి పేరిట జరిగే భూసేకరణల నిర్వాసితుల నుంచి  రైతులు, వ్యవసాయ కూలీల వరకు అందరిదీ దయనీయ స్థితి! చిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, అసంఘటిత కార్మికులు, దినసరి కూలీల వరకు అందర్నీ  పేదరికంలోకి నెట్టేస్తున్న పరిస్థితి! కార్పొరేట్‌ శక్తులు మాత్రం ఇంకా బలపడుతున్నాయి, ప్రపంచ స్థాయికి విస్తరిస్తున్నాయి. వారి ఏ ఆర్థిక నివేదిక చూసినా ఇది సుస్పష్టం.



బాబెందుకు వెళతాడో........?!

‘నోట్లో రాయి తీసుకోలేని వాడు ఏట్లో రాళ్లు ఏరేయడానికి వెళ్లాడ’ని వెనకటి సామెత! దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా ఎందుకు వెళతారు? ఇది, మేధావులైనా సమాధానం చెప్పలేని ప్రశ్న. పిలిచారనుకుందామా అంటే ఆయన్నెందుకు, ఏ హోదాలో పిలుస్తారు? తనంత తానుగా వెళితే ఏమి సాధించడానికి? ఇప్పటివరకేమైనా సాధించారా? ఇవి సమాధానం లేని ప్రశ్నలు. ఇంత ప్రజాధనం వెచ్చించి ఆయన రాష్ట్రం కోసం సాధించిందేమైనా ఉందా? వివిధ రాజకీయ పక్షాలు, పౌర సంస్థలు లేవనెత్తుతున్న ఈ సందే హాలను నివృత్తి చేస్తూ ఆయన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగలదా? తనకు, తన పరివార గణానికి ఈసారి అయిన దారి భత్యం ఖర్చు దాదాపు కోటి రూపాయలు. రాష్ట్రానికి ప్రచారం కల్పించడానికి ఒక స్టాల్‌ లాంటి దానిని ఏర్పాటు చేయడానికి, ఇతర ప్రచార వ్యవహారాలకు రూ. 7.57 కోట్ల ప్రజాధనం వెచ్చించారని సమాచారం. పనుల మీద కన్నా ప్రచారం మీద వందలు, వేల కోట్లు వెచ్చించి పబ్బం గడిపే చంద్రబాబు నాయుడి ఇదివర కటి పాలనా లక్షణాలన్నీ ఇప్పుడు మళ్లీ తెర మీదికొస్తున్నాయి.



అంతరాలను పెంచుతున్న భూసేకరణలు

ప్రపంచ ఆర్థిక వేదిక చర్చలకు, తాజా ఆలోచనా ధోరణులకు ఫక్తు విరుద్ధ విధానాల్ని ఆయన ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. రాజధాని భూసేక రణనే తీసుకుంటే  అది సమాజంలో తీవ్ర ఆర్థికాంతరాలకు దారితీస్తున్నట్టు కనిపిస్తోంది. రెండువేల ఎకరాల రాజధాని నిర్మాణాల కోసం దాదాపు 34 వేల ఎకరాల సామాన్యుల, రైతుల భూమిని ప్రభుత్వం కబ్జాపెట్టింది. భూస మీకరణ పేరిట ఇప్పటికే దాదాపు 28 వేల ఎకరాల వరకు స్వాధీనపరచుకొని, మరో నాలుగయిదు వేల ఎకరాలు లాక్కోవడానికి బెదిరింపులకు, అధికార దుర్వి నియోగానికి పాల్పడుతోంది. తమ భూములిచ్చేది లేదనే స్థిరాభిప్రా యంతో ఉన్నవారిని ‘భూసేకరణ’ పేరిట కొత్తగా బెదిరిస్తోంది. దాదాపు రెండున్నర వేల ఎకరాల భూముల్ని లాక్కోవడం సర్కారు లక్ష్యం.



రికార్డుల్లో తక్కువ చూపిన వ్యక్తిగత భూములు, గ్రామకంఠాలు, అసైన్డ్‌ భూములు, సరైన రికార్డులు నిర్వహించని చుక్క బెట్టిన భూములు... ఇలా రకరకాల భూముల్ని తమ వందిమాగధులకు కట్టబెడుతూ ఆర్థిక అంతరాలకు తానే కారణమౌతోంది. ఇది కాకుండా లంక భూములు, పోరంబోకు, గైరానీ, అటవీ శాఖతో పాటు వివిధ విభాగాల అధీనంలో ఉన్న దాదాపు 17 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా తీసుకొని ప్రపంచంలో మరెక్కడా లేనంత పెద్ద ‘భూదందా’ను స్వయంగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఉమ్మడి అభివృద్ధి ముసుగులో ఉచితంగా, నామమాత్రపు ధరకు భూములు పొందే విదేశీ కంపెనీలు, కార్పొరేట్లు, ప్రైవేటు కంపెనీలు, సంస్థలు, వాటి ప్రతి నిధులు... ఇలా ప్రభుత్వంతో అంటకాగిన వారంతా కోట్లకు పడగలెత్తుతారు. సర్కారు చలువతో ఓ నయా సంపన్న వర్గం స్వల్ప కాలంలోనే పైకి లేస్తుంది. ఏ భూమీ లేకున్నా పంట భూములపై ఆధారపడి ఉపాధి పొందినవాళ్లు, ఎకరం, అర ఎకరంతోనే ఏటా మూడుకు తగ్గని పంటలతో దర్జాగా బతికిన వాళ్లు ఇప్పుడు దీనంగా దారిద్య్రరేఖ దిగువకు జారుతున్నారు.



రాబడి పెంచుకుంటూ, బరువు దించుకుంటూ...

సమసమాజ స్థాపన లక్ష్యంగా కలిగిన సంక్షేమ రాజ్యం మనది. ఎన్నికల్లో ఓట్లు రాల్చే ప్రజాకర్షక విధానాలే తప్ప, ప్రజలకు హితం చేసే పనుల పట్ల ప్రభుత్వాలు శ్రద్ధ చూపట్లేదు, పైగా వైదొలగుతున్నాయి. ఎన్నికల హామీల అమలుకూ దిక్కులేని పరిస్థితి. ముక్కుపిండి జనం వద్ద ప్రత్యక్ష, పరోక్ష పన్నులతో ఏటేటా రాబడి పెంచుకుంటున్న ప్రభుత్వాలు కీలకమైన విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాల్లోనూ బరువు, బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటూ... ప్రైవేటు రంగానికి ఎర్రతివాచీలు పరుస్తున్నాయి. అలా ప్రైవేటు రాజ్యాలు నెలకొల్పిన వాళ్లు ఇప్పుడు ప్రభుత్వాల్లో భాగమై శాస నాలు, విధానాలు రూపొందిస్తున్నారు. పైగా నీరుగారిన, నిర్వీర్యమైన నియంత్రణా వ్యవస్థలతో పనిచేస్తూ కార్పొరేట్లకు, ఇతర ప్రైవేట్లకు మన సర్కార్లు అనుచిత ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఒకరికొకరు అంటకాగుతూ అవినీతికి హారతి పడుతున్నారు, అంతరాలకు ఆజ్యం పోస్తున్నారు. దీంతో ఆర్థిక అంతరాలు వేగంగా పెరుగుతున్నాయి.



పదేళ్ల కిందటి బడ్జెట్‌తో పోలిస్తే తెలుగు రాష్ట్రాల బడ్జెట్‌ ఆరింతలు పెరిగింది. 2005–06లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ రూ. 55,330 కోట్లు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలసి రూ. 3 లక్షల కోట్లు దాటనుంది. రూ. 1.60 లక్షల కోట్ల బడ్జెట్‌కు తెలం గాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాదాపు అంతే పరిమాణంతో ఏపీ బడ్జెట్‌ రూపొందనుంది. కీలక రంగాల్లో బరువు దించుకుంటున్న ప్రభుత్వం ప్రజా ధనాన్ని ఎక్కడ వ్యయం చేస్తోంది? సాగునీటి ప్రాజెక్టుల వ్యయ అంచనాలు పెరిగే తీరు, ప్రజాకర్షక పథకాలకు వెచ్చించే పద్ధతి విస్మయం కలిగిస్తోంది. వాస్తు భ్రమల్లో తరచూ మారే పాలకుల నివాసాలు, కార్యాలయాలు, విడిది కేంద్రాల నిర్మాణా లకయ్యే దుబారా, గాల్లో జరిపే ‘ప్రత్యేక’ ప్రయాణాల కయ్యే ఖర్చులు, అతి ఉదారంగా ఇచ్చే విరాళాలు... ఇలా ఎన్నిటికో ప్రజాధనం వ్యయమౌతోంది.



తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోంది. రైతుల్ని ఆదుకునే చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం జరగట్లేదనే విమర్శ ఉంది. మార్కెట్‌ జోక్యాలకు గాను నిర్ధిష్టంగా కొంత మొత్తం వెచ్చించి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలన్న సూచన అమల్లోకి రావట్లేదు. ఇప్పటికే అనేక సమస్యల్లో కూరుకుపోయిన రైతాంగం తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు లభించని స్థితిలో అల్లాడుతున్నారు. ఇది వీడని ఆర్థిక అంతరాలకే దారి తీస్తోంది.



అవకాశాల కల్పనతోనే అంతరాలు తీరేది

పేదరికం ఏ రూపంలో ఉన్నా దాన్ని తొలగించాలన్నది ఐక్యరాజ్యసమితి ప్రతి పాదించి, ప్రపంచదేశాలు అంగీకరించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్డీజీ) మొదటిది. రాగల పదిహేనేళ్లు అన్ని స్థాయిల్లో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తే తప్ప 2030 నాటికైనా ఈ లక్ష్యసాధన జరగదు. పెద్దనోట్ల రద్దు చర్యతో సాధించిన ఫలితాలేమిటో కేంద్రం ఇప్పటివరకు వెల్ల్లడించలేదు. ఆ పరంపరలో తదుపరి ఆర్థిక, పాలనా సంస్కరణలు, ఇతర చర్యల్ని జాగ్రత్తగా చేపడితే తప్ప నల్ల సంపదను వ్యతిరేకించిన సామాన్యుల త్యాగాలకు అర్థం  ఉండదని ప్రపంచ ఆర్థికవేత్తలు సైతం భావిస్తున్నారు. ఆర్థిక అంతరాలు తగ్గించే క్రమంలో ఒక వంక సంపద వృద్ధి చట్టపరిధికి లోబడి జరిగేలా చూస్తూనే, సామాన్యుల ఎదుగుదల అవకాశాల్ని వృద్ధి చేయాలి.





ఈ ఉదాహర ణను చూస్తే ప్రభుత్వాల వైఫల్యాలు కళ్లకు కడతాయి. నిర్మాణరంగ కూలీల కోసం ఆ రంగం నుంచి వసూలు చేసిన 2% సెస్‌ మొత్తాల్ని పదేళ్లలో ప్రభు త్వాలు వ్యయం చేసిన తీరే ఇందుకు నిదర్శనం. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దావోస్‌లో మాట్లాడుతూ అన్నట్టు ‘ప్రపంచీకరణ రెండువైపులా పదునున్న కత్తి’ అని పాలకులు గ్రహించాలి. దాన్ని ఒడుపుగా వాడుకొని ఆర్థిక అంత రాల్ని తగ్గించి, సమాజంలోని అశాంతిని తొలగించాలి. ‘‘విప్లవం నేరుగా ఉత్పత్తి కాదు, అది విప్లవ పరిస్థితుల నుంచి పుట్టే ఉప ఉత్పత్తి మాత్రమే’’ అన్న ఇంగితం అత్యవసరం.



దిలీప్‌ రెడ్డి

ఈమెయిల్‌: dileepreddy@sakshi.com

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top