ఎర్ర బుగ్గలకు స్వస్తి!

ఎర్ర బుగ్గలకు స్వస్తి!


అక్షర తూణీరం

పవర్‌లోకి వచ్చీ రాగానే, నేతలకు గన్‌మెన్‌లు, పైలట్‌లు సిద్ధమవుతాయ్‌.  ఇవి చాలా  అనవసరం, నాకొద్దు అన్నవారెవరైనా ఉంటే  వారికి వందనం.



ఉన్నట్టుండి ఆయనెందుకో సిగ్గుపడి, ‘ఎర్ర బుగ్గలకు‘ స్వస్తి  పలికారు. మోదీ మాట వినగానే, నేనిదివరకే... కాదు నాకిదివరకే సిగ్గేసి ఎర్ర బుగ్గలు వదిలేశానని, కారులో  నిలబడి మన వెంకయ్య నాయుడు చెప్పారు. జాగ్రత్తగా గమనిస్తే, నరేంద్ర మోదీ అప్పుడప్పుడు ఇలాంటి మెరుపులు మెరిపిస్తుంటారు. యూపీ విజయం తరువాత నాకేదో అనుమానంగా ఉంది. ఉన్నట్టుండి ముఖ్య నేతలంతా పాంకోళ్లు వేసుకుని.. మేండేటరీ చేయ కపోయినా,  ఆదరణీయ క్రియగా భావిస్తారని సందేహంగా ఉంది.



నిజమే! ఈ ఎర్ర దీపం కాన్సెప్ట్‌ ఎట్నించి వచ్చిందో తెలియదు.  ఫైరింజన్‌ని చిన్నప్పుడు మావూళ్లో గంటల కారు అనేవాళ్లం.  దానికి కూడా ఎర్రదీపం జ్ఞాపకం లేదు. అంబులెన్స్‌కి ఎర్ర  దీపం ఎరుగుదుం. వీఐపీలకి అంటే వాళ్ల కార్లకి ప్రమాద  ఘంటికలు మోగిస్తూ ఈ ఎర్ర దీపం తిరుగుడేందో, ఎట్లా  వచ్చిందో మనకు తెలి యదు. గొప్పవాళ్లకి కొంచెం ఆర్భాటం ఉండాల్సిందే. లేకపోతే వాళ్లకి గుర్తింపు ఉండదు. కలెక్టర్‌  గారికి, రిజిస్ట్రార్‌ గారికి, జడ్జీ గార్లకి ముందు డవాళా బంట్రోతు  నడుస్తూ తెగ సందడి చేసి భయపెడుతూ ఉంటారు. పూర్వం రాజులకి వంది మాగధుల నించి వెండి బెత్తాల వారు దాకా ముందుండి హంగు కూర్చేవారు. ఫ్యూడల్‌ అవశేషాలు ఇంకా  బోలెడు మిగిలే ఉన్నాయి. ప్రజా నాయకులం, ప్రజాసేవకులం అని చెప్పుకోవడం, రాచమర్యాదలకు  తహతహలాడడం మనవాళ్లకి అలవాటే!



‘మేం అసాంఘిక శక్తులపై నిరంతరం పోరు సాగిస్తున్నాం, మా ప్రాణానికి ముప్పుంది‘ అనే సాకుని ‘సెక్యూరిటీ‘గా  మార్చి, ఆ వంకన లేనిపోని ఆర్భాటం చేస్తున్నారని కొందరు విశ్లేషకులంటారు. ఎర్ర దీపానికి సెక్యూరిటీకి సంబంధం ఉంది  కాబట్టి, గొప్పవారి ప్రాణాలు అందులోనే ఉన్నాయనే వాదన  వినిపిస్తోంది. ఎర్ర దీపం కారు సైరన్‌తో, ఒక మహా మనిషి కదలి వస్తున్నాడని హెచ్చరిస్తూ వేగంగా వెళ్లి పోతుంది. దీని తర్వాత స్థాయి బులుగు బుగ్గలది. క్యాబినెట్‌ స్థాయికి దిగువన ఉండే వీఐపీలకు నీలం దీపాలుంటాయి.



పవర్‌లోకి వచ్చీ రాగానే, ఇంకేముంది మమ్మల్ని  చంపేస్తారంటూ–గన్‌మెన్‌లు, పైలట్‌లు సిద్ధమవుతాయ్‌. ‘ఇవి చాలా అనవసరం, నాకొద్దు’ అన్నవారెవరైనా ఉంటే  వారికి వందనం. ప్రజలతో మమేకమయ్యే వారికి ఈ  గొప్పలన్నీ అవసరమా అనిపిస్తుంది. నేనొకసారి ప్రత్యక్షంగా చూశాను–నగరంలో వెటర్నరీ హాస్పిటల్‌కి ఒక ఎర్ర దీపం కారు, నీలం దీపం కారు వచ్చాయి. రెండు కార్లలోంచి రెండు కుక్కలు దిగాయి. ఎర్ర దీపంలో వచ్చిన కుక్క ఆలస్యంగా వచ్చినా, దాన్నే ముందు చూసి పంపించారు. నీలం కారు కుక్క తాలూకు డ్రైవర్‌ ముందొచ్చా గదా అని సణిగాడు. ఎర్ర దీపానికున్న ప్రయార్టీ నీకుండదు గదా అన్నాడు. కుక్కల డాక్టరు ఈ రంగు దీపాల కార్లు స్కూల్లో పిల్లల్ని దింపుతూ కనిపిస్తాయ్‌. అందరూ ఒకే యూని ఫాంలో ఉన్నా ఎర్ర దీపం యవ్వారం వేరుగా ఉంటుంది. తరచు డ్రైవర్‌ సొంత పనిమీద  మందు షాపు ముందు ఆపుతాడు. ప్రసిద్ధ నటులు, తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు, గొప్ప చమత్కారి ఒకసారి నాతో అన్నారు–ఈ ఎర్ర దీపం బళ్లు వెళ్తుంటే ఖడ్గ మృగాల్ని చూసినట్టుండేదయ్యా. మా అన్నగారు ఢిల్లీ  పీఠమెక్కితే ఎర్రకోటకి పచ్చరంగు పడుద్ది. కార్లకీ పచ్చదీపాలే! దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోమన్నారు. అంటే తలమీద  ఎరుపో బులుగో ఉండగానే నాలుగు రాళ్లు...







శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top