నివాళి ఆకాశం

నివాళి ఆకాశం


జీవన కాలమ్‌

నాకు చాలా ఇష్టమైన ఫొటోలలో ఇది మొదటిది. మా శ్రీనివాస్‌ స్మారక పురస్కార సభకి కచ్చేరీ చెయ్యడానికి పద్మవిభూషణ్‌ అంజాద్‌ అలీ ఖాన్‌ని ఆహ్వానించాం. అదొక అపూర్వమైన సాయంకాలం. సభాసదుల్ని మైమరపించిన కచేరీ. అంతకు ముందు ఆయన్ని ఆహ్వానించడానికి కామరాజ్‌ హాలు ముందు మా అబ్బాయిలతో నిలబడ్డాను. కారాగింది. అంజాద్‌ అలీఖాన్‌ దిగారు. ముందుగా అనుకుని చేసినది కాదు. వారిని చూడగానే ముందుకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించబోయాను. ఆయనా ఊహించి ఉండరు. కానీ ఆయనా అంతే హఠాత్తుగా నా పాదాలకు వంగారు. ఒక మహా సంగీతకారుడి పట్ల నా గౌరవం అలా ఉండగా – ఒక మహా సంగీతకారుడి ‘వినయ సంపద’కి అది మచ్చు తునక. మా పిల్లలూ, మనుమడూ అంతా అబ్బురంతో ఈ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డారు. ఇదీ ఈ అరుదయిన ఫొటో కథ.



కాశీ వెళ్లినప్పుడు–రెండే దర్శనాలు నా మనసులో ఉన్నాయి. కాశీ విశ్వేశ్వరుడు. భారతరత్న బిస్మిల్లాఖాన్‌. మొదటి దర్శనం అందరూ చేసుకునేదే. చల్లా లక్ష్మణరావుగారు బిస్మిల్లాఖాన్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు. కాశీ విశ్వవిద్యాలయంలో నా ఉపన్యాసాన్నీ ఏర్పాటు చేశారు. అప్పుడు కాశీ విశ్వవిద్యాలయం కులపతి సింహాద్రి అనే తెలుగాయన. ఇప్పుడది కష్టమూకాదు. కారణం– నా అభిమాని, నన్ను గురువుగా భావించే బూదాటి వేంకటేశ్వర్లుగారు అక్కడి తెలుగు విభాగానికి అధ్యక్షులు. సరే, బిస్మిల్లాఖాన్‌ దర్శనానికి నేనూ, మా ఆవిడా బయలుదేరాం. మాకు ఫొటోలు తీయడానికి మా ఇంటి పురోహితులు గోరంట్ల లక్ష్మీనారాయణశాస్త్రి గారు వచ్చారు.



వెళ్తూ సరాసరి దంపతులం ఇద్దరమూ ఆయనకి పాదాభివందనం చేశాం. మేమెవరమో ఆయనకు తెలీదు. నా పేరు చెప్పినా తెలుసుకునే అవకాశం లేదు. మా ఆవిడని పద్మభూషణ్‌ శ్రీపాద పినాకపాణిగారి అమ్మాయిగా పరిచయం చేశాను. అప్పుడూ ఆయన స్పందించలేదు. గంట తర్వాత లేచి బయలుదేరబోతూంటే–ఇబ్బందిగా మరోసారి నాపేరు అడిగారు. మేం బిస్మిల్లాఖాన్‌కి పాదాభివందనం చేయడం శాస్త్రి గారికి ఇష్టం లేదు. ఆయన ఎరికలో నా పరపతి గొప్పది. నా మనస్సులో బిస్మిల్లాఖాన్‌ ఆకాశం.



చాలా సంవత్సరాల కిందట– నేనూ, మిత్రులు శోభన్‌బాబూ తణుకులో ‘బలరామ కృష్ణులు’ షూటింగ్‌ చేస్తున్నాం. ఆ సమయంలోనే మన ప్రధాని పీవీ నరసింహారావుగారు పుట్టపర్తి వెళ్లారు. సభలో సత్యసాయిబాబాకు పాదాభివందనం చేశారు. అది పేపర్లో వచ్చింది. శోభన్‌బాబుకి ఈ దేశపు ప్రధాని బహిరంగ సభలో బాబా గారికి అలా పాదాభివందనం చేయడం నచ్చలేదు. ఆ మాట నాతో అన్నారు.



ప్రణామానికి పునాది మన విశ్వాసం, సంస్కారం, సౌజన్యం, కర్తవ్యం, నివాళి. ఈ దేశానికి జ్ఞాన బిక్షను పెట్టిన ఆది శంకరులు ఒక మ్లేచ్చుడికి పాదాభివందనం చేసి– ‘జ్ఞానానికీ, విజ్ఞతకీ’ కులం లేదని నిరూపించారు. ఎంత మహానుభావుడైనా– సన్యసించాక లోకమంతా ఆయనకి పాదాభివందనం చేస్తుంది. చెయ్యాలి– తండ్రి అయినా సరే. కానీ అతను పాదాభివందనం విధిగా చెయ్యాల్సిన ఒక రుణం ఆ బొంది ఉన్నంతవరకూ ఉంటుందట. తన మాతృమూర్తికి ఆ రుణం ఆ జన్మకి తీరేది కాదు. మరి భగవంతుడికి? కనీసం తను విశ్వసించే భగవంతుడికి? మరునాడు కాలమ్‌ రాసి శోభన్‌ బాబుకి చదివి వినిపించాను. ‘ఇలా చూసినప్పుడు– ఆయన చర్య సబబుగానే ఉంది’ అన్నారు.



సంస్కారానికి ఎల్లలు లేవు. వినయానికి షరతులు లేవు. ఎదిగినకొద్దీ ఒదగడమే సంస్కారం.

జీవితమ్మెల్ల బహు శాస్త సేవలందు

గడిపితిని; రహస్యములు చాలా గ్రాహ్యమయ్యె,

ఇప్పుడు వివేకనేత్రమ్ము విప్పి జూడ,

తెలిసికొంటి నాకేమి తెలియదంచు– ఇది దువ్వూరి రామిరెడ్డిగారి మాట – ‘పానశాల’లో.



1952–53లో కాకినాడ సరస్వతీ గానసభ స్వర్ణోత్సవాలకు బడేగులాం ఆలీఖాన్ని ఆహ్వానించారు. ఉత్సవాల కన్వీనర్‌ ఎమ్‌.వి. శాస్త్రిగారు, మహా గాయకుడు, వాగ్గేయకారుడూ జీఎన్‌ బాలసుబ్రహ్మణ్యం క్లాస్మేట్స్‌. బడే గులాం కచ్చేరీకి కొన్ని షరతులు పెట్టారు: పోల్సన్స్‌ బట్టర్తోనే వంట చెయ్యాలి. రోజూ చికెన్‌ ఉండాలి. క్రేవెన్‌ ‘ఏ’ సిగరెట్లు, స్కాచ్‌ ఉండాలి–అని. బడే గులాం ఆలీ ఖాన్‌ కచ్చేరి అయ్యాక–సభలో ఆయన రెండు పాదాలమీదా తల ఆనించి పాదాభివందనం చేశారు జీఎన్బి.. రోజూ విధిగా మాంసాహారం, స్కాచ్‌ ఉండాలన్న బడేగులాంని, వారి సిబ్బందినీ రోజుల తరబడి తమ ఇంట్లో ఉంచుకుని సేవించారు ఘంటశాల.



బిస్మిల్లా ఖాన్‌ మీద కాలమ్‌ రాసి ముగిస్తూ ఓ మాట అన్నాను, నా పేరే గుర్తు లేని ఆ మహా విద్వాం సుని గురించి: గంగానదిలో లక్షలాదిమంది రోజూ స్నానం చేసి తరిస్తారు. వారెవరో గంగానదికి తెలియనక్కరలేదు–అని.

ఈ ఫొటో చూసినప్పుడల్లా–నా అభినందన కాదు. ఆ మహా వృక్షం తలవొంచడం అపురూపంగా, అపూర్వంగా అనిపిస్తూంటుంది.



గొల్లపూడి మారుతీరావు

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top