ట్రంపయ్య విన్యాసాలు

ట్రంపయ్య విన్యాసాలు - Sakshi


జీవన కాలమ్‌

మంచికో చెడుకో, ఒబామా మీద కసితోనో, పదవిమీద వ్యామోహంతోనో ఆయన ప్రపంచంలో కల్లా అతి బలమైన పదవిలో కూర్చున్నారు. ఇది ప్రతాపరుద్రుడి సింహాసనం మీద రజకుడి పాత్ర కాదు.



రాజకీయ నాయకుడు రెండు రెళ్లు తప్పనిసరిగా ఆరు అవుతుందని ప్రజల్ని మర్యాదగా నమ్మించాలని చూస్తాడు. రెండు రెళ్లు మూడంటే ‘ఇది ప్రతి పక్షాలు నామీద చేస్తున్న కుట్ర’ అంటాడు. రెండు రెళ్లు నాలుగు అంటే ‘నేను ముందే చెప్పాను కదా?’ అంటాడు. కోపం రాజకీయ నాయకుని శత్రువు. చిరునవ్వు పనిముట్టు. లౌక్యం ఆయుధం.



ఒబామా నిఖార్సయిన రాజకీయ నాయకుడు. పాకిస్తాన్‌ ఎన్నిసార్లు ఎన్నిరకాలైన దౌర్జన్యాలు చేసినా అమెరికా వారిని సిద్ధాంతపరంగా హెచ్చరిస్తూనే ఉంది. మరొకపక్క బిలియన్ల ఆర్థిక సహాయం చేస్తూనే వచ్చింది. ‘మొదట మీ పెరట్లో దౌర్జన్యాన్ని అరికట్టండి’ అన్న హిల్లరీ క్లింటన్‌ మాటని మనం చాలాకాలం నెత్తిమీద పెట్టుకుని ఊరేగాం. ఊరేగుతా మని అమెరికాకి తెలుసు. దౌర్జన్యాలు చేస్తున్న పాకి స్తాన్‌కి తెలుసు. ఇది చిన్న ఉదాహరణ. మరి ట్రంప్‌ గర్జించగానే ‘హఫీద్‌ సయీద్‌’ని పాకిస్తాన్‌ నిర్బం ధంలో ఎందుకుంచింది? వారికర్థమయ్యే ‘భాష’ ట్రంప్‌ దొర మాట్లాడాడు కనుక.



డొనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయ నాయకుడు కాదు. వ్యాపారి. వ్యాపారికి ఈ రాజకీయపరమైన శషభి షలు లేవు. వ్యాపారికి నిక్కచ్చితనం లాయకీ. 2011 మే 1వ తేదీన ఒబామా పాత్రికేయులకి వార్షిక విందుని ఇచ్చాడు. అంతకుముందు ట్రంప్‌గారు ఒబామా పుట్టిన తేదీని, స్థలాన్నీ ప్రశ్నించారు. ఈ విందుకి ట్రంప్‌నీ ఆహ్వానించారు. ఆ విందులో ఒబామా ట్రంప్‌ని అతిథులందరిముందూ చెడా మడా కడిగేశారు. ‘డొనాల్డ్‌ నా పుట్టుక తేదీని ప్రశ్నిం చారు. ఇప్పుడు ఏకంగా నేను పుట్టిన వీడియోనే చూపించబోతున్నాను’ అంటూ వాల్ట్‌ డిస్నీ ‘‘ది లైన్‌ కింగ్‌’’ కార్టూన్‌ వేసి చూపించాడు. అతిథులు నవ్వు లతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ రోజున తన 70వ ఏట మొదటిసారిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చెయ్యాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నాడని వార్త. మొదటినుంచీ ఎవరూ ట్రంప్‌ని సీరియస్‌గా తీసు కోలేదు. అందరికీ అతను ఓడిపోతాడనే దృఢమైన నమ్మకం ఉండేది. పాపులర్‌ ఓటు హిల్లరీ క్లింటన్‌కే దక్కింది. కానీ అమెరికా ఓటరు ట్రంప్‌ని అధ్యక్షు డిగా ఎన్నుకున్నాడు. అది మరచిపోకూడదు.



మరొక్కసారి– ట్రంప్‌కి రాజకీయమైన ‘సన్నాయి నొక్కులు’ తెలీవు. పదవిలో కూర్చోగానే ఎనిమిదేళ్లలో ఒబామా చేసిన సంస్కరణలన్నీ– సమూలంగా అటకెక్కించే ప్రయత్నం చేశాడు– ఆయన మీద ‘గుర్రు’ ఉంది కనుక. ఉందన్న విష యాన్ని ముందునుంచీ చెప్తూనే ఉన్నారు. చెప్పిందే చేశారు.



పెదవడ్లపూడి రైతు స్థానిక రచ్చబండ దగ్గర కూర్చుని భావించే ధోరణిలోనే ట్రంప్‌గారు బల్లగుద్ది కొన్ని నిజాలని వక్కాణించారు. అవి నిజాలని మనం మరిచిపోకూడదు. ఇన్నేళ్లలో ఐక్యరాజ్యసమితికి అమె రికా బిలియన్లు ఖర్చు చేసింది. ఆ సంస్థ ఏం ఒరగ బెట్టింది? ఇరాక్‌æ యుద్ధం, ఇరాన్‌ వ్యవహారం, పాకి స్తాన్‌ దౌర్జన్యం–వేటికి పరిష్కారమో, స్పందనో ఆయా దేశాలు వినేటట్టు చూపగలిగిందా? మరెం దుకూ ఈ దిక్కుమాలిన సంస్థ? పాకిస్తాన్‌ ఒకపక్క దౌర్జన్యం జరుపుతుండగా బిలియన్ల సహాయం ఎందుకు చెయ్యాలి? ఇటుపక్క అమెరికన్‌ యువతకి ఉద్యోగాలు లేక అల్లాడుతుండగా విదేశాల నుంచి ఆయా నిపుణుల్ని ఎందుకు రానివ్వాలి?



ఒక్క క్షణం ట్రంప్‌ చర్య వల్ల మనవారు అమెరికా వెళ్లగల అవకాశాలు తగ్గిపోతాయన్న విషయాన్ని పక్కన పెడితే– ఆ దేశం ఎన్నుకున్న– ఆ దేశానికి జరగవల సిన ఉపకారం గురించి కుండబద్దలు కొట్టి చెప్తున్న మాటలివి. ఈ వ్యాపారి ‘బుకాయింపు’ చూడండి. మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి కాందిశీ కులు వస్తున్నారు. అందువల్ల నష్టం అమెరికాకి. కనుక వారు రాకుండా ఒక గోడ కట్టాలి. ఎవరు కట్టాలి? నష్టం ఎవరికి జరుగుతోందో వారు కట్టు కోవాలి. కానీ ఈ ‘వ్యాపారి’ ఆ గోడకి అయ్యే ఖర్చు మెక్సికో భరించాలన్నారు.



అలాగే హింసని ప్రోత్సహిస్తున్న ఏడు దేశాల నుంచి ఆయా పౌరులు రావడాన్ని నిషేధించారు. ఆ చట్టాన్ని అమెరికా ప్రధాన న్యాయస్థానం కొట్టి పారే సింది. ట్రంప్‌ మళ్లీ చట్టాన్ని చేస్తానంటున్నారు. చేసినా ఆశ్చర్యం లేదు. ఆయన వ్యాపారి. తెగేవరకూ లాగడు. తెగేలాగ లాగుతాడు.



మంచికో చెడుకో, ఒబామా మీద కసితోనో, పదవిమీద వ్యామోహంతోనో ఆయన ప్రపంచంలో కల్లా అతి బలమైన పదవిలో కూర్చున్నారు. ఇది ప్రతాపరుద్రుడి సింహాసనం మీద రజకుడి పాత్ర కాదు. నాలుగు దశాబ్దాలు–వ్యాపార కీలకాలు ఎరి గిన వ్యాపారి చేతిలోకి వచ్చిన ప్రపంచంలోకల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యం పగ్గాలు. అప్పుడేమవుతుంది?



ప్రస్తుతం ‘అమెరికా’ అవుతుంది. పరిపాలన రోడ్డుమీద పడదు. కానీ– రాజకీయాలలో అలవాటైన ‘సన్నాయి నొక్కులతో’కాక– చాలా సందర్భా లలో కుండబద్దలుకొట్టే ‘పాలన’ సాగుతుంది. ఆ ‘సాగుడు’ అప్పుడే ప్రారంభమైంది.





- గొల్లపూడి మారుతీరావు

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top