అనువుగాని చోట్లు

అనువుగాని చోట్లు


జీవన కాలమ్‌

ఆ మధ్య పుణేలో ప్రసిద్ధ గాయకుడు సోనూ నిగమ్‌ తుప్పతల, పిల్లిగెడ్డం పెట్టుకుని వీధిలో ఒక చెట్టు కింద హార్మోనియం పట్టుకుని పాటలు పాడారట. ఒక్కడు కూడా ఆయన సంగీతాన్ని పట్టించుకోలేదట.



నాకు బాగా గుర్తు. ఎన్‌.టి. రామారావు నటించిన పుండరీకాక్షయ్యగారి చిత్రం ‘ఆరాధన’ రజతోత్సవ సభ హైదరాబాద్‌లో సుదర్శన్‌ 70 ఎంఎం థియేటర్‌లో జరిగింది. ఉత్సవానికి లోపలికి వెళుతుండగా గేటు దగ్గర ఎవరో నన్ను ఆపేశారు. నా వెనుకనే వస్తున్న ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చిన్న సత్యంగారు ముందుకు దూకారు. ‘‘ఆయన ఈ చిత్ర రచయిత బాబూ!’’ అని వివరించారు. అప్పటికి నేను నటుడిని కాదు. నా రచయిత పరపతి థియేటర్‌ గేటు కీపర్‌ దాకా ప్రయాణం చెయ్యలేదు.



1975 ఏప్రిల్‌లో హైదరాబాద్‌ ఫతే మైదాన్‌ క్లబ్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ ప్రారంభించారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి. మండలి వెంకట కృష్ణారావు విద్యామంత్రి. స్టేజీ మీద టంగుటూరి సూర్యకుమారి ‘మా తెలుగుతల్లికి’ గీతం పాడు తోంది. మాసిన బట్టలతో ఒకాయన గేటు దగ్గరికి వచ్చాడు. గేటు కీపర్లు ఆయన్ని ఆపారు. ‘ఆ పాట రాసింది నేనే’ అన్నాడాయన. అయినా వారు వద ల్లేదు. ఈలోగా ఎవరో ఆయన్ని గుర్తుపట్టి అధికారు లకి చెప్పారు. కార్యకర్తలు పరుగున వచ్చి ఆయన్ని సాదరంగా లోపలికి తీసుకెళ్లారు. ఆయన శంకరం బాడి సుందరాచారి. మర్నాడు విశ్వనాథ సత్యనారా యణ అధ్యక్షత వహించిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మనకి సామెతలు ఊరికే రాలేదు– ‘వెండి పళ్లానికైనా గోడ చేర్పు కావాలి’. ప్రతీ గొప్ప తనానికీ ‘అనువుగాని చోటు’ ఒకటుంటుంది–అని.



దీనిని సోదాహరణంగా నిరూపించిన విచిత్ర మైన, కానీ అపురూపమైన ప్రయోగం జరిగింది. 2007లో వాషింగ్టన్‌ లెఫెంట్‌ ప్లాజా మెట్రో స్టేషన్లో ప్రపంచ ప్రఖ్యాత వయొలినిస్ట్, గ్రామీ అవార్డు గ్రహీత జోషువా బెల్‌ బేస్‌బాల్‌ ఆటగాడి టోపీ పెట్టుకుని–వీధిలో తిరిగే వాద్యగాడిలాగా కూర్చుని వయొలిన్‌ వాయించాడట. ఆయన వయొలిన్‌ ఖరీదు 30 లక్షల డాలర్లు. ప్రపంచ ప్రఖ్యాత మెండల్సన్, బాఖ్‌ సంగీతాన్ని వాయించాడు. అది నూరు సంవత్స రాలుగా ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన అపురూపమైన సంగీతం. అయితే ఆనాడు యూనియన్‌ స్టేషన్‌లో 1,070 మంది ఆయన సంగీతాన్ని పట్టించుకోకుండా హడావుడిగా తమ తమ గమ్యాలకి పరుగులు తీశారు. కేవలం 27 మంది ఒక్కక్షణం ఆగి ముందుకు తరలి పోయారు. ఆయన బాఖ్‌ వాయిస్తూ ఉంటే హాలులో ఒక గుండుసూది కిందపడినా శబ్దం మారుమోగుతుందట.



ఈ కథ విని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ నవ్వుతూ అన్నాడట: ‘‘నాకు తెలిస్తే నేను అక్క డికి వచ్చేవాడిని’’ అని. బెల్‌ నవ్వి–నిజంగా ఆయన వచ్చి ఉంటే మరో కారణానికి–అంటే అమెరికా మాజీ అధ్యక్షుడిని మెట్రో రైలు స్టేషన్లో చూస్తున్నందుకు తెల్లబోయినవారు–అప్పుడు నా సంగీతాన్ని పట్టించు కునేవారు కాదు–అన్నాడట. ఈ కథని విన్న చాలా మంది నవ్వుతూ తమ ట్వీటర్లలో చమత్కరించారట. ‘‘ఇది ఏసుప్రభువుని మరచిపోయిన క్రిస్టమస్‌ లాంటిది’’ అని. ఈ ప్రయోగాన్ని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక నిర్వహించింది. దీన్ని చిన్నపిల్లలకు నీతికథగా వ్రాస్తే ఆ పుస్తకానికి పులిట్జర్‌ బహుమతి లభించింది. ఆయన ప్రముఖ నటీమణి మెరిల్‌ స్ట్రీప్‌తో ‘సీసేమ్‌ స్ట్రీట్‌’లో నటించారు. అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్‌ మహారాణి సమక్షంలో జోషువా బెల్‌ ప్రత్యేక ప్రదర్శ నలిచ్చారు.



ఆ మధ్య పుణేలో ప్రసిద్ధ గాయకుడు సోనూ నిగమ్‌ తుప్పతల, పిల్లిగెడ్డం పెట్టుకుని వీధిలో ఒక చెట్టు కింద హార్మోనియం పట్టుకుని పాటలు పాడా రట. ఒక్కడు కూడా ఆయన సంగీతాన్ని పట్టించు కోలేదట.



ప్రపంచంలో ప్రతి గొప్ప కళకీ చక్కని ఫ్రేమ్‌ కావాలి. ఆలంబన కావాలి. ఫోకస్‌ కావాలి. చిన్న ఉపో ద్ఘాతం కావాలి. మన తెలుగు సినిమాల్లో యముడూ, చిత్రగుప్తుడూ కిరీటం, గదతో మన రోడ్ల మీదకు వచ్చి ‘నేను యముండ’ అంటే, ‘మనది ఏ నాటక కంపెనీ బాబూ!’ అని పలకరించడం చూశాం.



ఆలయంలో అడుగు పెట్టిన క్షణం నుంచీ మంచి గంధం పరిమళం, గర్భగుడిలో మోగే గంటల రవళి, కర్పూర హారతి, అష్టోత్తర నామావళి–ఇవన్నీ ఒక పవిత్రమైన ఆలోచనా సరళిని ఒక ‘మూడ్‌’ని ్చఝbజ్చీ nఛ్ఛిని కల్పిస్తాయి. ఊరేగింపుకి స్వామి ఊరికేరాడు. ముందు మేళతాళాలు వస్తాయి. వెనుక భక్త బృందం నడుస్తుంది. తర్వాత ఏనుగులు నడుస్తాయి. తర్వాత పల్లకీ కనిపిస్తుంది–అప్పుడూ స్వామి దర్శనం.



ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు జోషువా బెల్‌ని రద్దీగా ఉన్న యూనియన్‌ స్టేషన్‌లో కూర్చోబెట్టిన ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక ప్రయోగం ఓ గొప్ప సత్యాన్ని ఆవిష్కరించడానికి ప్రతీక. ఈ వాస్తవం విపర్యాయా నికీ–అంటే ‘అనువుగాని చోట’ ఎంత గొప్ప కళయినా వీగిపోతుందనడానికీ ఈ ప్రయోగం తార్కాణం.



గొల్లపూడి మారుతీరావు

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top