సమానత్వం కోసం సమరం

సమానత్వం కోసం సమరం - Sakshi


నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

స్త్రీపురుషుల మధ్య అంతరం ఎంతగా తగ్గితే అంత వేగంగా వృద్ధి రేటు పెరుగుతుంది.  విద్యలో సమానావకాశాల ద్వారా కొన్ని దేశాలలో 50 శాతం ఎక్కువగా ఆర్థికాభివృద్ధి జరిగింది. స్త్రీపురుషుల మధ్య ఉపాధి, వేతన వ్యత్యాసాలు తొలగిస్తే స్త్రీల ఆదాయం 76 శాతం, ప్రపంచ ఆదాయం 17 ట్రిలియన్‌ డాలర్లు పెరుగుతుంది. కాబట్టే ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం స్త్రీల ఉపాధి, అన్నింటిలో సమానత్వం, సగం సగం భాగస్వామ్యం నినాదాన్ని ఇచ్చింది. ప్రపంచం దీనిని ఏ విధంగా గుర్తిస్తుందో చూడాలి.



ప్రపంచ వ్యాప్తంగా స్త్రీపురుషుల మధ్య మరింత వేగంగా సమానత్వాన్ని సాధించడం అనివార్యం. అందుకే ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం మరింత పదునైన నినాదాన్ని ఇచ్చింది. అది–‘మారుతున్న పని, ప్రపంచ స్త్రీలు: 2030 నాటికి ఈ భూగ్రహం 50:50గా మారాలి’. గత ఏడాది స్త్రీల సాధికారత, సమా నత్వాలపై పునరాలోచించమని కోరింది. 2015లో తొలిసారిగా స్త్రీల సమ స్యలపై చర్చించి ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ చేసిన తీర్మానాలను సభ్యదేశాలన్నీ ఆమోదించాయి.



ఆర్థిక వ్యవస్థలు బలపడాలంటే

విశ్వ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు బలపడాలంటే ఉపాధి, వేతనం రెండింటిలో  50:50 వంతున సమంగా ఉండాలన్న వాస్తవం పలు అధ్యయనాల ద్వారా వ్యక్తమైంది. ఫలితంగా 167 దేశాలు స్త్రీల సాధికారత చట్టాలను, విధానాలను సమీక్షించుకున్నాయి. స్త్రీలు/బాలికలపై జరిగే హింస, హత్యలపై ఉక్కుపాదం మోపాలని లాటిన్‌ అమెరికా నిర్ణయించుకుంది. బ్రెజిల్‌ నేర పరిశోధన, విచా రణలో చేపట్టిన నూతన విధానాలను, పద్ధతులను ఆదర్శంగా తీసుకుని మెక్సికో, ఈక్వెడార్, పెరూ వంటి దేశాలు స్త్రీలపై ఇంటా బయటా జరిగే దారుణ హింసలను ఆపాలని తీర్మానించుకున్నాయి. 64 దేశాల అధిపతులు కలసి స్త్రీ సాధికారితపై చర్చించారు. శాంతిభద్రతలను నెలకొల్పడంలో స్త్రీలు కీలక పాత్ర పోషిస్తున్నారనీ, ఈ ధోరణిని ప్రోత్సహించాలనీ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. 12 దేశాల ప్రభుత్వాల అధిపతులుగా, 13 దేశాలలో రాజ్యా ధిపతులుగా ఇప్పుడు స్త్రీలు  ఉండటం అనుకూలించే విషయం. స్త్రీపురుషు లకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ కెనడా తన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసింది. ఫిన్‌లాండ్, స్వీడన్, ఫ్రాన్స్‌ అదే బాట పట్టాయి. స్వీడన్‌ అతను (హన్‌) ఆమె (హోన్‌) అనే పదాలకు బదులు ఇద్దరికీ వర్తించేలా ‘‘హెన్‌’’ అనే పదాన్ని వాడుకలోకి తెస్తున్నది. కొసావో మహిళలు ఐదు వేల దుస్తులను ఒకేచోట ఆరవేసి యుద్ధంలో అత్యాచారాలకు గురైన స్త్రీలకు గొంతుకనిచ్చారు. ఛాందస దేశమైన ట్యునీషియా కూడా భర్త అనుమతి అవసరం లేకుండా బిడ్డలతో కలసి భార్య ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చి ఒక మూఢా చారానికి స్వస్తి పలికింది. టర్కీ, రష్యా, బెలారస్‌ మొదలైన దేశాలలో యుని లివర్‌ కంపెనీ మహిళలకు పనిలో  50 శాతం ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల పని సంస్కృతిలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందని ఖండాంతర కార్పొరేట్‌ సంస్థ ప్రకటించింది. అయితే ఇవన్నీ కాగితాల మీద రాతలేనా? లేక స్త్రీలు, బాలికల జీవితాల్లో మార్పు తెచ్చే ఫలితాలుగా కూడా అవతరిస్తున్నాయా? ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న చట్టపరమైన హక్కులు, ప్రపంచంలో సమానత్వం ఆవశ్యకతను చెప్పి ఒప్పించడం వంటి వాటితో అసమానతలను అంతం చేయొచ్చనే విశ్వాసం కలుగుతున్నది.



ఎక్కువ శ్రమ, తక్కువ ఫలితం

విద్యాపరంగా స్త్రీలకు సమాన హక్కులూ, అవకాశాలు అంటే– అమ్మాయి లంతా ప్రాథమిక స్థాయిలో బడిలో పేరు నమోదు చేసుకుంటే సరిపోతుం దనుకోవడం పొరపాటు. వాళ్లు ఎన్నేళ్లు విద్యనభ్యసించారు? నాణ్యమైన విద్య లభిస్తున్నదా? భద్రత కలిగించే వాతావరణం ఉందా? అభ్యుదయ భావాలతో పాఠ్య ప్రణాళికలు ఉన్నాయా?  శిక్షణ పొందిన ఉపాధ్యాయులు న్నారా? వంటి అంశాలకు సానుకూలమైన జవాబు లభిస్తేనే విద్యలో సమా నావకాశం అన్న మాట అర్థవంతమవుతుంది. స్త్రీల విద్యకీ, ఉపాధి అవకాశా లకీ, నైపుణ్యాలకీ గల సంబంధం అందరికీ తెలుసు. అయితే బాలికలు బడిలో గడిపే ప్రతి అదనపు ఏడాది 9.5 శాతం శిశుమరణాలను తగ్గిస్తుందని ఎన్ని ప్రభుత్వాలు గుర్తించాయి? ప్రాథమిక స్థాయిలో సరిసమానంగా బాలి కలు బడికి వెళ్లినా డిగ్రీ స్థాయికి 8 శాతంగా ఎందుకు ఆ నిష్పత్తి మారుతోంది. ఆపై విద్యకు వెళ్లేది కేవలం 3 శాతం. బాల్య వివాహాలు, పనులలో పెట్టడం, మూఢాచారాలు, కుల పంచాయితీలు వగైరాలు బాలికల చదువుకు ఆటం కాలు. వీటిని తొలగించేందుకు నిర్దిష్ట చర్యలేవి? వాటి ఫలితాల శాతం ఎంత? నినాదాల్లో ఉన్న తీవ్రత క్షేత్ర స్థాయి కార్యాచరణగా మారడంలో వైఫల్యం ఎందుకుంది?



ప్రపంచమంతటా అంతరాలు

చదువుకుని ఉద్యోగాలు చేసే అమ్మాయిల సంఖ్య బాగా పెరిగింది. రాజకీయ పార్టీల్లో నాయకత్వ స్థాయికి, ప్రజా ప్రతినిధులుగా స్థానిక సంస్థల్లో 50 శాతానికి మహిళలు చేరుకున్నారు. విధాన నిర్ణయాల్లో సైతం మహిళలపై హింస చర్చకు వస్తున్నది. కానీ యువతులలో మూడోవంతు కూడా ఉత్పత్తి రంగంలో నేరుగా కనిపించరు. గత మూడేళ్లలో గ్రామీణ ఉపాధిలో మహిళలు 35 శాతం నుంచి∙24 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 24 శాతం నుంచిl15 శాతానికి తగ్గిపోయారు. ప్రపంచవ్యాప్తంగా సగటున పురుషుల కంటే స్త్రీలు 24 శాతం తక్కువగా ఆదాయం పొందుతున్నారు. కానీ భారతదేశంలో ఆ అంతరం 40 నుంచి 65 శాతం ఉన్నది. పురుషుల కంటే రెండున్నర రెట్లు సమయం స్త్రీలు వేతన కూలితో పాటు వేతనం లభించని చాకిరీ చేస్తున్నారు. ఒక పక్కన ప్రపంచ సంపద అనంతంగా పెరుగుతున్నది. కానీ స్త్రీలకు ఆ సంపదలో భాగం లేదు.



భారత స్త్రీకి ప్రసూతి ఇప్పటికీ గండమే. కెనడా తల్లులతో పోలిస్తే ప్రసూతి సమయంలో మన స్త్రీలు  మరణించడానికి అవకాశం వందశాతం ఎక్కువ. 38 శాతం కాన్పులు నేటికీ శిక్షితులైన వైద్యుల సాయం లేకుండానే జరుగుతున్నాయి. ఆదివాసీలు, దళితులలో ఇది మరీ ఎక్కువ. మంచి ఉపాధి, సురక్షిత పని ప్రదేశాలు, నీరు, మరుగుదొడ్లు, శిశు సంరక్షణాల యాలు, పెన్షను, ఆరోగ్య సదుపాయం అనే కనీస హక్కులకు నోచని మహి ళలు ఇక్కడ 50 శాతం పైమాటే. సమాన అవకాశాలతో కొన్ని సామాజిక ఆర్థిక లక్ష్యాలు సాధించవచ్చు. అయితే ఆర్థికాభివృద్ధికి అనుసరించే మార్గాలన్నీ స్త్రీల సమానత్వానికి ఉపకరించవు. పైగా కొన్ని ఆర్థిక విధానాలు పనిలో అసమా నతలను పెంచి (అంటే ఇది స్త్రీల పని, ఇది పురుషుల పని అని విభజిం చడం), తద్వారా వేతన వ్యత్యాసాలను కొనసాగిస్తాయి. ఫలితంగా వేతన శ్రమకూ, వేతనం లేని చాకిరికి గల తేడాను బలపర్చి స్త్రీలను ఇంటిపనికే పరిమితం చేస్తాయి. దీనికి ఉదాహరణ ప్రస్తుతం మన దేశంలో అమల వుతున్న విధానాలే. స్త్రీలను అతి తక్కువ వేతనం చెల్లించే, నైపుణ్యం అంతగా అవసరం లేని పనులలో–భవన నిర్మాణ కార్మికులుగా, ఇటుక బట్టీలలో అడ్డాకూలీలుగా, ఇంటి పనివారిగా, పారిశుధ్య కార్మికులుగా; బీడీ, అగ రొత్తులు, అప్పడాలు వగైరా వంటివి తయారు చేయడం, బుట్టలు అల్లడం, గుండీలు కుట్టడం వంటి పనులకు పరిమితం చేస్తున్నారు. ఇక స్వయం సహాయక బృందాల మహిళలకు ఉపాధినిచ్చే నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చే పని రెండు తెలుగు రాష్ట్రాలలోను అరకొరగానే ఉంది. మానవ హక్కులు గీటు రాయిగా గల పర్యవేక్షణ వ్యవస్థలు లేకుండా ‘‘సాధికారత కల్పించాం’’ అని చెప్పుకునే ప్రకటనలలోని నిజాన్ని నిగ్గు తేల్చడం కష్టం.



చాలా సందర్భాలలో ఇటువంటి ఘనతలు పరిశీలనలో నిలబడవు. ఎలాగంటే స్వేచ్ఛా మార్కెట్‌ నినాదంతో చౌకగా శ్రమను అందిస్తామంటూ కార్పొరేట్లను ఆకర్షించాలన్న ఆత్రుతతో ఉన్న ప్రభుత్వాలు కార్మిక చట్టాలను, భద్రతా ప్రమాణాలను నీరు కారుస్తున్నాయి. లాభాపేక్షతో ప్రైవేటు కంపె నీలు అనుసరించే దోపిడీని ప్రశ్నించడానికి, న్యాయం పొందడానికి శ్రామిక మహిళలకు చట్టాలే ఆధారం. అటువంటి చట్టాలు కనీసం కాగితంపైన అయినా సమానత్వం నిలిపేందుకు కట్టుబడకపోతే స్త్రీల కనీస హక్కులకు హామీ ఎక్కడిది? పాతుకుపోయిన వివక్షా పూరిత భావనల వల్ల సమానత్వ చట్టాల అమలే కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో 498ఎతో సహా అన్ని చట్టా లకు తూట్లు పొడుస్తూ మరోవైపు స్త్రీలను రక్షించండి, ఆడపిల్లలను చదివిం చండి అని నినాదాలు ఇవ్వడం హాస్యాస్పదం.



స్త్రీలకు హక్కులు దక్కాలి

చట్టాల ద్వారా లభించే సూత్రప్రాయ సమానత క్షేత్రస్థాయిలో ఫలితంగా మారి కోట్లాది మంది స్త్రీల జీవితాలలో మార్పుకు నాంది పలకాలంటే ముందు సామాజికంగా అణచివేతకు గురైన తరగతుల వారికి వారసత్వంగా లభించిన ప్రతికూలతలను నిర్మూలించే దిశగా అడుగులు వేయాలి. అభివృద్ధి క్రమంలో చోటు దక్కని స్త్రీలకు ప్రాథమిక హక్కులు లభించాలి. దేశ ఆర్థిక విధానం సామాజిక న్యాయాన్ని, లైంగిక సమానత్వాన్ని సాధించే దిశలో అడుగువేయాలి. వ్యూహాత్మకంగా రచిస్తే సంక్షేమ పథకాలు ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి స్త్రీలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక ప్రతికూలతలను తొలగించాలి. అదే సమయంలో విధాన నిర్ణేతలు గమనించ వలసిన ప్రచారంలో ఉంచవలసిన ముఖ్య అంశాలు కూడా కొన్ని ఉన్నాయి.



మగవారు వేతనం లేని శ్రమను పంచుకున్నప్పుడే స్త్రీలు చేసే వేతన శ్రమలో సమానత్వానికి పునాది అవుతుంది. ఇంటిపని, పిల్లలూ వృద్ధుల సంరక్షణ వంటి వాటి వలన ఎంత నైపుణ్యం, సామర్థ్యం ఉన్నా స్త్రీలకు తగిన ఉద్యోగం, తగినంత జీతం లభించే, ఉపాధిని ఎంచుకునే అవకాశాలు తగ్గు తాయి. కాబట్టి ఈ చాకిరి తగ్గించే శిశు సంరక్షణా సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల కల్పన, సెలవులు వంటివి ఇస్తేనే వారు తమ శక్తిని పూర్తిగా వినిమయంలోకి తేగలరు. ఇంటా బయటా స్త్రీల శ్రమను తక్కువ చేసే ధోర ణులను నిరోధించే చర్యలు చేపట్టాలి. కార్మిక చట్టాలను అసంఘటిత రంగానికి కూడా వర్తింపు చేయాలి. శ్రమలో, ఉత్పత్తిలో స్త్రీల భాగస్వామ్యం ఎంత పెరిగితే అంతగా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.



అంతరాలు తగ్గితేనే ఆర్థికవృద్ధి

స్త్రీపురుషుల మధ్య అంతరం ఎంతగా తగ్గితే అంత వేగంగా వృద్ధి రేటు పెరు గుతుంది.  విద్యలో సమానావకాశాల ద్వారా కొన్ని దేశాలలో 50 శాతం ఎక్కు వగా ఆర్థికాభివృద్ధి జరిగింది. స్త్రీపురుషుల మధ్య ఉపాధి, వేతన వ్యత్యాసాలు తొలగిస్తే స్త్రీల ఆదాయం 76 శాతం, ప్రపంచ ఆదాయం 17 ట్రిలియన్‌ డాలర్లు పెరుగుతుంది. కాబట్టే ఐక్య రాజ్యసమితి మహిళా విభాగం స్త్రీల ఉపాధి, అన్నింటిలో సమానత్వం, సగం సగం భాగస్వామ్యం నినాదాన్ని ఇచ్చింది. ప్రపంచం దీనిని గుర్తిస్తుందో, లేదా అంతరాలను పెంచే కొద్దిమం దికే దోచిపెట్టే పాత విధానాలనే కొనసాగిస్తుందో వేచి చూడాలి. ఇంకా చెప్పా లంటే పాలకులు మహిళల సమస్యల పరిష్కారానికి సామరస్యంగా కదులు తారో, సమరానికి సన్నద్ధం కాక తప్పని స్థితిని కల్పిస్తారో కూడా చూడాలి.




- దేవి

వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త

ఈ–మెయిల్‌: pa-devi@rediffmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top