‘‘ఫెడెక్స్‌’’

‘‘ఫెడెక్స్‌’’


విశ్లేషణ

జీవన కాలమ్‌




ఆట అయ్యాక ఓడిన, అలిసిన చిలిచ్‌ భోరుమన్నాడు. గెలిచిన, చరిత్ర కారుడు ఫెడరర్‌ కూడా భోరుమన్నాడు. అలౌకికమైన ఆనందానికీ, అనిర్వచనీయమైన విషాదానికీ విముక్తి– కన్నీరే!



జీనియస్‌ల సౌందర్యం వర్ణనాతీతం. అది శరీరా నిది కాదు. అది ఒక తేజస్సు. అది శరీరానికి లొంగదు. ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌ని, చార్లెస్‌ డార్విన్‌ని చూస్తున్నప్పుడు వారి శారీ రక సౌందర్యం మనకి కని పించదు. మానవాళికి వారి మేధస్సు చేసిన ఉపకారం మన కళ్లను మిరుమిట్లు గొలుపుతుంది. ఏ విధంగా చూసినా సెరీనా విలి యమ్స్‌ అందగత్తె కాదు. కానీ 22 సార్లు ఈ ప్రపం చాన్ని దిగ్భ్రాంతుల్ని చేసిన ఆమె అఖండ ప్రతిభ ఆమెను అలౌకికమైన సౌందర్యరాశిగా మలుస్తాయి.



శ్రీశ్రీ, విశ్వనాథ అందగాళ్లుకాదు. కానీ మహా ప్రస్థానం, కల్పవృక్షం నేపథ్యం వారిని అఖండ తేజ స్వుల్ని చేస్తాయి. నిజానికి తెలుగు సాహిత్యానికి– నాకు తెలిసి –ఇద్దరే అందమైన రచయితలు. తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మ. ఈ మాట అంటూనే ఆవంత్స సోమసుందర్‌ని రన్నర్‌ అప్‌గా నిలుపుతు న్నాను. ఇవి సరదాగా చెప్పే మాటలు.



నిన్నటి వింబుల్డన్‌ పురుషుల ఫైనల్స్‌ ఒక చరిత్ర. ఒక విధంగా జాలిగొలిపే చరిత్ర. ఒక పక్క ప్రపంచంలో రికార్డ్‌ నెలకొలిపే చాంపియన్‌ నిలు వగా– ఎదురుగా ఎన్నో అవరోధాల్ని దాటి వచ్చిన 28 ఏళ్ల ఆటగాడు– మారిన్‌ చిలిచ్‌. ఒకపక్క ఒక చాంపియన్‌ దూసుకు వెళ్లడం తెలుస్తోంది. మరొక పక్క ఓ యువకుడు– అభిమన్యుడిలాగ నిస్సహా యంగా కూలిపోవడం తెలుస్తోంది. నాకు ఆట కాదు. చివర ఫెడరర్‌ అన్న మాట పతాక స్థాయిలో నిలుస్తుందనిపించింది: ‘‘ఒకొక్క  ప్పుడు ఇది క్రూరమైన విషయం. మారిన్‌ హీరో లాగా పోరాడాడు. మారిన్‌! నువ్వు గర్వపడే సమ యమిది. ఇది అపూర్వమైన టోర్నమెంటు. ఒకొక్క ప్పుడు ఫైనల్లో అధిగమించలేకపోవచ్చు’’ ఇది గెలి చిన చాంపియన్‌ ఓడిన కుర్రాడికి ఇచ్చిన కితాబు.



ఆ రోజుల్లో బోర్గ్‌ వరుసగా ఐదేళ్లు గెలి చినప్పుడు– ఇంగ్లండు ఒక నానుడిని మార్చుకుంది. ‘‘అసాధ్యమైన విషయాన్ని చెప్పడానికి ‘ఇది బియాండ్‌ బోర్గ్‌’ అని’ (బోర్గ్‌కే అసాధ్యమని చెప్పడం. అంటే ఎవరికీ సాధ్యం కాదని). తర్వాత చరిత్రలో క్రూరమైన శస్త్రచికిత్స చేసే ఆటగాడు– పీట్‌ శాంప్రాస్‌ వచ్చాడు. తర్వాత కనుబొమ్మలనయినా ఎగరేయకుండా దూసుకుపోయే ఫెడరర్‌ వచ్చాడు– చరిత్రను తిరగరాయడానికి. ఎనిమిదిసార్లు కప్పు గెలుచుకున్నాడు.



నేను వింబుల్డన్‌ సెంట్రల్‌ కోర్ట్‌ చూశాను. ఫెడ రర్‌ నడిచిన కారిడార్‌లో నడిచాను. అదొక మైకం. 18 కోట్ల 53 లక్షల డబ్బుని సొంతం చేసుకున్న ఫెడరర్‌– గత రెండువారాలలో– ఒక్క సెట్‌ కూడా ఓడిపోని 36 ఏళ్ల ఆటగాడికి వింబుల్డన్‌ ప్రసారాలు శుభాకాంక్షలు తెలుపుతూ– టీవీ స్క్రీన్‌ అంతా కని పించేలాగ ఒక పదాన్ని వేశాయి. ‘బిలీవ్‌’. అంతే కాదు. బిలీవ్‌లో ఎల్, ఐ ల స్థానంలో 19 అంకెను వేశాయి. ఇప్పటికి ఫెడరర్‌ 19 గ్రాండ్‌ స్లామ్‌ టైటి ళ్లను దక్కించుకున్నాడు. బిలీవ్‌. ఒకే మాట– తను సాధించగలననే ‘ఆత్మ విశ్వాసం’. అదీ చాంపియన్‌కి పెట్టుబడి. ఫెడరర్‌ పిల్లలు– నలుగురినీ చూపిస్తూ ఇంటర్వ్యూ చేసే అమ్మాయి అడిగింది: ‘‘మీ పిల్లలు ఈ విజయాలకి ఏమంటారు?’’ అని. ఫెడరర్‌ నవ్వాడు. ‘‘వాళ్లు చిన్నపిల్లలు. వాళ్లకి ఇదేమీ తెలి యదు. నాన్న ఓ ఆట ఆడుతున్నాడనుకుంటారు. పెద్దయ్యాక అర్థమౌతుంది’’ అన్నాడు.



ఆట అయ్యాక ఓడిన, అలిసిన చిలిచ్‌ భోరు మన్నాడు. గెలిచిన, చరిత్రకారుడు ఫెడరర్‌ కూడా భోరుమన్నాడు. అలౌకికమైన ఆనందానికీ, అనిర్వ చనీయమైన విషాదానికీ విముక్తి– కన్నీరే! కామెం టరీ చెప్తున్న బోరిస్‌ బెకర్‌ ఓ మాట అన్నాడు: ‘‘మారిన్‌ చిలిచ్‌ కృంగిపోనక్కరలేదు. ప్రపంచ టెన్నిస్‌ చరిత్రలో అగ్రస్థానంలో నిలిచిన ఓ గొప్ప ఆటగాడి ముందు– ప్రపంచంలోకెల్లా గొప్ప టెన్నిస్‌ కోర్టులో ఈనాటి అపజయం కూడా విజయమే’’.ఫెడరర్‌ వింబుల్డన్‌ కప్పుని అందుకోవడానికి వెళ్తున్నప్పుడు– కామెంటరీ చెప్పే వ్యక్తి అన్నాడు: ‘‘ఈ క్షణంలో ఫెడరర్‌ కాళ్లు నేలని తాకుతున్నాయో లేదో చూడాలని మీకూ అనిపిస్తుంది’’.



వింబుల్డన్‌ చాంపియన్‌షిప్‌ ఆఖరి పాయింట్‌ గెలవగానే నేలమీద కూలబడి దొర్లడం చూశాం. అది అనూహ్యమైన ఆనందానికి సంకేతం. నరాలు తెగి పోయే ఉత్కంఠకి విముక్తి. ఫెడరర్‌ లోగడ ఇలా ఆనందించడం చూశాం. కానీ ఈసారి ఫెడరర్‌ ఆ పని చెయ్యలేదు. చెయ్యాలనుకోలేదా? ఎందుకని? మొదటి బ్రేక్‌ పాయింట్‌కే ‘విశ్వాసం’ సడలి భోరు మన్న కుర్రాడిని, కాలి చర్మం చిట్లి 1974 నాటి కెన్‌ రోజ్‌వాల్‌ లాగ ఆట మధ్యలోనే నిష్క్రమించకుండా ధైర్యంగా మూడు సెట్లూ ఆడి ఓడిన కుర్రాడి సమ  క్షంలో విజయం– విర్రవీగేది కాదు. సంయమనంతో అందుకునేది. ఈ ప్రపంచ స్థాయి క్రీడల్లో నాకు కొట్టొచ్చినట్టు కనిపించేది–ఆటలో నైపుణ్యం పక్కన ఉంచగా– ఓడి పోయిన ఆటగాడి డిగ్నిటీ, గెలిచిన ఆటగాడి ఉదా త్తత. విజయం ఆ స్థాయిలో ఒక సంకేతం. వ్యక్తిత్వం ఆ క్షణాన్ని చిరస్మరణీయం చేస్తుంది.

గొల్లపూడి మారుతీరావు

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top