‘దావోస్‌’ తేల్చేదేమిటి?

‘దావోస్‌’ తేల్చేదేమిటి? - Sakshi


అమెరికా అధికార పగ్గాలు డోనాల్డ్‌ ట్రంప్‌ స్వీకరించబోతున్న పర్యవసానంగా ప్రపంచమంతటా ఏర్పడిన ఒక అయోమయ వాతావరణంలో ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాలు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రారంభమయ్యాయి. వివిధ దేశాల అధి నేతలు, రాజకీయ నేతలు, ప్రపంచ కుబేరులు, వివిధ రంగాల్లోని ప్రముఖులు ఈ వార్షిక సమావేశాలకు హాజరవుతున్నారు. సమావేశాల ముగింపు రోజైన 20వ తేదీన అమెరికాలో ట్రంప్‌ ఆ దేశ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. వాస్తవా నికి ఈ సమావేశాలు కొండంత ఉత్సాహంతో ప్రారంభం కావాల్సి ఉంది. ఎందుకంటే స్వల్ప స్థాయిలోనే కావొచ్చుగానీ... చాన్నాళ్ల తర్వాత ఈమధ్యే మార్కెట్ల నుంచి కాస్త అనుకూల వార్తలు వినిపిస్తున్నాయి. మార్కెట్లలో కదలిక వచ్చింది. స్టాక్‌ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. చమురు ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఏడాదిక్రితం వరకూ అందరినీ భయపెట్టిన చైనా ఆర్ధిక వ్యవస్థ మందగమనాన్ని తగ్గించుకుని చురుకందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదీగాక ఎప్పుడూ ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాల్లో పాల్గొనడానికి పెద్దగా ఉత్సాహం ప్రదర్శించని చైనా ఈసారి అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఆధ్వర్యంలో భారీ ప్రతినిధి బృందంతో హాజరవుతోంది. కానీ వీటన్నిటినీ ట్రంప్‌ పీడ తుడిచిపెట్టేసింది.  



నిజానికి ట్రంప్‌ వల్ల మాత్రమే కాదు... ఆయనను అధికార పీఠం వరకూ తీసుకెళ్లిన ధోరణులు ప్రపంచమంతటా కనబడటమే, అవి నానాటికీ బలపడుతుండటమే దావోస్‌ సద స్సును కలవరపరుస్తున్న ప్రధాన సమస్య. 47 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఏటా వార్షిక సమావేశాలను నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్ధిక వేదిక పన్నెండేళ్లనుంచి సమా వేశాలకు ముందు సర్వేలు జరుపుతోంది. అదేవిధంగా పలువురు ఆర్ధిక రంగ నిపు ణులు తమ తమ అధ్యయనాలను ప్రకటిస్తున్నారు. వీటన్నిటినీ సక్రమంగా అర్ధం చేసుకోవడంలో, పరిష్కారాలు వెదకడంలో ప్రపంచ ఆర్ధిక వేదిక విఫలమైంది. మౌలికంగా ప్రపంచ ఆర్ధిక వేదిక ఉన్నతశ్రేణి, సంపన్నవర్గాల ప్రయోజనాలకు, శ్రేయస్సుకు ప్రాతినిధ్యం వహించే సంస్థ.



ఎనిమిదేళ్లక్రితం ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్ధిక మాంద్యం ఇంకా సమసి పోలేదు. సంపన్నులకూ, నిరుపేదలకూ మధ్య అగాథం నానాటికీ పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. ఈ సంగతిని ప్రపంచ ఆర్ధిక వేదిక తాజా నివేదిక సైతం అంగీకరిస్తున్నది. దాని పర్యవసానంగా ప్రజానీకంలో అసంతృప్తి, ఆగ్రహావేశాలు పెరగడం...వాటిని ఆసరా చేసుకున్న పార్టీలు, వ్యక్తులు ప్రజామోదాన్ని పొందడం కళ్లముందు కనబడుతున్న వాస్తవం. పలుచోట్ల కొత్త పార్టీలు, రాజకీయాలకు కొత్త అయిన వ్యక్తులు సైతం జనాదరణలో ముందుంటున్నారు. అమెరికాలో ట్రంప్‌ విజయం సాధించడానికి ముందే బ్రిటన్‌ రిఫరెండంలో బ్రెగ్జిట్‌ వాదులు విజయం సాధించడం, అప్పటి ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ తప్పుకోవాల్సి రావడం తెలిసిందే.



ఇటలీలో సైతం రాజ్యాంగ సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నించిన ప్రధాని పదవినుంచి తప్పుకోవాల్సివచ్చింది. అక్కడ సైతం ఆర్ధిక సంక్షోభం, దాని పర్యవ సానంగా ఏర్పడిన పరిస్థితులే జనం అసంతృప్తికి కారణం. ‘ప్రపంచీకరణ కాదు... అమెరికాకే ప్రాధాన్యత’ నినాదంతో విజయం సాధించిన ట్రంప్‌ అంతర్జాతీయ ఒప్పందాలకు వ్యతిరేకంగనుక తన మద్దతుదార్లెవరినీ దావోస్‌ సదస్సుకు పంపడం లేదు. ఇంకా ఒబామా అధికారంలో ఉండబట్టి అమెరికా నుంచి అధికార బృందం వస్తున్నదిగానీ అందువల్ల ఒరిగేదేమీ లేదు. ఏతావాతా ఈసారి ప్రపంచీకరణ నినా దాన్ని కమ్యూనిస్టు చైనా నెత్తినెత్తుకున్నట్టు కనబడుతోంది.



వర్తమాన ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అనేకానేక సమస్యలపై చర్చించి, వాటి విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టవలసి ఉన్నదో నిర్ధారించడం దావోస్‌ సదస్సు అజెండా. ఆదాయాల్లో తీవ్ర వ్యత్యాసాలు, సంపద పంపిణీలో అసమతుల్యతలు అసంతృప్తిని రగిల్చిన పర్యవసానంగా కొత్త రాజకీయ ధోరణులు రంగ ప్రవేశం చేసి ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తున్నాయన్నది ఈ అంశాల్లో ప్రధానమైనది. అలాగే పర్యావరణానికి కలుగుతున్న ముప్పుపై కూడా సదస్సు సమీక్షిస్తుంది. సంపద పంపిణీ అవకతవకలు చక్కదిద్దకపోతే ఆయా దేశాల్లో సామాజిక సంఘీ భావం దెబ్బతినడం మాత్రమే కాదు... అంతిమంగా ప్రపంచ రాజకీయ, ఆర్ధిక సహకారం ధ్వంసమవుతుందని వేదిక అధ్యయనం భావిస్తోంది.  



సంపన్నులకూ, పేదలకూ మధ్య అంతరాలు పెరిగిపోవడం గురించి మాట్లాడేవారిని కమ్యూ నిస్టులుగా లేదా వారి అనుకూలురుగా ముద్రేయడం ప్రపంచంలో అన్నిచోట్లా ఉన్నదే. ఆ వాదనను ఖండించే పెట్టుబడిదారీ ప్రపంచం నుంచి ఇప్పుడు అదే తరహా మాటలు వినబడటం ఆశ్చర్యకరమే. కానీ ఎన్నికైన ప్రభుత్వాల విధానాలు చెల్లుబాటు కాకుండా చేసి, ఆ అధినేతల మాటలకు విలువ లేకుండా చేసింది తానేనని ప్రపంచ ఆర్ధిక వేదిక మరువకూడదు. బడుగు దేశాలపై అగ్రరాజ్యాల ద్వారా ఒత్తిళ్లు తెచ్చి అప్రజాస్వామికమైన పలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అమలు చేయించిందీ... సంపన్న ప్రపంచం మరింత బలపడటానికి, బడుగు దేశాలు బక్కచిక్కడానికి దోహదపడిందీ ఆ సంస్థే. ఈ విధానాలవల్ల సంపన్న దేశాల్లో సైతం వ్యత్యాసాలు పెరిగాయి. ఆక్స్‌ఫామ్‌ విడుదల చేసిన తాజా నివేదిక ఈ స్థితికి అద్దం పడుతుంది.



మన దేశంలోనే చూస్తే దేశ సంపదలో 58 శాతం కేవలం ఒక శాతం గుప్పెట్లో ఉంది. 84 మంది కుబేరుల వద్ద  24,800 కోట్ల డాలర్ల (సుమారు రూ. 16 లక్షల 87వేల కోట్లు) సంపద ఉన్నదని ఆ నివేదిక అంచనా. అంతర్జాతీయంగా చూస్తే కేవలం 8మంది వ్యక్తులు ప్రపంచ జనాభాలో సగభాగం సంపదను గుప్పెట్లో పెట్టుకున్నారని తేల్చింది. ప్రధాన స్రవంతి రాజకీయాలపై ఏహ్యభావం ఏర్పడ టానికి, జాత్యహంకార ధోరణులు పెరగడానికి ఈ అమానవీయ దోపిడీయే కారణ మవుతున్నదని ఆ నివేదిక తేల్చింది. ఇప్పటికైనా దావోస్‌ సదస్సు కళ్లు తెరిచి తన పాపాలను, వైఫల్యాలను అంగీకరిస్తుందా? సరైన పరిష్కారాలను అన్వేషిస్తుందా? నాలుగు రోజుల అనంతరం ఆ సంగతి తేలుతుంది.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top