ట్రంప్‌ వాచాలత

ట్రంప్‌ వాచాలత - Sakshi


డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పీఠమెక్కి తొమ్మిది నెలలు పూర్తి కావొస్తున్నది. కానీ ఆయన అధ్యక్ష ఎన్నికల ప్రచారంనాటి ఆహార్యాన్ని వదిలి పెట్టడానికి ససేమిరా అంటున్నారు. వేదిక ఏదన్న సంగతి మరచి తాను అమెరికా పౌరుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నట్టే భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ వేదికపై మంగళవారం ఆయన చేసిన ప్రసంగాన్ని గమనించినవారికి అవి బడాయి కబుర్లనిపిస్తే వారి తప్పు కాదు. కానీ అలా కొట్టిపారేయడానికి కూడా వీల్లేదు. ఎంతో బాధ్యతగా, ఆచితూచి మాట్లాడాల్సిన ఒక అగ్ర రాజ్యాధినేత సమితి వేదికపై అలా ఇష్టానుసారం ప్రసంగించడం, రెండున్నర కోట్లమంది జనాభా ఉన్న దేశాన్ని సర్వ నాశనం చేస్తానని బెదిరించడం సాధారణ విషయం కాదు.



సమితిలో ఇది డోనాల్డ్‌ట్రంప్‌ చేసిన తొలి ప్రసంగం. 41 నిమిషాలు కొనసాగిన ఆ ప్రసంగం నిండా అమెరికా ఎంత శక్తిమంతమైందో, దాని సైనిక పాటవం ఏపాటిదో, తల్చు కుంటే ఏం చేయగలదో ఏకరువు పెట్టడమే సరిపోయింది. ఆ తర్వాత ఉత్తర కొరియా, వెనిజులా, క్యూబా, ఇరాన్‌లపై విరుచుకుపడ్డారు. రష్యా తీరును తప్పు బట్టారు. నిజానికి ఇలాంటి మాటలన్నీ అమెరికా పౌరులకు చెబితే వారు సహజంగానే సంతోషపడతారు. ఎందుకంటే...ప్రపంచంలో ఎవరిమీదైనా, ఏమైనా మాట్లాడటం తమ హక్కని వారిలో చాలామంది నమ్ముతారు. కానీ సమితిలోఈ మాదిరి ప్రసంగం చేయడం దాని స్ఫూర్తికి, అది ప్రవచిస్తున్న మౌలిక విలు వలకూ, దౌత్య నిబంధనలకూ విరుద్ధం. ట్రంప్‌ ప్రసంగానికి ఒక్క ఇజ్రాయెల్‌ తప్ప మరెవరూ హర్షం వ్యక్తం చేయలేదంటేనే ఆప్రసంగం ఎలాంటిదో అర్ధం చేసు కోవచ్చు.



ప్రపంచంలో ఏ మూలనున్న దేశంతో సమస్య ఎదురైనా నేరుగా తేల్చు కుంటాం తప్ప ఐక్యరాజ్యసమితిని ఖాతరు చేయబోమని పరోక్షంగా కాదు... నేరుగానే ట్రంప్‌ చెప్పారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇంతకూ అమె రికానూ, దాని మిత్రదేశాలనూ బెదిరిస్తున్నది ఉత్తర కొరియా పౌరులు కాదు... నిండా మూడు పదుల వయసు నిండకుండానే ఆ దేశాధ్యక్ష పీఠం ఎక్కిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ట్రంప్‌లాగే కిమ్‌కి సైతం ముందూ మునుపూ అధికార పదవులు చేపట్టిన అనుభవం లేదు. అధ్యక్ష పీఠానికి కూడా కొత్త. ఇద్దరి మాటల తీరులోనూ పెద్దగా తేడా లేదు. పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరం గ్వామ్‌ ద్వీపాన్ని మధ్య శ్రేణి ఖండాంతర క్షిపణితో పేల్చేస్తానని గత నెలలో కిమ్‌ బెదిరించాడు. అమెరికా



నగరాలపైనా గురి పెడతామని హెచ్చరించాడు. నేర్పుతో, చాకచక్యంగా దౌత్యాన్ని నడిపితే కిమ్‌ నోటికి తాళం వేయడం కష్టమేమీ కాదు. అన్ని దేశాలనూ కూడగట్టి ఒత్తిళ్లు తీసుకొస్తే ఉత్తరకొరియా లొంగిరాక తప్పదు. ఎందుకంటే ఏ దేశమూ ప్రపంచంలో ఏకాకిగా బతకలేదు. ఎవరితోనూ సంబంధం లేకుండా ఎల్లకాలమూ మనుగడ సాగించలేదు. ఈ విషయంలో అమెరికాతో చేతులు కలిపి ఉత్తర కొరియాపై ఒత్తిళ్లు తీసుకొచ్చేందుకు భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌ సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి సమ యంలో హెచ్చరికలు జారీచేస్తే పరిస్థితి వికటించడం తప్పమరే ప్రయో జనమూ సిద్ధించదు. ట్రంప్‌ మాటలు విన్నాక యుద్ధం తప్ప తనకు గత్యంతరం లేదని కిమ్‌ తలిస్తే జరిగేదేమిటి? తన ప్రసంగంలో ట్రంప్‌ మరో చిత్రమైన ప్రతి పాదన చేశారు.



తమ తమ సార్వభౌమత్వాలను కాపాడుకోవడానికి, తమకు లాభదాయకమైన విధానాలు అవలంబించడానికి ఏ దేశానికి ఆ దేశం నిర్ణయం తీసుకోవచ్చునట! ఆయన తర్కం ప్రకారమైతే ఉత్తర కొరియాపై యుద్ధం చేయడం అమెరికాకు ‘లాభ దాయకం’. అలాంటి సమయంలో ఉత్తర కొరియాకు అండగా నిలవడం చైనాకు ‘లాభదాయకం’! ఇలా ఎవరికివారు తమ స్వీయ సార్వ భౌమత్వాల పరిరక్షణ కోసమని పరస్పర విరుద్ధమైన పోకడలకు పోతే ఈ ప్రపంచం ఏం కావాలి? మరి ఐక్యరాజ్యసమితి నిర్వహించే పాత్రేమిటి? సార్వ భౌమత్వానికి త్వరలో కొత్త నిర్వ చనం ఇస్తానని ట్రంప్‌ చెబుతున్నారు. అదెంత అందంగా ఉంటుందో చూడాల్సి ఉంది.



ఇదే సమితి సమావేశాల్లో శుక్రవారం ప్రసంగించడానికి ఉత్తర కొరియా ఎంపిక చేసిన ఆ దేశ విదేశాంగమంత్రి రి యోంగ్‌– హో ఉన్నంతలో మెరుగైన దౌత్యవేత్త. అనుభవశాలి. ప్రపంచ దేశాల మనోగతాన్ని కిమ్‌కి చేరేయగలిగిన వ్యక్తి. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో గత నెల జరిగిన ఒక సమావేశం సందర్భంగా చైనా, రష్యాలతో మాత్రమే కాదు... తమ ఆగర్భ శత్రు దేశం దక్షిణ కొరియా విదేశాంగమంత్రితో సైతం ఆయన మాట్లాడాడు. ఇలాంటి అవ కాశాలన్నిటినీ ఉపయోగించుకోవాలన్న స్పృహ ట్రంప్‌కు ఉండాలి. కనీసం ఆయన సలహాదార్లయినా ఆ సంగతి చెప్పాలి. ఒక్క ఉత్తరకొరియా విషయంలోనే కాదు...ఇరాన్, క్యూబా, వెనిజులా దేశాల గురించి కూడా ట్రంప్‌ ఈ మాదిరే మాట్లాడారు. ఇరాన్‌ ఆయన దృష్టిలో పెద్ద పిశాచం.



కానీ తనకుముందు అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్‌ ఒబామా ఆ దేశంతో అణు ఒప్పందం కుదు ర్చుకున్నారు. అనేక ఆంక్షల్ని సడలించారు. అది ట్రంప్‌కు నచ్చకపోతే ఆ సంగతి తన దేశ పౌరుల ముందూ, సెనేట్‌లోనూ చర్చకు పెట్టాలి. ఆ ఒప్పందాన్ని ఇరాన్‌ సక్రమంగా పాటిస్తున్నదో లేదో వచ్చే నెల 15న ట్రంప్‌ ధ్రువీకరించాల్సి ఉంటుంది. అది సరిగా లేదనుకుంటే అప్పుడు తాను చేయాల్సింది ఎటూ చేస్తారు. ఈలోగా దాన్ని ఖండిస్తూ సమితిలో మాట్లాడటం ఏం సబబు? అసలు ఒప్పం దానికి విరుద్ధంగా ఇరాన్‌ పోతున్న దాఖలాలు ఇంతవరకూ కనబడలేదు. అయి నప్పటికీ ఇష్టానుసారం చేస్తానంటే అది అమెరికావిశ్వసనీయతనే దెబ్బతీస్తుంది. ఇప్పటికే అమెరికా చేష్టల పర్యవసానంగా అఫ్ఘానిస్తాన్, ఇరాక్, సిరియా వగైరాలు శిథిలావస్థలో ఉన్నాయి. అందువల్ల అక్కడున్న ఇరుగుపొరుగు దేశాలు నానా కష్టాలు పడుతున్నాయి. ఉత్తర కొరియాపై కాలుదువ్వి ఆ పొరపాటే మళ్లీ చేయ రాదని అమెరికా గుర్తించాలి. లేనట్టయితే ప్రపంచ దేశాలన్నీ దానికా జ్ఞానోదయం కలిగించాలి.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top