కశ్మీర్‌ పరీక్ష!

కశ్మీర్‌ పరీక్ష! - Sakshi


ఉద్యమాలు చెలరేగినప్పుడూ, నిరసనలు మిన్నంటినప్పుడూ ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతుంది. నిత్యావసరాలు కూడా అందుబాటులో లేకపోవడంవల్ల జనం ఇబ్బందులు పడతారు. బయటికెళ్లినవారు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేవరకూ ప్రతి ఇల్లూ ఆందోళనతో ఉంటుంది. మూడున్నర నెలలుగా కల్లోలం నెలకొన్న కశ్మీర్‌ లోనూ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ ఎవరి పనో, ఎందుకలా చేస్తున్నారో తెలియకుండా గుర్తు తెలియని వ్యక్తులు విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని నిప్పెడుతుండటం అందరినీ కలవరపరుస్తోంది. ఈ మూడు నెలల్లోనూ ఆ రాష్ట్రంలో 30కిపైగా పాఠశాలలు అగ్నికి ఆహుతయ్యాయి.



వేలాదిమంది విద్యా ర్థులు చదువులకు దూరమై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ–బీజేపీ ప్రభుత్వం ఉన్నా లేనట్టే మిగిలిపోయింది. ఈ వరస దురంతాలకు కారకులెవరో ఆచూకీ పట్టలేక, అదుపు చేయలేక తన చేతగాని తనాన్ని నిరూపించుకుంటోంది. తగలబడిన విద్యాసంస్థల్లో అనంత్‌నాగ్‌లో ఉన్న 113 ఏళ్లనాటి పాఠశాల సైతం ఉంది.  కశ్మీర్‌లో కల్లోలం కొత్తగాదు. 2008, 2010 సంవత్సరాల్లో సైతం అక్కడ నెలల తరబడి మహోద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భాలున్నాయి. విద్యా సంస్థలు నెలల తరబడి మూతబడ్డాయి. కానీ వాటిని తగలబెట్టిన ఉదంతాలు ఎప్పుడూ లేవు.



మొన్న జూలైలో 22 ఏళ్ల యువకుడు బుర్హాన్‌ వనీని ఎన్‌కౌంటర్‌లో హత మార్చాక చెలరేగిన హింస ఇంతవరకూ అదుపులోకి రాలేదు. పోలీస్‌స్టేషన్లకూ, ప్రభుత్వ భవనాలకూ, వాహనాలకూ నిప్పెట్టడం అవిచ్ఛిన్నంగా సాగింది. నిరసన ప్రదర్శనలు, రాళ్లు రువ్వడం, పోలీసు కాల్పులు, కర్ఫ్యూ వగైరాలు అక్కడ నిత్య కృత్యమయ్యాయి. బుధవారం కూడా శ్రీనగర్‌తోసహా వివిధచోట్ల రాళ్లు రువ్వడం, బాష్పవాయు గోళాల ప్రయోగంలాంటి ఘటనల్లో వందమంది పౌరులు గాయ పడ్డారు. సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి సాగుతున్న ప్రయత్నాలు ఇంత వరకూ ఫలించలేదు. లోగడ ఢిల్లీనుంచి అఖిలపక్ష బృందం వెళ్లి ఆ రాష్ట్రంలో పర్యటించింది. అన్ని వర్గాలనూ కలిసింది. సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి సహకరించమని కోరింది. అయినా మారిందేమీ లేదు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు యశ్వంత్‌సిన్హా నాయకత్వంలో పౌర సమాజ బృందం వెళ్లింది. అయినా ఆశించిన ఫలితాలు రాలేదు. కనీసం విద్యాసంస్థల బంద్‌ను ఉపసంహరించుకోవాలని హురియత్‌లాంటి వేర్పాటువాద సంస్థలను కోరినా అవి ససేమిరా అంటున్నాయి.



భద్రతా బలగాల కాల్పుల్లో మృతుల సంఖ్య అంత కంతకూ పెరుగుతూనే ఉంది. పెల్లెట్‌లు, బాష్పవాయు గోళాలు, రబ్బర్‌ బుల్లెట్లు తగిలి గాయపడినవారితో ఆస్పత్రులు నిండుతున్నాయి. ఇంతవరకూ 92మంది మరణించగా, 13,000మంది పౌరులు క్షతగాత్రులయ్యారు. ఇద్దరు పోలీసులు చనిపోగా, నాలుగువేలమంది సిబ్బంది గాయపడ్డారు. కల్లోలం ప్రధానంగా దక్షిణ కశ్మీర్‌ జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నా ఇతర జిల్లాల్లో సైతం ఉద్రిక్తతలున్నాయి. నిజానికిది కశ్మీర్‌కు పరీక్షాకాలం. అంతర్గతంగా ఇలాంటి పరిస్థితులుంటే పాక్‌ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మన సైన్యం సర్జికల్‌ దాడులు నిర్వ హించాక పాక్‌ సేనలు కాల్పులు సాగిస్తుండటంతో సాంబా, రాజౌరి, పూంచ్, జమ్మూ సెక్టార్లలోని జిల్లాల్లో ఉన్న జనం బిక్కుబిక్కుంటూ రోజులు గడుపుతున్నారు. అక్కడ కూడా విద్యాసంస్థలు పనిచేయడం లేదు. మొత్తానికి కశ్మీర్‌ అన్ని విధాలా క్షతగాత్రగా మారి నెత్తురోడుతోంది.

 

మూడు నెలలుగా విద్యా సంస్థలు మూతబడటం, వాటిని దహనం చేస్తుండ టాన్ని నిరోధించలేని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో 10, 12 తరగతులకు పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. పరీక్షల నిర్వహణ అన్నది లాంఛనప్రాయమైన కార్యక్రమం కాదు. ఏడాది పొడవునా విద్యార్థులు ఏం అధ్యయనం చేశారో, వేర్వేరు పాఠ్యాంశాల్లో ఏమేరకు వారికి అవగాహన ఏర్పడిందో తెలుసుకోవడం, వాటిని బట్టి ర్యాంకులు నిర్ణయించడం పరీక్షల ఉద్దేశం. విద్యాసంస్థలు మూతబడి, తగలబడి... బోధన సాధ్యపడని స్థితిలో ఆ విద్యార్థులు నేర్చుకునేదేమిటి? వాటిని పరీక్షించడమేమిటి? జనజీవనం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు దాని ప్రభావం విద్యా ర్థులపైనా, ఉపాధ్యాయులపైనా కూడా ఉంటుంది. నిరవధిక కర్ఫ్యూ, నిరంతర హింస ఉన్నప్పుడు... వాటి ప్రభావం చుట్టూ కనిపిస్తున్నప్పుడు విద్యాసంస్థలు ఉన్నాయా, మూతబడ్డాయా అన్న సంగతి వదిలిపెట్టి అసలు ఇంట్లోనైనా ప్రశాం తంగా చదువుకోవడం సాధ్యమేనా? ఎందరో తల్లిదండ్రులు ఇప్పుడున్న స్థితిలో పిల్లల్ని బయటకు పంపడం మంచిది కాదని ఊరుకున్నారు. కర్ఫ్యూ, ఆందోళనలు వల్ల ఉపాధ్యాయులు సైతం బయటకు పోలేని పరిస్థితులున్నాయి.



పరీక్షల నిర్వహణ సమయం దగ్గరపడుతున్నదన్న ఉద్దేశంతో ప్రభుత్వం విద్యా సంస్థల్ని తెరిపించడానికి ఈమధ్యకాలంలో ప్రయత్నాలు చేసింది. అవి తెరుచు కుంటే నిరసనలు చల్లబడి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయన్న సంకేతాలు వెళ్తా యని భయపడి దుండగులు విద్యాసంస్థల్ని లక్ష్యంగా చేసుకున్నట్టు కనబడుతోంది. వారి ప్రయత్నాన్ని వమ్ముచేసి ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సిలబస్‌ అరకొరగా పూర్తయిన నేపథ్యంలో సరిగా రాయలేకపోతే, మార్కులు సరిగా రాకపోతే జాతీయ స్థాయి లోని నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లో విద్యార్థులు అనర్హులవుతారు.



వేర్వేరు రంగాల్లో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకున్న పిల్లలు తీవ్రంగా నష్టపో తారు. ముందు సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించి, విద్యాసంస్థలు తెరుచు కునేలా చూసి, భవనాలు ధ్వంసమైనపక్షంలో అక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. వచ్చే మూడు నెలలైనా చదువులు కొనసాగేలా చూస్తే ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వ హించవచ్చు. ఆ విషయంలో తొందరపాటుతో వ్యవహరిస్తే ఒక తరం నష్ట పోతుంది. దుండగులతో సమానంగా ప్రభుత్వం కూడా విద్యార్థులకు అన్యాయం చేసినట్టవుతుంది.

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top