బాబు భయోత్పాతం!

బాబు భయోత్పాతం! - Sakshi


చుట్టూ చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు అభిప్రాయాలనూ, భావోద్వే గాలనూ స్వేచ్ఛగా కలబోసుకునేవారిపై ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కక్ష పెంచుకుని వెంటాడుతోంది. అర్ధరాత్రి అరెస్టులు, లాకప్పులు, అక్రమ కేసుల బనాయింపుతో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. తమ నిర్వాకంపై నిప్పులు చెరిగే, నిలదీసే, వ్యంగ్యాస్త్రాలతో చీల్చి చెండాడేవారి నోరుమూయించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఫేస్‌బుక్‌లో ‘పొలిటికల్‌ పంచ్‌’ పేజీ నిర్వహిస్తున్న ఇంటూరి రవికిరణ్‌ను గత నెల 21 అర్ధరాత్రి తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసి రక రకాలచోట్లలో తిప్పి ప్రశ్నించి వదిలిపెట్టారు. తిరిగి ఈనెల 10న మరో కేసులో ప్రశ్నించాల్సి ఉన్నదని పిలిచి విశాఖ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు పాలనను విమర్శించే రవీందర్‌ అనే మరో యువకుణ్ణి బుధవారం బెంగళూరులో అమరావతి పోలీసులు అరెస్టు చేశారు. మరికొంతమంది నెటిజన్‌లకు పోలీసుల నుంచి తాఖీదులు అందుతున్నాయి.



వీటన్నిటి సారాంశమూ ఒకటే.. తన ప్రభుత్వ పనితీరును ఎండగడుతున్న, తన వంచనను బయటికీడుస్తున్న సామాజిక మాధ్యమ కార్యకర్తల్లో భయాందోళనలు సృష్టించడమే. పౌరులందరి భావ ప్రకటన స్వేచ్ఛకు పూచీపడుతున్న రాజ్యాం గంలోని 19(1) అధికరణానికి చంద్రబాబు సర్కారు తన చేష్టలతో తూట్లు పొడు స్తోంది. ప్రభుత్వాన్ని తన సొంత జాగీరుగా భావిస్తూ ఇష్టానుసారం వ్యవ హరి స్తోంది. ఈ పోకడలను పసిగట్టడం వల్లనే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్‌ కౌన్సిల్‌ మాజీ చైర్మన్‌ మార్కండేయ కట్జూ బాబు తీరును తీవ్రంగా ఖండించారు. అనాగరికంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ఆయన ప్రభుత్వాన్ని తక్షణం బర్తరఫ్‌ చేయాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలకు బుధ వారం రాసిన లేఖలో డిమాండ్‌ చేశారు. అక్షరంపై కత్తిగట్టి, అసమ్మతిపై ఆగ్ర హించి నాలుగు దశాబ్దాలక్రితం దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ఇందిరా గాంధీకి ఏ గతి పట్టిందో బాబు గుర్తు చేసుకోవాలి. అంతవరకూ అవసరం లేదు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన తొలి దఫా పాలన సర్వస్వం నియంతృత్వ పోకడలతో సాగినందువల్లనే మరో పదేళ్లపాటు విపక్షానికి పరిమితం కావాల్సివచ్చిందన్న సంగతైనా ఆయనకు స్ఫురించాలి. తాను మారిన మనిషనని నమ్మబలికినా... బీజేపీ, జనసేనలను వెంట తెచ్చుకున్నా, డబ్బులు కుమ్మరించినా స్వల్ప తేడాతో మాత్రమే పీఠం దక్కిన వైనాన్ని మరిచిపోకూడదు.



ఇప్పుడు సామాజిక మాధ్యమాలపై విరుచుకుపడుతున్న ఇదే చంద్రబాబు మూడేళ్లక్రితం ఎన్నికల సందర్భంగా ఆ మాధ్యమాలనే ఎంత విచ్చలవిడిగా విని యోగించారో అందరికీ తెలుసు. వదంతులు వ్యాపింపజేయడం, నీలాపనింద లేయడం, వ్యక్తిత్వహననానికి పాల్పడటం ఆయన పనే. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధి నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన మాత్రమే కాదు.. ఆయన కుటుంబంపై సైతం దారుణమైన ఆరోపణలు ప్రచారం చేశారు. ఆఖరికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డిని కూడా ఆయన బృందం వదల్లేదు. ఇవన్నీ టీడీపీ వెబ్‌సైట్‌లో ఈనాటికీ దర్శనమిస్తున్నాయి. అరెస్టయిన ఇద్దరు యువకులూ చేసింది అందులో శతాంశమైనా లేదు. తానూ, తన కుమారుడూ వివిధ వేదికలపై వల్లించే మతి మాలిన మాటల్ని ఎప్పటికప్పుడు బయటపెడుతున్నందుకూ... తన వంచనా శిల్పాన్ని లోకం ముందు పరుస్తున్నందుకూ బాబు నిప్పు తొక్కిన కోతిలా చిందు లేస్తున్నారు.



సామాజిక మాధ్యమాలు భావ వ్యక్తీకరణ విస్తృతిని పెంచి కోట్లాదిమందికి గొంతునిస్తున్నాయి. తమ కళ్లముందు జరిగే అన్యాయాలనూ, అక్రమాలనూ నిశ్చే ష్టులై చూసే పాత రోజులు పోయి వెనువెంటనే నిస్సంకోచంగా, నిర్భీతిగా, నిక్క చ్చిగా అభిప్రాయాన్ని చెప్పే స్థితి ఏర్పడింది. ఆ అభిప్రాయం ఆ క్షణంలోనే లోకాన్ని చుట్టేస్తోంది. దానిపై ఆ వెంటనే విమర్శలో, ప్రశంసలో వచ్చిపడు తున్నాయి. నెటిజన్‌ల అభిప్రాయం ఒక్కొక్కప్పుడు అంకుశం పెట్టి పొడిచినట్టు ఉండొచ్చు. పరువు బజారుకీడ్చినట్టు ఉండొచ్చు. వాటినుంచి తప్పించుకోవా లంటే ఒక్కటే మార్గం– నీతిబద్ధంగా, న్యాయంగా, పద్ధతిగా పాలించడం! ఆ పని బాబుకు చేతనవడం లేదు. నిత్యం తనను పొగడ్తలతో ముంచెత్తే భజన మీడియా అలవాటై చిన్న విమర్శను కూడా తట్టుకోలేని స్థితికి ఆయన చేరుకున్నారు. కానీ ఎంతమందిని అరెస్టు చేయగలరు? ఎందరి నోళ్లు మూయించగలరు? అందుకే ఒకరిని అరెస్టు చేస్తే వందలమంది భయపడాలన్నట్టు ఈ అరెస్టుల చుట్టూ కావలసినంత డ్రామాను అల్లుతున్నారు.



సాధారణంగా దొంగతనాలకూ, దోపిడీలకూ పాల్పడేవారు అర్ధరాత్రి దాటాక తమ పని మొదలెడతారని అంటారు. చంద్ర బాబు నాయుడు పోలీసులు కూడా సామాజిక మాధ్యమ కార్యకర్తలను అరెస్టు చేయడానికి ఈ ‘దొంగ ముహూర్తాన్నే’ ఎంచుకుంటున్నారు. పట్టపగలైతే చుట్టుపక్కలవారు గుమిగూడతారని, నిలదీస్తారని వారి భయం. పక్క రాష్ట్రాల్లో ఉంటున్నవారిని అరెస్టు చేసేటపుడు స్థానిక పోలీసులకు వర్తమానం ఇవ్వాలి. ఇద్దరు యువకుల విషయంలోనూ పోలీసులు దీన్ని బేఖాతరు చేశారు. రవి కిరణ్‌ది అయితే దాదాపు కిడ్నాప్‌గానే భావించాలి. బాబు మూడేళ్ల పాలనలో ఎన్నో కంతలున్నాయి. మూడు పంటలు పండే పొలాల్ని కబ్జా చేయడం మొద లుకొని పట్టిసీమ వరకూ రైతులకు చేసిందంతా అన్యాయమే. వాగ్దాన భంగాలకు లెక్కలేదు. మాఫియాల అరాచకాలకు అంతులేదు. వీటన్నిటినీ సామాజిక మాధ్య మాలు ఎప్పటికప్పుడు వేలెత్తి చూపుతున్నందుకే బాబు ఎక్కడలేని అసహనానికీ లోనవుతున్నారు. భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు బిగించాలని కలలు కంటున్నారు. ఇలాంటి పాలకులు ప్రజాస్వామ్యానికి చేటు. చంద్రబాబు తన పోక డలను మార్చుకునే వరకూ ప్రజాస్వామికవాదులు పోరాడాలి. సామాజిక మాధ్యమాల ద్వారా మరింత పదునైన వ్యాఖ్యలతో, కార్టూన్లతో ఆయనకు బుద్ధి చెప్పాలి.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top