Alexa
YSR
‘పారదర్శకతతో పథకాలు అమలు చేస్తే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందుతుంది’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వేదికకథ

సమాజ్‌వాదీ అంతర్యుద్ధం

Sakshi | Updated: January 03, 2017 00:00 (IST)
సమాజ్‌వాదీ అంతర్యుద్ధం

తాము అనుకున్నట్టే అంతా జరిగిందని భావించి సంబరపడిన సమాజ్‌వాదీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్, ఆయన అనుచరులకు కథ అడ్డం తిరిగిందని అర్ధమయ్యేసరికి కాలాతీతమైంది. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ తండ్రికి ఆదివారం ఇచ్చిన షాక్‌ చిన్నదేమీ కాదు. 24 గంటల క్రితం కంటతడి పెట్టినవాడే... నాన్నను మించి నాకెవరూ లేరని చెప్పినవాడే... పార్టీలో తిరిగి ప్రవేశించేందుకు మధ్యవర్తుల ద్వారా రాజీకి ప్రయత్నించినవాడే తన మనోభీష్టానికి భిన్నంగా పార్టీ జాతీయ సమావేశం నిర్వహించడం, జాతీయ అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడం ములాయంకు మింగుడు పడని వ్యవహారం. ఎత్తుగడలు వేయడంలో, ప్రత్యర్థులను ఊహించని దెబ్బతీయడంలో ములాయంను మించిన రాజకీయవేత్త దేశంలోనే ఉండరన్న ఖ్యాతి కాస్తా అఖిలేశ్‌ గెరిల్లా వ్యూహంతో గల్లంతైంది. ఇక ఇరు వర్గాలూ పార్టీ మాదంటే మాదని ఎన్నికల సంఘం(ఈసీ) ముందూ, ఆనక న్యాయస్థానంలోనూ ఎటూ పోరాడతాయి. ఇప్పుడున్న పరి స్థితుల్లో పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌ను స్తంభింపజేస్తారన్న రాజకీయ నిపుణుల అంచనా మాటెలా ఉన్నా... మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్న ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు మాత్రం కొత్త మలుపు తీసుకున్నాయి.

గత మూడు నెలలుగా సమాజ్‌వాదీ పార్టీలో ప్రత్యర్థి పక్షాలు బాహాటంగా కత్తులు దూసు కుంటున్న వైనాన్ని గమనిస్తున్నవారికి ఈ పరిణామాలేవీ వింతగొలపక పోవచ్చు. కానీ పార్టీగా పాతికేళ్ల ప్రస్థానం... పాలనలో విశేష అనుభవం... గత అయిదేళ్లుగా ప్రభుత్వ సారథ్యంలాంటి అనుకూలాంశాలున్న పార్టీ వాలకం అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకొచ్చిన తరుణంలో ఇలా ఉంటుందని ఎవరూ అనుకోరు. ఇందుకు అఖిలేశ్‌ కంటే ఆయన బాబాయి శివ్‌పాల్‌ యాదవ్, అమర్‌సింగ్‌లాంటి నేతలను తప్పుబట్టాలి. వారి వర్గంగా చలామణి అవుతూ యూపీలో అరాచకాలను సాగి స్తున్న మరికొందరు సమాజ్‌వాదీ నేతలను తప్పుబట్టాలి. వీటిని ఏదోమేరకు సరిదిద్దుతూ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్న అఖిలేశ్‌కు ఈ వర్గం ఆటంకాలు సృష్టిస్తూనే ఉంది. అయితే ఈ అయిదేళ్లూ వ్యక్తిగతంగా అఖిలేశ్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలూ రాకపోవడం ఆయనకున్న అనుకూలాంశం. ఈ సంక్షోభం తలెత్తాక పార్టీలో అత్యధిక ఎమ్మెల్యేలు అఖిలేశ్‌ వెనక నిలబడటానికి ప్రజల్లో... ముఖ్యంగా యువతలో ఆయన నాయకత్వంపట్ల, ఆయన పాలన పట్ల ఉన్న విశ్వాసమే కారణం. 2012లో అధికారంలోకొచ్చాక అఖిలేశ్‌ ప్రభుత్వం అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసింది. వాటిల్లో చాలాభాగం పూర్తి చేయగలిగింది.   
 
వాస్తవానికి పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్న ములాయం అఖిలేశ్‌కు అన్ని వర్గాల్లో లభిస్తున్న ఆదరణను గమనించి ఆయనకు మద్దతుగా నిలిచి ఉంటే... పార్టీకీ, ప్రభుత్వానికీ చెడ్డ పేరు తెస్తున్న శివ్‌పాల్‌ యాదవ్, అమర్‌సింగ్‌ అను చరగణాలను నియంత్రించి ఉంటే వేరుగా ఉండేది.  కానీ ములాయం అందుకు భిన్నంగా వ్యవహరించారు. శివ్‌పాల్‌ తదితరులను వెనకేసుకొచ్చి ఆత్మహత్యాసదృ శమైన తోవను ఎంచుకున్నారు. మూడు దశాబ్దాలక్రితం రాష్ట్రంలో వెనకబడిన కులా లను ఏకం చేసి, ముస్లింలలో విశ్వాసాన్ని పెంచి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ములాయం... ఆ వర్గాలు ఇప్పుడు అఖిలేశ్‌ అభివృద్ధి కార్యక్రమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయని, అవి ఫలవంతమైతే తమ బతుకులు మెరుగుపడతాయని భావిస్తున్నాయని గుర్తించలేకపోయారు. నిజానికి యూపీలో ములాయం సీఎంగా ఉన్న సందర్భాల్లోనే గరిష్టంగా మత కల్లోలాలు, గూండాయిజం ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో తనకున్న అపకీర్తి సంగతి ములాయంకు స్పష్టంగా తెలుసు. కుమారుడికి అటువంటి మకిలి అంటలేదని కూడా తెలుసు. అయినా ఆయన సక్రమంగా వ్యవహరించలేకపోయారు. తనను నమ్ముకున్న శివ్‌పాల్, అమ ర్‌సింగ్‌లకు అన్యాయం జరుగుతున్నదని భావించి అఖిలేశ్‌ను బహిరంగంగానే ఆయన మందలించిన సందర్భాలున్నాయి. కానీ అఖిలేశ్‌ ఎప్పుడూ తండ్రితో కల హానికి దిగలేదు. ఆయనతోనే శభాష్‌ అనిపించుకుంటామని బదులిస్తూ వచ్చారు. మొన్న అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో సైతం ములాయం హెచ్చరించారు. వీటన్నిటికీ పరాకాష్టగానే గత శుక్రవారం అఖిలేశ్‌నూ, ఆయనకు అండగా నిల బడిన తన సోదరుడు రాంగోపాల్‌ యాదవ్‌నూ ములాయం పార్టీ నుంచి బహి ష్కరించారు. ఇదంతా తాత్కాలికంగా సద్దుమణిగి తిరిగి పార్టీలోకి ప్రవేశించ గలిగినా అఖిలేశ్‌కు జరగబోయేదేమిటో తెలుసు. పార్టీలో ఇకపై తాను ద్వితీయ శ్రేణి నాయకుడిగా మిగలక తప్పదని, టిక్కెట్ల పంపిణీలో తన పాత్ర నామమాత్ర మవుతుందని ఆయనకు తేటతెల్లమైంది. ఇలాగైతే పార్టీకి విజయావకాశాలుండవని ఆయనకు అర్ధమైంది. అందుకే ఊహించని రీతిలో ప్రత్యర్థులపై పంజా విసిరారు.  
 

ఇంత చేసినా అఖిలేశ్‌ తన తండ్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చారు. ఆయనే పార్టీకి ఇప్పటికీ మార్గ నిర్దేశకుడని ప్రకటించారు. అఖిలేశ్‌ నిర్వహిస్తున్న జాతీయ సమావేశాలకు వెళ్లి తాడో పేడో తేల్చుకోవాలని ములాయం భావించినా, మిగిలిన వారు అడ్డుకోవడంతో ఆగిపోయారంటున్నారు. ఈ సందర్భంలో చంద్రబాబు టీడీపీని చీల్చి వైస్రాయ్‌ హోటల్‌లో ఎమ్మెల్యేలతో క్యాంప్‌ నిర్వహించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అక్కడికి వెళ్లడం, ఆయనపై బాబు చెప్పు లేయించడం అందరికీ జ్ఞాపకమొస్తుంది. ములాయం వెళ్తే ఏం జరిగి ఉండేదో గానీ... వైస్రాయ్‌ ఉదంతం మాత్రం పునరావృతమయ్యేది కాదని అఖిలేశ్‌ వ్యవ హార శైలి తెలిసినవారు అంటున్నారు. అందులో వాస్తవం ఉంది. ఏదేమైనా కుల, మతాల ప్రాబల్యం అధికంగా ఉండే యూపీలో అఖిలేశ్‌ విజేతగా నెగ్గుకురావడం అంత సులభమేమీ కాదు. ఒంటరిగా కాకుండా ఇతర పార్టీలతో పొత్తు కుదు ర్చుకుని జనం ముందుకెళ్తే, ఆ కూటమి ముస్లింలలో విశ్వాసాన్ని కలిగించగలిగితే మరోసారి అధికార పీఠం అఖిలేశ్‌ సొంతమవుతుంది. ఆ విషయంలో ఆయన ఎంతవరకూ కృతకృత్యులు కాగలరో చూడాలి.
 


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

డీప్‌..డీప్‌..డిప్రెషన్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC