‘నిర్భయ’ దోషులకు ఉరి

‘నిర్భయ’ దోషులకు ఉరి - Sakshi


అయిదేళ్లక్రితం దేశం మొత్తాన్ని తీవ్రంగా కుదిపేసిన నిర్భయ ఉదంతంలో దోషు లకు ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష ఖాయం చేయడం సరైందేనని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ కేసును అత్యంత అరుదైన ఉదంతంగా అభివర్ణించడంతోపాటు నేరస్తులపై కారుణ్యం చూపనవసరం లేదని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు. ఈ ఉదంతం అందరిలో ఆగ్రహాగ్ని రగిల్చింది. అప్పట్లో ఢిల్లీలో మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా అనేకచోట్ల రోజుల తరబడి సాగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వారంతా ముక్తకంఠంతో డిమాండ్‌ చేసింది ఒకే ఒక్కటి–ఆ దుర్మార్గులకు ఉరిశిక్ష పడాలని. నేర తీవ్రత అధికంగా ఉన్నదని వెల్లడైనప్పుడు సమాజంలో వెల్లువెత్తే ఆగ్రహావేశాలు ఆ స్థాయిలోనే ఉంటాయి. నిర్భయ ఉదంతంలో ఆ ఉన్మాదుల ప్రవర్తనను వర్ణించడానికి మాటలు చాలవు.



క్రూర మృగాలను తలపించే రీతి ప్రవర్తనతో అందరినీ వారు విస్మయపరిచారు. పారా మెడికల్‌ కోర్సు చదువుతూ స్నేహితుడితో కలిసి వెళ్లి ఇంటికొస్తున్న 23 ఏళ్ల యువతిపై దుండగులు కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించిందన్న ఆగ్రహంతో మరింత పాశవికంగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన ఆమె స్నేహితుణ్ణి కూడా తీవ్రంగా గాయపరిచారు. నెత్తురోడుతున్న ఆ ఇద్దరినీ ఒంటిపై దుస్తులు కూడా మిగల్చకుండా బస్సు నుంచి బయటకు నెట్టేశారు. ఆ నిశిరాతిరి వణికించే చలిలో వారిద్దరూ కొన్ని గంటలపాటు నరకం చవిచూశారు. మీడియాలో ఇదంతా వెల్లడయ్యాక పల్లెల నుంచి ఢిల్లీ వరకూ వేలాదిగా జనం రోడ్లపైకి వచ్చారు. ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ కేసులో ఒకడిని బాల నేరస్తుడిగా నిర్ధారించి మూడేళ్ల శిక్ష విధించినప్పుడు సైతం నిరసనలు పెల్లుబికాయి.



2013 సెప్టెంబర్‌లో నిందితులకు ఉరి శిక్ష విధించాక మిఠాయిలు పంచుకున్నారు. ఆ ఉదంతం సమా జాన్ని ఎంతగా కుదిపిందో ఇవన్నీ వెల్లడిస్తాయి. అందువల్లే ఆనాటి యూపీఏ ప్రభుత్వం జస్టిస్‌ జేఎస్‌ వర్మ నేతృత్వంలో వెనువెంటనే ముగ్గురు సభ్యుల కమిటీని నియమించి మహిళలపై జరిగే అఘాయిత్యాలకు అంతం పలికేందుకు ఎలాంటి చట్టం అవసరమో సూచించమని కోరింది. ఆ కమిటీ అసాధారణ రీతిలో పని చేసింది. వివిధ రంగాల నిపుణుల సాయంతో వివిధ వర్గాలనుంచి వచ్చిన సుమారు 80,000 సూచనలను క్రోడీకరించి చాలా స్వల్ప వ్యవధిలో ఆ కమిటీ నివేదిక సమర్పించింది. కేంద్రం కూడా అంతే వేగంతో స్పందించి తొలుత ఆర్డినె న్స్‌నూ, ఆ తర్వాత దాని స్థానంలో నిర్భయ చట్టాన్నీ తీసుకొచ్చింది.



నిర్భయ ఉదంతం సమాజంలోనూ, పాలకుల్లోనూ తీసుకొచ్చిన కదలికను చూసి చాలామంది సంతోషించారు. మన దేశంలో ఒక చట్టం తీసుకురావాలన్నా, ఉన్న చట్టంలో అవసరమైన మార్పులు చేయాలన్నా ఎన్నో ఏళ్లు పడుతుంది. అందుకు భిన్నంగా ప్రభుత్వం చురుగ్గా కదలడం వల్ల ఇకపై మహిళలపై సాగే నేరాలను తీవ్రంగా పరిగణిస్తారన్న ఆశ ఏర్పడింది. ఈ తరహా నేరాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కఠిన శిక్షల పరిధిలోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని అప్పట్లో ప్రభుత్వం కూడా చెప్పింది. అందుకు తగ్గట్టు నిర్భయ చట్టంలో అత్యాచారాలకు పాల్పడేవారికి గరిష్టంగా మరణశిక్ష విధించడంతోపాటు కనీసం పదేళ్ల కఠిన శిక్ష వేయాలని నిర్దేశించారు. అయితే ఆ చట్టం చేసి చేతులు దులుపుకోవడమే తప్ప ఆ మాదిరి నేరాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసు కోవాలన్న విషయంపై పాలకులు దృష్టి పెట్టలేదు.



ఎప్పటిలా అత్యాచారం ఆరోపణలొచ్చినప్పుడు కేసు పెట్టడంలో తాత్సారం చేయడం, నిందితులను పట్టు కోవడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం, బాధితులనూ, వారి కుటుంబ సభ్యులనూ రోజుల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పుకోవడం కొనసాగుతోంది. మహిళల వేషధా రణ గురించి, వారు ఇళ్లకే పరిమితం కావలసిన ఆవశ్యకత గురించి మతోద్ధారకు లుగా అవతారం ఎత్తినవారు మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, స్పీకర్ల వరకూ అందరికందరూ ఎప్పటిలాగే హితబోధలు చేస్తున్నారు. నిర్భయ ఘటనలో నేరస్తులకు ఉరిశిక్ష విధించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న కేంద్ర మంత్రులు, ఇతరులూ దీనికి ఏం సంజాయిషీ ఇస్తారు? ఒక నేరం జరిగినప్పుడు కారకులైనవారిని సత్వరం బంధించగలిగితే... వారిపై పకడ్బందీగా దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను సేకరించగలిగితే న్యాయస్థానాలు సైతం చురుగ్గా విచారించ డానికి, శిక్షలు విధించడానికి ఆస్కారం ఉంటుంది. వెనువెంటనే శిక్షించే విధానం అమలైతే నేరగాళ్లలో వణుకు పుడుతుంది. ఆడపిల్లల జోలికెళ్లాలంటే భయపడే పరిస్థితులుంటాయి. లైంగిక నేరాల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు, విచారణ ఎందుకు నత్తనడక నడుస్తున్నాయో ఏనాడూ దృష్టి పెట్టనివారంతా ఇప్పుడు  నిర్భయ ఉదంతంలో వెలువడిన తీర్పుతోనే అంతా మారిపోతుందన్నట్టు మాట్లా డుతున్నారు. తమ లోపాలను సరిదిద్దుకోవాలన్న ధ్యాస లేదు.



ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జస్టిస్‌ భానుమతి తెలిపిన వివరాల ప్రకారమే దేశంలో 2015లో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 3,27,394. అందులో అత్యాచారాలు 34,651, అత్యాచార యత్నాలు 4,437. నాలుగేళ్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ నేరాలు 43 శాతం పెరిగాయి.  నిందితులంతా మహిళలకు పరిచితులే. అయినా చాలా కేసుల్లో వారిని పట్టుకోవడంలో ఎంతో జాప్యం జరిగింది. నిర్భయ చట్టాన్ని తీసుకురావడంలో చూపిన వేగం దాన్ని అమలు చేయడంలో కనబడటం లేదని... సంబంధిత వ్యవస్థలు ఎప్పటిలా నిర్లక్ష్యధోరణిలోనే ఉంటున్నాయని ఈ గణాం కాలు చూస్తే బోధపడుతుంది. ఈ స్థితి మారాలి. ముఖ్యంగా మహిళలను కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న నేతలనూ, అలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్న ధోరణులనూ అదుపు చేయకుండా కిందిస్థాయి పోలీసుల్లో చైతన్యం తీసు కురావడం, వారిలో సున్నితత్వాన్ని పెంచడం సాధ్యం కాదు. ఆ దిశగా గట్టి ప్రయత్నం చేసినప్పుడే మహిళల్లో అభద్రత పోతుంది. అది నిర్భయకు నిజమైన నివాళి అవుతుంది.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top