చట్టం మంచిదే..అమలే కీలకం

చట్టం మంచిదే..అమలే కీలకం - Sakshi


పెద్ద నోట్ల రద్దు చర్య తర్వాత దేశంలో బినామీ ఆస్తుల భరతం పట్టడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. పార్లమెంటు సమావేశాల చివరిలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో, ముంబై తీరంలో శనివారం ఛత్రపతి శివాజీ మహరాజ్‌ భారీ స్మారక నిర్మాణానికి జలపూజ చేసిన సందర్భంగా, ఆ మర్నాడు ఆకాశవాణి ద్వారా ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మోదీ దీన్ని గురించి చెప్పారు. వాటికి కొనసాగింపుగా కేంద్ర ఆర్ధికమంత్రిత్వ శాఖ సోమవారం బినామీల ఆస్తుల స్వాధీనానికి సంసిద్ధమవుతున్నట్టు తెలిపింది. దేశంలో నల్లడబ్బు నిజానికి కరెన్సీ నోట్ల రూపంలో మాత్రమే లేదు. ఆ రూపంలో ఉన్న డబ్బు మొత్తంగా పన్నెండు శాతం మించదని ఆర్ధిక నిపుణులు లెక్కలేశారు. అధిక భాగం బినామీ ఆస్తుల రూపంలో రియల్‌ఎస్టేట్‌తోసహా వేర్వేరు రంగాల్లో చలామణిలో ఉన్నదని అంచనా వేశారు. అందవల్లే పెద్ద నోట్ల రద్దు వల్ల ఆశించిన ఫలితం నెర వేరదని ఆ నిపుణులు అభిప్రాయపడ్డారు. బ్యాంకుల వద్దకు చేరుతున్న పెద్ద నోట్ల లెక్క చూస్తుంటే వారి అంచనాలే సరైనవి కావొచ్చునన్న అభిప్రాయం కలుగు తోంది. ఈ నేపథ్యంలో బినామీ చట్టం నల్ల డబ్బు అంతు చూస్తుందన్న ఆశ అంద రిలో ఉంది.



బినామీ ఆస్తులపై 1988లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం తొలిసారి చట్టం తీసు కొచ్చింది. అయితే దానికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనల నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడంతో చట్టం అమల్లోకి రాలేదు. ఏతావాతా 28 ఏళ్లుగా అది నిరర్ధకంగా ఉండిపోయింది. అయితే యూపీఏ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకపోలేదు. 2011లో ఈ చట్టం దుమ్ము దులిపింది. ఆర్ధిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే స్థాయీ సంఘానికి నివేదించింది. బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి యశ్వంత్‌ సిన్హా నేతృత్వంలోని ఆ సంఘం బినామీ చట్టంలో విధానపరమైన అనేక లోపాలున్నాయని తేల్చింది. ముఖ్యంగా బినామీ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవచ్చునన్న నిబంధన పొందుపరిచినా ఆ చర్య తీసుకోవ డానికి ఎవరికి అధికారం ఉంటుంది... దానిపై అభ్యంతరాలున్నవారు ఆశ్రయించా ల్సిన యంత్రాంగం తీరుతెన్నులేమిటి వగైరా అంశాలేవీ లేవు. కనుకనే ఈ లోపా లను సవరించడంకంటే సమగ్రంగా ఒక కొత్త బిల్లు తీసుకురావడమే మేలని ఆనాటి సర్కారు భావించింది. దానికి అనుగుణంగా వచ్చిన బిల్లును 2011 ఆగస్టులో పార్ల మెంటులో ప్రవేశపెట్టారు కూడా. కానీ ఏనాడూ సక్రమంగా జరగని సమావేశాలు ఇతర బిల్లులతోపాటు దీన్ని కూడా సమాధి చేసేశాయి. తమ ప్రయోజనాలను నెరవేర్చే బిల్లుల్ని ఎంత గందరగోళంలోనైనా మూజువాణి ఓటుతో అవుననిపించు కునే పాలకపక్షాలు అందుకు భిన్నమైనవాటిని పట్టించుకోవు. మహిళా రిజర్వేషన్ల బిల్లు మొదలుకొని అనేక బిల్లులు అందువల్లే దశాబ్దాలు గడుస్తున్నా వెలుగు చూడ లేకపోతున్నాయి. బినామీ ఆస్తుల నిషేధం బిల్లు సైతం ఆ మాదిరే ఇన్నాళ్లుగా మూలనపడింది. అవినీతిపరులపై విరుచుకుపడటానికి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు, ఇతర పార్టీల ప్రభుత్వాలు సంసిద్ధం కాకపోవడమే ఇందుకు కారణమని నరేంద్ర మోదీ విమర్శించారుగానీ... ఆ మధ్యలో తమ పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు కూడా ఉన్నదని ఆయన మరిచారు.



ఇది అమలు కాకపోవడానికి ప్రధాన కారణం రాజకీయ సంకల్పం లేకపోవడ మేనని ఆయన చేసిన విమర్శలో వాస్తవం ఉంది. ఇప్పుడీ చట్టం పకడ్బందీగా అమలు చేస్తామని, అవినీతిపరుల భరతం పడతామని కేంద్రం చెబుతోంది. అయితే నేరుగా దేశంలోనూ, విదేశాల్లోనూ ఆస్తులు కూడబెట్టినవారు బ్యాంకులకు వేల కోట్లు ఎగేసినా చర్య తీసుకోవడానికి, అలాంటివారిని పట్టి బంధించడానికి  మీనమేషాలు లెక్కిస్తున్నవారు బినామీ ఆస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించ గలరా అన్న ప్రశ్న తలెత్తుతోంది. బినామీ ఆస్తుల వ్యవహారం అంత ఆషామాషీగా పూర్తయ్యేది కాదు. దానికి సమర్ధవంతమైన విస్తృతమైన యంత్రాంగం అవసరం ఉంటుంది. అంత సంఖ్యలో సిబ్బంది ఉండి పనిచేసినప్పుడు మాత్రమే అలాంటి ఆస్తుల గుర్తింపు, వాటి స్వాధీనం ప్రక్రియ సులభమవుతుంది. వాటిపై వెల్లువెత్తే అభ్యంతరాల సత్వర పరిష్కారానికి వీలవుతుంది. లేనిపక్షంలో ఈ మొత్తం ప్రక్రియ ఓ మేరకైనా పరిష్కారం కావడానికి, కొద్ది మొత్తంలోనైనా అలాంటి ఆస్తులు సర్కారు పరం కావడానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది. ఈ క్రమంలో నిజమైన హక్కు దారులు ఇబ్బంది పడకూడదు. ఉదాహరణకు పన్ను భారం తప్పించుకోవడానికి లేదా ప్రేమాభిమానాలతో మనవలు, మనవరాళ్ల పేరిట ఆస్తులు కొంటారు. అలా ఆస్తి కలిగినవారికి తగినంత సంపాదన లేదన్న కారణంతో ఈ చట్టంకింద స్వాధీనం చేసుకుంటే సమస్యలు తలెత్తుతాయి.



బినామీ ఆస్తులు పోగేసినట్టు రుజువైనా లేదా పవర్‌ ఆఫ్‌ అటార్నీ ముసుగులో వేరే వారిపేరిట ఆస్తుల్ని ఉంచినా అందుకు కారకులైనవారికి ఏడేళ్ల వరకూ కఠిన శిక్ష, ఆస్తికి సంబంధించిన మార్కెట్‌ విలువలో 25 శాతం వరకూ జరిమానా ఉంటుందని చట్టంలోని నిబంధన చెబుతోంది. నల్లడబ్బును తెల్లబరుచుకోవడానికి ఇతరుల ఖాతాల్లో వేసినా ఈ చట్టం కింద చర్య తీసుకుంటారు. బినామీ అన్నది స్థిరాస్తుల రూపంలోనే కాదు... షేర్లు, బంగారం, వ్యాపారం తదితర రూపాల్లో కూడా ఉంటుంది. అవన్నీ ఈ చట్టం పరిధిలోకొచ్చేలా చర్య తీసుకుంటే తప్ప నల్ల కుబేరుల జాతకాలు బయటపడవు. నిజానికి పెద్ద నోట్ల రద్దు చర్య కన్నా ముందు ఈ చట్ట ప్రయోగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే మేలు జరిగేదని నిపుణులంటారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత తగినంతగా కరెన్సీని చలామణిలో పెట్టకపోవడం వల్ల సాధారణ పౌరులు ఈనాటికీ చెప్పనలవిగాని ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క కొత్తగా ముద్రించిన రూ. 2,000 నోట్ల కట్టలు నల్ల కుబేరుల ఇళ్లలో, వారికి చెందిన దళారుల ఇళ్లలో భారీ మొత్తంలో పట్టుబడు తున్నాయి. బినామీ ఆస్తుల నిషేధ చట్టం అమలులో అలాంటి లోపాలు తలెత్త కుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top