Alexa
YSR
‘ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్య్రానికి అర్థం లేదు’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వేదికకథ

మండుతున్న మణిపూర్‌!

Sakshi | Updated: December 24, 2016 01:00 (IST)
మండుతున్న మణిపూర్‌!

మణిపూర్‌ మళ్లీ భగ్గుమంటోంది. రాష్ట్రంలో ఉన్న 9 జిల్లాలను 16కు పెంచుతూ ఈ నెల 9న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణం. ఇలాంటి నిర్ణయం తీసు కోబోతున్నదని తెలిసి నవంబర్‌ 2 నుంచే రాష్ట్రంలోని యునైటెడ్‌ నాగా కౌన్సిల్‌ (యూఎన్‌సీ) రోడ్ల దిగ్బంధం ఆందోళన ప్రారంభించింది. దీన్ని నిరసిస్తూ మణి పూర్‌లో మెజారిటీ తెగ మెయితీల ఆధ్వర్యంలో మరో ఆందోళన మొదలైంది. నాగాలు అధికంగా ఉండే ప్రాంతానికి నిత్యావసరాలు అందకుండా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఇలా ఆందోళనలు, ప్రత్యాందోళనలతో మణిపూర్‌ ప్రజానీకం ఊపి రాడని స్థితిలో పడ్డారు.

54 రోజులుగా గ్యాస్‌ మొదలుకొని నిత్యావసరాలేవీ లభ్యం కాక.. ఏం చేయాలో దిక్కుతోచక ఇబ్బందులు పడుతున్నారు. చర్చిలపై మొయితీల దాడులు చేస్తున్నారు. ఇరు వర్గాలూ బస్సులకూ, ఇతర వాహనాలకూ నిప్పం టిస్తున్నాయి. ఈ సమస్యలను పెద్ద నోట్ల రద్దు మరింతగా పెంచింది. మొత్తంగా అక్రమ వ్యాపారులు ఈ సమస్యలన్నిటినీ ఆసరా చేసుకుని నిత్యావస రాల ధరల్ని భారీగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తమకు వ్యతి రేకంగా ఉన్నాయని భావించిన తెగలు రోడ్డెక్కడం మణిపూర్‌లో సర్వసాధా రణం. ఆ తెగల పరిరక్షకులమని చెప్పుకునే సాయుధ గ్రూపులు తరచుగా హింసకు దిగడం, వారిని అరికట్టే పేరుతో భద్రతా బలగాలు చర్యలు తీసుకోవడం దీనికి అదనం.

మణిపూర్‌ అసెంబ్లీకి 2012లో జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలకూ 42 గెల్చుకుని వరసగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఇబోబీ సింగ్‌... వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అందుకోసమే ఈ వివా దాస్పద నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులంటున్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు సగభాగంగా ఉండి మణిపూర్‌ లోయలో అధికంగా నివసించే మొయితీలను మచ్చిక చేసుకుంటే గెలుపు సులభమవుతుందని ఆయననుకుంటున్నారు. జిల్లాల పునర్విభ జన నాగాలను కట్టడి చేయడానికి తోడ్పడుతుందని మొయితీలు విశ్వసిస్తున్నారు. మణిపూర్‌ లోయలో ప్రస్తుతం నాలుగు జిల్లాలుండగా... నాగాలు అధికంగా నివ సించే ఆదివాసీ కొండ ప్రాంతాల్లో అయిదు జిల్లాలున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఏడు జిల్లాల వల్ల నాగాలు అధికంగా నివసించే ఉఖ్రూల్, తామెంగ్లాంగ్, చందేల్, సేనాపతి  జిల్లాలు ప్రభావితమవుతున్నాయి. అక్కడ నాగా జనాభా తగ్గి మొయి తీల ప్రాబల్యం పెరుగుతోంది. తామున్న జిల్లాలతోపాటు అరుణాచల్, అసోంలోని నాగా ప్రాంతాలను నాగాలాండ్‌లో విలీనం చేసి విశాల ‘నాగాలిం’ను ఏర్పాటు చేయాలని తాము కోరుతుంటే... అందుకు భిన్నంగా ఇబోబీ సింగ్‌ మొయితీల ఆధిపత్యాన్ని ప్రతిష్టిస్తున్నారని నాగా సంస్థలు ఆరోపిస్తున్నాయి.

దేశంలో అమలవు తున్న చట్టాల ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో బయటివారు భూములు కొనలేరు. ఆ చట్టాలు మణిపూర్‌లోనూ అమలవుతాయి గనుక నాగాల జిల్లాల్లో మొయితీలైనా, మరొకరైనా భూములు కొనలేరు. అదే సమయంలో నాగాలు మాత్రం మణిపూర్‌ లోయలో నివసిస్తూ అక్కడ ఆస్తులు కూడబెట్టగలుగుతారు. ఇదే మొయితీలకు ఆదినుంచీ ఆగ్రహం కలిగిస్తోంది. తమకు సైతం అలాంటి రక్షణ కల్పించాలని నిరుడు ఆందోళనలకు దిగారు. వాస్తవానికి అసోంలో భాగంగా ఉన్నప్పుడు మణిపూర్‌ మొత్తానికి ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ వ్యవస్థ(ఐఎల్‌పీఎస్‌) కింద ఇలాంటి రక్షణ ఉండేదన్నది వారి వాదన. ఇది తిరిగి అమలు చేస్తే తమ ప్రాంతాల్లో ఆదివాసీలు స్థిరాస్తులు కొనలేరని వారు భావిస్తున్నారు. అయితే రాష్ట్రం ఆ పని చేయలేదు. అందుకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇబోబీ సింగ్‌ ఆ మాట చెప్పకుండా ఇలాంటి రక్షణలకు వీలయ్యే మూడు బిల్లుల్ని నిరుడు తీసుకొచ్చారు. వాటిపై ఆదివాసీలు ఆగ్రహించి దాదాపు ఆర్నెల్లపాటు రాష్ట్రాన్ని స్తంభింపజేశారు. పోలీసు కాల్పుల్లో పదిమంది పౌరులు చనిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు దగ్ధమయ్యాయి. అదింకా పూర్తిగా సమసిపోకముందే ఇప్పుడు ఈ జిల్లాల పునర్వి భజనను తలకెత్తుకున్నారు. ఫలితంగా మరోసారి హింస చెలరేగుతోంది.  

నిత్యం జాతుల వైరంతో అట్టుడికే మణిపూర్‌ వంటి రాష్ట్రంలో నిర్ణయాలు తీసు కునేటపుడు అత్యంత జాగురూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఇబోబీ సింగ్‌కే కావలసినన్ని అనుభవాలు ఉన్నాయి. తల బొప్పి కట్టిన సందర్భాలున్నాయి. అయినా ఆయన చేసిన తప్పే చేస్తున్నారు. ఎవరినీ సంప్రదించకుండా, ఎవరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోకుండా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో జిల్లాలను విభజించడం ఆయన పరిధిలో లేని అంశం. రాజ్యాంగంలోని 371సీ అధికరణకింద స్వయం ప్రతిపత్తిని అనుభవించే ఆదివాసీ ప్రాంతాలను కొండ ప్రాంత కమిటీ (హెచ్‌ఏసీ)లను సంప్రదించకుండా రాష్ట్ర అసెంబ్లీ ఎలాంటి చట్టాలనూ చేయడం సాధ్యం కాదు.

నిరుడు మూడు బిల్లుల్ని ఆమోదించినప్పుడుగానీ, ఇప్పుడు జిల్లాల పునర్విభజన సమయంలోగానీ ఇబోబీసింగ్‌ దీన్ని పాటించలేదు. ఇలాంటి చర్యలు న్యాయస్థానాల్లో ఎటూ వీగిపోతాయి. ఆ సంగతి తెలిసినా మొయితీ తెగను తానేదో ఉద్ధరించడానికి ప్రయత్నించినట్టు కనబడి వారి ఓట్లు కొల్లగొట్టాలని ఇబోబీ ఆలో చిస్తున్నారు తప్ప రాష్ట్రం తగలబడుతున్నదని గుర్తించడం లేదు. కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారు ఏర్పడ్డాక ముయివా నేతృత్వంలోని నాగా సంస్థతో ఒప్పందం కుదిరింది. ఇది నాగాల్లో బీజేపీ పట్టును పెంచింది. మొన్న జూన్‌లో ఇంఫాల్‌ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో తొలిసారి బీజేపీ కాంగ్రెస్‌కు దీటైన పోటీ ఇచ్చింది. ఆ పార్టీ 12 స్థానాలను గెలిస్తే బీజేపీ 10 గెల్చుకుంది. పొరుగునున్న నాగాలాండ్‌లో బలం పుంజుకుంటున్నది. ఇది కూడా ఇబోబీ భయాలను పెంచింది. పర్యవసానంగానే కొత్త జిల్లాల నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి తప్పుటడుగులు నాలుగు ఓట్లు సాధించిపెడతాయేమోగానీ.. ప్రజాజీవనానికి, శాంతిభద్రతలకు ముప్పు తెస్తాయి. ఇప్పటికైనా ఇబోబీ తన తప్పిదాలను సరిచేసుకుని ప్రశాంతతకు దోహద పడాలి. స్వప్రయోజనాలకు అతీతంగా వ్యవహరించాలి.


 


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Sakshi Post

Pakistan National Comes To TN By Boat From Sri Lanka, Held

The Pakistani national was produced before a magistrate and remanded to judicial custody.

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC