ఎడతెగని కీచులాట

ఎడతెగని కీచులాట - Sakshi


ప్రజాస్వామ్యంలో కీలక వ్యవస్థలు పరస్పరం తలపడటం... అది అంతూదరీ లేకుండా కొనసాగడం ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది. న్యాయమూర్తుల నియామకం వ్యవహారంలో కేంద్రానికీ, న్యాయ వ్యవస్థకూ మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం తీరు ఇలాగే ఉంది. కేంద్రంలో ఎవరున్నా ఇందులో మార్పుండటం లేదు. జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చాక దీని సంగతి తేల్చాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. గతంలో పనిచేసినవారు కేంద్రానికి ప్రతిపాదనలు పంపి ఊరుకునేవారు. సందర్భం వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేసేవారు. కానీ పురోగతి శూన్యం. అందుకే కాబోలు... పాతవారికి భిన్నంగా జస్టిస్‌ ఠాకూర్‌ కేంద్రాన్ని ‘ఎలాగైనా...’ ఒప్పించి తీరాలన్న దృక్పథాన్ని ప్రదర్శించడం మొదలెట్టారు. న్యాయమూర్తుల నియామకంపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంగా నాలుగైదు రోజుల క్రితం ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు అందులో భాగమే.



న్యాయమూర్తుల నియామకాలపై సాచివేత ధోరణి అవలంబించడం ద్వారా న్యాయవ్యవస్థను నిరోధించాలని చూస్తే... నాశనం చేయబూనుకుంటే చూస్తూ ఊరుకోబోమని కార్యనిర్వాహక వ్యవస్థను ఆయన హెచ్చరించారు. ‘మాకుగా మేం ఏ వ్యవస్థతోనూ ఘర్షణ పడాలని అనుకోవడం లేదు. కానీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని కూడా ఆయనన్నారు. జస్టిస్‌ ఠాకూర్‌ ఈ మాదిరి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటి సారి కాదు. గత మార్చిలో ప్రధాని, ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు పాల్గొన్న జాతీయ సదస్సులో ఏకంగా ఆయన కంటతడి పెట్టారు. మరో సందర్భంలో ‘మేం న్యాయపరంగా జోక్యం చేసుకునే స్థితి కల్పించకండి’ అని కేంద్రాన్ని హెచ్చరించారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఆ మాదిరే ఉన్నాయి.



సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠంపై ఉన్నవారు ఇలా మాట్లాడటం తగదని అభిప్రాయపడినవారున్నారు. సమస్య తీవ్రత నిజమే అయినా దాన్ని పరిష్క రించుకోవడానికి ఘర్షణ వైఖరి మంచిది కాదన్నవారున్నారు. ఆయన తీరుపై వ్యక్తమవుతున్న అభిప్రాయాల మాటెలా ఉన్నా న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత ఉండటం, కేసుల పరిష్కారానికి అదొక అడ్డంకిగా ఉండటం కాదనలేని సత్యం. అయిదేళ్లుగా వివిధ కోర్టుల్లో 80 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇందులో 16 లక్షలకు పైగా కేసులు వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌ పడితే, మిగిలినవి జిల్లా కోర్టుల్లో, సబార్డినేట్‌ కోర్టుల్లో కునుకు తీస్తున్నాయి. సుప్రీంకోర్టులో 27,184 కేసులు మూడేళ్లుగా ఎటూ తేల కుండా ఉన్నాయి. ఈ గణాంకాలన్నీ సమస్య తీవ్రతను సూచిస్తున్నాయి. లక్షలాది మంది పౌరుల జీవితాలు వీటితో ముడిపడి ఉన్నాయని... తుది నిర్ణయం కోసం వారంతా ఏళ్లతరబడి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారని సానుభూతితో అర్ధం చేసుకుంటే తప్ప ఈ పెండింగ్‌ సమస్య తీరదు.



అయితే పెండింగ్‌ కేసుల విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి చొరవా లేదని చెప్పలేం. ఇందుకు దోహదపడుతున్న పలు అంశాలను అది గుర్తించింది. న్యాయ మూర్తుల కొరత అందులో ఒకటి మాత్రమే. కేంద్ర, రాష్ట్ర చట్టాలు లెక్కకు మిక్కిలి ఉండటం వీటిలో ప్రధానమైనదని భావించింది. మొదటి అప్పీళ్లు పేరుకుపోవడం, అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌వంటివి వెలువరించే తీర్పులను హైకోర్టుల్లో సవాల్‌ చేసే ధోరణి పెరగడం, తరచుగా కేసుల వాయిదా, విచారణలో ఉన్న కేసుల తీరుతెన్ను లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే, ఏ స్థితిలో ఉన్నాయో ఆరా తీసే వ్యవస్థ అమల్లో లేకపోవడం వగైరాలు పెండింగ్‌కు ప్రధాన కారణమని భావించింది. లా కమిషన్‌ సైతం ఈ జాప్యాన్ని నివారించడానికి కొన్ని సూచనలు చేసింది. వీటన్నిటినీ లోతుగా సమీక్షించి తుది నిర్ణయానికి రావాలంటే రెండు వ్యవస్థలూ సదవగాహ నతో సమష్టిగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి ధోరణి ఇరువైపులా కనబ డటం లేదు. సుప్రీంకోర్టు, హెకోర్టుల్లో కేసులు పెండింగ్‌ పడిపోవడం గురించి మాట్లాడుతున్న న్యాయవ్యవస్థ కింది కోర్టుల్లో తెమలని కేసుల గురించి మాట్లా డదేమని కేంద్రం అడుగుతోంది. అది సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నే. కింది కోర్టుల్లో 5,000కు పైగా ఖాళీలున్నా న్యాయవ్యవస్థ వాటిని భర్తీ చేయలేక పోతోంది. ఇలా ఎవరికి వారు ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపుకుంటూ కాల క్షేపం చేయడంవల్ల సామాన్య పౌరులకు ఒరిగేదేమీ ఉండదు. వారికి కావలసింది సత్వర న్యాయం.



కేంద్రం తీసుకొచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌(ఎన్‌జేఏసీ) చట్టం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి గత నెలతో సంవత్సరం పూర్తయింది. అంతకుముందున్న కొలీజియం వ్యవస్థే ప్రస్తుతం అమలవుతోంది. కానీ దానికి అనుగుణంగా వెలువడాల్సిన విధాన పత్రం(ఎంఓపీ)పై పేచీ ఏర్పడింది. ఎంఓపీని ఖరారు చేసి పంపితే నియామకాలు వేగం పుంజుకుంటాయని ప్రభుత్వమూ... దాని సంగతి విడిచి పెట్టి ముందు నియామకాల సంగతి చూడమని సర్వోన్నత న్యాయస్థానమూ భీష్మించుకు కూర్చున్నాయి. ఆ విషయంలో కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య అంగీకారం కుదిరితే తప్ప నియామకాల్లో పురోగతి సాధ్యం కాదు. సమస్య తీవ్రతను గమనించి పాత ఎంఓపీ ఆధారంగా వివిధ హైకోర్టుల్లో కొత్తగా 86మంది న్యాయమూర్తుల నియామకం, ఇప్పుడున్న 121మంది అదనపు న్యాయ మూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా ఖరారు చేయడంవంటివి పూర్తి చేశా మని... ఎన్నాళ్లిలా నెట్టుకురావాలని కేంద్రం అడుగుతోంది. కానీ చేయాల్సిన నియామకాలతో పోలిస్తే పూర్తయింది చాలా స్వల్పమన్నది సుప్రీంకోర్టు వాదన. ఒక్క అలహాబాద్‌ హైకోర్టులోనే 160మంది న్యాయమూర్తులకు 77మంది మాత్రమే ఉన్నారని గుర్తు చేస్తోంది. ఇది వ్యక్తుల మధ్యనో, వ్యవస్థల మధ్యనో ఆధిపత్య పోరుగా, అహంభావ సమస్యగా మారడం మంచిది కాదు. ప్రజల శ్రేయస్సును, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించడం అవసరమని ఇద్దరూ గమనించాలి. సంయమనంతో పరిష్కారం దిశగా కదలాలి.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top