ఐరాస ప్రయాణం ఎటు?!

ఐరాస ప్రయాణం ఎటు?! - Sakshi


డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పదవి స్వీకరించాక వరసబెట్టి ధ్వంసించే సంస్థలు, వ్యవస్థలు ఏమేమిటో అమెరికాలో జాబితాలు రూపొందుతున్నాయి. వాటన్నిటినీ కాపాడుకో వడం ఎలాగన్నది ప్రస్తుతం అక్కడి పౌరులను వేధిస్తున్న సమస్య. ఈలోగా ఐక్య రాజ్యసమితి (ఐరాస) పనిబడతానని ప్రకటించి ప్రపంచ ప్రజానీకాన్ని ట్రంప్‌ హడ లెత్తిస్తున్నారు. ఫ్లారిడాలోని ఓ రిసార్ట్‌లో కులాసాగా గడుపుతూ ప్రస్తుతం ట్విటర్‌ ద్వారా ఆయన బాంబులు పేలుస్తున్నారు. ఐక్యరాజ్యసమితిపై విసుర్లు అందులో భాగమే. ఐరాస కొందరికి కాలక్షేపం క్లబ్‌గా, ఉల్లాసాన్ని పంచే వేదికగా మారిందని అనడమే కాదు... జనవరి 20 (తాను అధ్యక్ష పదవి స్వీకరించేరోజు) తర్వాత అది అలా ఉండదని కూడా ట్రంప్‌ సెలవిచ్చారు. ఆయనగారి తక్షణ ఆగ్రహానికి కారణం పాలస్తీనా భూభాగంలో అక్రమ ఆవాసాలను పెంచుకుంటూ పోతున్న ఇజ్రాయెల్‌ దుండ గీడుతనాన్ని అభిశంసిస్తూ సమితి భద్రతామండలి చేసిన తీర్మానమే.



ఐరాసపై ట్రంప్‌ మాదిరి అభిప్రాయాలు వ్యక్తం చేసినవారు అమెరికాలో చాలామంది ఉన్నారు. రిప బ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్షులుగా ఎన్నికైనవారి అభిప్రాయాలు ఏమైనా ఆ పార్టీ లోని సెనెటర్లు చాలామంది ఐరాసపై అక్కసు వెళ్లగక్కడంలో ఎప్పుడూ ముందుండే వారు. అది ‘తిన్నింటి వాసాలు లెక్కిస్తున్నద’ని, తమ దేశానికి అడుగడుగునా ఆటంకం కల్పిస్తున్నదని వారు విరుచుకుపడేవారు. న్యూయార్క్‌లోని సమితి ప్రధాన కార్యాలయానికి అయ్యే వ్యయంలో అత్యధిక శాతం (దాదాపు 22శాతం) డబ్బు తామే ఇస్తున్నామన్న అహంకారంతో మాట్లాడే మాటలవి.



నిరుడు షష్టిపూర్తి చేసుకున్నప్పుడు ఐక్యరాజ్యసమితి పనితీరుపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గోష్టులు జరిగాయి. సంక్షోభాలను ఎదుర్కొనడంలో, పరిస్థితిని చక్కదిద్దడంలో దాని పాత్ర... భవిష్యత్తు సవాళ్లకు దీటుగా అది రూపొందగల అవకాశాలపై విస్తృతమైన చర్చలు సాగాయి. అది ఆవిర్భవించిననాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు అంతర్జాతీయ శాంతికి, భద్రతకు ఎదురవుతున్న అవరోధాలు పూర్తిగా భిన్నమైనవని... వాటితో వ్యవహరించాలంటే మొత్తంగా దాని అవగాహ నలో, అమరికలో మార్పులు తప్పనిసరని చాలామంది భావించారు. అందులో వాస్తవముంది. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల సంఖ్యే ప్రారంభ దశతో పోలిస్తే నాలు గింతలైంది. 51 సభ్య దేశాలతో మొదలైన ఆ సంస్థలో ఇప్పుడు 193 దేశాలున్నాయి. వలస దోపిడీ రూపం మార్చుకుంది. ఎక్కడో ఖండాంతరాల్లో ఉండి, సైన్యాలను పంపి ఏ దేశాన్నయినా నియంత్రణలో పెట్టే పాత ధోరణిపోయి... తమ ప్రయో జనాలను నెరవేర్చగల స్థానికులను పీఠాలపై కూర్చుండబెట్టి, వారి ద్వారా తమ వ్యాపార వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి అనువైన చట్టాలను అమలు చేయిం చగల సత్తా అగ్రరాజ్యాలకు వచ్చింది. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్థల ద్వారా అప్పులిచ్చి, షరతులు పెట్టి ఏ దేశాన్నయినా చెప్పుచేతల్లో పెట్టుకోవడం ఎక్కువైంది. మరోపక్క ఉగ్రవాదులు, నేరగాళ్ల వంటి రాజ్యేతర శక్తుల ప్రవేశం, భారీయెత్తున విధ్వంసానికి పాల్పడగల వారి శక్తి ప్రపంచ భద్రతకు ముప్పు తెచ్చిపెడుతోంది.



అలాగే ఐరాస ఏర్పడిన 1945 సంవత్సరంలో ఊహకైనా అందని వాతావరణ మార్పులు, చాలా స్వల్పకాలంలోనే లక్షలాదిమందిని మింగేయగల అంటువ్యాధుల వంటివి ఇప్పుడు భూగోళాన్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా రెండో ప్రపంచయుద్ధం సృష్టించిన బీభత్స, భయానక వాతావరణాన్ని చక్కదిద్ది భవిష్యత్తులో తిరిగి అలాంటి దుస్థితి ఏర్పడకుండా ఉండేందుకు ఐరాస ఆవి ర్భవించినా అటువంటి ఉద్రిక్త పరిస్థితులు భూగోళంపై చాలాచోట్ల కొనసాగుతూనే ఉన్నాయి. రష్యాకు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలతో... చైనాకు అమెరికాతో కొనసాగుతున్న పొరపొచ్చాల మాట అటుంచి.. సిరియాలో అగ్రరాజ్యాలు సాగిస్తున్న చంపుడు పందెం, పర్యవసానంగా సాధారణ పౌరులు పిట్టల్లా రాలిపోవడం వంటి పరిణామాలు భీతిగొలుపుతున్నాయి.



నిస్సందేహంగా ఐరాస చేతగానితనమే ఇలాంటి దుస్థితికి దారితీసింది. అది లక్ష్యానికి ఆమడ దూరం జరిగి చాలా కాలమైందని... అణచివేతకు గురవుతున్న నిస్స హాయ దేశాల హక్కులను పరిరక్షించడంలో అది ఘోరంగా విఫలమైందని వర్ధమాన దేశాల నాయకులు తరచు ఆరోపిస్తుంటారు. చరిత్ర తిరగేస్తే ఇందుకు చాలా ఉదా హరణలుంటాయి. ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గిడియాన్‌ పోల్యా నాలుగేళ్లక్రితం ఆసక్తికరమైన అధ్యయనం చేశారు. అమెరికా ఆవిర్భావం నుంచీ అది స్వయంగా, ఇతరులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలను దురాక్రమించిందో... అందులో ఐరాస ఏర్పడ్డాక జరిగినవెన్నో సవివరమైన జాబితా విడుదల చేశారు. అమెరికా ఆవిర్భవించాక ఇప్పటివరకూ మొత్తంగా 71 దేశాల్లోకి అది చొరబడితే... అందులో ఐరాస ఏర్పడ్డాక జరిగినవి 50 ఉన్నాయని తేల్చారు. ఈ 50 దురాక్రమణల్లో 8 కోట్ల 20 లక్షలమంది మరణించారని, ఇవన్నీ నివారించదగ్గ మరణాలేనని ఆయన వివరించారు.



మరి ట్రంప్‌ ఆగ్రహం దేనికి? ఇవన్నీ పట్టకుండా అది కాలక్షేపం క్లబ్‌గా మిగి లిందని ఆయన చెప్పదల్చుకున్నారా? కాదు... ఐరాస చరిత్రలోనే తొలిసారి అమెరికా మిత్ర దేశం ఇజ్రాయెల్‌ చేసిన ఒక తప్పును తప్పుగా ఎత్తి చూపడమే అందుకు కారణం! వీటో చేయకపోవడం ద్వారా అలాంటి అవకాశం ఇచ్చింది కూడా అమెరి కాయే. దీన్నే ట్రంప్‌ సహించలేకపోతున్నారు. ఆయన ఎందుకన్నాడో గానీ ఐరాస పరాధీనగా, పరాన్నజీవిగా బతకడం ఇకనైనా చాలించాలి. ఒక దేశంపైనే అధికంగా ఆధారపడే విధానాన్ని మార్చుకోవాలి. లెక్కకు మించిన సిబ్బందిని తలకెత్తుకోవడం తగ్గించుకుని, దుర్వ్యయాన్ని అదుపు చేసుకోవాలి.



2016, 2017 సంవత్సరాలకు దాని బడ్జెట్‌ 540 కోట్ల డాలర్లు (సుమారు రూ. 37,000 కోట్లు). ఐరాస వ్యయాన్ని సభ్య దేశాలన్నీ సమానంగా భరించడం సాధ్యం కాదుగానీ... ఏ దేశమైనా పది శాతానికి మించి విరాళం ఇవ్వాల్సిన అవసరం లేకుండా నిబంధన విధించుకోవాలి. ఆ మేరకు ఖర్చు తగ్గించుకోవాలి. భద్రతామండలిని ప్రజాస్వామిక దృక్ఫథంతో పునర్నిర్మిం చాలి. కనీసం అప్పుడైనా స్వతంత్రంగా, నిర్భయంగా నిర్ణయం తీసుకునే సంస్థగా అది రూపొందుతుందేమో చూడాలి!

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top