Alexa
YSR
‘అన్నం పెట్టే రైతన్నను రుణ విముక్తుణ్ని చేయడమే నా ముందున్న లక్ష్యం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వేదికకథ

ఇకనైనా ‘జంగ్‌’ ఆగుతుందా?

Sakshi | Updated: December 23, 2016 00:19 (IST)
ఇకనైనా ‘జంగ్‌’ ఆగుతుందా?

ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రభుత్వంతో పోరాడుతూ తరచు వార్తల్లోకెక్కిన ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ హఠాత్తుగా పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమకు  ఈ సంగతి ముందు తెలియదని వైరి పక్షాలు ఆప్, బీజేపీ రెండూ చెబుతున్నాయి. నజీబ్‌ను  ఆప్‌ ప్రభుత్వమూ, పార్టీ ‘కేంద్రం ఏజెంట్‌’గానే చూశాయి. ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని పనిచేయకుండా అడు గడుగునా ఆయన అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపించాయి. ఒకటి రెండు సందర్భాల్లో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, నజీబ్‌ జంగ్‌ కరచాలనాలు చేసుకున్నా, చిరునవ్వులు చిందించుకున్నా అవి అక్కడితో ముగిసిపోయేవి. కొట్లాటలే నిరంతరం సాగేవి.

మన దేశంలో గవర్నర్‌ పదవి స్వభావమే అటువంటిది. రాజ్యాంగం ఏం చెప్పినా, పార్టీల అభిప్రాయాలు ఏమైనా... కేంద్రంలోని పాలకపక్షానికి భిన్నమైన పార్టీ రాష్ట్రాన్ని ఏలుతుంటే ఇలాంటి కీచులాటలు నిత్యకృత్య మవుతున్నాయి. అక్కడా, ఇక్కడా ఒకే పార్టీ అధికారంలో ఉన్నా... వేర్వేరు పార్టీలైన పక్షంలో సుహృద్భావ సంబంధాలున్నా ఈ గొడవలుండవు. కనుక గవర్నర్‌కూ, ఒక రాష్ట్ర సీఎంకూ  వైషమ్యాలు ఎందుకొస్తాయో సులభంగా అర్ధమవుతుంది. అంతకు ముందు గవర్నర్‌ వ్యవస్థను వ్యతిరేకించినవారు లేకపోలేదుగానీ... దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి ఆ పదవే ఉండరాదని గట్టిగా డిమాండ్‌ చేసిన వ్యక్తి స్వర్గీయ ఎన్‌టీ రామారావు. సీఎంగా ఉండి విదేశాలకు వెళ్లినప్పుడు తనను బర్తరఫ్‌ చేయడంపై ఆయన తీవ్రంగా ఆగ్రహించారు. విపక్షాలతో కలిసి ఉద్యమించి తన పదవిని తిరిగి కైవసం చేసుకున్నారు.

రాజకీయాలతో సంబంధంలేనివారిని గవర్నర్లుగా నియమించాలని చాన్నాళ్ల క్రితం సుప్రీంకోర్టు సూచించింది. మన దేశంలో ఎన్నికల్లో ఓడిన నేతలకూ, ఎన్నికల్లో నెగ్గలేని నేతలకూ గవర్నర్‌ పదవులు పునరావాస కేంద్రాలుగా మారా యని కటువుగా వ్యాఖ్యానించింది. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కా రియా కమిషన్‌ సైతం గవర్నర్‌ పదవికి ఎంపికయ్యేవారు రాజకీయాలకు సంబంధం లేనివారైతే మంచిదని అభిప్రాయపడింది. ఏదో ఒక రంగంలో నిష్ణాతులైన తటస్థ వ్యక్తులను ఎంపిక చేస్తే ఆ పదవికుండే ఔన్నత్యం నిల బడుతుందని చెప్పింది. యూపీఏ సర్కారు నియమించిన వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిషన్‌ కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేసింది. ఎవరు ఏం చెప్పినా గవర్నర్ల నియామకం తీరు మారలేదు. విపక్షంలో ఉండి నీతులు చెప్పినవారు అధికార పీఠం ఎక్కగానే తామూ అదే పని చేయడానికి వెరవడం లేదు. బీజేపీ నేతలు ప్రతిపక్షంలో ఉండగా గవర్నర్ల విషయంలో సుప్రీంకోర్టు, సర్కారియా, వీరప్పమొయిలీ కమిషన్ల అభిప్రాయాలు పట్టించుకోవాలని యూపీఏ ప్రభుత్వాన్ని కోరేవారు. తాము అధికారంలో కొచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించారు. గవర్నర్‌ పదవుల్లో ఉన్నవారిని తప్పించి ఆ స్థానాల్లో తమవారిని నియమించుకున్నారు. యూపీఏ సర్కారు తొలిసారి 2004లో అధికారంలోకొచ్చినప్పుడు కూడా ఇలాగే చేసింది.

సర్వం రాజకీయమయం అయినచోట ‘తటస్థ’ వ్యక్తులుంటారనుకోవడం అమాయకత్వమైనా కావాలి. లౌక్య మన్నా కావాలి. ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పుకుంటుంటే, ఐఏఎస్‌ అధికారిగా బాధ్యతల్లో తలమునకలై ఉంటే, సమాజసేవలో తరిస్తుంటే... అలాంటివారంతా అన్నిటికీ అతీతంగా ఉంటారనుకోవడం ఉత్త భ్రమ. అందుకు నజీబ్‌జంగే పెద్ద ఉదాహరణ. ఆయన మధ్యప్రదేశ్‌లో ఐఏఎస్‌ అధికారిగా, కేంద్రంలో జాయింట్‌ సెక్రటరీ హోదాలో పనిచేశారు. ఢిల్లీలోని జమియా మిలియా ఇస్లామియా యూని వర్సిటీ వైస్‌చాన్సలర్‌గా వ్యవహరించారు. అప్పటి యూపీఏ సర్కారు నజీబ్‌ జంగ్‌ను ఏరికోరి గవర్నర్‌ పదవికి ఎంపిక చేసింది. ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక గవర్నర్‌గా నియమించిన జ్యోతి రాజ్‌ఖోవా అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎన్ని డ్రామాలకు తెరలేపారో అందరికీ తెలుసు. చివరకు ఎన్‌డీఏ ప్రభుత్వమే ఆయన్ను తప్పు కోమని చెప్పినా రాజ్‌ఖోవా మొండికేశారు. మొన్న అక్టోబర్‌లో ఆయనకు ఉద్వాసన చెప్పాల్సివచ్చింది. రాజ్‌ఖోవా అసోంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైరయ్యారు. కనుక స్వభావ రీత్యా గవర్నర్‌ పదవి ‘అవసరమైతే’ జగడానికి సిద్ధంగా ఉండేవారికి మాత్రమే సరిపోతుంది.

తాను దేనికైనా సిద్ధమేనని ఈ మూడేళ్ల కాలంలో నజీబ్‌ జంగ్‌ రుజువు చేశారు. 2014 ఫిబ్రవరిలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం జన్‌లోక్‌పాల్‌ బిల్లు తీసుకొచ్చినప్పుడు వారిరువురి మధ్యా మొదలైన వివాదం తర్వాత విస్తరిస్తూ పోయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పది రోజులు సెలవులో వెళ్లినప్పుడు ఆయన స్థానంలో నియ మించాల్సిన అధికారిపై సైతం ఇద్దరి మధ్యా కీచులాటలు సాగాయి. నిజాయి తీపరుడిగా పేరున్న న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌(ఎన్‌డీఎంసీ) ఎస్టేట్‌ ఆఫీసర్‌ను మొన్న మే నెలలో దుండగులు కాల్చిచంపాక జంగ్‌పై ఆప్‌ సర్కారు నిప్పులు చెరిగింది. ఖాన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులందితే చర్య తీసుకోమంటూ అంతక్రితం జంగ్‌ ఆదేశాలివ్వడాన్ని కేజ్రీవాల్‌ తప్పుబట్టారు. ఆ కేసులో ప్రధాన నిందితుడు ఈ ఫిర్యాదీదారుల్లో ఒకరు.

ఢిల్లీకి లెఫ్టినెంట్‌ గవర్నరే పాలనాధికారని, ఇతరచోట్లలా ఆయన రాష్ట్ర కేబినెట్‌ చెప్పినట్టు వ్యవహరించనవసరం లేదని మొన్న ఆగస్టులో ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పాక జంగ్, కేజ్రీవాల్‌ మధ్య మరింత దూరం పెరిగింది. ఇంత కొరకరాని కొయ్యగా ఉన్నా జంగ్‌ 18 నెలల ముందే ఎందుకు తప్పుకోవా ల్సివచ్చింది? ఇది తన వ్యక్తిగతమైన నిర్ణయమని జంగ్‌ చెబుతున్నా అప్పుడే రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఆప్‌ ప్రభుత్వంతో ఇంతకంటే ‘కఠినంగా’ వ్యవహరించగలిగినవారిని కేంద్రం నియమించదల్చుకున్నదని కొందరంటున్నారు. అదే నిజమైతే నజీబ్‌ జంగ్‌ నిష్క్రమించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జంగ్‌ (యుద్ధం) ఆగదని అర్థమవుతోంది. ఇలాంటి వివాదాలు వ్యవస్థల్ని పలచన చేస్తాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి అవరోధాలవుతాయి. ఈ మాదిరి అప్రజాస్వామిక ధోరణులకు ఎంత త్వరగా స్వస్తి చెబితే అంత మంచిది.
 


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

'హోరు' గల్లు

Sakshi Post

JK Govt Bans All Social Media Platforms For One Month

The decision is taken to curb arsonists in the valley

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC