ఆర్భాటపు ఆర్డినెన్స్‌

ఆర్భాటపు ఆర్డినెన్స్‌ - Sakshi


భారత బ్యాంకింగ్‌ వ్యవస్థను పట్టిపీడిస్తున్న మొండి బకాయిల సమస్యకు పరి ష్కారంగా కేంద్ర ప్రభుత్వం గతవారం బ్యాంకింగ్‌ నియంత్రణ (సవరణ) ఆర్డినెన్స్‌–2017ను తెచ్చింది. మన బ్యాంకుల మొండి బకాయిలు లేదా నిష్క్రియాత్మక ఆస్తులు (ఎన్‌పీఏలు) దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరాయి. ఇంత భారీ ఎన్‌పీ ఏలు ఆర్థికవ్యవస్థలో రుణ లభ్యతను తగ్గించడం ద్వారా వృద్ధిపై ప్రతికూల ప్రభా వాన్ని నెరపుతున్నాయి. కేంద్రం తెచ్చిన తాజా ఆర్డినెన్స్, బ్యాంకులు వాటి మొండి బకాయిలను పరిష్కరించుకునేలా చేసే బాధ్యతను రిజర్వ్‌ బ్యాంకుకు అప్పగిం చింది. ఆర్‌బీఐ సమస్యాత్మకంగా మారిన మారుతున్న రుణాలను గుర్తించి, గత ఏడాది తెచ్చిన కొత్త దివాలా చట్టాన్ని అనుసరించి  బ్యాంకులు వాటిని ఎంతో ఒకింతకు పరిష్కరించుకునేలా చేయాల్సి ఉంటుంది. ఆ క్రమాన్ని పర్యవేక్షించే బాధ్యత కూడా ఆర్‌బీఐదే. ఈ దివాలా పరిష్కారాల్లో మొండి బకాయిదారుల రుణాల విలువను ఎంతకు తగ్గించుకుంటారో, దాన్ని ఎలా పుచ్చుకుని సరిపెట్టు కోవాలో రుణాలిచ్చిన బ్యాంకులే నిర్ణయించుకుంటాయి. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి తగిన చట్టపరమైన విధివిధానాలను రూపొందించామని ప్రభుత్వం చెబుతోంది.



ఆ విధివిధానాల  అమలును పర్యవే క్షించే బాధ్యతను ఆర్‌బీఐకి అప్పగించడం ద్వారా ఈ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా జాగ్రత్త వహించామని అంటోంది. కానీ ఆచరణలో ఇది,  కాగ్, సీవీసీల వంటి స్వతంత్ర సంస్థల తనిఖీలకు అతీతంగా బ్యాంకులు ఆర్‌బీఐ కమిటీల ఆమో దముద్రలతో తాము కోరుకున్న బకాయిదారుల రుణాలను పూర్తిగానో, పాక్షికం గానో మాఫీ చేయడానికి దారితీస్తుందనే విమర్శ వినవస్తోంది. అలాంటి అవకాశా లను నిరాకరించే ముందస్తు జాగ్రత్తలేవీ ఆర్డినెన్స్‌లో నిర్దిష్టంగా కనిపించవు. ఆ విమర్శ సంగతెలా ఉన్నా, ఈ ఆర్డినెన్స్‌ ఎన్‌పీఏల సమస్య పరిష్కారానికి ఏదో ఒక మేరకు తోడ్పడుతుందని, తద్వారా బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లను ప్రక్షాళన చేస్తుం దని చూడటానికి అనిపిస్తుంది. కానీ దశాబ్దాల తరబడి మన దేశ ద్రవ్య, బ్యాంకింగ్‌ రంగాల్లో నెలకొని ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే దీని ప్రభావం చాలా పరిమితమైనదే. అది కూడా ఇప్పటికి పోగుబడ్డ భారీ ఎన్‌పీఏల పరిష్కారానికే తప్ప, తిరిగి కొత్త మొండి బకాయిలు పుట్టిపెరిగి, పోగుబడకుండా అరికట్టలేదు. అసలా బాధ్యతనే అది పరిగణనలోకి తీసుకోలేదు.



మొండి బకాయిల వసూళ్ల నుంచి అన్ని మార్గాలను అనుసరించి బ్యాంకులు తమ ఎన్‌పీఏల భారాన్ని తగ్గించుకునేలా చేయాలని మునుపటి ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ గట్టి కృషి చేశారు. బ్యాంకులు ‘ఇకనైనా నిర్హేతుకంగా భారీ రుణాలను ఉదారంగా పందారం చేయడాన్ని మానుకోవాలి’ అంటూ ఆయన నిష్కర్షగా చేసిన హెచ్చరి కను ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనబడదు. మొండి బకాయిల పరిష్కారం బాధ్యతను ఆర్‌బీఐపై మోపిన ప్రభుత్వం అర్హతలేని, లాభదాయకంకాని, నిరర్థ కమైన ప్రాజెక్టులకు రుణాలను ఉదారంగా మంజూరు చేయకుండా బ్యాంకులపై ఆంక్షలను విధించే లేదా నిఘా ఉంచే అధికారాలను ఆర్‌బీఐకి ఇవ్వలేదు. మళ్లీ పదేళ్లకో, పదిహేనేళ్లకో ఇప్పటిలాగే ఎన్‌పీఏలు పేరుకుపోవనే హామీ ఏమిటి?



అన్నిటికి మించి ఎన్‌పీఏలుగా చర్చకు వస్తుండే ఈ మొండి బకాయిలన్నీ భారీ రుణాలే. వాటిలో ప్రధాన భాగం అధికారంలో ఉన్న ప్రభుత్వాల కనుసన్నల్లో నడుస్తూ రుణ అర్హత, లాభదాయకత తదితర ప్రమాణాలన్నిటికీ తిలోదకాలిచ్చి కోట్లకు కోట్లు రుణ పందారం చేసే ప్రభుత్వరంగ బ్యాంకులవే. ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో దాదాపు ఆరోవంతు సమస్యాత్మకమైనవేనని అంచనా. ఇందులో ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సంఖ్య తక్కువేం కాదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్‌పీఏలలో 21 శాతం లేదా రూ. 64,335 కోట్లు ఉద్దేశపూర్వక ఎగవేతదారులవేనని ఎన్‌పీఏలపై పార్లమెంటరీ కమిటీ గత ఏడాది ఫిబ్రవరిలో తేల్చిచెప్పింది.



రైతులు, ఉద్యోగుల వంటి సామాన్యులు రుణాలు చెల్లించకపోతే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలన్న తేడా లేకుండా బ్యాంకులన్నీ ఆస్తుల జప్తు నుంచి చట్టవిరుద్ధమైన బెదిరింపులు, దౌర్జన్యాల వరకు ఏ మార్గాన్నయినా నిస్సంకోచంగా అనుసరించడం పరిపాటి. అలాంటి రుణాలకు భిన్నంగా ఎన్‌పీఏలు ప్రధానంగా కార్పొరేట్, పారిశ్రామిక, వాణిజ్య, రియల్‌ ఎస్టేట్‌ తదితర రంగాలకు సంబంధించి నవి. ప్రభుత్వరంగ బ్యాంకులకు పది పెద్ద కార్పొరేట్‌ సంస్థలు బకాయిపడ్డ మొత్తమే రూ. 5.73 లక్షల కోట్లు. ఏ నిజమైన బ్యాంకరూ ఎంత మాత్రమూ అంగీ కరించలేని నష్టదాయకమైన ప్రాజెక్టులకు సైతం భారీ రుణాలను మంజూరు చేయించుకోగల శక్తి మన కార్పొరేట్‌ సంస్థలకు, కుబేరులకు, రాజకీయంగా పలుకు బడిగలవారికి ఉన్నదనేది బహిరంగ రహస్యమే. ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా ప్రజాధనాన్ని ఆశ్రితులకు కట్టబెట్టే రాజకీయ, అధికారస్వామ్య సంస్కృతికి అడ్డుకట్ట వేయకపోతే ఎన్‌పీఏల సమస్య పునరావృతమౌతూనే ఉంటుంది. దివాలా పరిష్కా రాల ‘హెయిర్‌కట్‌’లతో ప్రజాధనం లూటీకి చట్టబద్ధత లభిస్తూనే ఉంటుంది.



చైనా వృద్ధి మార్గాన్ని తరచు ఆదర్శంగా చెప్పే మన పాలకులు అది భారీ ఎన్‌పీఏల సమస్యను అధిగమించిన తీరును చూసి నేర్చుకోకపోవడం శోచనీయం.  2002 నాటికి చైనా బ్యాంకుల మొత్తం రుణాల్లో దాదాపు 30 శాతంగా ఉన్న  ఎన్‌పీ ఏలు, 2016 నాటికి 2 శాతానికి తగ్గిపోయాయి. మనలాగే ఆ ప్రభుత్వమూ ఎన్‌పీ ఏల విలువలను తిరిగి మదింపుచేసి, కుదించే పనిచేసింది. ప్రతి రుణ పరిష్కార ఒప్పందాన్ని పూర్తి పారదర్శకంగా వెల్లడించి ఉద్దేశపూర్వక ఎగవేతలకు దారులను మూసేసింది. అన్నిటికి మించి వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులకు ఇచ్చే రుణాల, వడ్డీల రాయితీలు, మాఫీల మొత్తాన్ని ప్రభుత్వమే భరించే ఏర్పాటును చేసింది. అందువల్లనే ఒక దశలో కుప్పకూలిపోతున్నదనిపించిన చైనా బ్యాంకింగ్‌ వ్యవస్థ  సుస్థిరంగా మనగలుగుతోంది. అలాంటి ఏర్పాటు జరిగితే తప్ప మన ప్రభుత్వా లకు ఉపాధి, ఉత్పాదకత, వృద్ధి, సంక్షేమం అనే కచ్చితమైన కొలమానాల ప్రాతిపదికపై రాయితీలను, మాఫీలను ప్రకటించే అలవాటు అబ్బదు. అప్పుడే బ్యాంకులు, ప్రభుత్వాల, పార్టీల చేతుల్లో పావులు కాకుండా ఉంటాయి.

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top