అఖిలేశ్‌ విజయపరంపర

అఖిలేశ్‌ విజయపరంపర - Sakshi


సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం ఏర్పడిననాటినుంచీ అత్యంత చాకచక్యంగా పావులు కదుపుతూ వరస విజయాలను సాధిస్తున్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ చివరకు పార్టీ గుర్తయిన సైకిల్‌ను కూడా సొంతం చేసుకుని తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎత్తుగడలు వేయడంలో, అనుకున్నది సాధించడంలో తండ్రిని మించిన తనయుణ్ణని రుజువు చేసుకున్నారు. మల్ల యోధుడు ములాయంసింగ్‌ కుమారుడు చేస్తున్న విన్యాసాల ముందు నిస్స హాయుడిగా మిగిలిపోయారు. ఈ నెల 1 నాటి వివాదాస్పద సమాజ్‌వాదీ జాతీయ సదస్సు పార్టీ నియమావళికి అనుగుణంగా జరిగిందా లేదా అన్న విచికిత్సలోకి పోకుండానే అత్యధికులు అఖిలేశ్‌ పక్షంలో ఉన్నారని ఎన్నికల సంఘం చేసిన నిర్ధారణతో ఆయన దిగ్భ్రాంతికి గురయి ఉంటారు.



పార్టీ గుర్తును అఖిలేశ్‌ పక్షానికిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్న ములాయం ప్రకటన పర్యవసానంగా అఖిలేశ్‌ వర్గం అక్కడ కేవియెట్‌ దాఖలు చేసింది. చిత్రమేమంటే ఇంతవరకూ వచ్చాక కూడా ఇరుపక్షాలూ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను ఇంకా అయోమయంలోనే ఉంచు తున్నారు. పార్టీ గుర్తు సొంతమైనట్టు తెలిశాక తన ఆశీస్సుల కోసం వచ్చిన అఖిలేశ్‌ను ములాయం ఆశీర్వదించడం... ఎన్నికల్లో గెలిచి వచ్చి మీ ఆదేశాను సారం పనిచేస్తానని అఖిలేశ్‌ అనడం వారిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు నా జాబితాలోనూ, మా నాన్న జాబితాలోనూ 90 శాతంమంది పేర్లు ఒకటేనని అఖిలేశ్‌ అనడం...శివ్‌పాల్‌ను కూడా అందులో కలుపుకోమని ములాయం చెప్పడం దాన్ని మరింత పెంచింది. ఈ సుహృద్భావానికి సమాంతరంగా పరస్పర సవాళ్లు కూడా వినబడుతున్నాయి. అఖిలేశ్‌ ముస్లిం వ్యతిరేకి అని ములాయం అనడం ఇలాంటిదే.



తండ్రీకొడుకులిద్దరికీ నిజానికి ఒకరిపై ఒకరికి బద్ధ శత్రుత్వం లేదు. అవతలి వారిని నడిపిస్తున్నవారిపైనే వారిద్దరికీ ఆగ్రహం. ములాయంకు అఖిలేశ్‌ను నడి పిస్తున్న తన సోదరుడు రాంగోపాల్‌ యాదవ్‌ అంటే కోపం. అఖిలేశ్‌కు తండ్రి వెనకున్న బాబాయ్‌ శివ్‌పాల్‌ యాదవ్‌ అంటే మంట. రాంగోపాల్‌ వలే శివ్‌పాల్‌ కూడా ములాయంకు సోదరుడే. ఇలా కావలసినవారి మధ్య పొరపొచ్చాలు ఏర్పడటం...వాటిని బాహాటంగా వ్యక్తం చేయలేకపోవడం పర్యవసానంగా బయటి వ్యక్తులైన అమర్‌సింగ్‌ లాంటివారు లక్ష్యమవుతున్నారు. యాదృచ్ఛికంగా అమర్‌సింగ్‌తోసహా ములాయం పక్షాన ఉన్న నాయకులంతా అధికార దుర్విని యోగంలో ఆరితేరినవారుగా, పవర్‌ బ్రోకర్లుగా పేరుబడ్డవారు.



ములాయం, అఖి లేశ్‌లు కత్తులు నూరుకుంటూనే, రాజీ యత్నాలు చేస్తూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకున్నారు. సైకిల్‌ గుర్తు రాకపోతే మోటార్‌ సైకిల్‌ గుర్తును ఖరారు చేసుకుందామని అఖిలేశ్‌ అనుకుంటే...జనతాదళ్‌ గుర్తయిన నాగలి పట్టిన రైతును సొంతం చేసుకోవచ్చునన్న ఆలోచనలు ములాయం వర్గం చేసింది. నిరక్షరాస్యత, రాజకీయ అవగాహన తక్కువగా ఉండే మనలాంటి దేశంలో ప్రజల్లో నాటుకు పోయిన గుర్తు సొంతం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం తక్కువేమీ కాదు. ఈ మొత్తం వ్యవహారమంతా తండ్రీకొడుకులిద్దరూ సాగిస్తున్న నాటకమని బలంగా విశ్వసించేవారు లేకపోలేదు.  నాటకమైనా కాకపోయినా ఉత్తరప్రదేశ్‌లో మాత్రం అది ప్రస్తుతం బ్రహ్మాండంగా రక్తి కడుతోంది. అందరి దృష్టీ సమాజ్‌వాదీ శిబి రంలోని పరిణామాలపైనే కేంద్రీకృతమై విజయం తథ్యమని మొదట్లో విశ్వసించిన బీఎస్‌పీనీ, బీజేపీనీ వెలవెలబోయేలా చేస్తున్నది.



అఖిలేశ్, ములాయం సంబంధాలు రాగలరోజుల్లో ఎలా ఉంటాయి... బరి లోకి ములాయం ఏ పార్టీ పేరుతో, ఏ గుర్తుతో దిగుతారన్న ప్రశ్నలకంటే అఖి లేశ్‌ తదుపరి ఎత్తుగడలపైనే ఇప్పుడందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాంగ్రెస్‌తో, అజిత్‌సింగ్‌ నేతృత్వంలోని ఆర్‌ఎల్‌డీతో పొత్తు పెట్టుకుని రంగంలోకొస్తే ప్రధాన వర్గమైన ముస్లింలలో ఆ కూటమి విశ్వసనీయత సాధించగలదన్న అంచనాలు విన బడుతున్నాయి. వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లో అమేథీ, రాయ్‌బరేలీ నియో జకవర్గాల వెలుపల కాంగ్రెస్‌ ప్రభావం లేదు. అలాగే ఆర్‌ఎల్‌డీకి జాట్‌లు అధి కంగా ఉండే ఉత్తరప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో పలుకుబడి ఉంది. వెలుపల అది చెప్పుకోదగ్గ శక్తి కాదు. ఇలా ఈ రెండు పార్టీలకూ పరిమితులున్నా ముగ్గురూ కలిస్తే ప్రజానీకంలో కలిగించే ప్రభావం వేరు. అది సాకారమయ్యేపక్షంలో బీఎస్‌పీ నుంచి బయటికొచ్చి భారతీయ సమాజ్‌ పార్టీ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్న బీసీ నేత రాజ్‌భర్‌ కూటమివైపు మొగ్గు చూపొచ్చు. ఈమధ్య వరకూ రాజ్‌భర్‌ అమిత్‌షాకు సన్నిహితంగా మెలిగారు.



వాస్తవానికి ములాయం–అఖిలేశ్‌ యుద్ధంలో సమాజ్‌వాదీ శ్రేణులు వీధిన బడి కొట్టుకుంటాయని... పర్యవసానంగా పార్టీ అంతరిస్తుందని బీజేపీ ఆశిం చింది. అఖిలేశ్‌ తండ్రిపై నోరు పారేసుకుని లోగుట్టును రచ్చకీడ్చినా... ములా యం కొడుకును దూషిస్తూ వీధికెక్కినా అదే జరిగేది.  కానీ తన ప్రయోజనాల కోసం చేయాల్సింది చేస్తూనే తండ్రిని, బాబాయ్‌ని అఖిలేశ్‌ పల్లెత్తుమాట అన లేదు. దివంగత నేత, తన మామ ఎన్టీఆర్‌ నుంచి అధికారాన్ని గుంజుకున్నప్పుడు ఆయనపై చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా ద్వారా ఎలాంటి ప్రచారాలు చేయించారో, ఎన్టీఆర్‌ స్వయంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు బస చేసిన వైస్రాయ్‌ హోటల్‌కు వస్తే చెప్పులేయించడంతోసహా ఎలాంటి పాపాలకు ఒడిగట్టారో ఎవరూ మరిచిపోరు.



ఉత్తరప్రదేశ్‌ సంక్షోభం వెనక అఖిలేశ్‌  సవతి తల్లి ఉన్నదన్న కథనాలు గుప్పుమంటున్నా అఖిలేశ్‌ ఎంత హుందాగా వ్యవ హరిస్తున్నారో, తండ్రి గౌరవానికి భంగం రానీయని పద్ధతిలో ఎలా నడు చుకుంటున్నారో గమనించాలి. అయిదేళ్ల పాలనలో ఎలాంటి మచ్చా పడని సీఎంగా మాత్రమే కాదు... విభేదాలను వైషమ్యాల స్థాయికి తీసుకుపోని నేతగా అఖిలేశ్‌ గుర్తింపు పొందారు. ఈ ఒరవడినే కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో సమాజ్‌ వాదీ గెలుపు సులభమవుతుంది.

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top