దళితులంటే చులకనా!

దళితులంటే చులకనా! - Sakshi


ఏడు పదుల స్వాతంత్య్ర సంబరాలు దేశవ్యాప్తంగా మంగళవారం అట్టహాసంగా ముగిశాయి. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో ఆంధ్రప్రదేశ్‌ మార్కెటింగ్‌ మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులను అత్యంత దారుణంగా కించపరుస్తూ మాట్లాడటానికి స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఎంచుకున్నారు. మరోపక్క అర్ధంతరంగా తనువు చాలించిన దళిత విద్యార్థి రోహిత్‌ వేముల మరణంపై నియమించిన న్యాయ విచారణ కమిషన్‌ వివాదాస్పద నివేదికను బయ టపెట్టడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వాతంత్య్ర దినోత్సవం మరుసటి రోజును ముహూర్తంగా ఎంచుకుంది.



ఆ నివేదిక రోహిత్‌ బలవన్మరణానికి ఆయనే తప్ప అన్యులెవరూ బాధ్యులు కారని సెలవిచ్చింది. అంతేకాదు...ఆయన దళితుడు కాడని నిర్ధారించింది. దురహంకారాన్ని ప్రద ర్శించడంలో, ఎవరినైనా ఏమైనా అనడంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరి తేరారు. ‘దళితులు శుభ్రంగా ఉండరు. సక్రమంగా చదువుకోరు. వారు అభివృద్ధి చెందకపోవడానికి వారే కారణం’అంటూ ఒక సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దురహంకారంలో నుంచి పుట్టుకొచ్చినవే.



పైగా ‘అంబేద్కర్‌ కేవలం పదేళ్లు మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తే 70 ఏళ్లవుతున్నా అవి కొనసాగుతున్నాయ’ నడం ద్వారా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్నాళ్లక్రితం ఇలాంటి మాటలే మాట్లాడారు. ‘ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అంటూ అందరినీ విస్మయపరిచారు. అధి కారంలో ఉన్నవారు ఏం చేసినా, మాట్లాడినా పర్యవసానాలేమీ ఉండబోవన్న భరోసాయే ఇలాంటి అతివాగుడుకు చోటిస్తోంది. స్వల్ప కారణాలతో సామా న్యులపై విరుచుకుపడే చట్టాలు అధికారంలో ఉన్నవారి ముందు పెంపుడు జంతు వుల్లా ఒదిగిపోతాయి.



రోహిత్‌ వేముల విషాదాంతంపై విచారణ జరిపిన జస్టిస్‌ రూపన్‌వాల్‌ అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనవారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు నిరుడు ఫిబ్రవరిలో ఏర్పాటైన ఈ కమిషన్‌ వాస్తవానికి ఆ ఏడాది ఆగస్టులోనే ఆ శాఖకు నివేదిక సమర్పించింది. ఆ తర్వాత మీడియాలో కమిషన్‌ నిర్ధారణలంటూ అడపా దడపా వార్తలొచ్చాయి. మొన్న ఫిబ్రవరిలో ఒక పౌరుడు నివేదికను బయటపెట్టాలంటూ సమాచార హక్కు చట్టం కింద కోరితే ఆ శాఖ అందుకు నిరాకరించింది.  నివేదిక పరిశీలనలో ఉన్నదని జవాబిచ్చింది. ఏడాది వ్యవధి తర్వాత ఎట్టకేలకు ఇన్నాళ్లకు అది వెలుగు చూసింది.



రోహిత్‌ బలవన్మరణానికి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ పొదిలె అప్పారావు బాధ్యులు కారని ఆ నివేదిక నిర్ధారించింది. చనిపోవాలనుకున్నది ఆయన ‘సొంత నిర్ణయం’ అని తేల్చింది. అందుకు ఆ యువకుడు వదిలి వెళ్లిన ఉత్తరమే తార్కాణమన్నది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారంటూ ఆయన రాసిన వాక్యాలను ఉదహరించింది. రోహిత్‌ ఆత్మహత్యకు ముందు ఆయన, ఆయనతోపాటు మరో నలుగురు సస్పెన్షన్‌లో ఉన్నారు. దానిపై వారు పోరాడుతున్నారు. దళితులమైనందుకే తమకు అన్యాయం జరుగుతున్నదని ఎలుగెత్తారు. అయినా వర్సిటీ అధికారులు వివక్ష చూపారనడానికి సంబంధించిన ఆధారాలు ఎవరూ ఇవ్వలేదని కమిషన్‌ అంటున్నది.



రూపన్‌వాల్‌ కమిషన్‌కు అప్పజెప్పిన విచారణాంశాలు రెండు. అందులో ఒకటి రోహిత్‌ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేమిటో, అందుకు బాధ్యులెవరో తేల్చడం. రెండోది– విద్యార్థుల ఇబ్బందుల పరిష్కారానికి వర్సిటీ అనుసరిస్తున్న విధానాలను సమీక్షించి అవసరమైన ఉపశమన చర్యలు సూచించడం. ఈ రెండూ కాకుండా రోహిత్‌ వేముల కులమేమిటో ఆరా తీసే బాధ్యతను కమిషన్‌ ఎందుకు నెత్తికెత్తుకున్నదో అనూహ్యం. కుల నిర్ధారణతోసహా విచారణాంశాల పరిధిని మించి చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకోబోమని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పినట్టు నిరుడు ఆగస్టులో ఒక వార్తా సంస్థ తెలిపింది.



కానీ ఇప్పుడా శాఖ అధికారిక  వైఖరేమిటో వెల్లడి కాలేదు. కులానికి సంబంధించినంత వరకూ నిర్ధారణ చేయాల్సింది రెవెన్యూ విభాగం. అది పలు సందర్భాల్లో రోహిత్‌ వేములకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేసింది. రోహిత్‌ ఆత్మహత్య ఉదంతం తర్వాత జాతీయ ఎస్సీ కమిషన్‌ గుంటూరు జిల్లా కలెక్టర్‌ నుంచి నివేదిక కోరింది. కలెక్టర్‌ సైతం రోహిత్‌ వేముల షెడ్యూల్‌ కులానికి చెందినవాడని అప్పట్లో నిర్ధారించారు. పైగా దాదాపు 20 ఏళ్లక్రితం ఇచ్చిన కీల కమైన తీర్పులో అమ్మ కులం బిడ్డలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రోహిత్‌ తల్లి రాధికను షెడ్యూల్‌ కులానికి చెందిన కుటుంబం పెంచుకుంది.



వడ్డెర కులానికి వ్యక్తితోనే ఆమెకు వివాహమైనా ఆ దంపతులు అనంతర కాలంలో విడిపోయారు. అటుపై ఆమె దళిత వాడలోనే పిల్లలను పెంచారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా... తన పరిధిలో లేని అంశంలోకి వెళ్లి రోహిత్‌ను వడ్డెర కులస్తుడని కమిషన్‌ ఎలా నిర్ధారించిందో అనూహ్యం. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన గుంటూరు జిల్లా యంత్రాంగం జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఒక రకంగా, కమిషన్‌కు మరో విధంగా నివేదిక ఇస్తుందనుకోవడానికి లేదు. లోపం ఎక్కడ జరిగిందో కనీసం కేంద్ర ప్రభుత్వమైనా తెలియజేయడం ధర్మం.



న్యాయమూర్తుల నిష్పాక్షికత గురించి చెబుతూ న్యాయం చేయడమే కాదు... చేసినట్టు కనబడాలని తొమ్మిది దశాబ్దాలక్రితం బ్రిటన్‌ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు చెప్పారు. దాన్ని ఈనాటికీ ఎవరూ సరిగా అవగాహన చేసుకోవడంలేదని రూపన్‌వాల్‌ నివేదిక గమనిస్తే అర్ధమవుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట బురుజులపై నుంచి ప్రసంగించిన ప్రధాని కశ్మీర్‌ సమస్యకు ఆత్మీయ ఆలింగనమే తప్ప తూటాలో, దూషణలో పరిష్కారం కాదన్నారు. దళితుల విష యంలోనూ ఇలా ప్రత్యేకించి చెబితే తప్ప, కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితులు మారవా?

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top