పోలవరం కాంట్రాక్టర్లకు వరం

పోలవరం కాంట్రాక్టర్లకు వరం - Sakshi


వాస్తవానికి నాలుగు కేంద్ర మంత్రిత్వ శాఖలు ఏకమై రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అక్రమాలు సాగించడానికి అవకాశం కల్పించాయి. ఇదంతా చూస్తే ఈ ప్రాజెక్టు మీద ప్రజాధనాన్ని అక్రమంగా వ్యయం చేయడానికి ఎలాంటి ప్రశ్నలు వేయకుండా రాష్ట్రంతో కేంద్రం కుమ్మక్కయిందన్న అభిప్రాయం కలుగుతుంది. పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాల గురించి ఎవరూ ప్రశ్నించలేదు. ఈ రెండు ప్రాజెక్టులతో ఎలాంటి అదనపు ప్రయోజనం లేదని తెలిసినా మూడు రాష్ట్రాలలో గిరిజనులను ఎందుకు నిరాశ్రయులను చేసినట్టు?



బహుళ ప్రయోజనాలను ఆశించి తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? విభజన తరువాత అనేక సమస్యల మధ్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నారా చంద్రబాబునాయుడు ఆ ప్రాజెక్టును 2019 సంవత్సరానికే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కోస్తాంధ్రకు జలధారగా ప్రజానీకం భావిస్తున్న ఈ ప్రాజెక్టు చంద్రబాబు హామీ మేరకు నిజంగానే పూర్తవుతుందా? జరుగుతున్న పరిణామాలు, నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త కొత్త నిర్ణయాలు ఈ ప్రశ్నకు బలం చేకూరుస్తున్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు భవిష్యత్తు పట్ల కలవరం కలిగిస్తున్నది. చాలా చట్ట వ్యతిరేక అంశాలు కనిపిస్తున్నాయి. ఇవి నేను గతంలో వివరించిన వాటికి అదనం. కొన్ని వారాలుగా పత్రికలలో ఇందుకు సంబంధించి వార్తలు వచ్చాయి.



కలవరపెడుతున్న కొత్త నిర్ణయాలు

నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తామన్న హామీతో ట్రాన్స్‌ట్రాయ్‌ తీసుకున్న కాంట్రాక్టు నుంచి(ఈపీసీ) ఆ సంస్థను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మొదట్లో మధుకాన్‌/బీఎస్‌పీసీఎల్‌ ఈ పనులు చూసింది. 2013లో పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్‌గా ట్రాన్స్‌ట్రాయ్‌ రంగంలో దిగింది. ఈ ఆగస్ట్‌ మధ్యలో రాష్ట్రానికి వచ్చిన నీటిపారుదల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘంతో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పురోగతిని గురించి చర్చించారు.



నిర్మాణ వ్యయం రూ. 50,000 కోట్లు పెరి గిందని చెప్పి ఆయన స్థాయీ సంఘానికి వెల్లడించారు. ఇంతవరకు దీని మీద రూ. 12,000 కోట్లు ఖర్చు చేసిన సంగతిని కూడా తెలియచెప్పారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయాలని కూడా కోరారు. నిర్మాణం పనుల పురోగతిని పరి శీలించడానికి స్వయంగా తానే పద్దెనిమిది పర్యాయాలు వెళ్లానని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో జాప్యాన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోబోతోంది. ఇందులో మొదటి చర్యగా– స్పిల్‌వే, స్పిల్‌ చానల్, అప్రోచ్‌ చానల్, కాఫర్‌ డ్యాం, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్డ్‌ డ్యాంలను సకాలంలో పూర్తి చేయడానికి తాజా టెండర్లు పిలవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ట్రాన్స్‌ట్రాయ్‌ని పక్కన పెట్టాలని నిర్ణయించుకుంది. ట్రాన్స్‌ట్రాయ్‌ని పక్కన పెడితేగానీ తాజాగా టెండర్లు పిలవడానికి అవకాశం లేదు కూడా.



ట్రాన్స్‌ట్రాయ్‌ని పక్కన పెట్టాలన్న నిర్ణయం తీసుకోవడానికి చెబుతున్న కారణం– నిర్మాణం పనులు పూర్తి చేయడానికి నిర్దేశించిన లక్ష్యంలో 27 శాతం మాత్రమే ట్రాన్స్‌ట్రాయ్‌ చేరుకోగలిగిందని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ ఇంతవరకు చాలా విరివిగా ఖర్చు చేసింది. ఇప్పటివరకు ఆ సంస్థ ఖర్చు చేసినదంతా ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వచ్చినదే. ఈ విషయాన్ని చాలా పత్రికలు వెల్లడించాయి కూడా. కానీ నిర్మాణంలో మాత్రం తీవ్ర జాప్యం కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తే ప్రభుత్వ పెద్దలకు, ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రమోటర్స్‌కు మధ్య గూడుపుఠాని జరిగి నట్టు స్పష్టంగా తెలుస్తుంది. మరొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. రూ. 50,000 కోట్లు వ్యయం పెరిగిందని ప్రభుత్వం చెప్పగానే దానిని విశ్వసించి, ఎలాంటి వివరాలు తెలుసుకోకుండానే కేంద్ర ఆర్థిక, జలవనరుల మంత్రిత్వ శాఖలు నిధులు మంజూరు చేస్తాయా?



పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను పోలవరం ప్రధాన ప్రాజెక్టుకు అనుబంధంగా చేర్చడం మరొక అంశం, నిజానికి వివాదం. పోలవరం ప్రాజెక్టుకే ఇంకా పర్యావరణ అనుమతులు లభించలేదు. కానీ పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను పోలవరం ప్రాజెక్టుకు అనధికారికంగా జోడించారు. ఈ అదనపు భారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, జల వనరుల మంత్రిత్వ శాఖ భరించవు.



ట్రాన్స్‌ట్రాయ్‌ గురించి ప్రశ్నలెన్నో!

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరే, అసలు ట్రాన్స్‌ట్రాయ్‌ గురించే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఇక్కడే ఆ సంస్థ ఘనత గురించి మరొక విషయం గుర్తు చేయాలి. ఇటీవల మన రిజర్వు బ్యాంక్‌ ప్రకటించిన రుణాల ఎగవేతదారుల జాబితాలో ఈ సంస్థ పేరు కూడా ఉంది. ఈ సంవత్సరం ఆగస్ట్‌ చివరన వెల్ల డించిన వివరాల ప్రకారం రిజర్వు బ్యాంక్‌లో పేరుకుపోయిన (2017 జూన్‌ వరకు) మొత్తం నిరర్ధక ఆస్తులలో 25 శాతం 12 సంస్థల నిర్వాకమేనని బ్యాంక్‌ వెల్లడించింది.



ఇక ప్రశ్నల విషయానికి వస్తే, ఈ రోజు వరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ట్రాన్స్‌ట్రాయ్‌కి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లించింది? రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన సొమ్మును ట్రాన్స్‌ట్రాయ్‌ అనధికారికంగా మళ్లించిందా? ఒప్పందం మేరకే ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము చెల్లించిందా? ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రాజెక్టు నిర్మాణం పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అనధికారికంగా ఈ నిధుల నుంచి కూడా ఏమైనా మళ్లించారా? ఇతర ప్రాంతాల నుంచి డబ్బు తేవడం, నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చడానికి విన్యాసాలు చేయడం (మనీ ల్యాండరింగ్‌) వంటివి ఈ ప్రాజెక్టు విషయంలో చోటు చేసుకున్నాయా? ఇవన్నీ తప్పక వచ్చే ప్రశ్నలే. రిజర్వు బ్యాంక్‌ ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసేవారి జాబితాలో ట్రాన్స్‌ట్రాయ్‌ని చేర్చింది. ఆర్బీఐ కొత్త నిబంధన ప్రకారం మిగిలిన ఎగవేత సంస్థల మీద అవినీతి కోణం నుంచి దర్యాప్తు జరిపినట్టే ట్రాన్స్‌ట్రాయ్‌ మీద కూడా దర్యాప్తు చేయించాలి.



రాష్ట్ర ప్రభుత్వం చూపించిన వ్యయ అంచనాల పట్ల, విడుదల చేసే నిధుల విషయంలోనూ కేంద్ర ఆర్థిక, జలవనరుల మంత్రిత్వ శాఖలు జాగరూకతతో వ్యవహరించాలి. అనుమతులు లేని ప్రాజెక్టులకు, అనధికార ప్రయోజనాలకు నిధులు విడుదల చేస్తే కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే అక్రమ చర్యలలోను, చట్ట విరుద్ధ కార్యకలాపాలలోనూ భాగస్వాములు కావలసి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున దీని నుంచి కేంద్రం తరువాత తప్పించుకోలేదు.



ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేనందున ఈ రీతిలో దీని నిర్మాణం కొనసాగిం చడం అక్రమమే అవుతుంది. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం మొదట పోలవరం ప్రాజెక్టులో భాగం కాదు. అయినా కేంద్ర జలవనరుల సంఘం అనుమతి లేకుండానే, రూ. 4,000 కోట్లతో వీటి పని ఆరంభించారు. అలాగే వీటికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు లేవు. అయినా రాష్ట్ర ప్రభుత్వం వీటి వ్యయాన్ని కూడా పోలవరం ప్రధాన పథకం అంచనాలలో అంతర్భాగం చేసింది. అందుకే పోలవరం కోసమే కేటాయించిన నిధులను ఈ రెండు ప్రాజెక్టులకు మళ్లించింది. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల ప్రధానమైన పోలవరం ప్రాజెక్టుకు న్యాయం జరగదు.



నిరాశ్రయులనూ పట్టించుకోలేదు

పోలవరంతో నిరాశ్రయులైన కుటుంబాల రోదనను కూడా రాష్ట్రం పట్టించుకోవడం లేదు. ఈ రోజు వరకు అటవీహక్కుల చట్టాన్ని అమలు చేయలేదు. ఈ ప్రాజెక్టు కారణంగా నిరాశ్రయులైన వేలాది మంది గిరిజనులకు పరి హారం అందలేదు. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఇదంతా తెలుసు. అయినా మౌన ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. ఇవన్నీ కాకుండా, ఈ మధ్య సమాచార హక్కు చట్టం కింద సేకరించిన అంశాలు కూడా కొత్త వాస్తవాలను వెల్లడించేవిగా ఉన్నాయి.



పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ముంపునకు గురయ్యే గ్రామాల సంఖ్య మొదట పేర్కొన్న సంఖ్య కంటే చాలా ఎక్కువని ఆ సమాచారం వల్ల తెలుస్తున్నది. అంటే ముంపు పరిధిలో ఉన్న అన్ని గ్రామాల వారీ వాదనలను రాష్ట్ర ప్రభుత్వం వినలేదు. ఈ ఉల్లంఘనను కూడా చట్ట వ్యతిరేకం కిందనే భావిస్తారు. కాంట్రాక్టర్ల ఒత్తిళ్లకు లొంగిపోయిన ప్రభుత్వం వారికి విరివిగా నిధులు మంజూరు చేయడం మరింత ఆందోళన కలిగించే విషయం. నిజానికి దీనితోనే ప్రాజెక్టు వ్యయం అనూహ్యంగా పెరి గింది. మొదట్లో ప్రాజెక్టు వ్యయం రూ. 16,000 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు చూపింది. అయితే తాజా అంచనాల ప్రకారం ఈ వ్యయం రూ. 40,000 కోట్లు. నిజం చెప్పాలంటే, మొదట చూపించిన రూ. 16,000 కోట్ల అంచనాకే కేంద్ర జల సంఘం అనుమతి ఇవ్వలేదు. అయినా నెల తరువాత నెల కాంట్రాక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా మంజూరు చేసిన నిధుల విషయం అందరినీ కలవరపెడుతోంది.



ఇలా ఉండగా, పెరిగిన అంచనాలను పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు, తీసుకోవలసిన చర్యలపై సిపారసులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఒక కమిటీని నియమించాలని నిర్ణయించింది. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు కూడా. ఈ కమిటీలో పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా, ప్రాజెక్టు సలహాదారు దినేశ్‌ప్రసాద్‌ భార్గవ సభ్యులు. జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని కూడా ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే ఈ జాతీయ ప్రాజెక్టు అధారిటీ కార్యదర్శి గుప్తాను రాష్ట్ర అధికారులు నియమించిన కమిటీలో సభ్యుడిని చేయడం చర్చనీయాంశమైంది.



ఎందుకంటే కాంట్రాక్టర్ల అక్రమాలకు కేంద్ర ప్రతినిధి కూడా ఆమోద ముద్ర వేసినట్టు అవుతుంది. వాస్తవానికి నాలుగు కేంద్ర మంత్రిత్వ శాఖలు ఏకమై రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అక్రమాలు సాగించడానికి అవకాశం కల్పించాయి. ఇదంతా చూస్తే ఈ ప్రాజెక్టు మీద ప్రజాధనాన్ని అక్రమంగా వ్యయం చేయడానికి ఎలాంటి ప్రశ్నలు వేయకుండా రాష్ట్రంతో కేంద్రం కుమ్మక్కయిందన్న అభిప్రాయం కలుగుతుంది. పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాల గురించి ఎవరూ ప్రశ్నించలేదు. ఈ రెండు ప్రాజెక్టులతో ఎలాంటి అదనపు ప్రయోజనం లేదని తెలిసినా మూడు రాష్ట్రాలకు చెందిన గిరిజనులను ఎందుకు నిరాశ్రయులను చేసినట్టు?



తాగునీరు, సాగునీరు కోసం కడుతున్న ఈ ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగమే ఎక్కువ కనిపిస్తోంది. సరైన అనుమతులు ఏమీ లేకుండా పనులు జరుగుతుండటం ఒక అక్రమమైతే, అందులోనే అవినీతి చోటు చేసుకోవటం సహించరానిది. పోలవరం ప్రాజెక్టుపై ఇంతవరకు చేసిన వ్యయం మీద కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) చేత ప్రత్యేకంగా ఆడిట్‌ జరిపిం చాలి. ఆ నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి. ఇంతవరకు జరిగిన దుర్వి నియోగాల మీద కేంద్రం దర్యాప్తు చేయించాలి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం సరికాదు. సీబీఐ రంగంలోకి దిగి నిధుల విషయంలో జరిగిన అవకతవకలను కేంద్రానికి తెలియచేయాలి.



వ్యాసకర్త భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి

మొబైల్‌ : 98660 21646

ఈఏఎస్‌ శర్మ

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top