కశ్మీర్‌ను చేజార్చుకుంటున్నామా?

కశ్మీర్‌ను చేజార్చుకుంటున్నామా?


జాతిహితం

కశ్మీర్‌కు సైనికపరమైన ముప్పు అనే భావన 1965లో నిజమైనది. నేడు దాదాపు అలాంటి పరిస్థితి లేదు. కాకపోతే మనం మన సొంత ప్రజలనే సైనిక ముప్పుగా చూసే పరిస్థితి ఏర్పడటానికి కృషి చేశాం. అదే నాటికి నేటికీ తేడా. 52 ఏళ్ల తర్వాత గతంలోలాగే మన ఆలోచన సైనికమైనదిగా సాగుతుండటం ఆందోళనకరం. కశ్మీర్‌ భౌగోళికంగా సురక్షితం గానే ఉన్నా... ఉద్వేగాలపరంగా, మానసికస్థితిపరంగా అది వేగంగా చే జారిపోతోంది. సరిగ్గా అందుకే అది చర్చించాల్సిన అంశం కావచ్చు.



కశ్మీర్‌ మన చేజారిపోయిందా? స్పష్టత కోసం చెప్పే సమాధానం లేదు అనే. అయితే దాన్ని వెన్నంటే ఎన్నో షరతులు, హెచ్చరికలను చెప్పుకోవాల్సి ఉంటుంది. 1947 నుంచి ఇలాగే కశ్మీర్‌ను మనం  చాలా సార్లు చేజార్చు కున్నాం. మొదటిసారి, పాకిస్తానీ సాయుధ దుండగులు శ్రీనగర్‌ విమానా శ్రయంపై విరుచుకుపడబోతుండగా... చిన్న డకోటా విమానాలు ఒక్కొక్క సారి ఒక్కొక్కటి దిగుతుండగా  లెఫ్టినెంట్‌ జనరల్‌ (ఆ తర్వాత లెఫ్టినెంట్‌ కల్నల్‌) నేతృత్వంలో మన సేనలు అక్కడకు చేరాయి. అప్పుడు పరిస్థితి ఏ ఆశా లేదన్నట్టే ఉండింది.  రెండోసారి 1965లో కశ్మీర్‌ మన చేజారిపోయింది. అది నిజానికి  చైనా యుద్ధంలో భారత్‌ దెబ్బ ఉన్న 1962లోనే పాక్‌ ప్రారం భించిన పెద్ద పన్నాగానికి తార్కికమైన ముగింపుగా జరిగిన దాడి. హజరత్‌ బల్‌లో పవిత్ర అవశేషం ‘‘దొంగతనానికి ’’ గురైన వెన్నంటి కశ్మీర్‌ లోయలో ప్రజా తిరుగుబాటు వెల్లువ పెల్లుబికింది. అదేసమయానికి కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వ ప్రాభవం బలíహీనపడుతోంది. దీంతో చివరకు అయూబ్‌ ఖాన్‌ దురాశాపూరితమైన ఆపరేషన్‌ జిబ్రాల్టర్‌ దాడిని ప్రారంభించారు. వేలాది మంది పాక్‌ సైనికులు ఆ దాడిలో కశ్మీర్‌ లోయలోకి చొరబడ్డారు. దాన్ని వెన్నంటే పాక్‌ చేపట్టిన ఆపరేషన్‌ గ్రాండ్‌ స్లామ్‌ ఛాంబ్‌ దాదాపుగా విజయవంతమైంది. కశ్మీర్‌ దాదాపుగా మన చేయి జారిపోయినట్టే అనిపిం చింది. చివరిసారి మనం కశ్మీర్‌ను సైనికంగా కోల్పోయినట్టనిపించినది ఆ 1965లోనే. అప్పటినుంచి 52 ఏళ్లు గడిచాయి.



సైనిక ముప్పు లేకున్నా అదే ఆలోచనా తీరు

ఆ తర్వాత అలాంటిది మళ్లీ జరగలేదు. 1971లో పాక్‌ సైన్యం పూంఛ్‌, ఛాంబ్‌లలో గొప్ప దృఢసంకల్పంతో దాడులను సాగించింది. ఆ తర్వాత 1969 కార్గిల్‌ దాడులతో కశ్మీర్‌పై భారత్‌ పట్టుకు ముప్పు వాటిల్లింది. అయినా ఈ అర్ధ శతాబ్ది కాలంలో భారత్‌ చేతిలో గతంలో కంటే కొంత ఎక్కువ కశ్మీర్‌ భూభాగమే ఉంటూ వచ్చింది. మరైతే మనం ఆందోళన చెందాల్సింది ఏముంది? సరిగ్గా ఇదే, 52 ఏళ్ల తర్వాత కశ్మీర్‌కు సంబంధించి చెప్పుకోదగిన సైనికపరమైన ముప్పు ఏమీ లేకపోయినా... మన ఆలోచన గతంలోలాగే సైనికీకరణకు చెందినదిగా సాగుతుండటమే ఆందోళనకరం. పాఠశాల సమావేశాల్లో మనం ‘‘దేశభక్తి’’ గీతాలను ఆలపిస్తుండిన ఆ రోజు ల్లోని ఆలోచనా రీతి అది. నేటి ఆలోచనకు ఆనాటి ఆలోచనకు ఉన్న తేడా ఒక్కటే. సైనిక ముప్పు అనే ఆనాటి భావన నిజమైనది. జనం చెప్పుకునే కథల్లో సైతం కశ్మీరీ లను స్థూలంగా జాతీయవాదులుగా, విశ్వసించదగ్గ వారుగా చూసేవారు. 1965లోని పాక్‌ చొరబాటుదార్లను స్థానికులు తిరస్కరించారని, వారి గురించిన సమాచారాన్ని అందించారని గుర్తుకు తెచ్చుకోండి.



నేడు దాదాపుగా ఎలాంటి సైనికపరమైన ముప్పూ లేదు. కాకపోతే మనం మన సొంత ప్రజలనే సైనిక ముప్పుగా చూసే పరిస్థితి ఏర్పడటానికి శాయశక్తులా కృషి చేశాం. అదే నాటికీ నేటికీ ఉన్న తేడా. కశ్మీర్‌ భౌగోళికంగా సురక్షితంగానే ఉన్నా... ఉద్వేగాలపరంగా, మానసికస్థితిపరంగా అది వేగంగా మన చే జారిపోతోంది (ఇప్పటికే చేజారిపోకపోయి ఉంటే). సరిగ్గా అందుకే అది చర్చించాల్సిన అంశం కావచ్చు. ఇక్కడ మూడు ప్రశ్నలు తలెత్తుతాయి. మనకిది ఎలా తెలుసు? దీనిపట్ల మనకు చింతేమైనా ఉందా? చివరిది, మనం దీన్ని పట్టించుకోవాలా?



ఇక మొదటి ప్రశ్నకు సమాధానం స్వయం విదితమే. ఇప్పటికి కొన్ని నెలలుగా లోయలోని కశ్మీరీలు లాఠీలు, తూటాలు, తూటా రవ్వలకు (పెల్లెట్స్‌) వీధుల్లోకి వస్తున్నారు. వారాలు గడిచేకొద్దీ మానవ కవచాలుగా వాడుతున్న తమ తోటి కశ్మీరీలను ‘‘త్యాగం’’ చేయడానికి సైతం సంకోచిం చకపోవచ్చు. నేడు పాక్‌ ఉగ్రవాదులతో నిజమైన ఎదురు కాల్పులు జరుగు తున్నప్పుడు వారు సైన్యాన్ని అడ్డగిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రం లోని అత్యంత శక్తివంతుడిగా ఉన్న, వృద్ధ నేత బరిలో ఉన్నా, ఆ ఎన్నిక రాష్ట్ర రాజధానిలోనే జరుగుతున్నా, అందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసినా... కేవలం 7 శాతం ఓటర్లు మాత్రమే ఓటు చేయడానికి బయటకు వచ్చారు. కశ్మీర్‌ భూభాగంపై మీ పట్టు చెక్కుచెదరకుండా ఉన్నా కశ్మీర్‌ ప్రజలను మీరు పోగొట్టుకుంటున్నారనడానికి ఇంతకు మించిన నిదర్శనం మరేం అక్కర్లేదు.  



రెండో ప్రశ్నకు మొదట సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది చాలా తేలిక. లేదు, మనకు ఏ చింతా లేదు. ఎందుకో చెప్పే వాదన దేశభక్తికి సంబంధించిన చాలా వాదనాల్లాగే చిన్నది, సునిశితమైనది నిర్ధాక్షిణ్యమైనది. మిమ్మల్ని ద్వేషిస్తున్న. దశాబ్దాలుగా దేశంపట్ల అవిధేయంగా ఉంటున్న, పాకి స్తాన్‌కు, మితవాద ఇస్లాంకు కట్టుబడిన మన సైనికులపై రాళ్లు రువ్వే ప్రజల ప్రేమను సాధించాలని తాపత్రయపడటం ఎందుకు? నేటి పునరుజ్జీవం పొంది అహంకరిస్తున్న పరివర్తనాత్మక భారతం మన ప్రధాన భూభాగంలో సినిమా హాల్‌లో జాతీయ గీతాన్ని వినిపిస్తుండగా లేచి నిలవకపోవడం వంటి సాపేక్షికంగా చిన్న నేరాలకు సైతం సామాన్య ప్రజలను చావగొట్టకపోయినా జైలుకు పంపుతోంది. అలాంటి దేశం  ఇలాంటి బహిరంగ దేశద్రోహాన్ని ఎలా సహిస్తుంది? జరిగిందేదో జరిగింది ఇక చాలు. ఆ కశ్మీరీలకు భారత్‌ నచ్చక పోతే పాకిస్తాన్‌కు పోవచ్చు.



ఇక మూడవ ప్రశ్న, కశ్మీరీలను మనం పట్టించుకోవాలా? ఇది మరింత సంక్లిష్టమైనది. మీరే గనుక సాధారణంగా కనబడే ఆవేశపూరిత దేశభక్తు లైతే... ఆ ‘‘దేశ ద్రోహులను’’ పాకిస్తాన్‌కు పోనివ్వండి అని బదులు చెబు తారు. ఆ తదుపరి కశ్మీర్‌ లోయకు ఇతర రాష్ట్రాలలోని జాతీయవాదులను (హిందువులను) పంపి ముంచెత్తండి. లేదా కొందరు బాధ్యతాయుతులైన అధికారపార్టీ నేతలు సూచిస్తున్నట్టు... కశ్మీరీలను అక్కడి నుంచి తరలించి,  సుదూర రాష్ట్రాల్లోని శిబిరాలలో ఉంచండి. లేదంటే కొందరు పదవీ విరమణ చేసిన సీనియర్‌ జనరల్స్‌ గట్టిగా చెబు తున్నట్టు కనబడ్డవాళ్లను కనబడ్డట్టు కాల్చి పారేయండి, ఇక అదే సద్దుమణిగి పోతుంది. ఆ సాహస కృత్యాన్ని లైవ్‌ ప్రసారం చేయడానికి వీలుగా ఆ పనేదో పట్టప గలే చేయడం మంచిది. దాన్ని చూసి దేశద్రోహులు కాగల వారు నీరుగారిపో తారు. ఇది కశ్మీర్‌నే కాదు, భారతదేశాన్నే కచ్చితంగా పోగొట్టుకునే మార్గం. ఇక్కడ మనం భారతదేశాన్ని గురించిన కాల్పనికమైన ఊహాత్మక భావన గురించి కాదు, కఠోర వాస్తవా లను గురించి మాట్లాడుతున్నాం.



భారత్‌ అంటే ఇజ్రాయెల్‌ కాదు, కాబోదు

ఇజ్రాయెల్‌ అంటే మనకు అపారమైన ప్రశాంసాభావం ఉంది. అది 50 ఏళ్లుగా ప్రయత్నించి విఫలమైన మార్గమిది. 1967లో ఆరు రోజుల యుద్ధం చేసి అతి పెద్ద అరబ్బు భూభాగాలను ఆక్రమించింది అప్పటి నుంచి అది ఆ భూభాగాలను ఉంచుకుని, అక్కడి ప్రజలను తరిమేయాలనే భావనను రక రకాలుగా అమలు చేసి సఫలం కావాలని ప్రయత్నించింది. ఇజ్రాయెల్‌కు పాశ్చాత్యదేశాల మద్దతు, అత్యంత ప్రబలమైన సైనిక ఆధిక్యత ఉంది. ఆ దేశ సైన్యానికి, గూఢచార విభాగానికి అవధులులేని అధికారాలున్నాయి. అంతకు మించి ఆఫ్రికా, తూర్పు యూరప్‌ల నుంచి తమ పవిత్ర భూమికి వలస వచ్చే విధేయులైన సరికొత్త యూదు పౌరుల అంతులేని ప్రవాహమూ ఉంది. ఇజ్రా యెల్‌ ఎన్నో అరబ్బు తిరుగుబాట్లను అణచివేసింది. ఐరాసను, అంతర్జాతీయ ఒత్తిడులను లెక్కచేయక అది కనిపిస్తే కాల్చేస్తోంది. మొత్తంగా సమాజాన్నే సైనికీకరించింది. ఈ వ్యూహం అమలుకు అది ధన రూపేణానే కాదు యూదు ప్రాణాల రీత్యా, అంతర్జాతీయ ప్రతిష్ట రీత్యా అపారమైన మూల్యాన్ని చెల్లిం చింది. అది భూభాగాన్ని నిలబెట్టుకోగలిగింది. కానీ ఇంకా ఆ ప్రాంతాల్లో అరబ్బు ప్రజలు ఉండనే ఉన్నారు. గతంలో జోర్డాన్, సిరియా, ఈజిప్ట్, లెబ నాన్‌లను ఓడించిన మధ్యప్రాచ్యంలోకెల్లా అత్యంత ప్రబల సైనిక శక్తి ఈ స్వీయవినాశక శాశ్వత ప్రతిష్టంభనలో ఇరుక్కుపోయింది.



ఇజ్రాయెల్‌లోని పలు జాతీయ లక్షణాలను ఈ రచయిత సహా మన మంతా ప్రశంసిస్తుంటాం. కానీ, భార తదేశం ఇజ్రాయెల్‌ కాదు, కాలేదు కూడా. అందువల్ల ఈ వ్యూహం ఆత్మహత్యాసదృశమైనది. ఇజ్రాయెల్‌ ఏర్ప డిందే యూదు దేశంగా. అక్కడ గణనీయమైన జనాభాగా ఉండే స్థానిక అరబ్బులకు ఓటు హక్కుంది. కానీ వారు సమాన పౌరులు కారు. భారత్‌లోని ముస్లింలు, క్రైస్తువులు, బౌద్ధులు, పార్సీలు, నాస్తికులలో ప్రతి ఒక్కరూ సమాన పౌరులే. అందరికీ ఉన్నవి ఒకే హక్కులు. రాష్ట్రపతి, ప్రధాన న్యాయ మూర్తి, రక్షణ బలగాలు, గూఢచార విభాగాల అధిపతులు సహా అత్యంత సున్నితమైన ఏ ఉద్యోగానికైనా లేదా పదవికైనా అందరూ అర్హులే. లాంఛ  నంగా కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా ప్రకటించదలిస్తే తప్ప,ప్రధాన భూభా గంలో ఒక వ్యవస్థను, కశ్మీర్‌లో మరో వ్యవస్థను  మీరు అనుసరించలేరు. ఒక దేశం రెండు వ్యవస్థలు అనేది చైనాలాంటి నియం తృత్వంలోనే మనగలుగు తుంది. హాంకాంగ్‌ విషయంలో అది అదే విధానాన్ని అమలుచేస్తోంది.



రాజకీయ నాయకత్వానికి సవాలు

గత ఆదివారం నేను ఢిల్లీలో జరిగిన భారత గూఢచార సంస్థ రా మాజీ అధిపతి గిరీష్‌ చంద్ర సక్సేనా (గారీ) స్మారకసభకు హాజరయ్యాను. 1991లో కశ్మీర్‌లో పాక్‌ చొరబాట్లు తారస్థాయికి చే రిన సమయంలో ఆయన  కశ్మీర్‌కు గవర్నర్‌గా ఉన్నారు. ‘టైం’ పత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్‌ ఎడ్వర్డ్‌ డెస్మండ్, నేనూ కలసి వాస్తవాధీన రేఖ వద్ద కొన్ని రోజులు గడపాలని, సాధ్యమైతే దగ్గరి నుంచి ఎదురుకాల్పులను చూడాలని అనుకున్నాం. ఆ సందర్భంగా నేను గారీ సాబ్‌ను కలిసినప్పుడు, కశ్మీర్‌ మన చేయిజారిపోయిందా? అని అడి గాను. అవి కశ్మీర్‌ తిరుగుబాటు తీవ్రంగా ఉన్న రోజులు అని గుర్తుంచు కోండి. ‘‘లేదు’’ అన్నారాయన ప్రశాంతంగా. ‘‘ఒక దేశం సమైక్యంగా నిల వాలంటే దానికా ఆత్మస్థయిర్యం ఉండాలి, మనకి అది ఉంది’’ అన్నారు. ఈ పోరాట దశ ముగిసిపోయి  (ఆయనేం మెతక పద్ధతులు వాడినవారు కాదు) సాధారణ ప్రభుత్వ పాలన నెలకొన్నాక ప్రజలను ఆకట్టుకునేందుకు, భార త్‌లో ఉండటంవల్ల మేలు జరుగుతుందని వారికి నచ్చజెప్పేందుకు సంబం ధించిన రాజకీయ ప్రణాళిక మనకు అవసరం అన్నారు. మేం ఇప్పుడు చేస్తున్న పని తేలికపాటిదే. నిజమైన సవాలు రాజకీయ నాయకత్వపు విశాల హృదయానికి ఎదురయ్యేదే. నేడైనా ఆయన అవే మాటలు చెప్పి ఉండేవారు.







శేఖర్‌ గుప్తా

twitter@shekargupta

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top