జనం సంగతి పట్టని ‘ఆవేదన’

జనం సంగతి పట్టని ‘ఆవేదన’ - Sakshi


డేట్‌లైన్‌ హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ల పేరిట వచ్చి పెత్తనం చేసే వాళ్లు కూడా తెలంగాణ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఏ రకంగాను ఉపయోగపడకపోగా నష్టం చేసే విధంగా వ్యవహరి స్తారు. కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు పరిష్కరించడం మాటేమోగానీ అరకొర సమాచా రంతో వారు మాట్లాడే మాటలు వారి రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతుంటాయి. నిజామాబాద్‌లో జరిగిన జన ఆవేదన సభలో మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ ముఖ్యమంత్రి ఫార్మ్‌ హౌస్‌లోనే గడుపుతారంటూ చేసిన విమర్శ అటువంటిదే.



దేశమంతటా ఎట్లాఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీది విషాదకర పరిస్థితి. అది స్థానిక నాయకుల స్వయంకృతాపరాధమే. తెలంగాణలో నాయకుల స్వయంకృతం అంటే అర్ధం చేసుకోవచ్చు కానీ, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకులను ఎట్లా నిందిస్తారు, అధిష్టానం నిర్వాకానికి ఆ రాష్ట్రంలో పార్టీ బలయింది కదా అని ఎవరైనా వాదించవచ్చు. అది కొంత నిజమే అయినా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలువురు స్థానిక నాయకుల నిర్వా కమే ఈ స్థితికి కారణమన్న విషయం నిర్వివాదాంశం. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి సున్నా మార్కులు రావడానికి కారణాలు తరువాత విశ్లేషించు కోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌ హడావుడి నడుస్తున్నది కాబట్టి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం.



ప్రాంతీయ ఆకాంక్షలు బలంగా పనిచేసి, వాటి పునాదుల మీద ఏర్పడిన ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలు బలోపేతమైన రాష్ట్రాలలో తమ పప్పులు ఉడకవని రుజువు చేసే అనుభ వాలు ఎన్ని ఎదురైనా పాఠాలు నేర్చుకోడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉండదు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఏదో ఒక ద్రవిడ పార్టీ తోక పట్టుకుని నడవాల్సిన పరిస్థితి. తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలు, నేటి సోనియా గాంధీ, రేపోమాపో పార్టీ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్‌కు దశ దిశ నిర్దేశిం చబోతున్న రాహుల్‌ గాంధీ దాకా ఇదే సంప్రదాయం. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌ వాదీ వంటి ప్రాంతీయ పార్టీ యువ నాయకుడు అఖిలే శ్‌ యాదవ్‌తో దోస్తీ చెయ్యాల్సిన దుస్థితి. జాతీయ నాయకత్వానికి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తూనే ప్రాంతీయ పార్టీల మాదిరిగా ఒకే నాయకుడి కనుసన్నల్లో నడిచే విధంగా పార్టీని మార్చుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటి నాయకులు ప్రయోగాత్మకంగా రుజువు చేసినా కాంగ్రెస్‌ అధిష్టానానికి పట్టలేదు. రాష్ట్రాల్లో ఒక నాయకుడు బలపడితే తమ పెత్తనం సాగదన్న దుగ్ధ ఆ పార్టీ మొదటికే మోసం వచ్చేటట్టు చేస్తున్న, చేసిన సందర్భాలు అనేకం. జాతీయ పార్టీలో ఉండి కూడా ప్రాంతీయ నాయకులకు ఉండే ప్రజాకర్షణ, ప్రజామోదం పొందిన నాయకుడు కాబట్టి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖరరెడ్డిని ముట్టుకునే సాహసం కాంగ్రెస్‌ అధిష్టానం చెయ్యలేదు.



కాబట్టే కాంగ్రెస్‌ పార్టీ పదేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉండగలి గింది. 1978లో ఆ తరువాత 1989లో లాగానే 2004లో కూడా ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులను మార్చి ఉంటే 2009లో మహాకూటమి ప్రయోగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫలించి 2009లోనే అధికారం కోల్పోయి ఉండేదేమో! నిజానికి 2009లో పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన డాక్టర్‌ రాజశేఖ రరెడ్డి హఠాన్మరణం తరువాత  ఆంధ్రప్రదేశ్‌లో రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డిల నాయకత్వంలో నడిచినవి పరోక్షంగా సంకీర్ణ ప్రభుత్వాలే. ప్రత్యక్షంగా ప్రజా రాజ్యం పార్టీ విలీనమై తోడ్పడితే తెర వెనుక నుంచి ఆ ప్రభుత్వాలను నడి పించింది తెలుగుదేశం పార్టీ అన్న విషయం జగమెరిగిన సత్యం.



నిస్సహాయ అధిష్టానం

ఏ రాజకీయ నేప«థ్యమూ లేని సినిమా నటుడు ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీ పెడితేనే ఆదరించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి తెచ్చిన తెలుగు ప్రజలు మూడు దశాబ్దాల పైబడిన రాజకీయ అనుభవం, అద్భుతమైన విషయ పరిజ్ఞానం, ఆ విషయాలన్నిటినీ అరటిపండు ఒలిచి పెట్టినట్టు చెప్పి మెప్పించగల వాక్చాతుర్యం, 14 సంవత్సరాల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన శక్తియుక్తులూ కలిగిన ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావు పట్ల ఇంత తొందరలో విముఖత ఏర్పరచుకుంటా రని కాంగ్రెస్‌ పెద్దలు భావించడం పొరపాటు. నిజానికి సమకాలీన రాజ కీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాకర్షణ, అభిమానం కలిగిన, ప్రజా భిప్రాయాన్ని ప్రభావితం చెయ్యగలిగిన నాయకులు ఎన్టీ రామారావు, డాక్టర్‌ రాజశేఖరరెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనడంలో సందేహం లేదు.



ఎన్‌టీ రామారావు, రాజశేఖరరెడ్డి ఇప్పుడులేరు, ఆ ఇద్దరు నాయకుల కంటే చంద్రశేఖరరావుకు ఉన్న అదనపు అర్హత రాష్ట్ర సాధన పోరాటానికి సుదీర్ఘ కాలం నాయకత్వం వహించడం. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో కేసీఆర్‌ తో పోటీ పడగలిగే నాయకుడు ఇతర ఏ పార్టీలోనూ లేకపోవడం వల్ల తెలం గాణ ప్రతిపక్ష శిబిరంలో రాజకీయ శూన్యత నెలకొన్న మాట వాస్తవం. తమ పార్టీల తరఫున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తెలంగాణ  రాష్ట్ర సమితికి వలస పోతుంటే కళ్లప్పగించి ఉండిపోవడం తప్ప, వాళ్లను ఆపుకోలేని నిస్సహాయ నాయకత్వం కాంగ్రెస్‌ది. శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు అధికారపక్షా నికి ఏ కారణాల చేత, ఏ ప్రలోభాలకు లొంగి వలసపోయినా, అది ఎంత అనైతిక వ్యవహారమైనా దాన్ని సమర్ధంగా ఎదుర్కొని పోరాడే సరైన నాయ కత్వం కాంగ్రెస్‌లో కొరవడిందన్న మాట వాస్తవం. ఎంతో అనుభవం కలిగిన, సుదీర్ఘకాలం మంత్రి పదవుల్లో ఉన్న వాళ్లం ఇంత మందిమి ఉండగా సమర్ధ నాయకుడు లేడని ఎట్లా అంటారు అంటూ తెలంగాణ  కాంగ్రెస్‌ పెద్దలు ఆగ్ర హించవచ్చు. అయినా వాస్తవాలు మాట్లాడుకోక తప్పదు.



సందర్భశుద్ధి లేని నాయకత్వం

ఇంతింత అనుభవం కలిగిన పెద్దలు తెలంగాణ  రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వం అన్న విషయం ప్రజల్లోకి తీసుకు పోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇచ్చింది కాంగ్రెస్‌ అయినా పోరాటం చేసి తెచ్చింది మేమే అన్న వాదనను కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగింది. పైగా ఒకే జిల్లాకు చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు మూడు ముఠాలుగా చీలిపోయి నాయకత్వం కోసం పోట్లాడుకుంటూ ఉంటే ఆ పార్టీ బలోపేతం కావడం ఎట్లా సాధ్యం? ప్రజలు ఆ పార్టీ మీద నమ్మకం ఎట్లా పెంచుకుంటారు?



తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లను నెరవేర్చడం లేదనీ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నదనీ కాంగ్రెస్‌ తెలంగాణలో జనావేదన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎక్కడైనా అది ప్రతిపక్షాల బాధ్యత, నిత్యం జనంలో ఉండాల్సిందే. వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం మీద ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చెయ్యా ల్సిందే. కానీ తెలంగాణ  కాంగ్రెస్‌ నాయకుల ధోరణి వింతగా ఉంటుంది. ఒక స్థానిక సంస్థకు ఎన్నికలు జరుగుతూ ఉంటే పోలింగ్‌ ఎల్లుండి ఉందనగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అయిదు రూపాయల భోజనం అద్భుతంగా ఉందని ఆ భోజనం తెప్పించుకుని తింటూ ఫొటోలకు పోజులిచ్చి పత్రికలవారికి చూపించిన పెద్దలు ఇంకా అధికార పార్టీ మీద ఏం పోరాటం చేస్తారు? నిజా నికి అయిదు రూపాయల భోజనం అందరి ప్రశంసలూ అందుకుంది.



ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఆ వాస్తవాన్ని బయటికి చెప్పొద్దనడం భావ్యం కాదు. కానీ ఎంచుకున్న సందర్భం ఎటువంటిది? ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నది, ప్రజల్లో తమ పార్టీకి ఎంత ఆదరణ ఉందో తెలుసుకోవాలని అనుకోవడం తప్పు కాదు. అందుకోసం పీసీసీ అధ్యక్షుడే స్వయంగా ఒక రహస్య సర్వే జరిపించుకోవడం కూడా తప్పు కాదు, నిజానికి తమ స్థానం ఏమిటో తెలుసుకునేందుకు, భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించుకోడానికి ఇది ఎంతో ఉపయోగపడు తుంది. అయితే ఇప్పటికే తీవ్రంగా ఉన్న అంతర్గత విభేదాలు మరింత పెరిగే విధంగా సరిగ్గా జనావేదన సభల ముంగిట ఆ సర్వే వివరాలను బహిర్గతం చేసుకోడం కాంగ్రెస్‌ పార్టీకి ఏ రకంగానూ తోడ్పడదు. అదే జిల్లాకు చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నాయకులూ ఏదో ఒక సంద ర్భంలో తామే ముఖ్యమంత్రులం అని ప్రకటించుకోవడం పార్టీని నగు బాటుకు గురి చేయడం తప్ప బలోపేతానికి తోడ్పడే విధంగా లేదు. ఈ మూడు గ్రూపుల నాయకులూ ఒకరి మీద ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకోడం చూస్తే ఇంకా జనావేదన ఏం వింటారనిపిస్తుంది.



ఇన్‌చార్జ్‌లు మోత బరువు

ఇక కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర పరిశీలకులు, ఇన్‌చార్జ్‌ల పేరిట వచ్చి పెత్తనం చేసే వాళ్లు కూడా తెలంగాణ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఏ రకంగాను ఉపయోగపడకపోగా నష్టం చేసే విధంగా వ్యవహరిస్తారు. కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు పరిష్కరించడం మాటేమో గానీ అరకొర సమాచారంతో వారు మాట్లాడే మాటలు వారి రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతుంటాయి. ప్రభుత్వం లోపాలను ప్రతిపక్షం ఎత్తి చూపాల్సిందే, ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే ప్రజల్లోకి ఆ విషయం తీసుకెళ్లి పోరాటం చెయ్యాల్సిందే. కానీ పనికిరాని  చిల్లర విమర్శలు చెయ్యడం వారి  స్థాయికీ తోడ్పడదు, పార్టీ బలో పేతానికీ ఉపయోగపడదు. నిజామాబాద్‌లో జరిగిన జన ఆవేదన సభలో మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ ముఖ్యమంత్రి ఫార్మ్‌ హౌస్‌లోనే గడుపుతారంటూ చేసిన విమర్శ అటువంటిదే.



ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది, ముఖ్యమంత్రి ఏంచేస్తున్నారు అన్న విషయంలో ఆయన తన పార్టీ స్థానిక నాయకత్వం నుంచి సరైన సమాచారం తీసుకుని మాట్లాడి ఉంటే బాగుండేది. ఇటీవలే నిర్మించిన ప్రగతిభవన్‌లోని జనహితలో ముఖ్యమంత్రి వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులను పెద్ద సంఖ్యలో కలుసుకుని వారి సమస్యలకు పరిష్కారాలను, కార్యక్రమాలను అన్వేషిస్తున్నారు, ప్రకటనలు చేస్తున్నారు. నిధులు కేటాయిస్తామని చెబు తున్నారు. అవి ఏ మేరకు కార్య రూపం దాలుస్తాయి, ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంత అనేది కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ కూడా మాట్లాడవచ్చు, అంతిమంగా ఏం చెయ్యాలో నిర్ణయించు కోడానికి ప్రజలకు రెండేళ్లే సమయం ఉంది. ఈలోగా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు నేనంటే నేను ముఖ్యమంత్రిని అని పోట్లాడుకోడం మానేసి అందరినీ కలుపుకుని పోయే నాయకత్వంగా తమను తాము మలుచుకుంటే సగం విజయం సాధించినట్టే. మిగిలిన సగం విజయం సంగతి ప్రజలకు వదిలేస్తే మంచిది.





- దేవులపల్లి అమర్‌


datelinehyderabad@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top