జనం గమనిస్తున్నారు సుమా!

జనం గమనిస్తున్నారు సుమా! - Sakshi


డేట్‌లైన్‌ హైదరాబాద్‌

పదిమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న బస్సు ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్‌ మృత దేహానికి పోస్ట్‌మార్టం ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించిన పాపానికి ప్రతిపక్ష నాయకుడు జగన్‌ మీద కేసులెందుకు పెట్టారు? తిరుపతి విమానాశ్రయంలో ఒక ఉద్యో గితో జరిగిన స్వల్ప వాగ్వివాదం సంఘటనలో పట్టుబట్టి ప్రతిపక్ష పార్లమెంట్‌ సభ్యుడు మిథున్‌రెడ్డి, శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరుల మీద కేసులెందుకు పెట్టారు? రోజుల తరబడి భాస్కర్‌రెడ్డిని జైలుకెందుకు పంపించారు?



తోటకూర నాడే చెప్పి ఉంటే... అని ఒక పాత సామెత ఉంది.  ఒక ఆక తాయి పిల్లవాడు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడట. మొట్టమొదటిసారి పక్కింటి పెరట్లో నుంచి తోటకూర దొంగతనంగా తెంపుకొచ్చి  తల్లికి ఇస్తే ఆమె కొడుకుని మెచ్చుకుని వండిపెట్టి తినిపించింది. రెండోసారి ఇంకెవరి దొడ్లో నుంచో సొరకాయలు తెంపుకొచ్చాడు దొంగతనంగా. కొడుకు ప్రయో జకుడు అవుతున్నాడని మెచ్చుకుందట  ఆ తల్లి. ఆ తరువాత ఊళ్లోవాళ్లు గంప కింద దాచుకున్న కోళ్లను తెచ్చేవాడు. మంచి వేపుడు చేసి కొడుక్కు పెట్టి తానూ తిని ఆనందించేది తల్లి. చిల్లర దొంగతనాల నుంచి మనవాడు తల్లి ప్రోత్సాహంతో ఆరితేరిన గజదొంగగా మారాడు. ఏదో ఒకరోజు పాపం పండక తప్పదు కదా! ఒక ఇంట్లో అర్ధరాత్రి దొంగతనానికి వెళ్లాడు. ఆ ఇంటి వాళ్లు పట్టుకోబోతే, విడిపించుకునే క్రమంలో ఒకరిని హత్య కూడా చేసేస్తాడు మనవాడు. తెల్లవారగానే పోలీసులు ఇంటికొచ్చి అతడిని అరెస్ట్‌ చేసి, సంకెళ్లు వేసి తీసుకుపోతుంటే  హత్య చేస్తావా దుర్మార్గుడా అని కొడుకును తిడుతూ తల్లి తల బాదుకుని ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు కొడుకు పోలీసుల అనుమతి తీసుకుని, తల్లి దగ్గరికి వచ్చి ఆమెను ఎడాపెడా బాది తోటకూర నాడే నన్ను బొంద పెట్టి ఉంటె ఇంత పెద్ద నేరస్తుడిని అయ్యేవాడినా, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అని శిక్ష అనుభవించడానికి వెళ్లిపోయాడట.



ఇసుక మాఫియా దగ్గరే...

నిజమే, చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నప్పుడే కొడుకుని దండించి, దారిలో పెట్టి ఉంటే హంతకుడు అయ్యేవాడు కాదు కదా! ఈ సామెత కథ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రస్తుత  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యవహార శైలికి సరిగ్గా సరిపోతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, మద్దతుదారుల విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా ఆ తల్లి వ్యవహారం లాగే ఉంది. తెలుగుదేశం పార్టీ దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ ఇసుక అక్రమ తవ్వకాలూ, రవాణా వ్యవ హారంలో ఎంఆర్‌వో వనజాక్షి మీద దాడి చేసిన నాడే ముఖ్యమంత్రి చంద్ర బాబు కఠినంగా వ్యవహరించి, చట్టపరమయిన చర్యలకు అనుమతించి ఉంటే రవాణా శాఖ కమిషనర్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాల సుబ్రహ్మ ణ్యంను దూషించడానికీ, ఆయన గన్‌మ్యాన్‌ మీద చేయి చేసుకోడానికీ పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ అలియాస్‌ నాని, శాసనసభ్యుడు బొండా ఉమా, శాసన మండలి (దీనిని పెద్దల సభ అంటాం) సభ్యుడు బుద్ధా వెంకన్న సాహసించి ఉండేవారా? చింతమనేని ప్రభాకర్‌ చేసిన తప్పుకు ఆయన మీద చట్టపరమయిన చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి ఇప్పుడు నాని తదితరుల మీద ఏం చర్యలు తీసుకోగలరు? అట్లా తీసుకోవాలనే ఆలో చన కూడా ఆయనకు ఏ కోశానా ఉన్నట్టు కనిపించదు.



చింతమనేని నుంచి కేశినేని దాకా తన వాళ్లను రక్షించుకునే క్రమంలో ముఖ్యమంత్రితో పాటు, ఆయన ప్రభుత్వం ప్రజల్లో చులకన అయిపోతున్న విషయాన్ని మరిచిపోతున్నారో, పట్టించుకోనక్కరలేదని అనుకుంటున్నారో తెలియదు. చింతమనేని వ్యవహారంలో తన ఏరియాలోకి రాని చోటికి వెళ్లి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారని ఎంఆర్‌వో వనజాక్షిని ఆక్షేపించారే కానీ ఆ అక్రమానికి పాల్పడ్డ ప్రభాకర్‌ను మాత్రం పల్లెత్తు మాట అనడానికి సాహసించలేదు.



తనవారి తప్పులు కానరావు

వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాజధాని భూముల వద్దకు వెళ్లి అధికారులూ, ఉద్యోగులను ఉద్దేశించి అసభ్య పదజాలం ప్రయోగించినా చర్యలు ఉండవు. శాసనసభ్యులు, మంత్రుల కుమారులు కొందరు నడి రోడ్ల మీద ఆడపిల్లను కార్‌ లోకి లాగే ప్రయత్నం చేసినా, మోటార్‌ సైకిల్‌ రేసుల్లో విజయవాడ వీధుల్లో స్వైర విహారం చేసి అమాయకుల మీదకు బండ్లు ఎక్కిం చినా ముఖ్యమంత్రి ఏ చర్యలూ తీసుకునేందుకు చొరవ చూపరు. ఇప్పుడు కేశినేని నాని తదితరులు ఏకంగా ఒక ఐపీఎస్‌ అధికారి మీదికి పోట్లాటకు వెళ్లి, పరుష పదజాలం ఉపయోగించి గన్‌మ్యాన్‌ను నెట్టి అవమానిస్తే క్షమా పణలతో సరిపుచ్చేసారు.



ప్రజాస్వామ్య మూల స్థంభాలుగా చెప్పుకునే నాలుగు వ్యవస్థల్లో రెండు– శాసనవ్యవస్థ, అధికార యంత్రాంగం మధ్య ఘర్షణ మంచిది కాదు, చట్ట పరమయిన చర్యల దాకా వెళ్లకుండా శాంతియుతంగా పరిష్కరించాలనే సదుద్దేశం ముఖ్యమంత్రికి ఉంది కాబట్టే కేసులు లేవని కాసేపు అనుకుందాం. ఎందుకంటే ఆయనను సమర్ధించేవారు అదే మాట చెబుతున్నారు. మరి అదే నిజమయితే పదిమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న బస్సు ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్‌ మృత దేహానికి పోస్ట్‌మార్టం ఎందుకు చెయ్యలేదని జిల్లా కలెక్టర్‌ను, వైద్యాధికారులను ప్రశ్నించిన పాపానికి ప్రతి పక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి మీద కేసులేందుకు పెట్టారు? తిరుపతి విమానాశ్రయంలో ఒక ఉద్యోగితో జరిగిన స్వల్ప వాగ్వివాదం సంఘటనలో పట్టుబట్టి ప్రతిపక్ష పార్లమెంట్‌ సభ్యుడు మిథున్‌రెడ్డి, శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తదితరుల మీద కేసులెందుకు పెట్టారు? రోజుల తరబడి భాస్కర్‌రెడ్డిని జైలు కెందుకు పంపించారు? ప్రతిపక్షానికి ఒక నీతి, అధికార పక్షానికి ఒక నీతా అని ప్రశ్నించి, నిరసనకు దిగిన ఎమ్మెల్యే భాస్కర్‌ రెడ్డిని రోజంతా పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించి సాయంత్రం ఎందుకు వదిలేశారు.



ఒక శాసనసభ్యుడిని సమావేశాలు జరుగుతున్న రోజున అరెస్ట్‌ చేసి  ఏ కేసూ పెట్టకుండా, కారణం అయినా చెప్పకుండా సాయంత్రానికి ఇక వెళ్ళిపో అని వదిలేసారంటే ఇక ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య ప్రజలకు దిక్కేమిటి? రాజకీయ నాయకత్వానికీ, అధికార యంత్రాంగానికీ మధ్య నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణంలో అన్ని సంఘటనలనూ ఒకే విధంగా చూడాలని కొందరు బీజేపీ నాయకులు సుద్దులు చెబుతున్నారు. అలాంటప్పుడు అన్ని సంఘటనల్లోనూ కేసులు ఉండాలి కదా! ఇటువంటి సంఘటనలు జరిగి నప్పుడు అవి ఎంత స్వల్పమయినవి అయినా ప్రతిపక్షం మీదనే కేసులెం దుకు నమోదు చేయడం? అవి ఎంత తీవ్రమైనవైనా అధికార పక్షం మీద కేసులు ఉండవెందుకు? సర్దుబాట్లు, క్షమార్పణలకే పరిమితమెందుకు? స్నేహధర్మంలో భాగంగా అధికార పక్షాన్ని కాపాడేందుకు ఇటువంటి కప్ప దాటు వైఖరి అవలంబించే బీజేపీ నాయకులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. విశాఖపట్నం దగ్గర భూముల కుంభకోణం గురించి మాట్లాడుతూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆధారాలు చూపుతున్న బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు విష్ణుకుమార్‌రాజుకే బెదిరింపులు వస్తున్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న కొందరు ఆ పార్టీ నాయకులు గుర్తించాలి.



మేనేజ్‌ చెయ్యడమనగా....!

నేను దేన్నయినా మేనేజ్‌ చెయ్యగలను అని ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతుంటారు. అధికార యంత్రాంగం నోరు నొక్కెయ్యడం, ప్రతి పక్షాన్ని శాసనసభ లోపల మైకులు కట్‌ చేసి, బయట కేసుల్లో ఇరికించి మాట్లాడకుండా చేసి, మీడియా మీద దాడి చేసి బహుశా మేనేజ్‌ చెయ్యడం అంటే ఇదేనని చెబుతారేమో చంద్రబాబు. తనను వ్యతిరేకించే మీడియాను నియంత్రించేందుకు చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన నాటి నుంచి విఫలయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.



తాజాగా శాసన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌రావు సభ వెలుపల ఒక  సమావేశంలో మాట్లాడుతూ మహిళలను గ్యారేజీలో ఉండే కొత్త కార్లతో పోలుస్తూ మాట్లాడిన మాటలను ప్రచురించినందుకూ, ప్రసారం చేసినం దుకు ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానల్‌లను లక్ష్యం చేసుకుని ఇబ్బందిపెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని స్పష్టం అవుతున్నది. స్థానిక మీడియాతో పాటు, జాతీయ ప్రచార ప్రసార మాధ్యమాలు అనేకం ఈ వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తెచ్చి స్పీకర్‌ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం తెలిపినా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఒక్క ‘సాక్షి’ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రసంగం క్లిప్పింగ్‌లను చూపడం దేనికి సంకేతమో అందరికీ తెలుసు. అధికార పక్షానికి వత్తాసు పలకడం లేదు కాబట్టి ఒక మీడియా సంస్థను ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగింది. మీడియాను భయపెట్టి, బెదిరించి, లొంగ దీసుకోవాలనే ప్రయత్నాలు గతంలో చాలానే జరిగాయి, అవి ఎటు వంటి దుష్ఫలితాలను ఇచ్చాయో ఉదాహరణలు మన కళ్లముందే ఉన్నాయి.



వ్యవస్థలన్నీ పరస్పర గౌరవంతో మెలిగితేనే ప్రజాస్వామ్యానికి వన్నె చేకూరుతుంది. ఇకపోతే  ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం న్యాయ వ్యవస్థ ఒకటే మిగిలిందిక. ఒక్క కేసులో కూడా విచారణ ఎదుర్కోకుండా స్టేలు తెచ్చు కోవడం చూస్తూనే ఉన్నాం. 2050 వరకూ తామే అధికారంలో ఉంటామన్న ఊహల్లో విహరిస్తూ, అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి అయిదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయని కానీ, అవి మరో రెండేళ్లలో ముంచుకు రానున్నాయని కానీ మరచిపోయినట్టున్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతిపక్షం ఉండకూడదు, సత్యాలు మాట్లాడే మీడియా ఉండకూడదు. ప్రజాభిప్రా యంతో తనకు పనిలేదన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. ఏం చేసినా అంతి మంగా ఓట్లు వేయవలసింది ప్రజలే, అంత ముఖ్యమైన విషయం మరచి పోతే ఎలా?





- దేవులపల్లి అమర్‌


datelinehyderabad@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top