దిగజారుడు రాజకీయం

దిగజారుడు రాజకీయం - Sakshi


ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ కీలకమైన ప్రక్రియ. జనం తమ ఇష్టా యిష్టాలను వ్యక్తం చేయడానికి, తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడానికీ... మీ చర్యలను గమనిస్తున్నామంటూ పాలకులను హెచ్చరించడానికీ అదొక సందర్భం. తమకు ప్రాతినిధ్యం వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయగలవారెవరో, మెరుగైన పాలనను అందించగలిగే సత్తా ఉన్న పార్టీ ఏదో ఓటర్లు నిర్ధారించుకుని ఎంచుకో వడం దీని వెనకున్న ఉద్దేశం. అది దేశ ప్రజల ప్రారబ్ధమనాలో, దురదృష్టమ నాలో... ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రక్రియను భ్రష్టు పట్టించడానికీ, దానికి అవినీతి మకిలి అంటించ డానికీ శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఎన్నికలంటేనే అందరికీ ఏవగింపు కలిగేలా చేస్తారు.



పంచాయతీరాజ్‌ మొదలుకొని పార్లమెంటు వరకూ ఏ ప్రజాస్వా మిక సంస్థలకు ఎన్నికలు జరిగినా ఆయన ధోరణి అదే. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా దాన్నుంచి ఆయన బయటపడలేదు. రెండేళ్లక్రితం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరెన్సీ కట్టలు వెదజల్లి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీని కొనడానికి ప్రయత్నిస్తూ ఆడియో, వీడియోలకు దొరికిపోయినా అలాంటి పాపిష్టి పనులకు దూరంగా ఉందామన్న భావన ఆయనకు కలగలేదు. అన్ని వ్యవస్థలూ చురుగ్గా పనిచేసి ఆ కేసు ఈపాటికి ఒక కొలిక్కి వచ్చి ఉంటే ఏమయ్యేదోగానీ... ఇప్పటికి మాత్రం ఆయనలో ఏ మార్పూ రాలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఆ దిక్కుమాలిన విద్యనే బాబు మరోసారి ప్రదర్శించారు. రాష్ట్ర ప్రజలనే కాదు... దేశంలో అందరినీ దిగ్భ్రమపరిచారు.



మండలిలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన 7 స్థానాలు, స్థానిక సంస్థలకు చెందిన 9 స్థానాలు, పట్టభద్రులకు సంబంధించిన 3 స్థానాలు, ఉపాధ్యాయులకు చెందిన 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తన బలా బలాలను లెక్కేసుకుని ఎమ్మెల్యే కోటాలోని 2 స్థానాలకు అభ్యర్థుల్ని నిలిపింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన స్థానాల్లో తన ఎత్తుగడలు పారబోవని గ్రహించి తన పార్టీ గెలిచే అయిదు స్థానాలకే బాబు అభ్యర్థుల్ని నిలపడంవల్ల నిలబడినవా రంతా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. మిగిలిన ఎన్నికల్లో సైతం బలమున్నచోట మాత్రమే పోటీ చేయాలన్న సూత్రబద్ధ వైఖరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కట్టుబడింది. అందువల్లే స్థానిక సంస్థలకు సంబంధించి 9 ఖాళీలుంటే అందులో మూడింటికి మాత్రమే అభ్యర్థుల్ని నిలిపింది. పట్టభద్రులకు సంబంధించిన ఒక స్థానంలో పోటీ చేసింది. మిగిలిన పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్థానాల్లో టీడీపీయేతర పక్షాలను బలపరిచింది. టీడీపీ మాత్రం ఏ విధంగానైనా గెలవాలన్న దురాశతో అడ్డదార్లు తొక్కింది. అన్నిచోట్లా పోటీకి దిగింది. అన్ని విలువలకూ తిలోదకాలిచ్చి కరెన్సీ కట్టలను వెదజల్లి, బెదిరింపులకు పాల్పడి, అధికార దర్పాన్ని ప్రదర్శించి ఎన్నికల ప్రక్రియనే దిగజార్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీలనూ, జడ్‌పీటీసీలనూ ప్రలోభపరిచింది. కొన్నిచోట్ల కిడ్నాప్‌లకు తెగబడింది. విలాసవంత మైన శిబిరాలు నడిపింది. బలం లేనిచోట పోటీ చేసి గెలుపొందామని తెలిస్తే పరువుప్రతిష్టలు దిగజారతాయన్న వెరపు లేకుండా ప్రవర్తించింది. తన ప్రలోభాలకూ, బెదిరింపులకూ లొంగినవారిని చార్టెర్డ్‌ విమానాలను రంగంలోకి దించి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోని శిబిరాలకు తరలించింది. ఒక్క వైఎస్సార్‌ జిల్లాలోనే వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందన్న కథనాలు వింటుంటే ఈ ఎన్నికలను బాబు ఏ స్థాయికి దిగజార్చారో ఊహించుకోవచ్చు.



తాను రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా ఉన్నానన్న సంగతిని కూడా మరిచి ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలతో ఆయన నేరుగా మాట్లాడి, వారిని అన్నివిధాలుగా చూసుకుంటానని హామీలిచ్చారంటు న్నారు. పర్యవసానంగా నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లోని స్థానిక సంస్థలకు చెందిన మూడు స్థానాల్లోనూ తమకేమాత్రం బలం లేకపోయినా టీడీపీ నెగ్గగలి గింది. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నెల్లూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ 435 చోట్ల గెలిస్తే... టీడీపీ 340కి మాత్రమే పరిమితమైంది. దాని ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 95 ఓట్ల తేడాతో ఓడిపోవాలి. కానీ ఆ పార్టీ 87 ఓట్ల మెజారిటీతో నెగ్గింది. కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో కూడా ఇదే స్థితి. కర్నూలులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 531, టీడీపీకి 454 స్థానాలున్నాయి. వైఎస్సార్‌ జిల్లాలో 521మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌కుంటే కేవలం 303మంది టీడీపీకి ఉన్నారు. అయినా కర్నూలులో 62 ఓట్లతో, వైఎస్సార్‌ జిల్లాలో 38 ఓట్లతో టీడీపీ గెలుపొందింది. ఏ ప్రలోభాలూ పెట్టలేని, ఎటువంటి బెదిరింపులకూ పాల్పడలేని పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ చావు దెబ్బతింది.



‘స్థానిక’ ఎన్నికల్లో నానాగడ్డీ కరిచి చివరకు గెలిచాననిపించుకున్న బాబుకు ఈ నియోజకవర్గాలు తగిన గుణపాఠమే నేర్పాయి. అక్కడికి మంత్రుల్ని, ఇతర మందీమార్బలాన్నీ తరలించి ఆపసోపాలు పడినా ఫలితం లేకపోయింది. టీడీపీ మూడేళ్ల పాలనతో విసిగిపోయిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఆ పార్టీ అభ్య ర్థుల్ని తిరస్కరించారు. పోటీచేసిన ఒక స్థానంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయ పథంలో ఉండటమే గాక మిగిలినచోట్ల ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలు పొందారు. అయినా బాబుకు వెరపు లేదు. ఈ ఎన్నికల్లో ప్రతిబింబించిన ప్రజాభిప్రాయాన్ని చూసి... ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తన పార్టీ గతేమవుతుందో గ్రహించి సిగ్గుతో చితికిపోవాల్సింది పోయి ఆయన దబాయింపులకు దిగు తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే విజయమంటున్నారు. సొంత జిల్లా చిత్తూరులోనే టీడీపీకి శృంగభంగమైన వైనం తెలియనట్టు నటిస్తున్నారు. బాబు తనంత తాను ఎలాగూ మారరని, పాత ధోరణులను వదులుకోరని ఈ ఎన్నికలు నిరూపించాయి. ‘ఓటుకు కోట్లు’ కేసులో అయినా త్వరగా విచారణ పూర్తయి, దోషులెవరో నిర్ధారణ అయితే ఆయన సంగతలా ఉంచి కనీసం ఆయన అను చరగణమైనా పద్ధతుల్ని మార్చుకుంటుంది. నిబంధనలకూ, విలువలకూ పాతరేస్తే పుట్టగతులుండవని గ్రహిస్తుంది. ఆ రోజు త్వరగా రావాలని ప్రజాస్వామికవాదులు ఆకాంక్షిస్తారు.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top