పరిశుద్ధ నగరం పగటి కలా?

జరిమానా విధిస్తున్న ముంబై క్లీన్‌–అప్‌ మార్షల్‌


విశ్లేషణ

వరద నీరు బయటకు పోవడానికి ఉద్దేశించిన కాలువలను చెత్తతో నింపేసి, అది నీటి ప్రవాహాన్ని అడ్డగించినప్పుడు ప్రజలు, అందుకు కారణమైన తమను తప్పుపట్టుకోకుండా నగర పాలన సంస్థ వైపు వేలెత్తి చూపుతుంటారు.



బహిరంగ ప్రదేశాలను చెత్త చేస్తున్నందుకు 14 లక్షల మందిని హెచ్చరించి, 5 లక్షలకంటే ఎక్కువ మందికి జరిమానాలు విధించి ఒక్క ఏడాదిలోనే రూ. 8.27 కోట్లను జరిమానాలుగా వసూలు చేశారంటే... ఆ నగరం చెత్తకు పూర్తి అతీ తంగా కాకపోయినా, మరింత పరిశుభ్రమైనదిగా ఉంటుందని అనుకోవడం సహజం. కానీ దేశంలోనే అతి పెద్ద, సుసంపన్న పట్టణ ప్రాంతమైన ముంబై విషయంలో అలా జరగలేదు. నగర పరిశుభ్రతపై అన్ని హెచ్చరికలను జారీ చేశాక గ్రేటర్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు జరిమానాలు విధించడం మొదలెట్టాయి. నగర పాలక సంస్థ ఉద్యోగులు, ఔట్‌ సోర్స్‌డ్‌ ఉద్యోగులు యూనిఫారాలు ధరించి, రసీదు పుస్తకాలు పట్టుకుని నిర్లక్ష్యంగా నగరాన్ని చెత్త చేసే వారిపై కన్నేసి ఉంచుతున్నారు.



ఆ నగర జనాభా 1.24 కోట్లు. పగటి వేళల్లో అంతకంటే గణనీయంగా ఎక్కువ జనాభాతో కిటకిటలాడిపోతుంటుంది. శివారు ప్రాంతాల నుంచి గుంపులు గుంపులుగా జనం పని చేయడం కోసం నిత్యం ముంబైకి వస్తుంటారు. శివారు ప్రాంతాలు నిజానికి సొంత స్థానిక పరిపాలనా సంస్థలు గల ఇతర నగరాలే.



నగర పాలక సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన పథకాలలో ఎక్కడా కిక్కిరిసిన మురికివాడలు కానరావు. బ్రహ్మాండమైన ఈ నగరంలోని గొప్ప వైరుధ్యం ఇది. 300 మంది ఉపయోగించే ఒక్కో మరుగుదొడ్డి శుద్ధికి అతి కొద్దిగానే నీరు లభ్యం కావడం, చెత్త చెదారం వగైరాలను తరలించేవారు లేకపోవడం వంటివి ఈ మహా నగర పారిశుద్ధ్య సమస్యలకు అదనం. పారిశుద్ధ్య పరిరక్షకులు ఈ మురికివాడలను సందర్శించరు. జనం ఎక్కువగా తిరిగే స్టేషన్లలాంటి ప్రాంతాలకే వారు పరిమితమవుతారు.



ప్రకాశవంతమైన, ఉజ్వలమైన ముంబై అనే భావనకు మురికివాడలు ఒక వైరుధ్యంగా నిలుస్తాయి. కార్యాలయాలుండే అద్దాల టవర్లు, నివాసాలుండే ఆకాÔ¶ హర్మ్యాలకు ఆనుకునే మురికివాడలుంటాయి. చెత్తకు నిలయంగా పేరు మోసిన నగరంలోని ఆ పది శాతం ప్రాంతంలోని మురికివాడలు నగర జనాభాలో సగానికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. నగర ప్రణాళికల నమూనాలలో ఎక్కడా వాటికి చోటుండదు. ముంబైని పరిశుభ్రమైన నగరమని అనలేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.



ఇది, మురికివాడల నుంచి చెత్తను తీసుకుపోవడం, అక్కడ నివసించేవారికి తాగునీటిని, దాదాపుగా పనికిరాకుండా ఉండే ఉమ్మడి మరుగుదొడ్లకు నీటిని అందించడానికి సంబంధించిన సమస్యలు నగర నిర్వాహకుల దృష్టికి సుదూరం నుంచైనా కానరావు. బిల్డర్ల దృష్టిలో మురికివాడలంటే అక్కడివారికి ప్రత్యామ్నాయ గృహవసతిని కల్పించి, బహిరంగ మార్కెట్‌ కోసం అదనపు నిర్మాణాలను నిర్మించి భారీ లాభాలతో జేబులు నింపుకునే రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులు. అంతేగానీ జనావాసాలు మాత్రం కావు.



దక్షిణ ముంబై, నగరంలోని అతి గొప్ప ప్రాంతం. వలస కాలం నాటి భవనాలు, వ్యాపార ప్రాంతాలు, సముద్ర తీరానికి అభిముఖంగా ఉండే ప్రాంతాలు, భారీ మైదానాలు అక్కడే ఉంటాయి. పారిశుద్ధ్య పరిరక్షకులు (క్లీన్‌ అప్‌ మార్షల్స్‌) విధుల్లో ఉన్నా అక్కడి బహిరంగ ప్రదేశాలు సైతం శుభ్రంగా ఉండవు. వీధిలో ఏమైనా పారేసినందుకు లేదా ఉమ్మినందుకు రూ. 200, మలమూత్ర విసర్జనకు రూ. 200, పెంపుడు కుక్క మలమూత్ర విసర్జన చేయడాన్ని అనుమతించినందుకు రూ. 500 జరిమానాలను విధిస్తున్నారు. సదరు పౌరులు వారితో వాదులాడినా చాలావరకు జరిమానాలను చెల్లిస్తున్నారు.



ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, దుకాణాలను ఏర్పాటు చేసుకుని పాదచారులు వాటిని ఉపయోగించుకోనివ్వకుండా చేసే వీధుల్లోని చిన్నవ్యాపారులు ఇప్పుడు జాగ్రత్తగా తమ వ్యర్థాలను చెత్తబుట్టలో వేస్తున్నారు. కాబట్టి ఒకప్పటి కంటే నగరం ఇప్పుడు మరింత శుభ్రంగా ఉందని నగర పరిపాలనా విభాగం చెప్పుకోవచ్చు. కానీ అది, మొత్తంగా ఈ కథనంలోని ఒక భాగం మాత్రమే. ఇది నా ఇల్లు కాకపోతే చాలు, చెత్తా చెదారం పడేసి మురికిమయం చేయదగిన ప్రాంతమేననే ప్రజల వైఖరి ఈ కథనంలోని మరో భాగం.



ఆసక్తికరంగా, ఈ జరిమానాల గురించిన అధికారిక గణాంక సమాచారంతో మీడియా నివేదిక వెలువడిన రోజునే మరో కథనం కూడా వెలువడింది. అది, నగరంలోని ప్రధానమైన కాలువలలో చెత్త పడేయడాన్ని నిరోధించడానికి వాటిపై పాలీకార్బనేట్‌ (దృఢమైన «థర్మో ప్లాస్టిక్‌) షీట్లను కప్పే పథకం గురించినది. ఈ కాలువలు నిజానికి వరద నీరు బయటకు పోవడానికి ఉద్దేశించినవి. కానీ అవి అతి పెద్ద చెత్త పడేసే స్థలాలుగా మారాయి. కాలువల్లో చెత్త పేరుకుపోయి, నీటి ప్రవాహాన్ని అడ్డగించినప్పుడు ప్రజలు... అందుకు కారకులైన తమను తప్పుపట్టుకోకుండా నగర ప్రభుత్వం వైపు వేలెత్తి చూపుతుంటారు. పౌరులు గొంతును శుభ్రపరచుకుని ఎక్కడబడితే అక్కడ ఊసే పరిస్థితి ఉన్నప్పుడు నిజంగానే పరిశుభ్రత కానరాదు. అలా ఊసేట ప్పుడు అది దారిన పోయేవారిపై పడకుండా ఉండటం అరుదు. ఇద్దరూ దీనికి ఎంతగా అలవాటు పడిపోయారంటే పాన్, తంబాకు నమిలేవారు ఆ పనిని... పారి శుద్ధ్య పరిరక్షకుల కంటపడితే తప్ప... సర్వసాధారణమనే భావిస్తుంటారు. పరిశుభ్రతను అలవాటుగా చేయడానికి బహుశా ఇప్పుడున్న దానికి వేల రెట్ల బలమైన భారీ బలగం అవసరం కావచ్చు.







- మహేష్‌ విజాపృకర్‌


వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top