కార్టూనిస్టుల గడ్డ- మోహన్‌ సార్‌ అడ్డా

కార్టూనిస్టుల గడ్డ- మోహన్‌ సార్‌ అడ్డా


ఆ అడ్డామీదికొస్తే కూలి గ్యారంటీ లేదు కానీ... కళ రావడం గ్యారంటీ. కళకు కాసులు కావాలంటే ఏ ఫైనాన్స్‌ కంపెనీనో, చిట్‌ఫండ్‌ పెట్టుకోమంటారు... ఆయన రాసిన కార్టూన్‌ కబుర్లు, వ్యాసాలు, గీసిన కార్టూన్‌లు చూస్తే చాలు ఏదో చేతబడి అయినట్లుగా ఓ రెండ్రోజుల్లో ఆయన ముందు వచ్చి వాలుతాం! అదే మోహన్‌ సార్‌ తావీదు మంత్రం. ఇప్పటికీ ఆ మంత్రం నుంచి బయటపడలేక ఆయన చుట్టే తిరుగుతున్నాం. మంత్రం బాగా పనిచేస్తే, ఏ పేపర్లోనో, యానిమేషన్‌లోనో, చిత్రకారుడిగానో రాణిస్తూ మా కుటుం బాలకు ఇంత అన్నం పెట్టుకుంటున్నామంటే అది ముమ్మాటికీ మాకు ఆయన పెట్టిన భిక్షే!



కొత్తగా ఏం బొమ్మలు వేశావబ్బా! అని అడుగుతారు. వేశామంటే కుదర్దు చూపించాలి కూడా.. మాకు ఇప్పటికీ భయమే ఏ బొమ్మ గీసినా ఆయన చూస్తారని.. అలా ఆయన తన కార్టూన్‌ కబుర్ల ఫైన్‌ ఆర్ట్‌ కోర్సులు ప్రవేశపెట్టి పైనుంచి మా బొమ్మలను చూస్తూ మాలాంటి కార్టూనిస్టులకు ఒళ్లు దగ్గర పెట్టుకొని బొమ్మలు వేయాలని పరోక్షంగా హెచ్చరిస్తూనే ఉంటారు. విశాలాంధ్రలో రిపోర్టరుగా కెరీర్‌ ప్రారంభించిన మోహన్‌ అదే పత్రికలో కార్టూనిస్టుగా పనిచేసి తర్వాత హైద్రాబాద్‌లో ఆంధ్రప్రభ, ఆ తర్వాత ఉదయం దినపత్రికల్లో కార్టూనిస్టుగా పనిచేశారు. ఉదయంలోనే తన కార్టూన్లు, కేరికేచర్లు, వ్యాసాలతో విశ్వరూపం ప్రదర్శిం చారు. రొటీన్‌గా వస్తున్న కార్టూన్లకు భిన్నంగా తన రేఖా విన్యాసంతో పతంజలి కథలకు, రకరకాల ప్రయోగాలతో బొమ్మలు గీశారు. తెలుగునాట చిత్రప్రసాద్‌ను పరిచయం చేసి సునీల్‌ జానా అనే ప్రఖ్యాత ఫోటో గ్రాఫర్‌ తెలంగాణ సాయుధ పోరాటానికి చెందిన ఫోటోలు ఢిల్లీ నుంచి తెప్పించి వాటిని పుస్తక రూపంలో మనముందుంచారు. బ్యాక్‌ అండ్‌ వైట్‌తో తన ఇంక్‌ డ్రాయింగ్స్‌ని చిత్తప్రసాద్‌ను మరిపించే విధంగా గీశారు. మా అందరినీ చిత్తప్రసాద్‌కు వీరాభిమానులుగా చేసేశారు.



తన గురించి తన బొమ్మల గురించి ఎవరైనా పొగిడితే, మా దృష్టి మరల్చి వీడి బొమ్మలు చూడబ్బా.. వీడు మొనగాడు అంటూ ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుల జాబితాను ముందుంచేవారు.  తెలుగు మీడియంలో చదివిన మాకు విదేశీ చిత్రాలను, ఆ రచయితలను, కార్టూనిస్టులను వాళ్ల గొప్పతనాన్ని చెప్పి, మేం ఏ ఇంగ్లిష్‌ రచనా చదవకుండానే కొన్ని వందల పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని మాకు పంచిపెట్టారు. నిజంగానే మోహన్‌ ఒక ఆర్ట్‌ బైబిల్‌. మీసాన్ని చిటికెన వేలితో తడుముతూ, బొమ్మలు గీసే మోహన్‌ సార్‌ లేడు అన్న భావం మాకు ఇంకా కలగటం లేదు. ఎందుకంటే ఆయన మాలోనే ఉన్నాడు. తన దగ్గరికొచ్చిన ప్రతి వ్యక్తిలో ఏదో రకంగా చేరిపోయారు. ఆయనను వదిలించుకోవటం ఎవరితరం కాదు. అందుకే ఆయన్ని మాతోనే ఉంచుకున్నాం.. ఉన్నారు.. ఉంటారు. మోహన్‌ సార్‌ జిందాబాద్‌!



-శంకర్‌

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top