బీజేపీ వగలు, టీడీపీ దిగులు

బీజేపీ వగలు, టీడీపీ దిగులు - Sakshi


విశ్లేషణ

ఉత్తరప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రి పదవిని యోగి ఆదిత్యనాథ్‌కు అప్పగించి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పెద్ద సాహసమే చేశారు. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్లలో తీసుకున్న నిర్ణయాలలో ఇది నిస్సందేహంగా కీలకమైనది. భవి ష్యత్తులో జరగబోయే ఇలాంటి సాహసాలకు బహుశా ఇదొక సంకేతం కావచ్చు. సమీప భవిష్యత్తులో బీజేపీ సాధించవలసిన పెద్ద విజయాలు ఏమీ కానరావు.



అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భవిష్యత్‌ ప్రణాళిక గురించి ఒక కీలక నిర్ణయం తీసుకోవలసిన పని మాత్రం మిగిలి ఉంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోను బీజేపీ పట్టు సాధించడానికి అవకాశాలు అందీఅందకుండా ఉండి పోతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి రెండు చోట్లా కూడా చిగురంత ఆశ కూడా లేదు. ఏదిఏమైనా తెలుగు ప్రాంతాలలో విస్తరించడానికి బీజేపీ పట్టుదలతో ఉందని మాత్రం చెప్పవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో సాధించిన ఘన విజయం ఆ పార్టీలో పట్టుదలను మరింత పెంచింది.



చరిత్రను చూడండి! అందులో అలెగ్జాండర్‌ అనే యువ విజేత విజయా లను చూడండి! తన తండ్రి శత్రువులందరినీ ఆయన ఓడించి, గ్రీస్‌ను గెలిచాడు. అక్కడితో ఆగిపోలేదు. పర్షియాను కూడా ఓడించాడు. ఆపై ప్రపంచాన్ని జయించి విశ్వవిజేతగా చరిత్రకెక్కాడు. తన జైత్రయాత్రలో అలెగ్జాండర్‌ ఎప్పుడూ ఒక్క శత్రువు మీదే దృష్టిని కేంద్రీకరించిన సంగతి అర్థమవుతుంది. శత్రువులందరినీ ఏకకాలంలో తుదముట్టించాలన్న ఆలోచన చేయలేదు. మోదీ, షాలు కూడా ఒక రాష్ట్రం తరువాత ఒక రాష్ట్రం మీద దృష్టి సారిస్తు న్నారు. తన విస్తరణ కార్యకలాపాలకు పదును పెట్టవలసిన రాష్ట్రాలు ఆ పార్టీకి రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీకి మిత్రులంటే మిత్రులూ కాదు. శత్రువులు కూడా కాదు. మిత్రులంటే మిత్రులు. శత్రువులంటే శత్రువులు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలో బీజే పీని ఒక నిర్దిష్ట రాజకీయ శక్తిగా నిర్మించాలా, లేదా ఏదో ఒక ప్రాంతీయ పార్టీకి తోక పార్టీగా కొనసాగించాలా అనే అంశాన్ని నిర్ణయించడానికి మాత్రం ఇదే సరైన సమయం.



తోక పార్టీలా మిగిలిపోవడం సాధ్యమా?

అంతర్జాతీయ మార్కెట్‌లో ‘నో కంపీట్‌’ (పోటీ రహితం) అనే షరతు ఒకటి ఉంది. అంటే మార్కెట్‌లో మరో కంపెనీ ఉత్పత్తులతో పోటీకి దిగకుండా ఉండి పోవడం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ అలాంటి ఒప్పందాన్నే చేసుకుంది. 2014లో అనివార్య పరిస్థితుల నడుమ బీజేపీ ఈ తరహా ఒప్పందం చేసుకుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లో తాజా విజయం తరువాత ఈ ఒప్పందం మీద పునరాలోచనలో పడింది. కొత్త దారులవైపు చూడడం ఆరంభించింది. నిజానికి 2004లో పార్టీ పరాజయం పాలైన తరువాత తెలుగుదేశం ఎలాంటి వైఖరిని ప్రదర్శించిందో బీజేపీ నేతలకు గుర్తుంది. 2002లో గోద్రా పరిణామాల అనం తరం తనను గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ చంద్ర బాబు ఇచ్చిన పిలుపు గురించి కూడా మోదీ మరచిపోలేదు. అసలు 2004లో తమ పార్టీ ఓటమికి కారణం మోదీయేనని కూడా చంద్రబాబు భాష్యం చెప్పారు. తమిళనాడులో కూడా బీజేపీకి మిత్రులు ఉన్నారు. డీఎంకే మొదలు ఏడీఎంకే వరకు కమలం పార్టీ ద్రవిడ పార్టీలతో మైత్రిని నెరపింది. అంతా అనుకూలించినప్పుడు బీజేపీ తన మిత్రులను వెంటనే మార్చివేస్తుంది. హరి యాణాలో ఓం ప్రకాశ్‌ చౌతాలాను, జార్ఖండ్‌లో జార్ఖండ్‌ ముక్తిమోర్చాను, అసోంలో అసోం గణ పరిషద్‌ను ‘ఉపయోగించుకోవడం, వదిలిపెట్టడం’ అన్న రీతిలో పక్కన పెట్టేసింది. పాత మిత్రుడిని మించి ప్రయోజనం చేకూర్చే కొత్త భాగస్వామి దొరికినా బీజేపీ పాతవారిని వదిలించుకుంటుంది.



నరేంద్ర మోదీ ఆశీస్సులతోనే షా బీజేపీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నా రని దేశంలో చాలామంది అభిప్రాయం. కానీ షా లేకపోతే మోదీకి కూడా కష్టమే. అమిత్‌షా స్థాయిలో నైపుణ్యం కలిగిన, ఎత్తుగడలను, వజ్రసదృశ నిర్ణయాలను అమలు చేయగలిగిన రాజకీయవేత్త ఇటీవల కాలంలో ఏ పార్టీలోనూ కనిపిం చరు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ద్వారా బీజేపీకి ఒనగూడే ప్రయోజనాలు ఎలా ఉంటాయో ముందుగానే షా ఊహించగలిగారు. నిజానికి ఉత్తరప్రదేశ్‌ను మించి ఆంధ్రప్రదేశ్‌లో కుల సమీకరణలు ఉన్నాయి.



ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మనుగడ ఎలా ఉంది? 2014 ఎన్నికలలో తెలుగు దేశం ఇస్తే బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసి, నాలుగు గెలుచు కుంది. నాలుగు ఎంపీ స్థానాలకు పోటీ చేసి రెండు సాధించుకుంది. అప్పటి పరిస్థితులలో బీజేపీకి అంతకు మించి అవకాశాలు ఏమీలేవు. పొత్తు పెట్టు కోవడానికి ఇతర పార్టీ ఏదీ ముందుకు రాలేదు. అందుకే టీడీపీ ఇచ్చిన వాటా తోనే సరిపెట్టుకుంది. నిజానికి ఆ సమయానికి అమిత్‌షాకు కూడా ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితులతో అంతగా పరిచయం లేదు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కులాలు, సంపద, అవినీతి, వైరి శిబిరాల రూపురేఖలు అన్నీ షాకు తెలుసు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల నిలిచిపోయిన పరమ వాస్తవం కూడా ఆయనకు తెలుసు. ఈ మధ్య ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలలో సీట్ల పంపకం గురించి షా ఒక కీలక ప్రకటన చేశారు. గతంలో టికెట్‌ ఇచ్చిన 280 మందిలో ఏ ఒక్కరికీ ఇప్పుడు అవకాశం ఇవ్వబోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతా కొత్తవారితోనే పార్టీ బరిలోకి దిగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాత నాయకత్వంతో పార్టీ ఎదిగే అవకాశమే లేదని ఆయన అంచనా. కొత్త నాయకత్వం; రాజకీయ పునాది, ప్రజాబలం ఉన్న నాయకులు కావాలని ఆయనకు తెలుసు.



క్షేత్రస్థాయిలో ఎలాంటి బలమూ లేని కొందరు కేంద్ర స్థాయి నాయకులే ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ శాఖను శాసిస్తున్నారని అమిత్‌షాకు తెలుసు. బీజేపీ కనుక పుంజుకుంటే, తెలుగుదేశం తిరోగమిస్తుం దని ఆ కేంద్ర నాయకులు భావిస్తున్న వాస్తవం కూడా అమిత్‌షాకు తెలిసినదే. రాష్ట్రంలోని ఒక వర్గం ఈ సిద్ధాంతాన్ని బాగా ఒంట పట్టించుకుంది. కాబట్టి బీజేపీ బలహీనంగా మిగిలిపోవడం ద్వారా తెలుగుదేశం బలంగా ఉండాలని ఆకాంక్షించే కొందరు తమ పార్టీలోనే ఉన్నారన్న వాస్తవం జాతీయ అధ్యక్షునికి తెలియనిది కూడా కాదు. దీనిని షా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుత బీజేపీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కె అడ్వాణీల నాటి పార్టీ కాదు. తెలుగు దేశాన్ని నిరోధించడం ద్వారా మాత్రమే బీజేపీ వికసిస్తుందని షాకు తెలుసు. తెలుగుదేశం భవిష్యత్తు గురించి షాకు పెద్ద పట్టింపు కూడా లేదు. మహారాష్ట్రలో చిరకాల మైత్రి నెరపిన శివసేన భవిష్యత్తు గురించే ఆలోచించడం మానేసిన బీజేపీకి తెలుగుదేశం భవిష్యత్తుకు గురించిన ఆలోచన ఎందుకు? 2014 ఎన్ని కల సమయానికి ఉన్న బలం తెలుగుదేశానికి ఇప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పు డొక చిన్న రాష్ట్రం. ఈ రాష్ట్రం నుంచి ఉన్న మద్దతు జారిపోయినా షా పట్టిం చుకునే స్థితిలో లేరు. మోదీ ప్రభుత్వానికి వచ్చిన బెడద ఏమీ ఉండదు. నిజానికి కాంగ్రెస్‌ను ఇకపై జాతీయ పార్టీ స్థాయిలో ఉంచరాదన్న తమ ఆశయం అమలు కావాలంటే ఆంధ్రప్రదేశ్‌లో తోక పార్టీలాగా కాక, ప్రబల శక్తిగా అవతరించక తప్పదు.  



సమీకరణలు మారితేనే...

ఏపీలో ప్రాబల్యం కలిగిన కొన్ని కులాలు ఉన్నా, వాటికి మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం లేని సంగతి కూడా షాకి తెలుసు. కొన్ని కులాలను సమీకరించడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లో సాధించిన తీరులోనే ఏపీలో కూడా విజయం సాధించ వచ్చునని బీజేపీ యోచన. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయం తరువాత తెలుగు దేశంలో కొంత దిగులు కనిపించింది. నిజానికి  ఆ ఎన్నికలలో బీజేపీ ఓడిపోతే, 2019 ఎన్నికలలో కమలాన్ని దూరంగా పెట్టి, ఎన్నికల బరిలోకి దిగాలని టీడీపీ ఆలోచించింది. బీజేపీ విస్తరించడమంటే తెలుగుదేశాన్ని బలహీనపరచడం ద్వారానే సాధ్యమని ఈ పార్టీ నేతలకు తెలియనిది కాదు. ప్రస్తుతం బీజేపీకి నాయకత్వం వహిస్తున్నవారు కూడా సామాజికంగా ప్రాబల్యం కలిగిన కులాల వారు కాదు. దీనితో గడచిన మూడేళ్లుగా పార్టీ బాగా బలహీనపడింది. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న కులాల వారికి అధికారం దక్కడం లేదన్న సంగతి బీజేపీ అధి నాయకత్వానికి తెలుసు. కులాల మధ్య విభజన తేవడం ద్వారా, మీడియాను అదుపులో ఉంచుకోవడం ద్వారా, ధనబలంతో తక్కువ సంఖ్యాకులైన కులాల వారే ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి కూడా వారికి ఎరుకే. అందుకే ఒక్కసారి బీజేపీ నాయకత్వం రాష్ట్రం మీద దృష్టి పెడితే ఈ దృశ్యాన్ని మార్చడం కష్టం కాకపోవచ్చు. బీజేపీని దూరం చేసుకోవడం ఇష్టం లేకపోతే తెలుగుదేశం 2019 ఎన్నికలలో మరిన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఎర వేయవచ్చు. కానీ అమిత్‌ షా వేరు అడ్వాణీ వేరు. టీడీపీ మరింత అప్రతిష్ట పాలైతే ఆ పార్టీతో కలసి బీజేపీ కూడా ఎందుకు మునిగిపోవాలి?  బీజేపీ తన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉండాలన్నదే చంద్రబాబు కోరిక. ఇది కూడా అమిత్‌షాకు బాగా తెలుసు.



ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో 403 స్థానాలు ఉన్నాయి. 18 శాతం ముస్లింలు, మాయావతికి చెందిన జాతవ్‌ కులస్థులు 6 శాతం, యాదవులలో 8 శాతం బీజేపీకి ఓటు వేయరని అమిత్‌షా అంచనా వేశారు. అందుకే మిగిలిన 68 శాతం ఓట్ల మీద ఆయన దృష్టి సారించారు. మొత్తం పోలైన ఓట్లలో 41 శాతం సాధిం చారు. చిత్రంగా యాదవుల, ముస్లింల ఓట్లు కూడా కొన్ని బీజేపీ సాధించు కుంది. వాస్తవానికి ఏపీలో పరిస్థితి మరింత నల్లేరు మీద నడక. జనాభాలో నాలుగు శాతం ఉన్న కులాల మద్దతుతోనే టీడీపీ మనుగడ సాగిస్తున్నది. మిగిలి నది 96 శాతం ఓటర్లు. ఇందులో 35 శాతం ఓట్లను ఆకట్టుకోగలిగితే తమ బలం విశేషంగా పెరుగుతుందని ఆ పార్టీ ఆశ. ఇది అమలు కావాలంటే కొత్త నాయ కత్వం కావాలి. మోదీ లేదా షా నేతలలో విధేయతను ఆశించరు, విజయాలను తెచ్చే వారినే ఎంచుకుంటారు. అవసరమైతే ఇతర పార్టీల నుంచి దిగుమతి చేస్తారు. ఏపీలో కొన్ని ఇతర మార్గాలు కూడా బీజేపీకి ఉన్నాయి. టీ డీపీతో పాత బంధాన్ని కొనసాగించడం అందులో ఒకటి. టీడీపీ కూడా కొన్ని స్థానాలను అద నంగా కేటాయించవచ్చు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా టీడీపీతో పాటు బీజేపీ కూడా నష్టపోవచ్చు. కొన్ని ప్రభావాలను బట్టి ప్రస్తుతం బీజేపీ నుంచి నెగ్గిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు యథాతథ స్థితిని ఆకాంక్షించే అవ కాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ఎదిగితే తమకు ఒరిగేది ఏమీ ఉండదు. కాబట్టి బీజేపీ రాష్ట్రంలో బలహీన ంగానే ఉండిపోవాలని వారు కోరుకుంటారు. ఇందుకు కేంద్ర స్థాయిలోని కొందరి ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే.



ఒంటరి పోరే శరణ్యం

బీజేపీ పాత బంధాన్ని తెంచుకుని కొత్త మిత్రుల కోసం అన్వేషించవచ్చు. కేంద్రంలో బలంగా ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీలు కూడా చేయి కలపడానికి ముందుకు రావచ్చు. బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగడం మరో మార్గం. వాస్త వానికి టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బీజేపీ తీర్థం తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ సమయంలో టీడీపీతో కలసి మళ్లీ పోటీ చేయాలా? లేదా ఒంటరి పోరాటం చేయాలా అన్నది బీజేపీ నిర్ణయించుకోక తప్పదు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం దరిమిలా తెలుగుదేశం పార్టీ ఎంత దిగులుగా ఉందో ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన చంద్రబాబు హావభావాలు చెప్పకనే చెప్పాయి. 2019 నాటికి ఏపీలో బీజేపీ బలోపేతం కావాలని గట్టిగా కోరుకున్నట్టయితే, తరువాత తెలంగాణలో పాగా వేయడం పెద్ద కష్టం కాదు. 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రబల రాజకీయ శక్తిగా అవతరించే అవకాశం బీజేపీకి వచ్చింది కూడా. కానీ రెండు దశాబ్దాల పాటు ప్రాంతీయ పార్టీలకు తోకగా మిగిలిపోవడంతో ఆ అవకాశాలు సన్నగిల్లాయి. మోదీ, షా ఉన్నత స్థానాలలో ఉండగా అలాంటి అవకాశం కనిపిస్తే బీజేపీ వదులుకునే అవ కాశాలు ఉండవు.





- పెంటపాటి పుల్లారావు

వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ppr193@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top