కోడై కూసిన మీడియా

కోడై కూసిన మీడియా - Sakshi


మహిళల భద్రతపై ఏపీ స్పీకర్‌ కోడెల వ్యాఖ్యలను సాక్షి మీడియా వక్రీకరించిందని ఏపీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు కానీ అంత కంటే మిన్నగా జాతీయ, అంతర్జాతీయ మీడియా రిపోర్టు చేయలేదా?



‘ఆడది తిరిగి చెడింది–మగాడు తిరగక చెడ్డాడు’.. ఇది స్త్రీలను ఇళ్లకి కట్టిపడేసేందుకు సమాజం ప్రచారంలో పెట్టిన నానుడి. దురదృష్టవశాత్తూ దీన్ని బలపర్చేవిధంగానేlరాజకీయ నాయకుల వ్యాఖ్యలు ఉంటున్నాయి. ‘మహిళా పార్లమెంట్‌’ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఏపీ శాసనసభ  స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు దీన్నే నిరూ పించాయి. వాహనాలు బయటకొచ్చినప్పుడు యాక్సిడెంట్లు జరిగే అవకాశాలున్నట్టే స్త్రీలు బయటకొచ్చినప్పుడు అత్యాచారాలూ వేధింపులూ జరుగుతాయనడం, ఇంటి పట్టునుంటే ఆడవాళ్లపై ఎలాంటి అఘాయిత్యాలూ జరగవనడం పై నాను డినే గుర్తు చేస్తున్నాయి.



ఓవైపు స్త్రీ సాధికార తను వల్లె వేస్తూ మరోవైపు వాళ్ల సామాజిక జీవితాన్ని వ్యతి రేకించడం ఏలికల నిజస్వరూపాన్ని వెల్లడిస్తోంది. సాధికార స్ఫూర్తిని మింగేసిన ఈ వ్యాఖ్యలపై  మీడియా సీరియస్‌గానే స్పందించింది. ‘సాక్షి’ సహా ప్రాంతీయ–జాతీయ పత్రికలూ చానళ్లూ స్పీకర్‌ వ్యాఖ్యల్ని శీర్షికలు చేశాయి. వాహనంతో ముడిపెట్టి ఆయన ప్రవచించిన మహిళా భద్రతా సిద్ధాంతాన్ని పాఠకుల ముందుంచాయి. స్త్రీల హక్కుల అంశం ఎంతో కొంత చర్చనీయాంశమవుతున్న సామాజిక సందర్భంలో ఈ తరహా కవరేజీ అభినందనీయం.



స్త్రీ పురుష సమానత్వం సాకారమయ్యేందుకు  మరో  170 ఏళ్లు వేచి ఉండక తప్పదన్న సర్వేలపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరగా సమానత్వం వచ్చేందుకు పోరాడాలని ప్రవచించడమే కాకుండా, కోడెల మాటల్లో తప్పు లేదని తేల్చేశారు! ఆయన వ్యాఖ్యల్ని లోకానికి చాటిన మీడియాపై అప్పట్లో బాబు కోపగించు కున్నారు. లక్షలాది కుటుంబాలతో ముడివడిన ‘అగ్రిగోల్డ్‌’ అంశాల్ని పక్కదారి పట్టించేందుకు గురు వారం అసెంబ్లీలో మళ్లీ కోడెల వ్యాఖ్యల్ని ముందుకు తెచ్చారు. స్పీకర్‌ మహిళా వ్యతిరేక వ్యాఖ్యల్ని ఉన్నవి ఉన్నట్టుగా అందించిన ‘సాక్షి’ మీడియాపై నిప్పులు కక్కారు. నిజానికి, ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ‘ఇండియా టుడే’ ‘దక్కన్‌ క్రానికల్‌’ ‘డీఎన్‌ఏ’ సహా వివిధ పత్రికలూ వెబ్‌సైట్లూ సైతం స్పీకర్‌ వ్యాఖ్యల్ని హైలెట్‌ చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ‘హఫింగ్టన్‌ పోస్టు’ సైతం దాన్ని లోకల్‌వార్తగా కొట్టేపడేసి వదిలేయలేదు. కానీ సీఎం మాత్రం యథాప్రకారం ‘సాక్షి’పై ఎటాక్‌ చేశారు.  



కోడెల వ్యాఖ్యలు ‘మహిళా పార్లమెంటు’లో ప్రస్తావనకే రాకపోవడాన్ని తన కథనంలో తొలి వాక్యం చేసుకున్నారు ‘హిందూ’ ప్రతినిధి (తేదీ : 12.2.17). రేపిస్టుల్ని జైళ్లలో పెట్టాల్సిన వాళ్లు ఆడ వాళ్లను కట్టడి చేయడంపై ‘ఆప్‌’ ఎమ్మెల్యే అల్కా లంబా ఆగ్రహించడం, మంత్రి వ్యాఖ్యల్ని యువ తులు ఖండించడం వంటి విషయాల్ని ఆమె తన కథనంలో వివరించారు. సోషల్‌ మీడియాలో తీవ్రంగా ఖండన మండనలకు గురైన ఆయన వ్యాఖ్యలు ఆ వేదికపై ప్రస్తావనకే రాకపోవడంలో ఎలాంటి విడ్డూరమూ లేదు. ఏలికలు తమకోసం తాము ఏర్పాటు చేసుకున్న ఇలాంటి కూటముల్లో ప్రశ్నలకూ ప్రస్తావనలకూ చోటివ్వరు. సాధికారత సంగతి అటుంచి, స్త్రీలు ఎదుర్కొంటున్న వేధిం పులపై అవగాహన లేని ‘సర్కారీ పార్లమెంట్‌’పై వెలువడిన విమర్శనాత్మక వ్యాఖ్యలతో వాళ్లకి పని లేదు. తమ ‘ఖ్యాతి’ని లోకానికి చాటే మీడియా సంస్థ వాళ్లకు ఉండనే ఉంది. అది కోడెల వ్యాఖ్యల్ని కత్తిరించేసి, సాధికార రంగుల స్వపాన్ని కంటికి కట్టే ప్రయత్నం చేసింది. ఆ విధంగా ‘పాజిటివ్‌’గా ఉండాలంటున్నారు ముఖ్యమంత్రి. అదే జరిగితే మీడియా తన మౌలిక విలువల్ని పూర్తిగా విస్మ రించినట్టే.



మహిళల భద్రత గురించి  కోడెల శివప్రసాద రావు వ్యాఖ్యలపై సాక్షి మీడియా ఏమని నివేదిం చిందో సరిగ్గా దాన్నే జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, వెబ్‌ సైట్లు నివేదించాయి. ఇంకా చెప్పా లంటే ఇంతకన్నా ఎక్కువగానే అవి టైటిల్స్‌లో కూడా వ్యంగ్యంగా తీసుకొచ్చాయి. ఆడపిల్లలు గతంలోలాగే హౌస్‌వై‹ఫ్‌లా ఉంటే వాళ్ల మీద ఏమీ జరగవు. మహిళలు పని కోసం, చదువుల కోసం బయటకు వెళ్లినప్పుడే వారు ఈవ్‌టీజింగ్, వేధింపు, అత్యాచారం, కిడ్నాప్‌ వంటివాటికి గురవుతు న్నారు’’ అని కోడెల అన్నట్లు హఫింగ్‌టన్‌ పోస్ట్‌ పేర్కొంది. ఇక thequint.com వెబ్‌సైట్‌ అయితే 'How to Avoid Rape? Stay Home Like Parked Car, Says Sexist Minister' అని ఈ వార్తకు టైటిల్‌ కూడా పెట్టేసింది. (https://goo. gl/YnQfbl).



నానా రకాల అణచివేతలు ఎదుర్కొంటూ, అవకాశాల కోసం పెనుగులాడుతూ ఈ స్థాయికి వచ్చిన స్త్రీలు ఇప్పడున్న సవాళ్లనూ అధిగమిస్తారు. ఇంటా బయటా ఎదురవుతున్న యాతనల్ని ఎదు ర్కొంటూ ముందుకే సాగుతారు. (మన స్పీకర్‌కి ఇంట్లో జరిగే అఘాయిత్యాలపై బొత్తిగా అవగాహన లేనట్టుంది) జీవితమంటే ఎదుర్కోవడమే. ఈ క్రమంలో వాళ్లు  పడిలేచే కడలి తరంగాలవుతారు. తమ జీవితాలపై పట్టు సాధించుకుంటారు. మనం పరిశీలించదలిస్తే వర్తమాన సమాజంలో ఎటు చూస్తే అటు ఇలాంటి దృశ్యాలే అగుపిస్తాయి. ఏలి కలూ.. మచ్చుకి తుందుర్రు వైపు చూడండి.

– వి.ఉదయలక్ష్మి

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top