ఉస్మానియాతో నా ఊసులు

ఉస్మానియాతో నా ఊసులు


ఆ రోజుల్లోనే సెవెన్‌స్టార్‌ సిండికేట్‌ వారు ‘నవత’ పేరుతో ఒక పత్రిక వెలువరించటం మొదలెట్టారు. ‘నవత’ అన్న పేరు పెట్టిందీ, పత్రికకు గౌరవ సంపాదకుడుగా ఉండటానికి శ్రీశ్రీని ఒప్పించిందీ వరవరరావే! అయితే ఆ పత్రిక ప్రారంభోత్సవం నాడు వరవరరావుకు గానీ, ఆయన మిత్ర బృందానికి గానీ ఆహ్వానమే లేదు. అయినా ‘నవత’ ప్రారంభోత్సవా నికొచ్చిన శ్రీశ్రీని కలుద్దామని వెళ్తే మమ్మల్ని గేటు దగ్గరే ఆపారు. అప్పుడే ‘‘మనమే ఒక త్రైమాసికను ప్రారంభిద్దాం వరవర్‌!’’ అని నేనన్నమాటే ‘సృజన’ స్థాపనకు దారి తీసింది. నేను 1962–64 మధ్యకాలంలో ఉస్మానియా, ఆర్ట్స్‌ కాలేజీలో ఎం.ఏ. చదివి నప్పటి కొన్ని జ్ఞాపకాల్ని పాఠకులతో పంచుకోవాలని ఆ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ వ్యాసం రాస్తున్నాను.



ఉస్మానియాకు రప్పించిన ఉత్తరం

నేను వరంగల్‌లోని ఆర్ట్స్‌ అండ్  సైన్స్‌ కాలేజీలో బీఏ (1958–1962) ప్యాస య్యాక చదువు ముగించి యేదన్నా ఉద్యోగం చూసుకోవాలన్నాడు మా నాయన గారు. ‘‘నిన్ను హైదరాబాద్‌ పంపించి ఎం.ఎ. చదివించేంత ఆర్థిక స్తోమత లేద’’ని ఆయన కచ్చితంగా చెప్పేశాడు. నాకేమో ఎం.ఎ. చదవాలన్న కోరిక గాఢంగా ఉండేది. ఉస్మానియాలోని ఆర్ట్స్‌ కాలేజీలోనే ఎం.ఎ. చదవా లన్న కోరిక ఎలా కల్గిందో చెప్పాలి–



బీఏ చదువుతున్న రోజుల్లోనే నాకు ఆత్మీయులైన వరవరరావు, గంట రామారెడ్డి హైదరాబాద్‌లో ఎం.ఎ. చదువుతున్నారు. నాకూ, ఈ మిత్రులకూ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతుండేవి. ఒకసారి వరవరరావు ఓ పెద్ద ఉత్తరంలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంప¯Š  ఎంత అందంగా ఉంటుందో రాశాడు. తనుండే ‘జు’ హాస్టల్‌ ముందు రోడ్డుకు ఇరుపక్కలా వరసగా ఎన్నో బొండుమల్లె చెట్లు ఉంటాయనీ, తెల్లవారి రోడ్డంతా ఈ బొండుమల్లెపూలు తెల్లగా పరచుకునే ఉంటాయనీ, చలికాలంలో మంచు బిందువులతో నిండిన ఆ పూలను చూడటం అద్భుతమైన అనుభవం అనీ, ఈ అపూర్వ దృశ్యాలకు నీ కళ్లు తెరచుకోవాలంటే నువ్వొకసారి ఇక్కడకు రావాలనీ ఆ 12 పేజీల ఉత్తరం సారాంశం.



ఆ ఉత్తరం ఐదారుసార్లు చదువుకున్నాక, ఉస్మానియా క్యాంపస్‌ చూసి రావాలని నిర్ణయించుకున్నాను. నాతో పాటు వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో చదువుతున్న మిత్రులు శివకుమార్, తిరుపతయ్య, సత్యనారాయణరెడ్డిలను కూడా రావటానికి ఒప్పించి, 1960 జనవరిలో, మంచి చలికాలంలో హైదరాబాద్‌ వెళ్లి ‘జు’ హాస్టల్‌లో వరవరరావు ఉంటున్న రూంలోనే బస చేశాం. వరవరరావు, గంటా రామన్నలు సంతోషించి క్యాంపస్‌ అంతా తిప్పారు. మొట్టమొదలు యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ చూపించారు. ఆ అద్భుత భవనాన్ని చూసి నేనెంత థ్రిల్లయ్యానో చెప్పలేను. ఆ ఆర్కిటెక్చర్‌ కళ్లు మిరి మిట్లు గొల్పింది. క్లాస్‌రూమ్స్, లాంజులు, వరండాలు కలలో చూస్తున్న దృశ్యాలుగా కనిపించాయి. మరుక్షణంలోనే, ఈ కాలేజీలో చదువుకునే అవ కాశాన్ని పొందకపోతే ఈ జన్మ వృథా అనుకున్నాను.



వసతిగృహం–వామపక్ష శిబిరం

మా కుటుంబ ఆర్ధిక పరిస్థితులు బాగా లేకపోయినా, మా నాయన గార్కి నేను ఎం.ఎ. చదవడం ఇష్టం లేకపోయినా నేనే మొండి ధైర్యంతో కొందరు మిత్రుల సహాయంతో ఆర్ట్స్‌ కాలేజీలో ఎం.ఎ. (ఎకనామిక్స్‌)లో చేరిపో యాను. ఎం.ఎ. తెలుగు కానీ, పొలిటికల్‌ సైన్స్‌ కానీ చెయ్యాలనుకున్నాను. కానీ ఎకనామిక్స్‌తో చేస్తే త్వరగా ఉద్యోగం దొరుకుతుందని వరవరరావు, రామన్న చెప్పడం వల్ల అందులో చేరాను. ‘జు’ హాస్టల్‌లో అడ్మిషన్‌ దొరికింది. కేంద్రమంత్రిగా పనిచేసిన జైపాల్‌ రెడ్డి మాకు రూంమేట్‌. వరవరరావు మా రూంకొచ్చినప్పుడు మేం చర్చించుకుంటూ ఉంటే జైపాల్‌రెడ్డి కూడా పాల్గొనే వాడు. ఒకరోజు వరవరరావు సిటీలో జరిగిన సీపీఐ నాయకుడు ఎస్‌ఏ డాంగే పాల్గొన్న సభకు వెళ్లొచ్చి రూంకొచ్చాడు.



డాంగే ఉపన్యాసం ఎంత గొప్పగా ఉందో, యేయే విషయాలను గూర్చి మాట్లాడాడో చెప్పడం మొదలెట్టాడు. అదంతా వింటున్న జైపాల్‌రెడ్డి ‘‘డాంగే అంటే మీకంత ఇష్టమా?’’ అని ప్రశ్నించి, డాంగేను, కమ్యూనిస్టు పార్టీని విమర్శించటం మొదలెట్టాడు. ఆ రోజుల్లో జైపాల్‌రెడ్డికి సి. రాజగోపాలచారి స్థాపించిన స్వతంత్ర పార్టీ అంటే చాలా అభిమానం. స్వతంత్ర పార్టీ ముఖ్యంగా నెహ్రూగారు అమలు చేస్తున్న కొన్ని వామపక్ష విధానాలను వ్యతిరేకించటానికే స్థాపించారు. ఆరోజు నేను, వరవరరావు ఒకపక్క; జైపాల్‌రెడ్డి ఒక పక్క–దాదాపు రెండుగంటల సేపు వాదించుకున్నాం. ‘జు’ హాస్టల్‌లో ఉన్నన్ని రోజులు జైపాల్‌రెడ్డి, ఆయన మిత్ర బృందానికీ, మా మిత్ర బృందానికీ మధ్య వాదనలు జరుగుతూనే ఉండేవి.



శ్రీశ్రీ వర్గంతో విశ్వనాథ వర్గం డీ

ఒక్క రాజకీయాల్లోనే కాదు, సాహిత్యంలో కూడా విద్యార్థులం రెండు వర్గా లుగా చీలిపోయి వాదించుకునేవాళ్లం. ఒకటి శ్రీశ్రీ వర్గం, మరొకటి విశ్వనాథ వర్గం–వరవరరావు, నేను, సి. రాఘవాచారి లాంటి వాళ్లం శ్రీశ్రీ వర్గంగా; మాదిరాజు రంగారావు, ముదిగొండ వీరభద్రయ్య, వే. నరసింహారెడ్డి విశ్వ నాథ వర్గంగా ఉండేవాళ్లం. అందరం స్నేహంగానే ఉండేవాళ్లం కానీ, తీవ్ర మైన వాదోపవాదాలు జరుగుతుండేవి. ఇక్కడే సాహిత్యానికి సంబంధించిన ఒక ఉదంతాన్ని చెప్పాలి. ఒకసారి ముదిగొండ వీరభద్రయ్య రూంలో కూర్చొని వాదించుకుంటున్నాము. ఆ వాదనలో ‘‘కాదేదీ కవితకనర్హం’’ అన్న శ్రీశ్రీ మాటను కోట్‌ చేసి ‘‘ప్రతీది కవితా వస్తువు ఎలా అవుతుంద’’ని వీరభద్రయ్య అంటే, ఎందుకు కాదు అని మేం–అప్పుడు నాకు మార్లిన్‌మన్రో గుర్తొచ్చింది.



మార్లిన్‌ మన్రో అంటే మేం చాలా ఇష్టపడేవాళ్లం. నేను వరవరరావుతో ‘‘మార్లిన్‌మన్రో మీద నువ్వో కవిత రాయాలి’’ అన్నాను. ఆ మాట వినగానే వీరభద్రయ్య ‘‘సెక్స్‌కు సింబల్‌ అయిన మార్లిన్‌మన్రో కూడా కవితావస్తువు అవుతుందా?’’ అన్నాడు. ‘‘ఎందుకు కాదు’’ అన్న వరవరరావు వెంటనే తన రూంకు వెళ్లి మార్లిన్‌మన్రో మీద ఒక కవిత రాసేశాడు. దాన్ని చదివి మేమంతా చాలా బావుందన్నాం. ఆ కవితను వరవరరావు అప్పుడే బాపు–రమణల సంపాదకత్వంలో వెలువ డ్తున్న ‘జ్యోతి’ మాసపత్రికకు పంపించాడు. ఆ కవితకు బాపు చక్కని మార్లిన్‌ మన్రో చిత్రాన్ని వేసి ప్రచురించాడు. దాన్ని వరవరరావు మాకు చూపించిన ప్పుడు ఎంత ఎక్సైట్‌ అయ్యామో! తర్వాత ఆ కవితకు పారితోషికంగా రూ.10 మనియార్డర్‌ చేస్తే, అందరం సికింద్రాబాద్‌లో తాజ్‌మహల్‌ హోట ల్‌కు వెళ్లి టీ తాగాం.



పాఠం వదిలి పథేర్‌పాంచాలికి

నేను క్లాస్‌ అటెండ్‌ చేసినప్పుడు మాత్రం చాలా డిస్సపాయింట్‌ అయ్యాను. క్లాస్‌ తీసుకున్న ముస్లిం ప్రొఫెసర్‌గారు చాలాకాలం ఉర్దూ మీడియంలో పాఠాలు చెప్పాడట. ఉర్దూలో రాసుకున్న నోట్స్‌ ముందు పెట్టుకొని, అతి కష్టంగా ఇంగ్లిష్‌లోకి అనువాదం చేస్తూ పాఠం చెప్పాడు. మిగతా లెక్చరర్లు కూడా అంతే. నాకస్సలు కూర్చోబుద్ధి కాకపోయేది. ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. ఆరోజుల్లో ఎం.ఎ. ఎకనామిక్స్‌ స్టూడెంట్స్‌కు క్లాసులు మొదటి మూడు రోజులు ఆర్ట్స్‌ కాలేజీలోనూ, తర్వాతి మూడురోజులు నిజాం కాలేజీ లోనూ జరిగేవి. నిజాం కాలేజీలో మాకు ప్రొఫెసర్‌ జసవాలా అనే ఆమె క్లాసులు తీసుకునేది. మేం రెండు సిటీ బస్సులు మారి వెళ్తే, ‘మేడం ఈరోజు క్లాసు తీసుకోవటంలేదు’ అని అక్కడుండే మరో లెక్చరర్‌గారు చెప్పేవాడు.



ఎట్లాగూ సిటీకొచ్చాం, క్లాసు లేదు. యేదైనా సినిమాకు వెళ్దాం అని మార్నిం గ్‌షోలు నడుస్తున్న థియేటర్‌కు పరిగెత్తేవాళ్లం. గురుదత్‌ నిర్మించిన ‘ప్యాసా’ అన్నా, ‘కాగజ్‌కేపూల్‌’ అన్నా విపరీతమైన ఇష్టం. ఎన్నిసార్లు చూశానో! ఆ రోజుల్లోనే లిబర్టీ టాకీసులో సత్యజిత్‌రే ‘పథేర్‌ పాంచాలి’, ‘అపరాజితో’, ‘అపూర్‌ సంసార్‌’, ‘తీన్‌కన్యా’, ‘చారులత’ లాంటి సినిమాల్ని ప్రత్యేక ప్రదర్శ నలుగా ప్రదర్శించేవాళ్లు. క్లాసులు ఎగ్గొట్టి వరవరరావు, నేను పరిగెత్తేవాళ్లం. ఇలా ఆర్ట్స్‌ కాలేజీలో చదువుతున్న రోజుల్లో సినిమాలు, వామపక్ష రాజకీ యాలు; శ్రీశ్రీ–విశ్వనాథల సాహిత్యం–ఈ మూడింటితోటే గడిచిపోయింది.



అటు కృష్ణమీనన్, ఇటు కృపలానీ..

ఆరోజుల్లోనే సి. రాఘవాచారి మంచి మిత్రుడయ్యాడు. మొదలు మాకు వరం గల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలోనే మిత్రుడు. మేం ఎం.ఎ. చదువుతున్న రోజుల్లో ఆయన లా కాలేజీలో చదువుతున్నాడు. ఆయనకు మొదట్నించి సీపీ ఐలో సభ్యత్వం ఉండేది. ఆయన లా కాలేజీ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్య క్షునిగా పోటీ చేసినప్పుడు నేనూ, వరవరరావు ప్రచారం చేశాం. ఆయన గెల్చాడు. ఆయన అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఒకసారి లా కాలేజీలో వి.కె. కృష్ణ మీనన్‌ ఉపన్యాసం ఏర్పాటు చేశాడు. కృష్ణమీనన్‌ ఉపన్యాసం అంటే మాకు ఎనలేని అభిమానం. కొందరు రైటిస్టు విద్యార్థులు ఆ ఉపన్యాసాన్ని అడ్డుకో వాలని ప్రయత్నించారు. ఆరోజు కృష్ణమీనన్‌ గొప్ప ఉపన్యాసం చేశాడు. మేం ఎంత ఎక్సైట్‌ అయ్యామో చెప్పలేను.



మేం ఎం.ఎ. చదువుతున్న రోజుల్లోనే (1962లో) నార్త్‌ బొంబాయి నియోజకవర్గం నుండి పార్లమెంట్‌కు కాంగ్రె¯Š  నుంచి కృష్ణమీనన్, రైటిస్టు పార్టీలన్నింటి తరఫున ఆచార్య కృపలాని పోటీ చేశారు. మా మిత్రబృంద మంతా కృష్ణమీనన్‌ గెలుస్తాడనీ;  జైపాల్‌రెడ్డి, మిత్రబృందమంతా కృపలానీ గెలుస్తాడనీ వాదించుకునేవాళ్లం. కృష్ణమీనన్‌ 3 లక్షల మెజార్టీతో గెలిచాడని తెలిశాక పెద్ద పండుగ చేసుకున్నాం. అయితే మా సంతోషం ఎంతోకాలం నిలువలేదు. మీనన్‌ గెల్చిన కొద్ది నెలల తర్వాత–అంటే నవంబర్‌ 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్‌ సైన్యానికి ఎదురుదెబ్బలు తగలటంతో కృష్ణమీనన్‌ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఈ వార్త తెలిశాక ‘జు’ హాస్టల్‌ ముందున్న బషీర్‌ క్యాంటీన్‌ వద్ద కృపలానీని సమర్థించిన బృందం పెద్ద పండుగ చేసుకుంటోంటే అప్పుడే అక్కడికి టీ తాగటానికి వెళ్లిన మేం యేమీ మాట్లాడలేని పరిస్థితి యేర్పడింది.



శ్రీశ్రీని చూద్దామని వెళితే...

ఆ రోజుల్లోనే సెవెన్‌స్టార్‌ సిండికేట్‌ అనే సంస్థ వారు ‘నవత’ పేరుతో ఒక త్రైమాసిక పత్రిక వెలువరించటం మొదలెట్టారు. ‘నవత’ అన్న పేరు పెట్టిందీ, పత్రికకు గౌరవ సంపాదకుడుగా ఉండటానికి శ్రీశ్రీని ఒప్పించిందీ వరవరరావే! అయితే ఆ పత్రిక ప్రారంభోత్సవం నాడు వరవరరావుకు గానీ, ఆయన మిత్ర బృందానికి గానీ ఆహ్వానమే లేదు. అయినా ‘నవత’ ప్రారంభో త్సవానికొచ్చిన శ్రీశ్రీని కలుద్దామని వెళ్తే మమ్మల్ని గేటు దగ్గరే ఆపారు. సరిగ్గా అప్పుడే ‘‘మనమే ఒక త్రైమాసికను ప్రారంభిద్దాం వరవర్‌!’’ అని నేనన్న మాటే ‘‘సృజన’’ స్థాపనకు దారి తీసింది.



ఎం.ఎ. ద్వితీయ సంవత్సరం (1963–64)లో ఉన్నప్పుడే ‘అంపశయ్య’ నవలకు బీజం పడింది. ఒకేరోజు నా మనస్సును తీవ్రంగా కలచివేసిన, జరి గిన సంఘటనలు ‘అంపశయ్య’ రాయటానికి పురికొల్పాయి. ఈ నవలను 1964లో మొదలెట్టి 1968లో పూర్తి చేశాను. ఇలా ఉస్మానియా యూనివర్శిటీలో మేం చదువుకున్న రోజుల్లో ఎన్నో చరిత్రాత్మకమైన సంఘటనలు జరిగాయి.




అంపశయ్య నవీన్‌,

వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత

ఈ–మెయిల్‌ : naveen.ampasayya@yahoo.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top