నిజమైన విలన్లు హీరోలే..!

నిజమైన విలన్లు హీరోలే..! - Sakshi


ఆలోచనం

సమస్యని, సంక్షోభాన్ని ఎత్తి చూపడానికే రాజకీయాలలోకి వస్తున్నానంటున్న పవన్‌కల్యాణ్‌కి, మద్యపానం సంక్షోభంలా కనిపించకపోతే ఎలా? పౌరసమాజం శక్తివంతంగా ఉండాలంటే తను పాటలో పాడినట్లు అందరూ తాగాల్సిందేనా?



రాజులయినా, బంటులయినా, కూలీలయినా, యాపారులయినా చీకటయితే చుక్కకోసం జివ్వు జివ్వు ఆగునా. కల్లయినా, సారాయయినా, ఇంగిలీషు మందయినా, కల్తీ సరుక యినా తాగకుంటే జివ్వు జివ్వు లోన , తాగితేనే తందానా నాన. రంగు రంగులా మందెయిరా, మత్తెక్కి చిందెయ్‌ రా, వెయ్యేనుగులా బలమొస్తదిరా. నటుడు పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా, ‘కాటమరాయుడు’లో పాట అది.



‘రాజకీయాలలోకి దిగి, అందులో ఉన్న మురికిని కడిగి పారబోసి, చక్కని సమతౌల్యం ఉన్న, శక్తివంత మయిన పౌరసమాజాన్ని నిర్మించాలి’’ అని 19 మార్చిన ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన  ఘనమయిన ఆకాంక్షను వ్యక్తపరచాడు పవన్‌. పౌరస మాజం ఆయన ఆశించినట్లు ‘వెయ్యేనుగుల బలం’తో శక్తివంతంగా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళూ తాగాల్సిందే నని, ఆయన తాగుతూ, చిందేస్తూ  కాటమరాయుడులో భలే బోధించారు. రోగి కోరేది అదే వైద్యుడు చెప్పిందీ అదే కనుక ఆయన అభిమానులు థియేటర్లో ఆ పాటకి ఈలలతో అలాగే అలాగే అని వంత పాడారు.



రేజర్ల స్వాతి, వెంకట్‌ కిరణ్, తోట గోపి వీళ్ళం దరూ ఆంధ్రలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో  చదువు కుంటున్న దిగువ మధ్యతరగతి పిల్లలు. మద్యపాన వ్యసనం మీద అవగాహన తరగతులు నిర్వహించడా నికి మేము ఆయా పాఠశాలలకి వెళ్ళినపుడు ఆ బిడ్డలు తమ తండ్రుల వ్యసనం గురించి చెప్తూ గుండెలు పగి లేట్టు ఏడ్చి, ఎక్కిళ్ళు పెట్టారు. వీరిలో తోట గోపీ తండ్రి తనను తాగవద్దని వారించిన భార్యను కిరోసిన్‌ పోసి తగలపెట్టి చంపేశాడు. కోర్టు పద్నాలుగేళ్ళ జైలు శిక్ష  వేసింది. గోపీ అనాథై పర పంచలు పాకుతున్నాడు.



తెలంగాణలో ఒక గ్రామం. మా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున విధవలకు చీరలు పంచుదాం అనుకున్నాం. ఆ వూరిలో లెక్కకు మిక్కిలి వున్న విధవల సంఖ్య నన్ను ఆశ్చర్యపరచింది. అందులో 75%మంది 30 లోపు అమ్మాయిలు. వాళ్ళ భర్తల్ని, పవన్‌ చెప్పారు కదా కల్లయినా, కల్తీ సరుకయినా పర్లేదని, ఆ.. సరుకే మింగేసింది. 26 ఏళ్ళ విధవ శమంత ఇద్దరు బిడ్డల తల్లి, ‘ఈ చీర రంగు నచ్చలేదు, మార్చుకోవచ్చా’ అని అడిగింది నన్ను. జీవితం పట్ల ఆ అమ్మాయికున్న మక్కువను చూసి దుక్కమొచ్చి, ఆమె తల్లిని, ‘చిన్న పిల్ల కదా శమంతకు మళ్ళీ పెళ్లి చేయకూడదా’ అంటే, ‘ఇద్దరు బిడ్డల తల్లి కదమ్మా, ఎవరూ ఇష్టపడటం లేదు’ అన్నది నిర్లిప్తంగా.



తాగమని ఎగురుతూ బోధించిన పవన్, గోపీకి తల్లిదండ్రుల్ని, శమంతకు భర్తని తెచ్చిచ్చి తిరిగి వారి జీవితాలలో ఆనందాన్ని నింపగలడా?



నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో కొత్త డేటా ప్రకారం దేశంలో 96 నిమిషాలకు ఒక్కరు చొప్పున రోజుకు 15 మంది మద్యం వ్యసనం వల్ల చనిపోతున్నారు. oecd రిపోర్ట్‌ ప్రకారం మద్యం వల్ల ఆరోగ్యాన్ని నష్టపోతున్న దేశాలలో ఇండియా 3వ స్థానంలో ఉంది. ఆరోగ్యం సంగతి వదిలేస్తే భారతదేశపు దారిద్య్రానికి అతి ముఖ్య కారణం మద్యపాన వ్యసనం అని who పేర్కొంది. మద్యపానం గృహ హింసకూ మొదటి కారణమట.  



ఈ హెచ్చుతగ్గుల సమాజంలో అభివృద్ధి లేని తమ జీవితపు విసుగునుంచి బయటపడటానికి, పేదలు ఏ బెల్టు షాపులోనో చేరి దుక్కాన్ని దించుకోవాలనుకుని జీవితాలను బలిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం వారిని మత్తులో ముంచి వారి రెక్కల కష్టాన్ని దుర్మార్గంగా దోచుకుంటుంది. ‘సమస్యని, సంక్షోభాన్ని ఎత్తి చూప డానికే రాజకీయాలలోకి’ వస్తున్నానంటున్న పవన్‌కి, మద్యపానం సంక్షోభంలా కనిపించకపోతే  ఎలా? అధి కారంలో ఉండటం అంటే ఒక్క రాజకీయాధికారమే కాదు. సాంస్కృతిక రంగంలో అధికార స్థానంలో ఉన్న పవన్‌ కావాలనుకుంటే ఈ పాటని వద్దని చెప్పగలిగే వారే, కానీ ఆయన అలా అనుకోలేదు.



ఈ సినిమాలోనే ఇంకో పాట ఉంది ‘మిర్రా మిర్రా  మీసం, మెలి తిప్పుతాడు జనం కోసం’ అని.  తాగమని పవన్‌ చెప్పక్కర్లేదు. చెప్పకున్నా తాగుతారు. తనవంతుగా మద్యపాన నిర్మూలనకు కృషి చేసి తన అభిమానుల చేతయినా తాగుడు మానిపించే చాలెంజ్‌ తీసు కుంటే, అప్పుడు మిర్రామిర్రా మీసం భలే మెలి తిప్పాడు పవన్‌ జనం కోసం అని అందరం సంతోషంగా పాడుకుంటాం. అసలు ముక్కుకింద ఉన్న ఆ నాలుగు వెంట్రుకలకు మగతనమనే మిత్‌ను ఆపాదించక తప్పకపోతే, పవన్‌కి ఎవరయినా తప్పక ఇలా చెప్పాలి, ‘మిర్రా మిర్రా మీసమే మెలితిప్పాల్సొస్తే, హైకోర్టు కుదరదన్నా సుప్రీంకోర్టుకు వెళ్లి మద్యపాన నిషేధాన్ని సాధించుకొచ్చాడే బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ‘మగాడంటే ఆడ్రా బుజ్జీ’ అతను  తిప్పాలి మీసం, తాగమని చెప్పే నువ్వు కాదు‘ అని.



సామాజిక స్పృహ కొంచెం కూడా లేకుండా, ‘వీడో నేలబారు నడిచే నిండయిన ఆకాశం’ అని తెగ బారెడు పాటలు రాయించుకుని, మహా లావు మాటలు మాట్లాడే ఈ హీరో తరహాని చూస్తుంటే ‘మిత్ర’ రాయగా, విమలక్క ఉద్వేగంగా, ఉద్రిక్తంగా, మహా గొప్పగా పాడిన ఒక పాటలోని వాక్యం గుర్తొస్తుంది ‘నిజమయిన విలనోళ్లు హీరోలురా–అభిమానసంఘాల జోరాయెరా ..!





- సామాన్య కిరణ్‌


వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top