బాల్యాన్ని చిదిమేస్తున్నాం!

బాల్యాన్ని చిదిమేస్తున్నాం!


విశ్లేషణ


ఈ మధ్య ఇళ్ల నుంచీ, బడుల నుంచీ కూడా పిల్లలు పారిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ జరుగుతున్న ఈ తరహా దుర్ఘటనలు ఇటు తల్లిదండ్రులను, అటు పోలీసు శాఖను కూడా పరుగులు పెట్టిస్తున్నాయి. కనీస ఆచూకీ తెలుసుకోవడానికి కూడా నెలలు పడుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక నైపుణ్యం పెరిగి, అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉంది. రైల్వేస్టేషన్లలో, బస్‌ స్టేషన్లలో రెప్ప వాల్చకుండా పనిచేసే చైల్డ్‌లైన్‌ వంటి సంస్థల నిఘా కూడా ఉంది.



అయినా పిల్లలు, ముఖ్యంగా కౌమారంలో ఉన్న పిల్లలు ఎలా కన్నుగప్పి మాయం కాగలుగుతున్నారు? పిల్లలు అక్రమ రవాణా, కిడ్నాప్‌లకు గురైతే కొంత ప్రతిఘటన ఉంటుంది. అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు గుర్తించగలరు. కానీ తమంతట తామే వెళ్లే పిల్లలు మొహాలలో ఎటువంటి కంగారు లేకుండా, ఎదుటివారికి అనుమానం కలగకుండా జాగ్రత్త పడుతూ పాఠశాల, కళాశాల పేరుచెప్పి సరిహద్దులు దాటిపోతున్నారు. నిజానికి ఎలా పారిపోతున్నారనేకంటే, ఎందుకు పారిపోతున్నారన్నది ముఖ్యం.



పిల్లలు ఎందుకు పారిపోతున్నారు? ఇది తల్లిదండ్రులతో పాటు పాఠశాలల నిర్వాహకులు కూడా వేసుకోవలసిన ప్రశ్న. ఇటీవల హైదరాబాద్‌ నగరానికి చెందిన పూర్ణిమ సాయి అనే బాలిక ఇలా వెళ్లిపోవడం సంచలనం సృష్టిం చింది. ఓ పూర్ణిమ సాయి, ఓ కాజల్, నర్సాపూర్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి, గాంధీనగర్‌కు చెందిన మరో అబ్బాయి వీరంతా అదృష్టవశాత్తు క్షేమంగా దొరికినా, అసలు వీరు ఇలా చేయడానికి వెనుక ఉన్న పరిస్థితులు ఏవి? పూర్ణిమకు నటన అంటే మక్కువ. కాజ ల్‌కు సినిమాలంటే ఇష్టం. నర్సాపూర్‌ పిల్లలకు సవతి తండ్రి వేధింపులు.



ఇలా కారణాలు ఏమైనా వీరంతా భౌతి కంగా ఇళ్లలోనే ఉంటున్నారు గానీ, మానసికంగా అక్కడ ఇమడలేని పరిస్థితి. పిల్లలని కన్నాం కానీ, వాళ్ల అవసరాలనీ, ఆశలనీ కనడం లేదు. బడిలో చేర్చాం ఇదీ తల్లిదండ్రుల తీరు. ఫీజులు తీసుకుంటున్నాం, బట్టీయం వేయిస్తున్నాం. ర్యాంకులు రావాలని నిర్దేశిస్తున్నాం, రాకపోతే నిర్దాక్షిణ్యంగా ఉంటున్నాం ఇదీ పాఠశాలల ధోరణి. ఇటు తల్లిదండ్రులు గానీ, అటు పాఠశాలల నిర్వాహకులు గానీ పిల్లలకు బాల్యాన్ని ఇస్తున్నారా? అసలు వారు బాలలని గుర్తిస్తున్నారా? వారికి కూడా మనసూ, ఆశయాలూ ఉంటాయని గమనిస్తున్నారా? లేదంటే పిల్లలంతా  నాలుగ్గోడల మధ్యనే బందీలై ఉన్నారనీ, వారికి తామే సంరక్షకులమనీ తలపోస్తున్నారా?



ఒకసారి ఒక అమ్మాయి తప్పిపోయి కశ్మీర్‌లో దుర్భర పరిస్థితుల మధ్య దొరికింది. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ చక్కటి సందేశం ఇచ్చారు. ఎవరికైనా వంట బట్టిందా ఆ సందేశం? లేకుంటే ఇవి పోలీసులు నేర్పుతున్న సుద్దులనుకుంటూ నిర్లక్ష్యం చేశారా? దీనిని ఎంతమంది అర్థం చేసుకున్నారో మరి! ఎంతమంది ఆచరిస్తున్నారో! ఇదీ ఆ సందేశం సారాంశం ‘మీరు పిల్లలకు ఇవ్వవలసింది అడిగినంత డబ్బు కాదు, కార్పొరేట్‌ విద్య కాదు, ఎక్కి తిరగడానికి కారు కాదు, డాబూ దర్పాలు అసలే కాదు. వారికి ఇవ్వవలసింది కొంచెం సమయం. అది కేటాయించండి! వారి ఆశలూ, ఆకాం క్షలూ ఏమిటో గ్రహించండి! ఆచరణ సాధ్యమా, కాదా అన్నది విశ్లేషించుకుని వాటి గురించి వివరించండి.



పెద్ద పెద్ద స్కూళ్లలో వేశామని కాదు, పిల్లలు చదువుల యంత్రాలు అవుతున్నారా? జ్ఞానవంతులవుతున్నారా? ఇది గమనించండి! ర్యాంకుల కోసం, గ్రేడ్‌ల కోసం పాకులాడకండి! అవి మీ బిడ్డల జీవితాలను తీర్చిదిద్దడానికి ఉపకరించవు. విద్యాసంస్థలు కేవలం మీ పిల్లల పేర్లు చెప్పుకుని మరిన్ని అడ్మిషన్లు తెచ్చుకోవడానికే ఉపయోగపడతాయి’.

తల్లిదండ్రులు ఏది కొనాలన్నా పదిసార్లు ఆలోచిస్తారు. అలాగే బిడ్డలని కనేటప్పుడు కూడా మీ ఆర్థిక స్థోమత, కేటాయించగలిగిన సమయాల గురించి కూడా పదిసార్లు ఆలోచించండి. కడుపున పుట్టిన పిల్లలని శిక్షించడం కాదు, చక్కని శిక్షణ ఇవ్వాలి. అప్పుడే అలాంటి ఘటనలు పునరావృతం కావు.





- అచ్యుతరావు

వ్యాసకర్త గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం

మొబైల్‌ : 93910 24242



 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top