రహస్య సంధి ఫలితమే రగడ

రహస్య సంధి ఫలితమే రగడ - Sakshi


రెండో మాట

భూటాన్‌–చైనాల మధ్య డోక్లామ్‌తో ఏర్పడిన సంక్షోభంలో భూటాన్‌కు–భారత ప్రభుత్వానికి మధ్య కుదిరిన రహస్య ఒప్పందంవల్ల వర్తక, వాణిజ్య సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందా? గత మూడుమాసాలుగా భూటాన్‌–చైనాల మధ్య ఆ మేరకు, భారత్‌–చైనాల మధ్య తగాదాలు లేదా ఘర్షణలు పరిమితిని దాటి మరింతగా కుదరకపోవడానికి కారణం కూడా ప్రపంచ మార్కెట్‌లో చైనా స్థాపించుకున్న వర్తక సంబంధంలో దాని అగ్రస్థానమే అయి ఉంటుంది.



‘‘ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 1962లో భారత్‌–చైనా సరిహద్దు యుద్ధంలో ఇండియాకు కలిగిన నష్టాల గురించి హెచ్చరించారు. అదే సమయంలో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మైన్మార్‌లతో చైనా ఎలా సన్నిహిత సంబంధాలు పెంచుకుందో గమనించాలని గుర్తు చేశారు.’’

– పత్రికల వార్తలు



‘‘1. పరస్పరం ఇరుదేశాల సరిహద్దుల సమగ్రత, సార్వభౌమాధికారాల పట్ల గౌరవ భావం చూపాలి. 2. పరస్పరం దాడులను నివారించాలి. 3. దేశ ఆంతరంగిక వ్యవహారాలలో పరస్పరం జోక్యం చేసుకోరాదు. 4. సమానత్వాన్నీ, పరస్పర ప్రయోజనాన్ని గౌరవించుకోవాలి. 5. శాంతి సహకారాలతో పరస్పరం వర్ధిల్లాలి.’’  (ఏప్రిల్‌ 29, 1954 తేదీన భారత్‌–చైనా పంచసూత్రాల ఆధారంగా

బీజింగ్‌లో చేసుకున్న ఒప్పందం)




ఈ ‘పంచసూత్ర’ఒడంబడిక పైన ఇండో–చైనా అధిపతులు టిబెట్‌ సమస్య పూర్వరంగంలో కుదుర్చుకోవడానికి కారణం– టిబెట్‌పైన చైనా సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ గుర్తించక తప్పకపోవడమే. ఏ రెండు ఇరుగుపొరుగు దేశాల అధిపతులైనా తమ పార్టీ రాజ కీయ ప్రతిపత్తిని సంరక్షించుకోవడానికో, తమ అధికార స్థానాలు నిలబెట్టుకునేందుకో దేశ సరిహద్దులనీ, ఉభయ దేశాల ప్రజల విశాల ప్రయోజనాలనీ పణంగా పెట్టడానికో తగాదాలను పెంచి యుద్ధాలకు దారి తీసేవిధంగా వ్యవహరించరాదు.



కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? 1962లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన భీకర సరిహద్దు ఘర్షణలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. కానీ గత మూడు మాసాలుగా మరొక దేశం (భూటాన్‌) సరిహద్దు ప్రాతిపదికగా యుద్ధం జరగకపోయినా, అందుకు దారి తీయగల స్థాయిలో సైన్యాల మోహరింపు జరుగుతోంది. నిజానికి ఆనాడు టిబెట్‌ కారణంగా>, ఆ దేశ ఫ్యూడల్‌ వ్యవస్థ అవశేషంగా ఉన్న దలైలామా పారిపోయి భారత్‌కు వస్తే మన పాలకులు ఆశ్రయం ఇచ్చిన కారణంగా ఉభయ దేశాల నడుమ ఘర్షణలు తలెత్తాయి.



చారిత్రక పరిస్థితులను గమనించాలి

గత పరిణామాలుగానీ, తాజాగా సిక్కిం– భూటాన్‌ సరిహద్దులు ఆధారంగా జన సంచారంలేని డోక్లామ్‌ పీఠభూమిలో భారత్‌–చైనాల మధ్య కొత్తగా అంకురించిన ఘర్షణ వాతావరణం గానీ– ఏ పూర్వ రంగంలో, ఏ చారిత్రక పరిణామాల ఫలితంగా సంక్రమించాయో గ్రహించాలి. ఎందుకంటే, 1962 నాటి తగాదాలకు ఏ బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పాలకులు 19వ శతాబ్దంలో కారకులైనారో, నేటి డోక్లామ్‌ ఘర్షణ వాతావరణానికి కూడా వారే కారకులని మరచిపోరాదు. ఒకప్పుడు నేపాల్, సిక్కిం, భూటాన్‌ బ్రిటిష్‌ పాలనలో కొనసాగవలసి వచ్చింది. తరువాత భారతదేశం స్వాతంత్య్రం సాధించుకున్న దరిమిలా నేపాల్‌తో పాటు, సిక్కిం కూడా స్వతంత్ర ప్రతిపత్తిగల దేశంగా ఉన్నప్పటికీ భారత్‌–చైనాల మధ్య సరిహద్దు వివాదాల మధ్య ఇందిరాగాంధీ నేతృత్వంలో సిక్కింను భారత్‌లో ఒక రాష్ట్రంగా విలీనం చేయడం జరిగింది.



ఈ పరిణామాన్ని ‘దురాక్రమణ’గా ప్రకటించినవారు మరెవరో కాదు, తరువాత ప్రధాని పదవిని చేపట్టిన మొరార్జీ దేశాయే. భూటాన్‌ కూడా నేపాల్‌తో పాటు స్వతంత్ర దేశంగా ఉంటూ వచ్చింది. కానీ విదేశీ వ్యవహారాలు మాత్రం భారత ప్రభుత్వానికి దఖలు పరిచింది. ప్రస్తుతం సిక్కిం, భూటాన్, చైనాల మధ్య అధికారిక సరిహద్దులు లేక పైలాపచ్చీసుగా ఉన్న డోక్లామ్‌ పీఠభూమిలో రోడ్ల నిర్మాణాన్ని చైనా ఆరంభించింది. నిజానికి ఇది భూటాన్‌–చైనాల సమస్య. కానీ భూటాన్‌ తన వైదేశిక విధానాల నిర్ణయాల అధికారాన్ని మన దేశానికి అప్పగించడంతో డోక్లామ్‌ వివాదంలో భారత్‌ ఇరుక్కోవలసి వచ్చింది. అంటే 1914–15 నాటి సిమ్లా సమావేశంలో ఒక చైనా అధికారికి అధికారి హోదా కల్పించి దొంగచాటుగా టిబెట్‌ను చైనా నుంచి విడగొట్టడానికి బ్రిటిష్‌ వలస అధికారి మెక్‌మహన్‌ దొంగ సంధి పత్రం మీద సంతకం చేయించుకున్నాడు.



అయితే అది దొంగ పత్రమేనని అంగీకరిస్తూనే ‘నిజానికి చైనా ప్రభుత్వ అధికార ప్రతినిధులు టిబెట్‌ను చైనా నుంచి విభజించే పత్రం మీద సంతకాలు చేయడానికి నిరాకరించార’ని స్పష్టం చేయవలసి వచ్చింది. అలాగే ఇప్పుడు అలాంటి పరిస్థితే ‘డోక్లామ్‌’ తగాదా పూర్వరంగంలో మనకూ, చైనాకూ మధ్య దాపురించింది. ఇది మన పాలకులకు కక్కలేని, మింగలేని పరిస్థితి. కనుకనే ముందు డోక్లామ్‌లోకి మన సైనికుల్ని పంపి భూటాన్‌ తరఫున వకాల్తా పుచ్చుకునేందుకు దూకాం. కానీ భూటాన్‌ ఈ సంక్షోభంలో ఎటూ పాలుపోక కాసేపు ఇండియా తరఫునా, మరి కాసేపు చైనా తరఫునా మాటలు మార్చి ఊగిసలాడుతోంది. ఈ ఊగిసలాటకు కారణం–సిక్కిం– భూటాన్‌–చైనాల మధ్య త్రికోణాకారంలో ఉన్న ఊసర క్షేత్రం డోక్లామ్‌.



భూటాన్‌ ఊగిసలాట

మనకు సంక్రమించిన ‘పెత్తన’మల్లా భూటాన్‌ విదేశాంగ వ్యవహారాల నిర్వహణ బాధ్యతను అక్కడి రాచరిక ప్రభుత్వం అప్పగించటం. ఈ పెత్తనం భూటాన్‌ తన ఇష్టానుసారంగా దఖలు పరచడంవల్లనా, లేక ఇతరుల ఒత్తిళ్లవల్ల దఖలైనదా తెలుసుకోవాలంటే రెండు రకాల సంధి పత్రాలను పరిశీలించాల్సిందే. ఎందుకంటే, 1949 నుంచీ భూటాన్‌–చైనాల మధ్య నలుగుతూ, ముదురుతూ వస్తున్న సంక్షోభానికి బీజం 1949లో భూటాన్‌ రాచరిక ప్రభుత్వానికీ స్వతంత్ర భారత ప్రభుత్వానికీ మధ్య జరిగిన ‘రహస్య ఒప్పందం’ (సీక్రెట్‌ ట్రీటీ)లో ఉంది. ఈ విషయాన్ని డోక్లామ్‌లో చైనా రోడ్ల నిర్మాణం చేపట్టిన సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టు, వ్యాఖ్యాత సయీద్‌ నక్వీ (4.8.17) ఇటీవలనే బయటపెట్టారు.



నాటి భూటాన్‌ రాజు, నక్వీకి (1979 సెప్టెంబర్‌ 11) ఇచ్చిన ఇంటర్వ్యూలో అది ఉంది. రాజు జిమీ సింగ్సీ వాంగ్‌ చుక్‌ ఇచ్చిన అరుదైన ఇంటర్వ్యూ అది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పటికీ మన మధ్య ఉన్నారు. ప్రస్తుత పాలకుడు ఆయన కొడుకే. ఇంతకూ వాంగ్‌ చుక్‌ 1979లో చైనాతో చర్చలు జరపవలసిన అవసరం ఉందని ఎందుకు భావించినట్టు? 1949 నాటి రహస్య ఒప్పందంలోని 2వ క్లాజు ప్రకారం ‘భూటాన్‌ విదేశాంగ వ్యవహారాల నిర్వహణ విషయంలో భారత ప్రభుత్వ జోక్యం ఉంటుంది’. కానీ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా భూటాన్‌కు చైనాతో సంబంధాలు అనివార్యమని, కానీ 1949 నాటి భూటాన్‌ –భారత్‌ రహస్య ఒప్పందంలోని రెండవ క్లాజు చైనాతో సంబంధాలకు అవరోధం కల్గిస్తోందనీ రాజు ప్రకటించినట్టు సయీద్‌ నక్వీ ఆ ప్రత్యేక ఇంట ర్వ్యూలో వెల్లడించారు. అంతేగాదు, రాజు ఆ ప్రకటనలో ఇలా స్పష్టం చేశాడు:



‘‘దౌత్యపరమైన పరిభాషలో కాకుండా నేరుగా నా స్పష్టమైన సమాధానం ఏమంటే– 1949 నాటి భారత్‌–భూటాన్‌ ఒప్పందాన్ని ఆధునిక అవసరాల దృష్ట్యా విధిగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది’’. అంటే, భూటాన్‌ విదేశాంగ వ్యవహారాల నిర్వహణలో ఇకమీదట భారత ప్రభుత్వ సలహా సంప్రదింపులకు భూటాన్‌ కట్టుబడి ఉండాల్సిన పనిలేదన్న భావాన్ని రాజు వ్యక్తం చేశాడని నక్వీ అభిప్రాయపడ్డారు. ఈ రీత్యా ఇంతవరకు భూటాన్‌–చైనాలమధ్య క్షేత్రస్థాయిలో నేలమీద గుర్తు పెట్టకుండా వదిలేసిన ‘సరిహద్దును వెంటనే ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా’ఉభయ దేశాలూ సరిహద్దుల్ని గుర్తుపెట్టాల్సిన అవసరం ఉందని డోక్లామ్‌ పరిణామాలు నిరూపిస్తున్నాయి.



1949 నుంచీ భూటాన్‌–భారత్‌ల మధ్య ‘రహస్య ఒడంబడిక’ ఫలితంగా అనేక పరిణామాలు జరిగినందున ఈ తాజా సమీక్ష చాలా అవసరమని కూడా భూటాన్‌ భావి స్తోందని పలువురు వ్యాఖ్యాతల అభిప్రాయం. అయితే అదే సందర్భంలో భారత్‌ ప్రధాన ప్రయోజనాలకు హాని కలిగేలా భూటాన్‌ ప్రవర్తించదని నక్వీ భావన. మరో విచిత్రమేమంటే భూటాన్‌లో నివసిస్తున్న టిబెట్‌ పౌరులు అనేకమంది భారతదేశంలోని దలైలామా తెరచిన ‘ధర్మశాల’దుకాణానికి పన్నులు కూడా చెల్లిస్తున్నారని వింటున్నాం.



మేకపోతు గాంభీర్యమే

అయితే ఇదే సమయంలో మరొక ప్రశ్న తలెత్తుతోంది: భూటాన్‌–చైనాల మధ్య డోక్లామ్‌తో ఏర్పడిన సంక్షోభంలో భూటాన్‌కు–భారత ప్రభుత్వానికి మధ్య కుదిరిన రహస్య ఒప్పందంవల్ల వర్తక, వాణిజ్య సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందా? గత మూడుమాసాలుగా భూటాన్‌–చైనాల మధ్య ఆ మేరకు, భారత్‌–చైనాల మధ్య తగాదాలు లేదా ఘర్షణలు పరిమితిని దాటి మరింతగా కుదరకపోవడానికి కారణం కూడా ప్రపంచ మార్కెట్‌లో చైనా స్థాపించుకున్న వర్తక సంబంధంలో దాని అగ్రస్థానమే అయి ఉంటుంది. బహుశా ‘పంటి బిగువు’ కోసం నేటి భారత్‌ బీజేపీ–ఆరెస్సెస్‌ పాలకులు ‘డోక్లామ్‌’ మోహరింపుల మధ్యనే చైనాతో వర్తక వాణిజ్య సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతూనే మరొకవైపున చైనా పట్ల ‘మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తున్నట్లు కన్పిస్తోంది.



ఎందుకంటే ‘నోట్ల రద్దు’ అక్రమ ప్రయోగం కాస్తా సామాన్యుడిమీద ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’లా విరుచుకుపడినా, ఆ ప్రయోగాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో మరోవైపు నుంచి భారతదేశంలోకి చైనా పెట్టుబడులను ధారాళంగా ఆహ్వానిస్తూ తివాచీలు పరుస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ట్రంప్‌ అధికారానికి వచ్చిన మొదట్లో చైనాతో కొంత ‘కంపు’ చేసుకోవడానికి ప్రయత్నించినా, చైనాను బుజ్జగించడానికి ‘చాయంగల విన్నపా’లన్నీ చేయవలసి వచ్చింది. అదంతా వ్యాపార రహస్యం. ఆ పాఠమే ఇండియాలో మోదీ కూడా అనుసరించి ప్రపంచవ్యాప్తంగా చొచ్చుకుపోతున్న చైనీస్‌ ‘అలీబాబా’ పెట్టుబడి సంస్థ సహకారంతో ‘పేటీఎం’ అనే భారత టెక్‌ కంపెనీ ద్వారా ధన లావాదేవీలను భారీగా నిర్వహింపజేస్తున్నారు.



మరొకవైపున, జనరల్‌ మోటార్స్‌తో సంయుక్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న చైనీస్‌ కంపెనీ ‘సాయిక్‌ మోటార్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ సరాసరి గుజరాత్‌లోని హాలోల్‌ వద్ద భారత మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమను కాస్తా స్వాధీనం చేసుకుంటోంది. అలాగే నాగపూర్‌ విమానాశ్రయం వద్ద ఉన్న ఇంటర్నేషనల్‌ కార్గో హబ్‌ కేంద్రంలో మెట్రో రోలింగ్‌ స్టాక్‌ తయారీ (మాన్యుఫాక్చరింగ్‌) పరిశ్రమను నెలకొల్పడానికి చైనా ప్రభుత్వం రైల్వే రోలింగ్‌ స్టాక్‌ కార్పొరేషన్‌ను భారత ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని పస్తుల్లోకి నెట్టి ఆహ్వానం చెప్పింది. ఈ కారణాల రీత్యా కూడా డోక్లామ్‌లో చైనాతో తులతూగలేని పరిస్థితి మనది!



ఏబీకే ప్రసాద్‌

సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top