స్వాతంత్య్ర స్ఫూర్తిని మరిచారా?

స్వాతంత్య్ర స్ఫూర్తిని మరిచారా? - Sakshi


రెండో మాట

బీజేపీ పాలకులు సెక్యులర్‌ రాజ్యాంగం భారత ప్రజలకు హామీ పడిన ప్రజాస్వామ్యపు పునాదులకు, అందులో భాగంగా హామీ పడిన భావప్రకటనా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ వగైరా సప్త స్వాతంత్య్రాలకు తూట్లు పొడుస్తున్నారు. గాంధీజీ నిర్వచించిన స్వేచ్ఛా వాయువుల్ని పీల్చగల రాజకీయ వాతావరణం నేడు దేశంలో ఉన్నట్లు అనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో పాలక వర్గం క్విట్‌ ఇండియా, ఆగస్టు 15 చారిత్రక పరిణామాల పేరిట ఎన్ని హామీలు, ప్రకటనలు జారీ చేసినా అవి కంటి నీళ్ల తుడుపే అవుతాయి.



‘‘1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తి మళ్లీ దేశాన్ని ఆవరించాలి. విదేశీ పాలన నుంచి దేశ విముక్తి కోసం ఆనాటి నినాదం ‘చావో, రేవో’ తెగబడమని (డూ ఆర్‌ డై)’’. కానీ ఆ నినాదాన్ని నేడు ‘మేం చేస్తాం, ప్రగతిని సాధిస్తాం’ అన్నది మన లక్ష్యంగా పెట్టుకోవాలి. నేటి నుంచి రాబోయే ఐదేళ్లను (2017–2022) ఈ లక్ష్య సాధనకు సంకల్ప సిద్ధ సంవత్సరాలుగా ప్రకటించుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పౌరులు బాధ్యతలు మరచి హక్కుల సాధనపై కేంద్రీకరించారు. చివరికి పౌరులు ప్రాథమిక చట్టాలు కూడా ఉల్లంఘిస్తున్నారు, చట్టానికి బద్ధులై ఉండే బాధ్యతను మరచిపోతున్నారు. దేశంలో మార్పులు రావాలంటే, ప్రజల మనస్తత్వం మారాలి’’.     – ప్రధాని మోదీ, లోక్‌సభ ప్రసంగం (9.8.17)



‘‘ఈ రోజున మన దేశంలో అన్ని వర్గాల, మతాల, భాషా మైనారిటీల, దళిత మైనారిటీ ముస్లింల క్షేమ సౌభాగ్యాలు చూసే జాతీయతా భావాన్ని గురించి మనం మాట్లాడటం మానేశాం. ఇపుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? జాతీయత ముసుగులో ‘సాంస్కృతిక జాతీయ వాదాన్ని’ (మూకుమ్మడిగా ఒకే సంస్కృతి–కల్చరల్‌ నేషనలిజం) బలవంతంగా రుద్దే దశలో ఉన్నాం. ‘గోరక్షణ’ ముసుగులో పలుచోట్ల దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ పరిణామాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. విశ్వవిద్యాలయ కేంద్రాలపై దండయాత్రలు స్వతంత్ర ఆలోచనా శక్తినే చంపేసే పరిణామాలు’’.

– అజిత్‌ ప్రకాశ్‌ షా, కేంద్ర లా కమిషన్‌ చైర్మన్‌ (8.8.2017)



క్విట్‌ ఇండియా ఉద్యమం గురించి మోదీ ఎంతవరకు చదువుకుని ఉంటారో తెలియదుగానీ, ఆ మహోద్యమ 75వ వార్షికోత్సవం నాడు ఆయన... ఇండియాను దోచుకుని, బికారిగా విడిచిపోయిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించిన ప్రజలకు నాడు నాయకత్వం వహించిన నాయకులు, త్యాగధనులు ఎవరో మాట మాత్రంగా ప్రస్తావించలేదు. అసలు క్విట్‌ ఇండియా నినాదాన్ని తీర్మానంగా రూపొం దించి, ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీలో ఆమోదింపజేసి ఉద్యమ స్ఫూర్తికి దోహదం చేసిన ఇరువురిలో ఒకరైన గాంధీనే తప్ప, నెహ్రూను పేర్కొనలేదు. ఇది, ఒక చారిత్రక సత్యాన్ని కనుమరుగు చేయాలన్న తలంపు మాత్రమే. క్విట్‌ ఇండియా తీర్మానం తర్వాత ఐదేళ్లకు పలు వివాదాస్పద పరిణామాల మధ్య, ప్రజల అశేష త్యాగాల ఫలితమైన స్వాతంత్య్ర భానూదయ శుభ ఘడియల ఆవిష్కరణలో మోదీ తెలివిగా తమ పార్టీ బీజేపీకి గురు స్థానంలో నిలిచిన ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల పాత్ర ప్రస్తావనను కూడా తప్పించేశారు.



చారిత్రక సత్యాన్ని దాచే యత్నం

ఈ దేశ రాజకీయ చరిత్ర మొత్తంలో అత్యంత కీలక దశలైన క్విట్‌ ఇండియా, ఆగస్టు 15 సందర్భాలలో మోదీ తన మాతృ సంస్థల విభీషణ పాత్రను ప్రస్తావించ సాహసించలేక పోయారు ఎందుకు? అలా చేయడమంటే తన మాతృ సంస్థల కార్యకలాపాల్ని బయట పెట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి. ఈ రెండు మహోద్యమాలలో అవి నిర్వహించిన విద్రోహ పాత్రను, గాంధీజీ హత్యకు కారకులుగా అవి దేశ ప్రజల ముందు నిలవడాన్ని చరిత్ర అక్షర సత్యంగా లిఖించింది. మోదీ ఆశావహ ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి బీజేపీ మాతృ సంస్థల పాత్ర ప్రస్తావనకు రాకపోవడానికి కారణం–అవి క్విట్‌ ఇండియా నినాదాన్ని, ఉద్యమాన్ని పూర్తిగా వ్యతిరేకించడమే గాక, బ్రిటిష్‌ పాలకులకు మద్దతు ప్రకటించి, అండదండలు అందించటమే.



ఆగస్టు 15 స్వాతంత్య్రం తర్వాత గాంధీజీని హత్య గావించిన వెంటనే స్వీట్లు పంచారు. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాటి హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ, గోల్వాల్కర్, సావర్కార్‌ స్వాతంత్య్రాన్ని గేలి చేసి, బ్రిటిష్‌ పాలకులకు వత్తాసుగా నిలిచారు. మరొక నాయకుడు హెగ్డేవర్, క్విట్‌ ఇండియా ఉద్యమానికి, ఆగస్టు 15 స్వాతంత్య్ర లబ్ధి కార్యక్రమానికి దూరంగా ఉండమని ఆదేశించినట్టు ఆ సంస్థ చరిత్ర రాసిన సి. పి. భిషికార్‌ వెల్లడించాడు. అవిభక్త బెంగాల్‌ కృషక్‌ ప్రజా పార్టీ నాయకుడు ఫజుల్‌ హక్‌ సంకీర్ణ ప్రభుత్వంలో హిందూ మహాసభ నాయకుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ ఉన్నారు. ఆ ప్రభుత్వం క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ బ్రిటిష్‌ పాలకులకు మద్దతు పలికింది.



గోల్వాల్కర్‌ రాసిన ‘‘మేము’’ (ఉయ్‌ 1939) అనే మత వైషమ్యాన్ని రెచ్చగొట్టే గ్రంథంలో ప్రకటించిన సిద్ధాంతం: ‘‘ఇటలీ, జర్మనీ (ముస్సోలినీ, హిట్లర్‌ 1939)లో ప్రాచీన ఆర్యజాతి తిరిగి తలెత్తుతుంది... ఈ స్ఫూర్తితో ఆర్యజాతికి వ్యతిరేకులైన అన్యమతస్తుల్ని దేశం నుంచి తరిమి వేయాలి’’. ఈ స్ఫూర్తితోనే ఆర్‌ఎస్‌ఎస్‌ 1946–47లో కాంగ్రెస్‌ నాయకులపై దారుణంగా దాడులు చేసింది. హిందూ–ముస్లిం ఐక్యత లేకుండా స్వరాజ్యం లేదని అన్నందుకు గాంధీజీని కడతేర్చారు.



గాంధీ కోరిన స్వేచ్ఛ ఏదీ?

ఈనాడు బీజేపీ హయాంలో సెక్యులర్‌ రాజ్యాంగం భారత ప్రజలకు హామీ పడిన ప్రజాస్వామ్యపు పునాదులకు, అందులో భాగంగా హామీ పడిన భావప్రకటనా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ వగైరా సప్త స్వాతంత్య్రాలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా మత రాజకీయాలపై ఆధారపడిన పార్టీలకు రాజకీయార్థిక వ్యవస్థ (పొలిటికల్‌ ఎకానమీ) గురించిన పరిజ్ఞానం శూన్యం కావడమే ఇందుకు ప్రధాన కారణం. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు విదేశాంగ విధానంలో పాటించాల్సిన పంచసూత్రాలకూ, బాండుంగ్‌ మహాసభకు మధ్య ఉన్న అవినాభావ సంబంధంగానీ లేదా ఆసియా–ఆఫ్రికా మహా సభ, బాండుంగ్‌ మహాసభ ఒకటేననిగానీ తెలియకపోవడం ఒక ఉదాహరణ. క్విట్‌ ఇండియా ఉద్యమానికి 20 ఏళ్ల ముందటి సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా గాంధీజీ ‘స్వరాజ్యం’ అన్న పదాన్ని ఇలా నిర్వచించారు: ‘‘మన జాతీయ లక్ష్యాలను సాధించడంలో మరింతగా ముందడుగు వేసే ముందు మనం మొట్టమొదట చేయవలసిన పని–భావ ప్రకటనా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛలకు మనకు గల హక్కును ముందు స్థాపించుకోవడం.



మన జీవితాలతో ముడివడిన ఈ అత్యంత ప్రాథమిక హక్కుల్ని మనం సదా రక్షించుకోవాలి, చివరకు మన ప్రకటనలు, ఉపన్యాసాలు ఇతరులను బాధపెట్టినా సరే. అదే భావ ప్రకటనా స్వేచ్ఛకు అర్థం’’. అంతేగాదు, పత్రికలు తీవ్ర విమర్శలు చేసినా లేదా కొన్ని సందర్భాలలో వార్తల్ని తప్పుగా రాసినా కూడా పత్రికా స్వేచ్ఛను గౌరవించాలి. అంతేగాదు, గుమిగూడి లేదా సమావేశమై చర్చించుకోడానికి, చివరికి మిరుమిట్లు గొలిపే క్రియాశీలమైన కార్యక్రమాలను చర్చిం చుకునేందుకు ప్రజలకున్న సమావేశ స్వేచ్ఛను గౌరవించి తీరాలి. స్వరాజ్యాన్ని అనుభవించడానికి తొలిమెట్టు పౌర స్వేచ్ఛ, అదే స్వాతంత్య్ర సౌధానికి పునాది. ఈ విషయంలో పౌర స్వేచ్ఛను కుదించడానికి లేదా ఆ విషయంలో రాజీపడటానికి లేదా సడలింపులకూ వీల్లేదు. ఎందుకంటే, భావ స్వేచ్ఛే జీవ జలం, అదే సజీవ స్రవంతి’’ (గాంధీ కలెక్టెడ్‌ వర్క్స్, వాల్యూం 69, పే.356).



నేడు, గాంధీజీ నిర్వచించి, హెచ్చరించిన ఆ స్వేచ్ఛా వాయువుల్ని పీల్చ గల రాజకీయ వాతావరణం దేశంలో ఉన్నట్లు అనిపించడం లేదు. పలు రాష్ట్రాల్లో గత మూడేళ్లుగా సాగుతున్న పరిణామాలు దాన్నే రుజువు చేస్తున్నాయి. ఈ వాతావరణంలో పాలక వర్గం క్విట్‌ ఇండియా, ఆగస్టు 15 చారిత్రక పరిణామాల పేరిట ఎన్ని హామీలు, ప్రకటనలు జారీ చేసినా అవి కంటి నీళ్ల తుడుపే అవుతుంది. విద్యావేత్తా, దౌత్య వ్యవహర్త హమీద్‌ అన్సారీ భారత ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యంగ్య ప్రసంగం ఈ వాస్తవాన్ని మరింత ఖాయపరిచేదిగా ఉంది. అన్సారీ, భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడటం, విశ్వవిద్యాలయాల్లో విద్వత్‌ గోష్ఠులను స్వేచ్ఛగా, పది రకాల అభిప్రాయాలను గౌరవించే విధంగా నిర్వహించే వాతావరణం ఉండాలని అనడం పాలకులకు నచ్చినట్లు లేదు.



మోదీ, అన్సారీ మీద నర్మగర్భంగానూ, వెకిలిగానూ విరుచుకుపడ్డానికి అసలు కారణం బహుశా ఆయన చివరి ప్రసంగ వచనాలే కావాలి: ‘‘పాలక విధానాలను తగు రీతిలో, స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా విమర్శించడానికి ప్రతిపక్షాలను అనుమతించకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాస్తా నియంతృత్వం కింద దిగజారిపోతుంది’’ అన్నారు. అంతేగాదు, నేడు ఒక పౌరుడి భారతీయతను ప్రశ్నించడం ఆందోళనకర అంశమని కూడా అన్సారీ భావిం చారు. ఈ అభద్రతా ధోరణిని పౌరులలో వ్యాపించనివ్వరాదని, పొద్దస్తమానం దేశ పౌరులు జాతీయతను నిరూపించుకోనక్కర్లేదనీ, ‘నేను భారతీ యుడ్ని’ అన్న ప్రకటనే వ్యక్తిత్వానికి ఏడుగడ’’ అన్నారు.



జ్ఞానోదయం అయ్యేనా?

దేశవిభజన అంశంపై గాంధీజీని వ్యతిరేకించిన కాంగ్రెస్‌ నాయకత్వం, ఆగమేఘాలమీద అధికారంలోకి రావాలని బ్రిటిష్‌ ఇండియా వైస్రాయి ఎక్కడ ముద్రలు వేయమంటే అక్కడల్లా వేసింది. ఫలితం, 70 ఏళ్లుగా ముగిసిపోని కల్లోల సముద్రంగా మిగిలిన ఇండియా–పాకిస్తాన్‌ ఘర్షణ. ఈ భావి పరిణామాన్ని కూడా ఊహించిన గాంధీజీ దేశ విభజన కోసం బ్రిటిష్‌ పార్లమెంటులో ప్రతిపాదించిన బిల్లు గురించి 1947 జూలై 5 నాటి తన ప్రార్థన సమావేశంలో ఈ ప్రకటన చేశారు: ‘‘ఈ బిల్లులో విషం ఉంది. ఈ విషాన్ని మనం మింగాం, కాంగ్రెసూ మింగింది. బ్రిటన్‌ 150 ఏళ్లపాటు ఇండియాను ఏలింది. రాజకీయంగా భారతదేశమంతా ఒకే దేశమని బ్రిటిష్‌ ప్రభుత్వం అంగీకరించింది. అయినా దేశాన్ని ఐక్యంగా ఉంచిన బ్రిటన్‌ తన చేతుల్తోనే చీల్చేయడం కొరగాని పని. అటు కాంగ్రెసు, ఇటు ముస్లింలీగ్‌ ఆ బిల్లుకు అంగీకరించాయి.



కానీ, ఒక చెడును అంగీకరించడాన్ని మంచిపని కాజాలదు గదా!’’ భారత్, పాకిస్తాన్‌లు రెండూ ఒక దానిపైకి మరొకటి సాయుధ దళాలను సన్నద్ధం చేస్తుండటాన్ని గమనించిన గాంధీజీ ఆ మరునాడే భవిష్యత్తు గురించి ఇలా హెచ్చరించారు: ‘‘ఈ మోహరింపుల పర్యవసానం యుద్ధం. ఇంతకూ అసలు ప్రశ్న– మన వనరులను మన పిల్లలను విద్యావంతుల్ని చేయడానికి వినియోగిద్దామా లేక తుపాకీ మందుపైనా తుపాకులపైనా ఖర్చుపెడుతూ కూర్చుందామా? ఈ వరస చూస్తుంటే భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది సుమా!’’ అన్నారు గాంధీజీ. ఇప్పటికీ మన పాలకులకు బుద్ధి రావడం లేదు, ఏం చేద్దాం? జ్ఞానోదయం కోసం వేచిచూద్దాం!




ఏబీకే ప్రసాద్‌

సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top