‘బాడుగ’ వరకే బంధం

‘బాడుగ’ వరకే బంధం - Sakshi


రెండో మాట

అమెరికా పాలకుల అనర్థదాయక ప్రకటనలు పంపుతున్న తిరకాసు సంకేతాలను భారత పాలకులుగాఖండించలేకపోతున్నారు. పైగా ట్రంప్‌ విధానాలకు పరోక్షంగానూ, ప్రత్యక్షం గానూ వత్తాసు పలుకుతున్నారు. ఇందుకు కారణం, ఆర్థిక సంస్కరణలపై మనం బేషర తుగా సంతకాలు చేసి ఉండడమూ, ఆ షరతులనుంచి దూరం కాలేకపోవడమూనని గ్రహించాలి. ఇందుకు తాజా ఉదాహరణ–‘ఇండియాతో సంబంధాల విషయంలో ట్రంప్‌ పాలకవర్గం సానుకూల వైఖరితోనే ఉందని’ మన విదేశాంగ కార్యదర్శి ప్రకటించడం.



‘‘అమెరికాలో నివసిస్తున్న తెలుగువారంతా కలసికట్టుగా ఉండాలి. అమె రికావాళ్లు పిచ్చివాళ్లుగా మారిపోతున్నారు. ఏ విషయంలోనైనా సరే మీరు వారితో వాదనలలోకి దిగవద్దు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాల వల్లనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. భారత యువత పునరాలోచించుకుని స్వదేశానికి తరలండి!’’ - మేడసాని మన్మోహన్‌రెడ్డి , 24–2–2017 (శ్రీనివాస్‌తో పాటు జాత్య హంకారుల దాడికి గురై కోలుకుంటున్న అలోక్‌రెడ్డి తండ్రి)



దూరపు కొండలు నునుపు కావచ్చు, కానీ అమెరికా దూరపు కొండలు గరు కేనన్న సంగతిని ట్రంప్‌ పదవీ స్వీకారం తరువాతే మనం గ్రహించామను కుంటే పొరపాటు. ఇటీవలి దశాబ్దాలలో కూడా ఇలాంటి హత్యాకాండ అమె రికాలో సాగిందన్న వాస్తవాన్ని గుర్తించాలి. గడచిన పదిన్నరేళ్ల కాలంలోనే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సహా, భారత విద్యార్థులు 1,064 మంది జాత్య హంకారంతో జరిపిన దాడులలో బలయ్యారు. ట్రంప్‌ అధ్యక్షుడైన తరువాత విద్య, ఉద్యోగాల కోసం అమెరికాను ఆశ్రయించిన ఆసియా, ఆఫ్రికా దేశాల యువతపై దాడులు మరింత పెచ్చరిల్లిపోయాయి. ఒక వారం లేదా పది రోజుల వ్యవధిలోనే ఇలాంటి దాడులకు బలైన, కాకుంటే క్షతగాత్రులైన వారి సంఖ్య నాలుగు. తాజాగా సిక్కు యువకుడు దీప్‌రాయ్‌ పైన నిన్నగాక మొన్న (మార్చి 5) కాల్పులు జరిగాయి. ఆయన కోలుకుంటున్నారు. ఈ ఘటన తరువాత అప్పుడు తెలుగు సంఘాల మాదిరిగానే ఇప్పుడు సిక్కు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.



భూతాల స్వర్గం

అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి వెన్నుదన్నుగా నిలుస్తూ జాత్యహం కార ధోరణులకూ, దాడులకూ ప్రతిఘటనా శక్తిగా వ్యవహరిస్తున్న న్యాయ వాది వలారి కౌర్‌. విభిన్న జాతులకు చెందిన బాధితులకు కూడా ఆమె అండ దండలనిస్తున్నారు. ఇటీవలి దాడుల నేపథ్యంలో ఈ ధోరణిని ఖండిస్తూ ఒక ఆఫ్రికన్‌–అమెరికన్‌ చర్చి ఆవరణలో జరిగిన భారీ సభలో కౌర్‌ ప్రసంగిం చారు. ఆరు నిమిషాల పాటు, ఉద్వేగంగా ఆమె ఉపన్యసించారు. అమెరికా వచ్చిన వలస జీవుల పట్ల సాగుతున్న అమానవీయత ఆమె గొంతులో ధ్వనిం చింది. ‘‘ఈ చీకటి– ప్రేతగృహంలోని అంధకారం కాకపోతే మరేమిటి? ఈ చీకటి గర్భాంతర చీకటి. మన అమెరికా ఓ మృతదేహం, కాకపోతే జన్మనె త్తుతున్న దేశమా? ఇప్పటికీ సమయం మించిపోలేదు. మనం శ్వాసించాలి’’ అన్నారు.



నేను గత పదిహేనేళ్లుగా అమెరికా గడ్డపైనే నివశిస్తూ సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాను. కానీ ఈనాటిలా ఇంతకు ముందు అసం ఖ్యాక ప్రజానీకం ముందుకొచ్చి న్యాయం కోసం నిలబడ్డ సన్నివేశాన్ని నేను చూడలేదని అన్నారామె. ఈ ప్రసంగాన్ని కోటీ అరవై లక్షలమంది టీవీలలో తిలకించారని ప్రసిద్ధ భారతీయ పత్రికా రచయిత జార్జ్‌ వర్ఘీస్‌ (5–3–17)న ఒక నివేదికలో ప్రస్తావించారు. న్యాయవాది కౌర్‌కు నైతిక బలం వందేళ్ల నాటి ఘట్టం నుంచి వచ్చింది. ఆనాడు సిక్కు కుటుంబానికి చెందిన ఆమె తాత గారు పంజాబ్‌ నుంచి తలపాగాతో అమెరికాలో దిగితే డిటైన్‌ చేశారు. తరు వాత తప్పిదాన్ని గ్రహించి విడుదల చేశారు. నిజానికి ఆయనను విడిపిం చినది మళ్లీ ఒక శ్వేతజాతి న్యాయవాదే. అయితే 9/11 ట్విన్‌ టవర్స్‌ ఉదంతం తరువాత ఈ సిక్కు కుటుంబం అమెరికాను వీడవలసి వచ్చింది. కానీ న్యాయ వాది కౌర్‌ అమెరికాలోనే ఉండిపోయి సిక్కు–ముస్లిం అమెరికన్లకు వ్యతిరే కంగా జరుగుతున్న దాడులను ప్రతిఘటిస్తూ, వారికి అండగా నిలిచారు. 9/11 బ్రహ్మ రహస్యాన్ని చరిత్ర గర్భంలో పాతిపెట్టినట్టేనని అమెరికా మేధావి నోమ్‌ చామ్‌స్కీ, బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ నేత కార్బిన్‌ ఇప్పటికే వ్యాఖ్యా నించారు. ఆ ఘటన దరిమిలానే శ్వేతేతరులపై శ్వేతజాతీయులలో గూడు కట్టుకుని ఉన్న జాత్యహంకార వైఖరి పెచ్చరిల్లిపోయింది.



ఈ దాడులన్నీ విద్రోహంలో భాగమే

అందుకే లాయర్‌ కౌర్‌ (కాలిఫోర్నియా) జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఇరవై ఏళ్లుగా క్షేత్రస్థాయిలో పోరాడుతున్నారు. అట్టడుగు ప్రజాబాహు ళ్యంతో, 3 లక్షలమంది సభ్యులతో మహోద్యమాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్, బల్బీర్‌ సింగ్‌ తదితరుల హత్యాకాండ విద్రోహమేననీ కౌర్‌ ఎలాంటి శష భిషలు లేకుండా చెబుతున్నారు. ‘ఈ దుర్ఘటనలన్నీ పెద్ద స్థాయిలో సృష్టిస్తున్న భీతావహ పరిస్థితిలో, విద్వేష వాతావరణంలో భాగమేనని గుర్తించాల’ని  పదే పదే హెచ్చరిస్తున్నారు.



అమెరికాకు భారతీయ జ్ఞాన సంపద, ఉపజ్ఞ కావాలి. ఆసియా, ఆఫ్రికా ఖండ దేశాల సాంస్కృతిక సంపద కావాలి. కానీ వీరంతా ‘కిరాయి’ తీసుకుని తమకు ఊడిగం చేసి వెళ్లిపోవాలి. వారు అమెరికాలో ఉన్నత స్థానాలలోకి ఎదిగి రాకూడదు. ఇదే అమెరికా పాలకుల ప్రధాన ఆశయం. హార్డ్‌వేర్‌ సాంకే తిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాల ప్రయోజనాలకు అందించకుండా అమెరి కన్‌ సైనిక–పారిశ్రామిక పాలనాధికార వ్యవస్థ ఇన్నాళ్లూ తొక్కి పెట్టినది కూడా ఇందుకే. అలాగే ‘టెర్రరిజం’ తెరచాటున ఇండియా, తదితర వర్ధమాన దేశాల పాలకుల్ని తమపై ఆధారపడి ఉండే వ్యూహాలు, ఎత్తుగడలలో బంధి స్తున్నది. అమెరికాలో ఇలాంటి ఊడిగం కొనసాగించడానికే, మన టెక్నాలజీ వృద్ధి చెందకుండా ఆ దేశ సర్వర్ల మీదనే మనం ఆధారపడి ఉండే పరిస్థితిని అమెరికా సృష్టిస్తూ వస్తోంది.



ఎంతకాలమని అమెరికాలోని నిరుద్యోగ సంత తికి ఉపాధి అవకాశాలు కల్పించకుండా తొక్కిపెట్టగల్గుతుంది? ఆ వ్యూహం సాధ్యపడదు కాబట్టే తొలి ‘బాడుగ’ పనుల కోసం సమాచార సాంకేతికప రమైన టెక్నాలజీ (ఐటీ)లో ఎదుగుతున్న భారతీయ యువతను అమెరికాకు రప్పించుకుని ఎక్కువ జీతాలపై వారిని సాకుతున్నట్టు నాటకం ఆడుతూ వచ్చింది. తాను ఆర్థిక సంక్షోభంలో మునకవేసే దశ వచ్చేసరికి భారతదేశం  లోనే ఉండి తక్కువ జీతాలపై ‘బాడుగ’తో అమెరికాకు సేవలందించండని శాసించింది. అంతేకాదు, ‘హెచ్‌–1బి’ వీసాల చార్జీలు పెంచేసి, అత్యంత అనుభవజ్ఞులైన విద్యార్థులకు తప్ప, అమెరికాకు ఉద్యోగాల కోసం ఇండియా నుంచి పంపే లక్షలాదిమందికి గంపగుత్తగా వీసాలిచ్చేది లేదంటూ ట్రంప్‌ నుంచి ఆదేశాలు, నియంత్రణలు వెలువడుతున్నాయి. ఇది ఇండియాలో యువత తల్లిదండ్రులకు, హెచ్‌–1బి, ఎల్‌–1 వీసాల కోసం తపనపడి పడి గాపులు కాసేవారికి పిడుగుపాటైపోయింది.



ట్రంప్‌ భారత్‌ అనుకూలుడా? ఎలా?

ఈ ఆకస్మిక  దుష్పరిణామాన్ని తిప్పి కొట్టగల శక్తి పరాధార స్థితిలో ఉన్న స్వతంత్ర భారత పాలకులకు కరువైపోయింది. కనీసం–ఇంతమంది భారతీ యుల్ని పొట్టనపెట్టుకుంటున్న జాత్యహంకార ధోరణికీ, అమెరికన్‌ పాలనా విధానాలకూ నిరసనగానైనా బలమైన గొంతును విన్పించలేని దుస్థితి భారత పాలకులది. కారణం? అమెరికా పాలకులు ‘టెర్రరిజం’ బూచిని చూపి, ‘మేం ప్రపంచంలో ఎవరిని, ఏ దేశాన్ని టెర్రరిస్టు దేశం అని ప్రకటిస్తామో ఇతర దేశాల నాయకులు కూడా అదే విధానానికి కట్టుబడి ఉండాలి. లేకపోతే వారినీ, వారి దేశాలనూ కూడా మేం టెర్రరిస్టులుగా ప్రకటిస్తాం’ అని (సీని యర్‌ జార్జిబుష్‌ లగాయతూ) హెచ్చరించారు. ఆ క్షణం నుంచీ భారత దేశం లోని సాత్విక పాలకులూ, దుందుడుకు పాలకులూ అమెరికా నినాదాన్నే అందుకున్నారు. టెర్రరిజం టెర్రరిజం నుంచే పుడుతుంది, ఫాసిజం ఫాసిజం నుంచే తలెత్తుతుంది. ఈ వాతావరణం ఇన్ని వేలమంది మన యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీసేందుకు సిద్ధంగా ఉంది.



అమెరికా పాలకుల అనర్థదాయక ప్రకటనలు పంపుతున్న  తిరకాసు సంకేతాలను స్వతంత్ర భారత పాలకులుగా కరాఖండిగా ఖండించలేకపోతున్నారు. పైగా ట్రంప్‌ విధానాలకు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ వత్తాసు పలుకుతున్నారు. ఇందుకు కారణం, ఆర్థిక సంస్కరణలపై మనం బేషరతుగా సంతకాలు చేసి ఉండడమూ, ఆ షరతులనుంచి దూరం కాలేక పోవడమూనని గ్రహించాలి. ఇందుకు తాజా ఉదాహరణ–‘ఇండియాతో సంబంధాల విషయంలో ట్రంప్‌ పాలకవర్గం సానుకూల వైఖరితోనే ఉందని’ మన విదేశాంగ కార్యదర్శి ఎస్‌. జయశంకర్‌ వాషింగ్టన్‌ నుంచి (4.3.17) ప్రకటించడం. ఆయన ఈ నిర్ణయా నికి ఎలా వచ్చారు? ట్రంప్‌ వైఖరి మనకు సానుకూలంగా ఉంటుందని ఏ భారమితితో కొలిచారు? ట్రంప్‌ కూడా అమెరికా ఇతరుల మీద దిగుమతు లపై ఆధారపడకుండా ఎగుమతుల్ని పెంచుకునేందుకు దేశీయ వస్తూత్పత్తి రంగాన్ని (మాన్యుఫాక్చరింగ్‌) పటిష్టం చేయాలనుకుంటున్నారు.



ఇక్కడ ‘ఇండియాలోనే తయారీ’ (మేక్‌ ఇన్‌ ఇండియా) అని మోదీ కూడా నినాదం అందుకున్నారు. కాబట్టి ఉభయుల ఆదర్శాలూ ఏకీభవిస్తున్నాయి. ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు యథావిధిగానే ఉంటాయన్నది జయశంకర్‌ అభిప్రాయం. కానీ ట్రంప్‌ ప్రకటనలు మన స్వతంత్ర ఆర్థిక మూలాలకు, సాంకేతిక పురోగతికి ప్రపంచబ్యాంక్‌ ప్రజా వ్యతిరేక విధానాల ఆసరాతోనే ఎసరు పెడుతున్నాడన్న మౌలికమైన గ్రహింపు లేకపోవడమే జయశంకర్‌ ప్రక టనకు ప్రధాన కారణమై ఉండాలి.



ఇదొక కొనసాగింపు

‘హెచ్‌–1బి’ వీసాల అనుమతిపై ఒబామా పాలనలో ప్రారంభమైన వాదోప వాదాలకు కొనసాగింపే ట్రంప్‌ కఠినమైన నిర్ణయాలకు బాట వేసిందంటే– ఇండియా విషయంలో ఏకీకృతమైన నిర్ణయాలు తీసుకోవటంలో (అణుశక్తి వినియోగం, వాణిజ్య వర్తక లావాదేవీలు) డెమోక్రాట్లు–రిపబ్లికన్లు చేతులు కలుపుతారని కూడా గ్రహించాలి. అలాగే హెచ్‌–1బి వీసాలపై తుది నిర్ణ యానికి రావడంలో కూడా అమెరికా పార్లమెంటులో పాత చట్టం స్థానే ఒక ముఖ్యమైన సవరణను డెమోక్రాట్లు–రిపబ్లికన్‌లు ఉమ్మడిగానే ప్రతిపాదించా లని నిర్ణయించారని మోదీ సలహాదార్లకు తెలియక పోవటం విచారకరం.



ఏది ఏమైనా ఇటీవల అమెరికాలో మనవాళ్లపై జరుగుతున్న హత్యాకాండ గురించి, కట్టలు తెగుతున్న విద్వేషం గురించి అధికార స్థాయిలో తగిన రీతిలో నిరసనలు వ్యక్తం కావటం లేదని ప్రజలు భావిస్తున్నారు. ట్రంప్‌ ఇంత వరకూ ‘విచారిస్తున్న’ట్టు ముక్తసరిగానే చెప్పారు కానీ రోదిస్తున్న కుటుంబా లకు ‘క్షమాపణ’ చెప్పలేదని మరచిపోరాదు. ఈ దేశం నుంచి ఎందరో మహ నీయులు అమెరికా వెళ్లారు. జ్ఞానాన్ని సునిశితం చేసుకున్నారు.Sకానీ వారు ఇప్పటిలా అక్కడే కూరుకుపోలేదు.





- ఏబీకే ప్రసాద్‌


సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top