గెలుపు కోసమే గాండ్రింపులు

గెలుపు కోసమే గాండ్రింపులు - Sakshi


రెండో మాట

ఫలానా వారు, లేదా ఫలానా సంస్థ/సంస్థలు ‘గోరక్ష’ దౌర్జన్యకారులని మోదీ ప్రకటించకపోయినా, ఆరెస్సెస్‌ లాంటి ప్రధాన సంస్థ, ఆ సంస్థ అనుబంధ శాఖలు ఇలాంటి ‘గోరక్ష’ దౌర్జన్యకాండలకు ఎలా కారణమవుతున్నాయో సుప్రసిద్ధ భారత రాజకీయ విశ్లేషకుడు, పాత్రికేయుడు ధీరేంద్ర కె. ఝా ఈ ఏడాది (2017) ప్రారంభ దినాల్లోనే ‘షాడో ఆర్మీస్‌’ అనే పరిశోధనాత్మక గ్రంథంలో వివరించారు. అవి ఇండియాలో ఏ విధంగా పని చేస్తూ వచ్చాయో ధీరేంద్ర ఝా ‘అజ్ఞాత సైనికులు’ గ్రంథంలో పూసగుచ్చినట్టు వివరించాడు.



‘గోరక్ష పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న హింస, దౌర్జన్యాల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. గోరక్ష పేరుతో ఎవరూ చట్టాన్ని తమ చేతులలోకి తీసుకోరాదు. పలువురు సంఘ వ్యతిరేకశక్తులు ఈ అవకాశం విని యోగించుకుని సమాజంలో అస్థిర పరిస్థితులకు కారణమవుతున్నారు. ఈ మతహింసను అరికట్టడంలో ప్రతిపక్షాలు సహకారం అందించాలి.’ – నరేంద్రమోదీ (పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ఒక రోజు ముందు, 16వ తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశంలో)



తెలివి ఎవడబ్బ సొమ్ము? వెనుకటికి ఒకడు కన్నవారిని కడతేర్చి, ‘అమ్మా బాబులు లేనివాడిని అదుకోండి!’ అని మొత్తుకున్నాడట. ఇంతకూ ప్రధాని మోదీ విపక్షాలను ఉద్దేశించి చేసిన విజ్ఞాపనలో గోరక్ష పేరుతో అరాచకాలు చేస్తున్నవారు ఎవరు? ఆ పేరుతో హింసకు దిగుతున్నవారు ఎవరు? అనే అంశాన్ని మాత్రం స్పష్టంగా పేరుపెట్టి చెప్పలేదు. ఎవరు గోరక్ష పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో బహిరంగపరచలేకపోయారు. చట్టాన్ని ఎవరూ తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోరాదన్న మోదీ మాటను గౌరవించాల్సిందే. అలాగే మతహింసను అరికట్టే కృషిలో విపక్షాలు కూడా సహకరించాలన్న ప్రధాని విన్నపాన్ని కూడా గౌరవిస్తాం. అయితే తానే పేర్కొన్న ఆ అజ్ఞాత శక్తులేవో చెప్పకుండా ఆయన మౌనం దాల్చారు.



ఆవు తోకతో గెలుపు వైతరణి దాటడానికే!

ఇంతకూ విపక్షాలకు ఇలాంటి విజ్ఞాపనను ఇప్పుడు ప్రధాని చేయడం వెనుక రహస్యం ఏమిటి? సోమవారం (17వ తేదీ) కొత్త రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌కు ముహూర్తం కాబట్టి! బీజేపీ (ఆరెస్సెస్‌), ఎన్డీఏ పరివార్‌ అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ బరిలో ఉన్నారు కాబట్టి! విపక్షాల తరఫున మీరాకుమార్‌ పోటీలో ఉన్నారు కనుక! కాబట్టే మోదీకి అమోఘమైన లౌక్యం అవసరమైంది. కోవింద్‌ నెగ్గాలంటే ఈ ఒక్క సందర్భానికైనా సెక్యులరిజం అవసరమై ఉంటుంది. గోరక్ష పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న హింస, దౌర్జన్యాల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు సరే, ఈ కృషిలో కేంద్రం తన వంతు ధర్మంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నదో కూడా మోదీ వివరించలేదు. నిజానికి ఈ మతహింసకు ఎలాంటి వ్యక్తులు, ఏయే సంస్థలు కారణమో చెప్పి, మరింత తీవ్రంగా ఖండించి ఉంటే మోదీ ప్రజాభిమానాన్ని చూరగొని ఉండేవారు. కానీ ఆయన మాటలలో అదే కొరవడింది. గోరక్ష పేరుతో పలువురు సంఘ వ్యతిరేక శక్తులు హింసాకాండకు దిగారని ఆయనే అన్నప్పటికీ, వాళ్లెవరో ఆయన పేర్కొనలేదు. అంటే ‘సమాజంలో అస్థిర పరిస్థితులకు కారకులు’ ఎవరో కూడా బయటపెట్టలేదు. మతహింసను అరికట్టడంలో ప్రతిపక్షాలు సహకరించాలని కోరారే గానీ దేశవ్యాప్తంగా మూడేళ్లుగా గోరక్ష పేరుతోనే హేతువాదులపైన, దళితులపైన, జాతీయ మైనారిటీలపైన విచ్చలవిడిగా సాగిన దాడులకూ, దౌర్జన్యాలకూ కారకులు ఎవరో కూడా ఆయన వెల్లడించలేదు. ఆయా వర్గాల ఆహారపు అలవాట్ల మీద, వస్త్ర ధారణ మీద, రాజ్యాంగం శాసించినట్టు పాఠ్యపుస్తకాలలో సెక్యులర్‌ అంశాలను చేర్చడంపైన విరుచుకుపడుతున్నవారు ఎవరో ఆయన చెప్పలేదు. అంతా శ్రీవైష్ణవులే కానీ రొయ్యలబుట్ట ఖాళీ అన్న చందంగా గోరక్ష పేరుతో జరుగుతున్న ఈ అజ్ఞాత హింసకు పునాదులు ఎక్కడ ఉన్నాయో మోదీకి తెలియవంటే నమ్మగలమా!



గోరక్షకుల అసలు ధ్యేయం ఏమిటి?

కొత్త రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ‘శాయంగల విన్నపము’లలో భాగంగానే మోదీ నోటి వెంట ఆ తరహా ఆపద్ధర్మ విజ్ఞాపన వెలువడింది. అంతేతప్ప, ఆయన మాటను కుల, వర్గ, మతాతీత సెక్యులర్‌ వ్యవస్థ రక్షణకు ఉద్దేశించిన రక్షా కవచంగా భావించలేం. ఎందుకంటే, గోరక్షకుల ధ్యేయం నిజంగా గోవుల రక్షణ కాదు. వాటికి అవసరమైన మేతను, పచ్చికబయళ్లను పెంచి, గోశాలలు ఏర్పాటు చేసి వాటి సంక్షేమాన్ని చూడడం కాదు. రాజకీయ కక్షలలో భాగంగా చేపట్టే గోరక్ష ఉద్యమాలు, దౌర్జన్యాలు చేటు చేస్తాయి. హిందుత్వవాదులుగా ‘హిందూరాష్ట్ర సాధన’ కోసం పరితపించిన గోల్వాల్కర్, సావర్కర్‌లు విభిన్న జాతుల, మతాల, కులాల, తెగల సమన్వయంతో విలసిల్లే భారతదేశమే మనదన్న స్పృహ లేకుండా తలపెట్టినదే గోరక్ష చిట్కా. ఈ పూర్వరంగాన్ని మభ్యపెట్టి ఎవరో హింస చేస్తుంటే, అందుకు రాష్ట్ర ప్రభు త్వాలు ‘కఠినంగా వ్యవహరించకుండా ఉన్నట్టూ’ ఆ హింసను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు సహకరించనట్టూ ఎదురుదాడికి పాలకులు దిగడం– ఇప్పటికీ చరిత్ర పాఠాలు నేర్వడానికి వారు సిద్ధంగా లేరని భావించడానికి ఆస్కారం కల్పిస్తున్నది.



మోదీ వెల్లడించడానికి ఇష్టపడని ఆ ఫలానావారి ‘హింస’కు వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా విద్యార్థి, ప్రజా సంఘాలు, సాహిత్య, సాంస్కృతిక రంగాల జాతీయ పురస్కార గ్రహీతలు ఎందరో నిరసనలు తెలిపారు, ఉద్యమాలు నడుపుతున్నారు, పురస్కారాలు తిప్పికొడుతున్నారని గ్రహించాలి. ఫలానా వారు, లేదా ఫలానా సంస్థ/ సంస్థలు ‘గోరక్ష’ దౌర్జన్యకారులని మోదీ ప్రకటించకపోయినా ఆరెస్సెస్‌ లాంటి ప్రధాన సంస్థ, ఆ సంస్థ అనుబంధ శాఖలు ఇలాంటి ‘గోరక్ష’ దౌర్జన్యకాండలకు ఎలా కారణమవుతున్నాయో సుప్రసిద్ధ భారత రాజకీయ విశ్లేషకుడు, పాత్రికేయుడు ధీరేంద్ర కె. ఝా ఈ ఏడాది (2017) ప్రారంభ దినాల్లోనే ‘షాడో ఆర్మీస్‌’(అజ్ఞాత సైన్యం) అనే పరిశోధనాత్మక గ్రంథంలో వివరించారు. ఈ ‘అజ్ఞాత శక్తులు’ ఎన్ని రూపాల్లో పనిచేస్తుంటాయో, ఈ అనుబంధ శాఖలు బ్రిటిష్‌ వలసవాద సైన్యం దుస్తుల నుంచి ఇటలీలోని ఫాసిస్టు ముస్సోలినీ సైన్య నిర్మాణ లక్షణాల నుంచి ఎరువు తెచ్చుకుని ఇండియాలో ఏ విధంగా పనిచేస్తూ వచ్చాయో ధీరేంద్ర ఝా ‘అజ్ఞాత సైనికులు’ గ్రంథంలో పూసగుచ్చినట్టు వివరించాడు. అతని పరిశోధన ప్రకారం ‘‘గత మూడు దశాబ్దాలుగా ‘హిందుత్వ’ రాజకీయాలు భారీ స్థాయిలో వ్యాప్తి అవుతూ వచ్చాయి. భారతీయ సమాజాన్ని చీల్చిపెట్టే పెక్కు రకాల బ్రాండ్‌ రాజకీయాలకు ఇది పునాదులు వేసింది. ఇందుకు దోహదం చేసే సంస్థ ఒక్క భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే కాదు, ఈ పార్టీకి అజ్ఞాతంగా పనిచేసే పెక్కు శక్తులు కూడా రంగ ప్రవేశం చేశాయ’’ని ధీరేంద్ర రాశాడు. అఖండ భారత సంస్థగా 1925లో అవతరించిన ‘రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌’(ఆరెస్సెస్‌) ఇంతవరకూ భారతీయ చట్టాలలో దేని పరిధిలో కూడా రిజిస్టర్‌ కాని సంస్థ అని ఆయన పేర్కొన్నాడు. అలాగే పేరుకు తమది సాంస్కృతిక సంస్థ అని చెప్పుకున్నా దాని ప్రధాన వ్యాపకం రాజకీయ లక్ష్యమేనని ధీరేంద్ర చెబుతూ, ఈ సంస్థ కింద చాలామందికి తెలియని మొత్తం 36 అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. వీటిలో బీజేపీ మాత్రమే రాజకీయాలకు అంకితమైన ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ. ఈ 36 విభాగాలనూ కలిపి ‘సంఘ్‌ పరివార్‌’గా పరిగణిస్తారు. పైకి చెప్పింది చేయక పోవటం, చేసింది చెప్పక పోవటం– ఈ ‘అజ్ఞాత సైన్యం’ లక్షణమన్న లోకోక్తి కూడా వ్యాప్తిలో ఉంది.



ఆరెస్సెస్‌ను మూడుసార్లు ఎందుకు నిషేధించారు?

బహుశా బీజేపీ గత 30 సంవత్సరాలలో పార్లమెంటులో కేవలం 2 సీట్లనుంచి, 2014 నాటికి 282 సీట్లకు ఎదగడం వెనుక రహస్యం దాని మాతృ సంస్థ అజ్ఞాత కార్యకలాపాలే కావచ్చు. అలాంటి ఆరెస్సెస్‌ సంస్థను దేశ స్వాతంత్య్రం తర్వాత మూడుసార్లు ఎందుకు నిషేధించాల్సి వచ్చింది? ఒకసారి మహాత్మాగాంధీ హత్యానంతరం (1948) మరోసారి 1970లలో ఎమర్జెన్సీ కాలంలో, ఇంకోసారి బాబ్రీ మసీదును విధ్వంసం చేసినప్పుడు (1992). ఈ అన్ని దశలను వివరిస్తూ ధీరేంద్ర ఝా అసలు విషయాన్ని ఇలా వర్ణించాడు: ‘‘బీజేపీ అధికారికంగా రాజకీయాలకు అంకితమైన ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ. మిగతా అనుబంధ సంస్థల ఆశయం ఇండియాను ఇక్కడ నివసించే ఇతర జాతులతో, విభిన్న మతాలతో, భిన్న జాతీయ ‘మైనారిటీ’ లతో సంబంధం లేని కేవల హిందూ రాష్ట్రంగా మార్చడం. ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ)– బీజేపీకి నీడలా వెన్నంటి ఉండే తెరచాటు సంస్థలు. ఈ రెండు సంస్థలూ ఎన్నికల్లో పోటీ చేయవుగానీ, జనాల్ని సమీకరించడంలో రాజకీయ బలాబలాల్లో మార్పు తీసుకురావడానికి తగిన సమస్యల్ని ముందుకు నెట్టడానికి ఒక రాజకీయ పార్టీ చేయగల పనులన్నింటినీ పెడుతుంటాయి’’.



ఏ ‘సంఘ విద్రోహుల’ వల్ల భారతీయ సమాజానికి ‘అస్థిర పరిస్థితులు’ ముంచుకొస్తున్నాయో తేల్చే బాధ్యతను మోదీ వదిలి, ఆ పనిని మనకు బదలీ చేస్తున్నట్టుంది. అధికారంలో ఉన్న తాను పరిష్కరించగలిగి కూడా, పరిష్కరించలేక, రాష్ట్రపతిగా కేవలం కోవింద్‌ విజయావకాశాన్ని పెంచే ప్రయత్నంలో ‘గోరక్ష’ దౌర్జన్యం పేరిట మోదీ విపక్షాలపైన కనికట్టు ప్రయోగం చేశారు. దేశ భద్రత కోసం, దేశ రక్షణలో మీకు బాసటగానే ఉంటామని విపక్షాలు అఖిలపక్ష సమావేశంతో సరిపెట్టుకున్నాయి గానీ, దేశ భద్రతకు దేశ రక్షణకూ, దేశంలో మత జాతర ప్రాతిపదికపై విచ్చలవిడిగా కొనసాగుతున్న అరాచకాలకు స్వస్తి చెప్పించడానికి సంబంధం ఉన్న సత్యాన్ని మరవరాదు. అంటే, దేశంలో పాలకులు అనుసరించే నీతికీ, విధాన స్వచ్ఛతకూ–వైదేశిక నీతికీ, ఇరుగుపొరుగుతో సంబంధాలను శాంతి చర్చల ద్వారా మెరుగుపర్చుకోవడానికీ విడదీయరాని సంబంధం ఉందన్న సంగతిని కూడా సదా గుర్తుం చుకోవాలి.





- ఏబీకే ప్రసాద్‌


సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top