ఈయూ గాథ, బ్రిటన్ బాధ

ఈయూ గాథ, బ్రిటన్ బాధ - Sakshi


రెండో మాట

‘పశ్చిమ రాజ్యాల ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాలుగా ఆయా దేశాలకు ఇతర దేశాల నుంచి జరుగుతున్న వలసల విషయంలో కలుషిత వాతా వరణాన్ని సృష్టిస్తూ వచ్చాయి. పశ్చిమ దేశాలలో ఏర్పడిన కార్మికులు, శ్రామి కుల కొరతను తీర్చుకోవడం కోసం వీరిని అతిథి సేవకులుగా (గెస్ట్ వర్కర్స్) దిగుమతి చేసుకోవలసి వచ్చిందన్న మిషతో ఈ వలసలని అనుమతించడం జరిగింది. ఇలా సరిహద్దులను అతిక్రమించి ఏ అధికారిక పత్రాలు లేకుండా దూసుకువస్తున్న ఆ అసంఖ్యాక వలస కార్మికుల వల్ల సరిహద్దులను కాపాడు కోగల శక్తి గురించి కూడా పశ్చిమ రాజ్యాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అవాస్తవికంగా ఉంటున్నాయి. యూరప్ దేశాల ప్రజలకు ఇతర చోట్ల నుంచి జరుగుతున్న వలసలు యూరప్ ఆర్థిక సమస్యలకన్నా పెద్ద తలనొప్పిగా మారాయి.’

-ది ఎకానమిస్ట్ (లండన్) ప్రత్యేక నివేదిక; మే 28, 2016

 

నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క తుపానుతో సరి. రవి అస్తమించని మహా సామ్రాజ్యంగా రెండున్నర శతాబ్దాల పాటు ఇతర దేశాలను వలస లుగా మార్చి, ప్రజలను దోపిడీ, దురాక్రమణలతో పీడించి పిప్పి చేసిన దేశం ‘గ్రేట్ బ్రిటన్’. ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఒకనాటి ఈ మహా సామ్రాజ్యం వలసల రూపంలో వచ్చిన సమస్యతో నేడు తన ఉనికికే పరీక్ష సమయాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది.

 

నలభై ఏళ్ల క్రితం 28 యూరోపియన్ రాజ్యాలు సభ్యులుగా యూరో పియన్ యూనియన్ (ఈయూ) ప్రయాణం ఆరంభమైంది. అందులో బ్రిటన్ కూడా సభ్యదేశమే. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు ఆ సమాఖ్య నుంచి ఎందుకు తప్పుకోవలసి వచ్చింది? అధికార ప్రయోజనాల కోసం పాలక, ప్రతిపక్షాలు (కన్సర్వేటివ్, లేబర్ పార్టీలు) పడుతున్న తంటాల నేపథ్యంలో ఈయూ నుంచి బయట పడితేగానీ దేశానికి సుఖం లేదని తాజా ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం)లో బ్రిటిష్ పౌరులు ఎందుకు తీర్పు చెప్పవలసి వచ్చింది? ఆ తీర్పు ఫలితంతో బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ ఎందువల్ల దారుణంగా పతనమైంది? దీనితో పాటే ఇండియా సహా పెక్కు దేశాల (అమెరికన్ డాలర్, జాపనీస్ కరె న్సీ మినహా) కరెన్సీల విలువ కూడా ఎందుకు దిగజారవలసి వచ్చింది?



బ్రిటన్ నిర్ణయం గురించి ఈయూ ప్రత్యేక కమిషన్ చర్చించి ఇంకా ఒక నిర్ణయానికి రాక ముందే బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరూన్ (కన్సర్వేటివ్ పార్టీ) ఎందుకు రాజీనామా నిర్ణయానికి రావలసి వచ్చింది? బ్రిటన్‌తో పాటు ఇంకొన్ని సభ్య దేశాలు కూడా ఈయూ నుంచి వైదొలగాలని ఎందుకు అనుకుంటున్నాయి? ఈ సంక్షోభంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పౌండ్ రక్షణకు దన్నుగా ఆగమేఘాల మీద 250 బిలియన్ పౌండ్లను ఎందుకు ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించవలసి వచ్చింది? బ్రిటన్ లేబర్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేత జెరేమీ కార్బిన్ ప్రజాభిప్రాయ సేకరణ ఫలితం మీద, దేశ పరిణామాల మీద చేసిన వ్యాఖ్యలనే ఈ ప్రశ్నావళికి సమాధా నాలుగా పరిగణించాలి. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల పైన కార్బిన్ చేసిన నిశిత వ్యాఖ్యగా కూడా భావించాలి. ఇదంతా పాలక, ప్రతిపక్షాలకూ, వారి నాయకులకూ మధ్య కేవలం వ్యక్తిగత తగాదాలతో తలెత్తిన సమస్య కాదు.



విపక్షం విశ్లేషణ

ఇది కార్బిన్ విశ్లేషణ: ‘‘2015 ఎన్నికలలో 63 శాతం ఓటర్లు ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న లేబర్ పార్టీ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు. ఇతర దేశాల నుంచి ప్రవాసులుగా వలస రావడం  బ్రిటన్‌కు పెద్ద సమస్యగా పరిణమించింది. వలసలు ఇప్పుడు మరింతగా పెరిగిపోయాయి. పారిశ్రామి కీకరణ వెనుకబడి, కొత్తగా పెట్టుబడులు అందని స్థితిలో... ప్రజా బాహు ళ్యంలోని బలహీనవర్గాలకు ప్రభుత్వం పొదుపు పథకాలను ఎర చూపడం వల్ల, ఆర్థిక రంగంలో ప్రభుత్వ వైఫల్యాల కారణంగా వలసలు పెరిగిపో యాయి. గనుల పరిశ్రమలు పెట్టుబడుల కొరతతో కుప్పకూలిపోయాయి. చివరికి 1980లలో వలే అత్యున్నత నైపుణ్యం గల ఉద్యోగాలకు అవకాశం ఉన్న పరిస్థితులు కూడా నేడు లేవు. నిపుణతతో లభించే ఈ ఉపాధిని కూడా కాపాడుకోలేని స్థితి కూడా నేడు నెలకొని ఉంది. కనీసం తక్కువ వేతనాలతో గడిపేవారి ఉపాధికి కూడా భద్రత లేని దుస్థితి. దేశంలోని అలాంటి విభా గాలలో తీవ్ర దారిద్య్ర పరిస్థితులు తాండవిస్తున్నాయి.

 

ఇలా బయట నుంచి బ్రిటన్‌లోకీ, దేశంలోనే పట్టణ ప్రాంతాలకూ వలసలు పెరిగిపోయాయి. ఫలితంగా ఉపాధికి రక్షణ లేని పరిస్థితి. ఆపైన ప్రభుత్వ పథకాలు, బడ్జెట్లలో భారీ కోతలు.’’ ఈయూ సభ్యదేశంగా బ్రిటన్ వాస్తవ దృశ్యం ఇదే. నిజానికి కార్బిన్ కూడా బహిర్గతం చేయని మరో రహస్యం, అసలు దోపిడీ కూడా ఉన్నాయి. ఈ సమాఖ్యలోని సభ్య దేశాల మధ్య పరస్పర దోపిడీ వల్ల పెరుగుతున్న వలసలు (ఉదా: రెండేళ్ల నాడు గ్రీస్ వామపక్ష పాలన కింద ఉన్నందున దాని మీద జర్మనీతో కలసి బ్రిటన్ కూడా ఆర్థిక ఆంక్షలూ, పొదుపు ఆంక్షలూ పెట్టి లొంగదీయడానికి ప్రయత్నించింది) మరొక వాస్తవం. దాంతో పాటు ఆసియా, ఆఫ్రికా ఖండ దేశాల ప్రజలనుంచి దోచుకున్న ధన, సహజ వనరుల సంపదతో తన పారిశ్రామిక విప్లవ ఫలితాలను ఇంతకాలం బ్రిటన్ చెక్కుచెదరకుండా కాపాడుకుంటోంది.

 

కానీ, వలస దేశాలు మాత్రం ఆకలిదప్పులతో కాలం గడిపాయి. వీరు అనేక త్యాగాల ద్వారా రాజకీయ స్వాతంత్య్రం సాధించుకున్నా మళ్లీ ఆంగ్లో- అమెరికన్ సామ్రాజ్య పెత్తందారీ వలస పెత్తందారీతనం, బహుళ జాతి గుత్త పెట్టుబడుల నీడలలో ఇప్పటికీ మగ్గ వలసి వస్తున్నది. ఇప్పటికీ ఏదో ఒక రూపంలో ‘సరళీకరణ’, ‘ప్రపంచీకరణ’, ‘ఆర్థిక వ్యవస్థల పునర్ వ్యవ స్థీకరణ’, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థల ద్వారా ప్రజా వ్యతిరేక సంస్క రణలను నూతన ప్రపంచ వ్యవస్థ నిర్మాణం ముసుగులో కొనసాగు తున్నాయి. వర్ధమాన దేశాలు ఆర్థిక సంస్కరణల ఎండమావుల మధ్య ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి. వర్తక, వ్యాపార, వాణి జ్యాలూ అనేక ఆంక్షల మధ్య అసమస్థాయిలో సాగుతూనే ఉన్నాయి. ఆంగ్లో- అమెరికన్ సామ్రాజ్య దురాక్రమణ యుద్ధాలు ఈ 20వ శతాబ్దం తొలి పాతిక సంవత్సరాలుగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలపై (ఆఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా, పాలస్తీనా వగైరా) కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా ఉపాధి, పనుల కోసం పాత వలసల ప్రజలు సంపన్న దేశాలవైపు ఇప్పటికీ పరుగులు పెడుతున్నారు. నాడు దోచుకున్న పశ్చిమ రాజ్యాలే నేడు వర్ధమాన దేశాలనుంచి సాగుతున్న వలసలని ఆడిపోసుకుంటున్నాయి.

 

అమెరికాను అంటకాగిన ఫలితం

ఈయూ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి మరొక కారణం - దురాక్రమణ యుద్ధాల ద్వారా అభాసుపాలైన అమెరికా రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఏర్పరచిన ‘నాటో’ సైనిక కూటమితో పాలు పంచుకోవటంవల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడడం కూడా. ఈ దుస్థితి నుంచి బయట పడకుంటే ప్రగతి కంటక మార్గంలో చిక్కుకుంటుందన్న  ప్రజల ఆందోళననే కార్బిన్ వ్యక్తం చేశాడు. ఎందుకంటే, సామ్రాజ్య పెట్టుబడిదారీ వ్యవస్థను సాకుతున్న నాయకులు ఎలాంటివారో విస్కాన్సిన్ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు రూడీ కూజెల్ ఇలా వర్ణించాడు: ‘వీళ్లు ప్రజల గొంతుల్ని సునాయాసంగా కోసే స్తారు, ఆ పిమ్మట ఆ గాయపడిన గొంతులకు ఏ రకం బాండ్-ఎయిడ్ వేయాలా అని వాదించుకుంటుంటారు’.

 

అంతేగాదు, ఈ సామ్రాజ్యవాద దేశాలలో జాతీయోత్పత్తుల విలువను లెక్కగట్టే పద్ధతులు కూడా మోసపూరితమైనవేనని ప్రసిద్ధ ఆర్థిక నిపుణుడు, పరిశోధకుడు మారిస్ హెర్మాన్ బయటపెట్టాడు : ‘పేద దేశాల నుంచి అభి వృద్ధి చెందిన దేశాలకు భారీ ఎత్తున సాగే వలసల వల్ల అటు దోపిడీకి గురైన దేశాలు, ఇటు దోచుకునే దేశాల తలసరి జాతీయోత్పత్తుల విలువ పెరుగు తుంది. ఎందుకంటే, పేద దేశాల ఎగుమతుల విలువను తగ్గించి చూపే ప్రయత్నంలో సంపన్న దేశాలలో తలసరి జాతీయోత్పత్తుల విలువను పెంచి చూపడం జరుగుతోంది.’ అన్నాడు. ఈ ప్రమాణాలతో చూస్తే ఆ యూనియన్ బడ్జెట్‌లో బ్రిటన్ ఏటా తన వాటాగా 12 బిలియన్ డాలర్లను జమ చేస్తోంది. ఈ దశలో ఇండియా-బ్రిటన్ వాణిజ్య లావాదేవీల విలువా పడిపోతుంది.

 

భారత్ ఐటీపై ప్రభావం


బ్రిటన్ యూరప్ సమాఖ్య నుంచి తప్పుకోవడంవల్ల జర్మనీ, ఫ్రాన్స్ వాణిజ్యం కూడా దెబ్బ తింటుంది. అందుకే బ్రిటన్ తన నిర్ణయాన్ని పునరా లోచించుకోమని జర్మనీ ప్రాధేయపడవలసి వచ్చింది. ఇప్పటిదాకా బ్రిటన్ చేసుకుంటున్న దిగుమతులలో ఇండియా ఐదవ స్థానంలో ఉంది. చిన్న చిన్న బ్రిటిష్ వ్యాపార సంస్థలు, చిన్న వ్యాపారులు, యూరోప్ సమాఖ్యతో వాణి జ్యంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. బ్రిటన్ వైదొలగాలను కుంటున్న వారిలో వీరిది పెద్ద సంఖ్యే. యూరోప్ సమాఖ్య బ్రిటన్ ఆంత రంగిక వ్యవహారాల్లో తరచుగా జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణ కూడా బ్రిటన్  నిర్ణయానికి మరో ప్రధాన కారణం. ఈయూ పెట్టిన 100 నిబంధనల వల్ల ఏటా ఇంగ్లండ్ భారీగా 33 బిలియన్ డాలర్ల ఖర్చును భరించాల్సి వస్తోంది.

 

వీటన్నింటికన్నా మిన్నగా యూరప్-అమెరికా సామ్రాజ్య ప్రభుత్వాలు కల్పించిన యుద్ధాల మూలంగా సిరియా, లెబనాన్, ఇరాక్,  అఫ్గానిస్తాన్‌ల నుంచే లక్షలాదిమంది పౌరులు అమెరికా, బ్రిటన్‌లకు వలస వెళ్లారు. భారత ఐటీ వలసలకూ బ్రిటన్ తీర్పు గండమే!

వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్ (సీనియర్ సంపాదకులు)

abkprasad2006@yahoo.co.in

 

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top