కారం రుద్ది కేకలు పెట్టేలా చేయాలి!

చట్టబద్ధత, రాజ్యాంగ విధేయతలకు చోటెక్కడ? - Sakshi


అవలోకనం

మన దేశంలో మంత్రులు, ప్రధాన మంత్రులంతా పదవీ స్వీకారం చేసేటప్పడు ఇలా ప్రమాణం చేస్తారు : ‘‘దేవుని సాక్షిగా నేను భారత రాజ్యాంగానికి, చట్టానికి నిజంగా విధేయుడనై, నిబద్ధుడనై ఉంటాననీ, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్ర తను కాపాడుతాననీ, నా విధులను పూర్తి విధేయతతో, మనఃపూర్వకంగా నిర్వహి స్తానని,.. రాజ్యాంగానికి, చట్టానికి అనుగుణంగా, ఎలాంటి భయం లేదా పక్షపా  తమూ, అభిమానం లేదా దురుద్దేశమూ లేకుండా అందరితోనూ సరైన విధంగా నడుచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను.’’



ఇది మన రాజ్యాంగంలోని మూడో షెడ్యూలులో ఉన్నది. ప్రభుత్వ రహస్యాలను దాచి ఉంచుతానంటూ మంత్రి చేసే ప్రమాణమూ ఉంది. అది ‘‘నా పరిశీలనకు వచ్చే లేదా నాకు తెలిసే ఏ విషయాన్నీ మంత్రిగా నా విధులను నిర్వహించే క్రమంలో తప్ప, ఏ వ్యక్తికిగానీ లేదా వ్యక్తుల కుగానీ ప్రత్యక్షంగాగానీ లేదా పరోక్షంగాగానీ చేరవేయను లేదా వెల్లడించను.’’



రాజ్యాంగంపట్ల విధేయతతో ప్రవర్తిస్తామనే ఈ ప్రమాణం పట్ల మన మంత్రులు చిత్తశుద్ధిని చూపుతున్నారా? ‘‘అత్యాచార నేర అనుమానితులను, వారు తమ ప్రాణాలను కాపాడమని ప్రాధేయపడేలా చేశాననీ, వారిని చిత్రహింస లకు గురిచేయమని పోలీసులను ఆదేశించాననీ ఒక భారత మంత్రి చెప్పారు.’’ ఇది ఈ వారం బీబీసీ వెలువరించిన వార్త.



అనుమానితులను తలకిందులుగా వేలాడదీసి, వారిపై నేరారోపణ చేసిన వారు దాన్ని కళ్లారా చూసేలా చేశానని కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి చెప్పారు. ‘‘అత్యాచారానికి పాల్పడిన వారిని వారు క్షమాపణ కోరేవరకు బాధితుల సమక్షంలోనే చిత్రహింసలకు గురి చెయ్యాలి... అత్యాచారానికి పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీసి, చర్మం ఊడేలా చావ బాదాలి’’ అని ఆమె చెప్పినట్టుగా బీబీసీ తెలిపింది.



‘‘కారం రుద్ది కేకలు పెట్టేలా చేయాలి. వారి తల్లులు, అక్కచెల్లెళ్లు దాన్ని చూసేలా చేయాలి’’. మంత్రి చేశానని చెప్పుకుంటున్నది నేరపూరితమైన చర్య. చట్టమూ, రాజ్యాం గమూ ఆమె చేసినదాన్ని అంగీకరించవు. నేరాలతో  వ్యవహరించాల్సిన క్రమం స్పష్టంగానే ఉంది. పోలీసులు కేసు రిజిస్టర్‌ చేసి, దర్యాప్తు చేస్తారు, ప్రభుత్వం వారిని విచారణకు నిలుపుతుంది, న్యాయవ్యవస్థ తీర్పు చెబుతుంది. ఉమా భారతి గొప్పగా చెప్పుకుంటున్న పని... తాను కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. ఉపఖండంలో మూకుమ్మడిగా ఏ విచా రణా లేకుండానే శిక్షలను వేçస్తుండటం మనం ఊహించగలిగినదే. కానీ మంత్రులే ఆ పని చేసి, అందుకు గర్వించడమనేది మన దేశంలో చట్టంతో ఎలా వ్యవహరి స్తున్నారనేదాన్ని, మన మంత్రులు తమ ప్రమాణ స్వీకారం పట్ల ఎంత చిత్తశుద్ధిని కన బరుస్తున్నారనేదాన్ని కొంత వరకు తెలియజేస్తుంది.



అత్యాచారాలకు పాల్పడే వారిని శిక్షించడం గురించిన ఈ డాబుసరి మాటలను, నిజంగా అలాంటి నేరాల విషయంలో దేశం వాస్తవంగా చేపడుతున్న చర్యలతో పోల్చిచూడాలి. 2013 ముజ ఫర్‌నగర్‌ అల్లర్లలో సామూహిక అత్యాచారాలకు గురై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసిన ఏడుగురిలో ఎవరికీ ఇంతవరకు న్యాయం జరగలేదు. వారిలో ఒక మహిళ చని పోగా, మిగతావారు తమ గోడు వినిపించుకునేలా చేయడానికి వ్యవస్థకు వ్యతి రేకంగా పోరాడుతూనే ఉన్నారు. నిందితులు వారిని బెదిరింపులకు గురిచేశారు. లైంగిక వేధింపులపై ఘనమైన చర్యలు చేపట్టామని గొప్పలు చెప్పుకుంటున్న వారి నుంచి ఆ బాధితులకు ఇంతవరకు ఎలాంటి మద్దతు లభించలేదు.  



నిర్భయ కేసుగా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ ఘటనలో ఒక యువతిపై సామూహి కంగా లైంగిక దాడి, హత్య జరిగాయి. ఆ తదుపరి భారీ ప్రజా ఉద్యమమూ సాగింది. అలాంటి హింస బాధితులకు, బయటపడ్డ వారికి వేగంగా న్యాయం అందేలా చేయడం కోసం చట్టంలోనూ, నియమ నిబంధనలలోనూ మార్పులు చేశారు. కానీ క్షేత్ర స్థాయి పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదనేది వాస్తవం.  అందువలన, ఒకవంక లైంగిక హింసపై, అత్యాచారాలకు పాల్పడేవారిపై చర్య లను చేపట్టడంలోనూ, వారికి న్యాయం అందించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలం కాగా... మరోవంక ఈ నేరాలను అరికట్టడానికి మంత్రులు చేస్తున్న అద్భుత ఘనకార్యాల ప్రకటనలు మన ముందుకు వస్తున్నాయి.



ఉమా భారతి తాను చేస్తున్నది సరైనదేనని నమ్ముతున్నారు కాబట్టి ఆమెకు తాను రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నానని సైతం తెలియకపోవచ్చు. ఆమెలాంటి వ్యక్తుల దృష్టికి సరైనదిగా అనిపించేది... తప్పనిసరిగా చట్టబద్ధమైనది కానవసరం లేదు. ‘అందరితోనూ సరైనవిధంగా నడుచుకుంటాన’ని ఆమె ప్రమాణం చేశారు. కానీ ‘మంచి కుటుంబాల’ నుంచి వచ్చిన వారుంటారని విశ్వసించేవారు ఉన్న సమాజంలో నేరారోపణలు ఎదుర్కొంటున్నవారికి, శిక్షపడ్డ వారికి మధ్య తేడా ఉండదు. మంచి కుటుంబాల నుంచి రాని వారిది తప్పక చెడు పుట్టుకే కావచ్చు. అందుకుగానూ వారిని శిక్షించాల్సిందే అనే భావన ప్రబలంగా ఉంటుంది. కానీ చట్టం పట్ల నాగరిక భావన ఆరోపితులకు రక్షణను కల్పిస్తుంది. ‘‘దోషిగా తేలే వరకు అమాయకునిగానే భావించాలి’’ అనే పదబంధం ఉన్నది కూడా అందుకే. అయితే అది, మన మంత్రి ప్రదర్శించిన ఆదిమ ఆలోచనకు విరుద్ధమైనది.



ఆ ప్రమాణంలోని ‘‘భారత దేశ ఐక్యత, సమగ్రత’’ అన్న దానిపై దృష్టి కేంద్రీ కణ అంతా ఉంటుంది. అది పవిత్రమైనది. ఆ భావనను, మాటల్లోనే అయినా ఉల్లంఘించినట్టుగా ఆరోపణకు గురైన వారిని ఎవరినైనా చావబాదేస్తారు. అది కూడా ఎలాంటి విచారణ లేకుండానే. భారత రాజ్యాంగానికి, చట్టానికి కట్టుబడి ఉండటం అనే ఆ మిగతాదంతా నసుగుడు మాత్రమే.



- ఆకార్‌ పటేల్‌

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత

aakar.patel@icloud.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top