అవసాన దశకు చేరువలో అతి పాత పార్టీ

అవసాన దశకు చేరువలో అతి పాత పార్టీ - Sakshi


అవలోకనం

రాష్ట్రాల్లోని బలమంతా తుడిచిపెట్టుకుపోవడంతో కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది. 2004–2014 మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సైతం ఉత్తర భార తంలోని పెద్ద భాగాలలో అది శాశ్వత ప్రతిపక్షంగా ఉంది. పెద్ద రాష్ట్రాల్లో అది నాలుగవ లేదా ఐదవ స్థానానికి దిగజారింది. మరో నేత నేతృత్వంలో కాంగ్రెస్‌ పునరుజ్జీవితమయ్యే అవకాశం ఉన్నమాట నిజమే. కానీ రాహుల్‌ గాంధీ వృద్ధుడేమీ కాడు. జాతీయ స్థాయిలో కనుమరుగవుతూ సమంజసత్వాన్ని కోల్పోతున్న ఆ పార్టీకి ఇది ప్రతికూలంగా పని చేస్తుంది.



రాజకీయ పార్టీలు ఎలా చనిపోతాయి? మెల్లగా మరణిస్తున్న కాంగ్రెస్‌ను చూస్తున్న మనకు ఈ అంశాన్ని తరచి చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. భారతదేశంలోని అతి పాత పార్టీౖయెన అది 132 ఏళ్ల క్రితం పుట్టింది. అది అధికారానికి దూరంగా ఉన్నది గత మూడేళ్లుగానే. అయినా అది ఒక జాతీయ శక్తిగా ఇప్పటికే చనిపోకపోయి ఉంటే, కోమాలాంటి స్థితిలోనైనా ఉన్నదనేది స్పష్టమే. దాని పేరు ప్రతిష్టలు బాగా దెబ్బతినిపోయాయి. దాని గురించి సాను కూలంగా చెప్పుకోడానికి ఏమీ లేదు. తన చిన్న ఓటర్ల పునాదికి ఇవ్వగల రాజ కీయ సందేశం సైతం దానివద్ద ఏదీ లేదు. జాతీయశక్తిగా అది అదృశ్యమై పోయినా (అంటే, హస్తం గుర్తును నిలబెట్టుకోడానికి తగినన్ని ఓట్లను సైతం సాధించలేకపోయినా) చనిపోతున్న మొదటి రాజకీయ పార్టీ అదే కాజాలదు.



అస్తిత్వంలో ఉండటానికి తగ్గ కారణాలేవీ మిగలక అఖిల భారత ముస్లిం లీగ్‌ మరణించింది. 20వ శతాబ్దిలో ముస్లింల రాజకీయ హక్కుల సాధన కోసం, వలసవాద ప్రభుత్వంతో చర్చలు జరపడం కోసం ఆ పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్‌తో అధికారాన్ని పంచుకోడానికి చర్చలు జరపాలని ప్రయత్నించి విఫలమైంది (నేడు బీజేపీని చూస్తున్నట్టే ముస్లింలలో ఎక్కువ మంది అప్పట్లో కాంగ్రెస్‌ను హిందూ పార్టీగా చూసేవారు). అవి ఒక ఒప్పందానికి రాకపోవడం వల్లనే దేశ విభజన జరిగింది. దీంతో ముస్లిం లీగ్‌ ఇంచుమించుగా అదృశ్యమైంది.



భారత యూనియన్‌ ముస్లిం లీగ్‌ పేరిట చాలా ఏళ్లపాటూ ఒకే ఒక్క ఎంపీ ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండేవారు. కేరళ నుంచి పదే పదే ఎంపీగా ఎన్నికైన జీఎం బంటావాలా గుజరాతీ. దేశ విభజన తర్వాత ఒక దశాబ్దిపాటూ పలువురు ప్రధానుల నేతృత్వంలో ముస్లింలీగ్‌ పాకిస్తాన్‌లో అధికారంలో ఉండేది. రెండు దేశాల సిద్ధాంతమే ఆ పార్టీకి ప్రాథమిక ప్రాతిపదిక. దీంతో ముస్లింలే అధికంగా ఉన్న దేశంలో అది సమంజసత్వాన్ని కోల్పోయింది. పాకిస్తాన్‌ ఏర్పడిన తర్వాత కొద్దికాలానికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు పెద్ద నేతలు చనిపోయారు. 1948 సెప్టెంబర్‌ 11న గవర్నర్‌ జనరల్‌ జిన్నా క్షయ వ్యాధితో మరణించారు. ప్రధాన మంత్రి లియాఖత్‌ 1951 అక్టోబర్‌ 16న హత్యకు గురయ్యారు.



కొన్నేళ్ల తర్వాత జనరల్‌ అయూబ్‌ఖాన్‌ అధికారాన్ని హస్తగతం చేసుకునే నాటికి జిన్నా నాయకత్వం వహించిన పార్టీ చీలికకు గురై కన్వెన్షన్‌ ముస్లిం లీగ్‌ ఏర్పడింది. పాకిస్తాన్‌లో ఆ పార్టీ ధరించిన ఎన్నో రూపాల్లో ఇది మొదటిది. పార్టీని విచ్ఛిన్నం చేసి, సైనిక పాలకులకు మద్దతుగా దాన్ని సంస్కరణకు గురిచేసే ఆ సంప్రదాయం దశాబ్దాల తరబడి కొనసాగింది. జనరల్‌ జియా ఉల్‌ హఖ్‌ హయాంలోని ప్రధాన మంత్రి జునెజో ముస్లిం లీగ్‌(జే)ను ఏర్పరచగా, ముస్లిం లీగ్‌ (క్యూ) జనరల్‌ ముషర్రాఫ్‌కు మద్దతుగా నిలిచింది. నేడు అధికారంలో ఉన్న పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) సైతం జియా హయాంలో ఏర్పడినదే.



భారత్‌లో కాంగ్రెస్‌ జాతీయ స్థాయిలో ఇంచుమించుగా ఐక్యంగానే నిలి చింది. లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణానంతరం వచ్చిన పెద్ద చీలికతో ఇందిరా గాంధీ అధికారం చేపట్టారు. నెహ్రూతో కలసి పనిచేసిన పాత తరం నాయకులు తమ సొంత కాంగ్రెస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ బలవంతురాలైన ఇందిర తన జన సమ్మోహనశక్తితో, జనాదరణతో పార్టీ నిర్మాణాన్ని చేజిక్కించుకున్నారు.

ఇందిరా గాంధీని ఓడించిన జనతా పార్టీ, ప్రాంతీయ పార్టీల అతుకుల బొంత కూటమి. అది భావజాల రీత్యా సోషలిస్టు, కాంగ్రెస్‌ వ్యతిరేక స్వభావంతో ఉండేది. అత్యవసర పరిస్థితిలో ఏర్పడ్డ  ఆ పార్టీ ఆ తర్వాత త్వరలోనే సమంజస త్వాన్ని కోల్పోయింది. దాని భాగస్వాములు జనతాదళ్‌ పేరిట దాని కాంగ్రెస్‌ వ్యతిరేకవాదాన్ని కాపాడాలని ప్రయత్నించినా అది వాటిని కలిపి ఉంచలేకపో యింది. ఉత్తరాది, దక్షిణాది పార్టీలుగా అది ముక్కలైంది.



రామజన్మభూమి ఉద్యమంతో లాల్‌ కృష్ణ అద్వానీ భారత రాజకీయాలలో మార్పును తెచ్చారు. దీంతో జనతా పార్టీ ముక్కల కాంగ్రెస్‌ వ్యతిరేక స్వభావం కాస్తా హిందుత్వ వ్యతిరేకతగా మారింది. బీజేపీ అన్నా, అది ప్రాతినిధ్యం వహించే భావజాలమన్నా వాటికున్న భయమే అందుకు కారణం. ఈలోగా రాజీవ్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఏ భావజాలానికీ ప్రాతినిధ్యం వహించడం మానేసింది. దానికి అసలు నిజమైన భావజాలమే లేకుండా పోయింది.



రాష్ట్రాల్లోని బలమంతా తుడిచిపెట్టుకుపోవడంతో కాంగ్రెస్‌ కేంద్రంలో అధికా రాన్ని కోల్పోయింది. 2004–2014 మధ్య అది అధికారంలో ఉన్న దశాబ్దంలో కొన్ని వాస్తవాలు మరుగున పడిపోయాయి. ఉత్తర భార తంలోని పెద్ద భాగాలలో అది శాశ్వత ప్రతిపక్షంగా ఉంది. మూడు దశాబ్దాలుగా అది గుజరాత్‌ ఎన్నికల్లో గెలవలేదు. బీజేపీ అధికారంలో లేదా ప్రతిపక్షంలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో అది నాలు గవ లేదా ఐదవ స్థానానికి దిగజారింది. అంటే అసంబద్ధమైనదిగా మారింది.



దక్షిణాదిలో అది అనుకుంటున్నదానికంటే వేగంగా తన స్థానాన్ని బీజేపీకి  కోల్పోతోంది. తమిళనాడు, కేరళలో బీజేపీ ఓపికతో కూడిన నిరంతరాయ కృషిని కొనసాగిస్తోంది. వివిధ ప్రాంతాలలోని సమర్థవంతులైన నేతలు పార్టీకి మరణం ఆసన్నమవుతోందని ముందే గ్రహించారు. మమతా బెనర్జీలాంటి కొందరు విజ యవంతంగా అక్కడి పార్టీ యంత్రాంగాన్ని చేజిక్కించుకున్నారు. మహారాష్ట్రలో శరద్‌ పవార్‌లాగా కొందరు ఆ విషయంలో సఫలం కాలేదు. మహారాష్ట్రలో తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు పార్టీ నుంచి నిధులు అందకపోవడం వల్లనే అది అంత ఘోరంగా దెబ్బతింది. ఇది ప్రమాద సంకేతం. అయినా పట్టించుకునేవారు లేరు. కాంగ్రెస్‌ కుటుంబ పార్టీ కావడం వల్ల జవాబు దారీతనం లేదు. కాబట్టి అది ఇలాగే తన అగమ్యగోచర పయనాన్ని సాగిస్తుంది.



మరో నేత నేతృత్వంలో కాంగ్రెస్‌ పునరుజ్జీవితమయ్యే అవకాశం ఉన్నమాట నిజమే. కానీ రాహుల్‌ గాంధీ వృద్ధుడేమీ కాడు. కొన్ని దశాబ్దాల పాటూ ఆయన పార్టీ కార్యకలాపాలను కొనసాగించాల్సి ఉంది. జాతీయ స్థాయిలో çకనుమరుగవుతూ సమంజసత్వాన్ని కోల్పోతున్న ఆ పార్టీకి ఇది ప్రతికూలంగా పని చేస్తుంది.





- ఆకార్‌ పటేల్‌


వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top