పర్యావరణానికి హాని లేకుండా దిగుబడి పెంచొచ్చు!

పర్యావరణానికి హాని లేకుండా దిగుబడి పెంచొచ్చు! - Sakshi


నిరూపించిన చైనా వ్యవసాయ శాస్త్రవేత్తలు

జనాభాలోనే కాదు రసాయనిక ఎరువుల ఉత్పత్తి, వినియోగం లోనూ ప్రపంచంలో చైనాదే అగ్రస్థానం. 2030 నాటికి చైనా ప్రజలకు 65 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయని అంచనా. రసాయనిక ఎరువులను ఎక్కువ మోతాదులో వినియోగిస్తే పర్యావరణానికి హాని జరుగు తుందన్న విషయం అందరికీ తెలిసిందే. పర్యావరణానికి హాని కలగకుండా పంటల దిగుబడులు పెంచుకోవడం ఎలా అనే కోణంలో చైనా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జాంగ్ ఫుసువో సారథ్యంలో సాగిన ఐదేళ్ల పరిశోధన సత్ఫలితాలనిచ్చింది. పర్యావరణానికి హాని కలగని రీతిలో రసాయన ఎరువులను తగుమాత్రంగా, సమర్థవంతంగా వినియోగించుకునే మెరుగైన సాగు పద్ధతి(స్మార్ట్ టెక్నిక్) ద్వారా పంటలు పండించి దిగుబడులు పెంచవచ్చని నిరూపితమైంది.

 

 1,500 పొలాల్లో వరి, గోధుమ, మొక్కజొన్న పంటలను వివిధ పద్ధతుల్లో పండించి, ఫలితాలను శాస్త్రీయంగా నమోదు చేశారు. స్థానిక నేలలు, వాతావరణ పరిస్థితులు, పోషక అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. తక్కువ ఎరువులతోనే శాస్త్రీయ పద్ధతి ద్వారా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చని ప్రొ. జాంగ్ తదితర శాస్త్రవేత్తల బృందం నిర్థారణకొచ్చింది. ఈ ప్రయోగాల్లో పొందిన దిగుబడుల్లో 80 శాతం సాధించినా రానున్న రోజుల్లో పెరగనున్న ఆహార అవసరాలను ఎదుర్కోవచ్చని బృందం స్పష్టం చేసింది.

 

 ‘పర్యావరణానికి ఎలాంటి ముప్పూ కలిగించకుండానే పంటల దిగుబడులను పెంచవచ్చని, ఆహార భద్రతను సాధించవచ్చని నిరూపించాం. భవిష్యత్తులో చైనా రైతాంగానికి ఈ పరిజ్ఞానం దిక్సూచిగా ఉపకరిస్తుంది. అయితే లక్షలాది మంది అన్నదాతలు ఈ పద్ధతిని అనుసరించాలంటే చాలా కాలమే పడుతుంది’ అని ఈ పరిశోధనలకు సారథ్యంవహించిన ప్రొ. జాంగ్ అన్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ జర్నల్‌లో ప్రొ. జాంగ్ తదితర శాస్త్రవేత్తల పరిశోధన పత్రం ప్రచురితమైంది. అందులోని వివరాల ప్రకారం.. శాస్త్రవేత్తలు నాలుగు వేర్వేరు సాగు పద్ధతులను ఉపయోగించి వ్యవసాయ దిగుబడులను సరిపోల్చి చూశారు. మొదటి పద్ధతి: స్థానికంగా రైతులు ఆహార ధాన్యాలను పండిస్తున్న పద్ధతినే అనుసరించారు. రెండో పద్ధతి: మొదటి పద్ధతిని కొంత మెరుగు పరచి అమలు చేశారు. మూడో పద్ధతి: పర్యావరణ అంశాలను పట్టించుకోకుండా అధిక దిగుబడులు పొందడానికి రసాయనిక ఎరువులు వాడారు. నాలుగో పద్ధతి: స్థానిక వాతావరణం, నేల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడికి అనువైన పంటలను, రసాయనిక ఎరువులను ఆచితూచి వాడుతూ  ‘స్మార్ట్ టెక్నిక్’ ప్రకారం సాగు చేశారు.

 

 ఈ నాలుగు పద్ధతులలోనూ మూడో పద్ధతిలో అధిక దిగుబడులు వచ్చాయని గుర్తించారు. అయితే నాలుగో పద్ధతిలో పర్యావరణానికి పెద్దగా హాని కలగని రీతిలో 97-99 శాతం ఫలితాలు వచ్చాయని ప్రొ. జాంగ్ తెలిపారు. రెన్మిన్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయంపై పరిశోధనలు చేస్తున్న మరో శాస్త్రవేత్త ప్రొ. జెంగ్ ఫ్రెంగ్‌టియాన్ మాట్లాడుతూ ఎరువుల వినియోగాన్ని సగానికి తగ్గించు కున్నప్పటికీ దిగుబడుల్లో మార్పు ఉండబోదన్నారు. అయితే శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేయగలిగినప్పుడే ఇది సాధ్యపడుతుందని ఆయన అన్నారు.

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top